రామాయణమ్.111
.
రాముడి మాటలు విన్న భరతుడు లేచి ఆచమనంచేసి ఎదురుగా ఉన్న మంత్రులు,పౌరులూ ,జానపదులూ ,విద్వాంసులతో ఇలా అన్నాడు.
.
నేనెన్నడూ రాజ్యము ఇమ్మని నా తండ్రిని అడుగలేదు,అందుకోసము నా తల్లిని ప్రేరేపించనూ లేదు,రాముడి అరణ్యవాసాన్ని నేను ఎప్పుడూ సమర్ధించలేదు.
.
తండ్రిగారి మాట ప్రకారము అరణ్యములో పదునాలుగేండ్లు నివసించటానికి నేను సిద్ధం!.
.
భరతుడి ఈ సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోతూ రాముడు ఈ విధముగా పలికాడు .
.
నా తండ్రియుండగా జరుపబడిన లావాదేవీలను మార్చుటకు నాకుగానీ భరతునకు గానీ అధికారములేదు.
.
మాతకైకేయి రాజ్యము తన కుమారునకు కట్టబెట్టమని నా తండ్రిని కోరటంలో ఇసుమంతైనా దోషములేదు .వివాహ సమయములో ఆవిడ తండ్రికి మా తండ్రిగారు ఆవిధముగానే కదా వాగ్దానము చేసి యున్నది.
ఆ వాగ్దానము నిలుపుకొనుటకు మా తండ్రిగారు భరతునకు రాజ్యమిచ్చుట యుక్తమైనటువంటిదే!
.
రణభూమిలో నా తండ్రికి సహాయము చేసినందులకు గాను మాతకైకకు ఒసగిన వరము ఆవిడ ఇప్పుడు నా తండ్రిని నెరవేర్చమన్నది .దాని ప్రకారము నాకు అరణ్యవాసము విధించుట ఒక మహారాజుగా ఆయనకు గల అధికారమునకు సంబంధించినది.అదియు గాక తండ్రి ఆజ్ఞ పుత్రునకు శిరోధార్యము .అదియే ధర్మము.
.
కావున నా అరణ్యవాసము,భరతుడిపట్టాభిషేకము విషయములోమాత కైక,మరియు తండ్రిగారు చేసిన పని యుక్తమే!
.
భరతుడు ఓర్పుగలవాడు,పెద్దలను పూజించు వాడు, సత్యసంధుడు,మహాత్ముడు అని నాకు తెలియును .అతనికి మంగళమగుగాక.
.
అంతేగాక వనవాస విషయములో నా బదులుగా భరతుని పంపుట అత్యంత జుగుప్సాకరమైన విషయము. నేను వనవాసము చేయకుండుట వలన నా తండ్రికి అసత్యదోషము కలుగుతుంది ,నా తండ్రికి ఆ అపవాదు ఎన్నటికీ కలుగకుండుగాక!
.
నేను వనమునుండి తిరిగి వచ్చి భరతునితో కూడి పరిపాలనము చేయగలవాడను అని ప్రజలందరితో పలికాడు శ్రీరాముడు.
.
రామభరతుల ఈ అన్యోన్యమైన ప్రేమ, వారి ధర్మనిష్ఠ అక్కడ చేