*కీ.కం.*
ఉదయం కళ్లు తెరుస్తూనే ఫోన్ చేత్తో పట్టుకుని వంటింట్లోకి వెళ్ళి పాలు స్టౌ మీద పెట్టి ఫేస్ బుక్ ఓపెన్ చేశాను.రెండు మూడు శుభోదయాలు,గుడ్ మార్నింగులూ, ముందు రోజు రాత్రి చూడని గుడ్నైట్లూ చూస్తుండగా నాకంట్లో పడి నన్నాకర్షించింది,
’చెయ్యి ఇయ్యి' గ్రూపులో ఒకావిడ పెట్టిన పోస్టు.
గబగబా ముఖం కడుక్కుని వచ్చి కాఫీ కలుపుకుని, మెల్లగా తాగుతూ పెరటి గుమ్మం మీద కూర్చుని మళ్లీ ఆ పోస్ట్ తీశాను.
అప్పటికే పన్నెండు పదమూడు లైకులూ,
లవ్వులూ,
వావ్,
👌👌యువ్వార్ గ్రేట్,
👏👏👏
అంటూ నాలుగైదు కామెంట్లు కూడా వచ్చేశాయి.
ఇంతోటి పాతచీరా ముష్టి దానికి ఇస్తూ తీసి పెట్టిన ఫోటోకి వస్తున్న రెస్పాన్స్ చూసిన నా మనసులో ఏదో అసూయతో కూడిన బాధ.
అమాంతం కీర్తి కండూతి(కీ.కం.)తో,నేను కూడా ఏదో ఒక మంచి పని చేసేసి ఫేస్ బుక్ లో పెట్టేసి బోలెడు కీర్తి సంపాదించెయ్యాలని మనసులోనే శపధం చేసేసుకొన్నాను.
రోజంతా అదే ధ్యాస.
ఏం చెయ్యాలీ,ఎలా,ఎలా? అని.
ఆఖరికి ఒక ఆలోచన వచ్చింది.
నాలుగు వీధుల అవతల ఉన్న కామాక్షీ పీఠానికి అనుసంధానం అయిన అనాధాశ్రమం గుర్తు కొచ్చింది.
అక్కడి పిల్లలకు ఏమైనా ఇవ్వాలని అనుకున్నాను.ఏమిచ్చినా ఫోటోల్లో ఘనంగా కనిపించేలా ఉండాలని అనుకున్నాను.
ఒకసారి అక్కడికి వెళ్లి ఆ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి ఏంచేసేదీ ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందనిపించింది.
ఆ సాయంత్రమే అక్కడికి వెళ్లి కామాక్షీ దేవిని దర్శించుకుని,ఆశ్రమ నిర్వాహకులను కలిసి వివరాలు కనుక్కున్నాను.
వారు పిల్లలకు వస్తురూపంలో ఏ సహాయాన్ని అనుమతించమనీ,
చెయ్యాలనుకుంటే వారి చదువు ఖర్చు ఇవ్వ వచ్చుననీ
లేక ఆ పిల్లలలో ఎవరినైనా ఎంచుకుని ఆ పిల్లలకు పద్ధెనిమిది సంవత్సరాలొచ్చే వరకూ ఆశ్రమంలో వారికయ్యే ఖర్చు మొత్తం భరించ వచ్చనీ
లేక ప్రభుత్వ అనుమతులతో ఎవరినైనా దత్తత కూడా తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్లవచ్చుననీ చెప్పారు.
అవన్నీ వింటూనే ఏదో కీ.కం.తో వచ్చాను గానీ నాకు అవన్నీ ఎలా సాధ్యం అనుకుంటూ,
నేను అంత పెద్ద సహాయం చేయలేననీ,ఏదైనా చిన్న మొత్తంలో అయ్యేది చెప్పాలనీ అడిగాను.
గుడిలో రోజూ జరిగే అన్నదానానికి ఒకరికి వందరూపాయల చొప్పున ఎంత మొత్తం అయినా ఇవ్వవచ్చుననీ,భక్తులతో పాటు ఆశ్రమంలో ఉండే పిల్లలు కూడా అదే తింటారనీ చెప్పారు.
మన సంతృప్తి కోసం వడ్డనలో పాల్గొన వచ్చని కూడా చెప్పారు.అది విన్న నేను మనసులోనే ఎగిరి గంతేశాను.
ఆశ్రమంలో మొత్తం ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారుట.ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో పెట్టడానికి పదిమంది పిల్లలు చాలనుకొని, ఆ మర్నాడు మా కుటుంబం తరఫున పదిమంది పిల్లలకు భోజనాలు పెట్టమని,మేము వచ్చి,డబ్బు కట్టి,వడ్డిస్తామనీ చెప్పి ఇంటికి వచ్చాను.
దాంతో నేను నా ఫేస్ బుక్ వాల్ మీద,
’చెయ్యి ఇయ్యి'గ్రూపులోనూ కూడా పెట్టిన ఫోటోలను చూసి లెక్కలేనన్ని లైకులూ, వందలాది ఫ్రెండ్ రిక్వెస్ట్ లువచ్చేసినట్లూ,వేలాది మంది ఫాలో అయిపోతున్నట్లూ ఊహించుకొంటూ గాల్లో తేలిపోతూ అతికష్టం మీద ఆ రోజు గడిపాను.
ఆ విషయం చెప్పి మావారిని కూడా ఆశ్రమానికి రమ్మన్నాను.మంచిపని చేస్తున్నావని మెచ్చుకొంటూనే తనకు మర్నాడు ఆఫీసులో తప్పనిసరిగా ఎటెండ్ అవ్వాల్సిన మీటింగు ఉందనీ,మా అబ్బాయిని తీసుకొని వెళ్లమనీ చెప్పారు.
మా అబ్బాయిని రమ్మంటే వాడు,
"అమ్మా, ఇలాంటి వాటికి మనం వెళ్లక్కర్లేదు.
మనం మనీ ఆన్లైన్లో కట్టెయ్యచ్చు.
అన్నీ వాళ్లే చూసుకుంటారు" అన్నాడు.
దాంతో నేను,"అది కాదురా, భోజనాలు మనం పెడుతున్నామని వాళ్లకు తెలియద్దూ?",అన్నాను.
"ఎందుకు తెలియాలి?
ఓన్లీ హెల్ప్ షుడ్ రీచ్ ద నీడీ.
అయినా మనం అలా వెళ్లి వడ్డిస్తుంటే ,ఆ పిల్లల ఇగో కూడా హర్టవుతుంది.
నేను చూడు లాస్ట్ మంత్ ,మా కాలేజి ఎన్.ఎస్.ఎస్.వాళ్లకి నా పోకెట్ మనీ నుంచి ఎనిమిది వందలు కట్టాను.అది నీకు కూడా చెప్పలేదు నేను.
హెల్ప్ ముఖ్యం కానీ ఎవరు చేశారో కాదు కదా", అనడంతో ,
నేను వాళ్లకు డబ్బు కట్టడంలో అసలు ఉద్దేశ్యం వాడికి చెప్పలేక ,
"నీకేం తెలీదురా.మనం ఇచ్చిన డబ్బు సద్వినియోగం అవుతోందో లేదో చూసుకోకుండా గుడ్డిగా దానాలు చేస్తూ పోతామా?"అని,
చివరికి డ్రైవరును తీసుకుని ఒక్కతినీ బయల్దేరాను.
నేను ఆశ్రమానికి చేరేసరికే భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కంటి చివరనించి గమనించాను.ఐదుగురు భక్తులు టేబుల్స్ దగ్గర కూర్చుని ఉన్నారు.
పిల్లలంతా కంచం,గ్లాసు పట్టుకొని వరుసలో నిలబడి ఉన్నారు.
నేను గబగబా ఆఫీసుకి వెళ్లి వెయ్యిరూపాయలూ కట్టేసి హాల్లో వడ్డన జరిగే చోటికి చేరుకున్నాను.
అప్పటికే వడ్డన మొదలు పెట్టిన ఆయా చేతిలోంచి గరిట తీసుకొని వడ్డనకు ఉపక్రమించాను.
అంతకు ముందే నేను, వీలయినన్ని ఎక్కువ ఫోటోలు తీయాలనీ,
అలాగే కాస్త దూరం నుంచి తీస్తే చాలామంది కవర్ అవుతారనీ చెప్పి,
ప్రతీ ఫోటోలోను నన్ను ఏఏ యాంగిల్సులో ఎలా కవర్ చెయ్యాలో తగిన సూచనలు ఇచ్చి,
నా ఫోను కూడా డ్రైవరుకు ఇచ్చి ఉండడంతో,
మధ్య మధ్యలో చిరునవ్వుతో ఆ పిల్లలను పలకరిస్తూన్నట్లు నటిస్తూ,
నా పట్టు చీర జరీ అంచు సర్దుకుంటూ పోజులిస్తున్నాను.
డ్రైవర్ టకటకా పాతిక ముప్పై వరకూ ఫోటోలు తీసేశాడు.
ఈ లోగా నాచేత డబ్బు కట్టించుకున్న ఆ ఆశ్రమపు సెక్రటరీ మా డ్రైవరు దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడి ఆ ఫోటోలు చూస్తూండడం గమనించిన నేను బేక్ గ్రౌండ్లో నన్ను కవర్ చేస్తూ,ఆయనకి కూడా రెండు మూడు ఫోటోలు తియ్యమని డ్రైవరుకు సైగ చేశాను.
అది అర్థం చేసుకొన్న డ్రైవరు ఆయన్ని అడుగుతున్నాడు కానీ,ఆయన వద్దు వద్దంటూ మొహమాటపడి అక్కడినుంచి వెళ్లిపోయారు.
'ఏవిటో, అమాయకుడు,ఒప్పుకుంటే ఫోటోలో నాతో బాటు ఆయన్ని కూడా వేలాది మంది ఫేస్ బుక్ లో చూసేవారు.ఏం చేస్తాం,పోనీ', అనుకున్నాను.
ఈలోగా అక్కడ భోజనాలు చేస్తున్న భక్తులలో సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక జంట నన్నే చూస్తూండడం గమనించిన నేను,
"ఏం ఫర్వాలేదు,మొహమాట పడకుండా కడుపునిండా తినండి"అని,
మీరు తింటున్న భోజనంలో కూడా నేను కట్టిన వెయ్యి రూపాయల్లో కొంత భాగం ఉంది అనుకుంటూ,
కించిత్తు గర్వంగా భావిస్తూ,
అలిసిపోయినట్లు చూస్తూ,
పక్కనే పెట్టుకున్న నా హేండ్ బాగ్ లోనుంచి రుమాలు తీసి సుతారంగా పెదవులమీద ,మెడ దగ్గర పట్టిన చెమట అద్దుకున్నాను.
ఎలాఅయితేనేం అన్నదానకార్యక్రమం ముగిసింది.
సెక్రటరీ నన్నూ,డ్రెవరునూ కూడా భోజనం చేయమని చెప్పాడు.
మనసులో'ఛీ, ఇక్కడ నేనెలా తింటాను'అనుకుంటూనే,పైకి మాత్రం,
"ఇంటికి గెస్ట్స్ లంచ్ కి వస్తున్నారు సర్",అని సున్నితంగా చెప్పి తప్పించుకుని,
అక్కడే మెట్టు మీద డ్రైవరు చేత కారులోంచి తెప్పించుకున్న టర్కీ టవల్ పరచుకొని కూర్చుని,డ్రైవరు చేతిలోంచి నా ఫోన్ తీసుకుని గబగబా ఫోటోల కోసం వెదికాను.
ఆశ్చర్యం! ఒక్క ఫోటో కూడా లేదు.
డ్రైవర్ మెల్లగా భయపడుతూ, "ఆ సెక్రటరీ గారు పిల్లలకు ఫోటోలు తీయకూడదు,అంటూ డిలీట్ చేయించేశారమ్మా,
అక్కడికీ నేను మా అమ్మగారు పదిమందికి అన్నం పెడుతున్నారని,
మీరు చెప్పినట్లే రెండు మూడైనా ఫోటోలు అయినా ఉంచమని కూడా చెప్పాను,కానీ రూల్స్ ఒప్పుకోవన్నారమ్మా" అన్నాడు.
ఆనుకున్నదొకటీ,అయ్యిందొకటీ కావడంతో,ఖంగు తిన్న నేను ఛర్రున లేచి విసురుగా కారు వైపు నడుస్తున్నాను.
నాలుగడుగులు వేసేసరికి వెనకనుండి ఎవరో నా చీర కొంగు లాగుతున్నారనింపించి, వెనక్కి చూశాను.
అంతకు ముందు భోజనాల దగ్గర కనపడ్డ ఒక పిల్ల.
కుడిచేతి చూపుడు వేలు బొటన వేలు కలిపి నాకొంగు లాగుతోంది.
నల్లటి దాని ముఖంలో మెరుస్తున్న తెల్లటి కళ్లు.
జారిపోతున్న స్కర్టుని ఎడంచేత్తో పైకి లాక్కుంటూ,నేను వెనక్కి చూడ్డంతో మరోసారి గట్టిగా నా చీర కొంగు లాగింది.
దాంతో నా పైటకు పెట్టుకున్న పిన్ను ఊడిపోయి పైట చెంగు పర్రున చిరిగింది.
అంతే విసురుగా వెనక్కి తిరిగి, అసలే వెయ్యి రూపాయలు కట్టి, ఫోటోలు తీసుకుని ఫేస్ బుక్ లో పెడదామని వస్తే అంతా చెడిపోవడమే కాక,
డబ్బు కూడా వృధా అయిందని చిరాకుగా ఉన్న నేను,
ఈ పిల్ల వల్ల పద్ధెనిమిది వేల ఖరీదైన చీర కూడా చిరగడంతో,
'ఛీచీ,ఎవరు కని పారేశారో,అనాథ వెధవలు' అనుకుంటూ అప్రయత్నంగా ఛెళ్లున దాని చెంప మీద ఒకటి వేశాను.
దాని తెల్లటి కళ్లు ఎర్రబారి కన్నీళ్లు జలజలా రాలుతుండగా వెనక్కి తిరిగి ఆశ్రమంలోకి పరుగెత్తింది.
నేను ఇంక వెనక్కి తిరిగి చూడకుండా,విసురుగా కారెక్కేసి,"పోనీ",అన్నాను.
*****
మర్నాడు ఆశ్రమం నుంచి ఫోను.నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మంటూ.
'ఫోటోలు తీసుకునేందుకు అయ్యుంటుంది.
ఆ సెక్రటరీ గాడు బోడి పెత్తనం చెలాయించాడు గానీ,
తర్వాత ఆ సంగతి తెలిసి ఆశ్రమం ప్రెసిడెంట్ ఇంత గడ్డి పెట్టి ఉంటాడు.
పిలవక ఏంచేస్తారు.
ఆశ్రమాలకీ,ధర్మసత్రాలకీ ఎవరైనా వంద రూపాయలిస్తే గొప్ప ఈరోజుల్లో.
అలాంటిది నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను.
అంత డబ్బూ కట్టి ఒక ఫోటో అయినా తీసుకోనివ్వకపోతే,
ఎవడిస్తాడు వీళ్లందరినీ మేపడానికి విరాళాలూ?డబ్బులు ఊరికే వస్తాయా?',
అనుకుంటూ ఉత్సాహంగా బయల్దేరాను.
ముందురోజు జరిగిన దాని గురించి డ్రైవరు ఏమనుకున్నాడో అనిపించి నష్ట నివారణ చర్యగా,"చూశావా రాంబాబూ,నిన్న ఆ సెక్రటరీ తనకే రూల్స్ అన్నీ తెలుసన్నట్లు గొప్పగా మాట్లాడి,నీచేత ఫోటోలు డిలీట్ చేయించేశాడా?
ఇవాళ చూడు,వాళ్లే మళ్లీ పిలిచారు",అన్నాను.
ఆశ్రమం చేరి లోపలికి ప్రవేశించిన నా దృష్టి,అక్కడ ఆఫీసు ముందు ఉన్న బోర్డు మీద పడింది.
'నిన్న దీన్ని చూడలేదే నేను?' అనుకుంటూ ఆ బోర్డు మీద వ్రాసి ఉన్న విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు చదువుతున్నాను.
అందులో కొందరు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చి ఉండడంతో బహుశా నా పేరు కూడా ఆ బోర్డు మీద వ్రాస్తారేమో అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో లోపలికి నడిచాను.
ముందురోజు నాకు వడ్డనలో సహాయం చేసిన ఆయా, ఆశ్రమం ఆఫీసు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చింది.
ఆనీళ్లు తాగి,అక్కడే ఒక కుర్చీలో ముఖం మరో వైపుకు తిప్పుకొని కూర్చున్న సెక్రటరీని గమనించి,
'రూల్సు,రూల్సంటూ చాలా ఎక్కువ చేశాడుగా, ఇప్పుడు తెలిసి వచ్చినట్లుంది',
అనుకుంటూ ఉండగా,
అక్కడ ఉన్న నలుగురిలో ఒక పెద్దాయన
"చూడమ్మా, ఒక పూట మా ఆశ్రమంలో ఉన్న పదిమంది పిల్లల ఆకలి తీర్చిన అన్న పూర్ణ మీరు".
ఈ మాట విన్న నా మనసులోని కీ.కం.నా కళ్లలోకి మెరుపు రూపంలో తన్నుకొచ్చింది.
ఆయన కొనసాగిస్తున్నారు.
"మా ఆశ్రమపు దాతల పట్ల మాకు చాలా గౌరవం.మిమ్మల్ని అవమానించాలని కాదు కానీ నిన్న జరిగినది మీరు తెలుసుకుంటే బాగుంటుందనిపించి పిలిపించాను.
శ్రమ తీసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు.
ఇది చూడండి", అంటూండగా అక్కడ కూర్చుని ఉన్న వారంతా,సెక్రటరీతో సహా ఒక్కొక్కరుగా లేచి బయటికి వెళ్లి పోయారు.
ఆయన ఆశ్రమం ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల రికార్డును అదే గదిలో ఉన్న స్క్రీన్ మీద చూపించడం మొదలు పెట్టారు.
సీసీ టీవీలో దృశ్యాలను ఒక్కొక్కటిగా చూస్తున్న నాకు చివరికొచ్చేసరికి
అక్కడే నేలలో పాతుకు పోతే బాగుండునని పిస్తోంది.
అపరాధ భావంతో తల ఎత్తలేక పోతున్నాను.
ఆ దృశ్యాలన్నీ నా మనసులో మళ్లీ మళ్లీ తిరుగుతున్నాయి.
ముందురోజు వడ్డన దగ్గర నేను హేండ్ బేగులోంచి రుమాలు తీసినపుడు దానితో బాటు కింద పడిపోయిన పది రూపాయల నోటును,
తర్వాత ఆడుకుంటూ చూసిన ఆ పిల్ల దాన్ని నాకివ్వాలని, పరుగెత్తుకుంటూ వచ్చి కారెక్క బోతున్న నా కొంగు లాగడం,
తర్వాత నేను చేసిన పని,
అది చూసి ,కళ్లనీళ్లతో ఆశ్రమంలోకి పరుగెడుతున్న ఆ పిల్లని,ఎత్తుకుని ఆఫీసులోకి తీసుకొని వెళుతున్న ఆ భక్తుల జంటలోని అమ్మాయి,
ఒకదాని వెంట ఒకటి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ పిల్ల కుడి చేతిలో మడత పెట్టి, మూడు వేళ్లతో నొక్కి పెట్టి తెచ్చిన,నా పది రూపాయల నోటు కారు పార్కింగ్ లోనే,తన చేతిలోంచి జారి పడిపోయింది.
ఆయన,
"ఇంకా మీరు తెలుసుకోవలసినది,ఆ పిల్ల మూగది,అందుకే మిమ్మల్ని పిలవలేక చీర కొంగు లాగింది.
మరో విషయం ఆ పిల్లని ఎత్తుకొని తీసుకు వచ్చిన అమ్మాయి ఈ ఆశ్రమంలోనే పెరిగింది.
మీలాంటి మరొకరి దయతో చదువుకొని విదేశాల్లో డాక్టరుగా పనిచేస్తోంది.
నిన్ననే ఆమె భర్తతో కలిసి వచ్చి ఈ ఆశ్రమానికి ఇరవై లక్షల విరాళం ఇచ్చింది.
ఇద్దరు పిల్లలని దత్తత తీసుకొందుకు గవర్నమెంటుకు అప్లై కూడా చేశారు.ఆ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు నెలరోజులు ఇక్కడే ఉంటుంది.
మనవల్ల అవసరంలో ఉన్నవారికి ఏదైనా ఉపకారం జరగాలి కాని,మనకోసం వారిని ఉపయోగించుకోవాలనుకోడం మంచిది కాదు..."అంటూ
ఆయన ఇంకా ఏవేవో చెబుతున్నారు.
నా కళ్లలో నీళ్లు.
నన్నెవరో కట్టేసినట్లు కుర్చీలోంచి లేవలేక పోతున్నాను.
'తల్లీ కామాక్షీ,నాకు క్షమాపణ అడిగే శక్తినియ్యి'.అనుకుంటూ లేచి రెండు చేతులూ జోడించి అస్పష్టంగా,
"క్షమించండి సార్" అంటూ,నాలో ఉన్న కీ.కం ని అడుగడుగుకీ పాతాళంలోకి తొక్కేస్తూ, బయటికి వస్తుంటే ఒక పక్క,
ఆ వెయ్యి రూపాయల విరాళాలు ఇచ్చిన దాతల పేర్ల పక్కనే 1980 అనే సంవత్సరం కూడా వ్రాసి ఉండడం కనిపించింది.
'నలభై సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు అంటే?... ఈరోజు…?'అనుకుంటూ,
తల వంచుకుని బయల్దేరిన నాకు ఆశ్రమపు తోటలోని మొక్కల మధ్యనుంచి కల్మషం లేని రెండు తెల్లటి కళ్లు,ఒక నల్లటి బుల్లి చేయి టాటా చెబుతున్నాయి.నా చెయ్యి కూడా అప్రయత్నంగా ఊగుతోంది.
- _వేటూరి పద్మ_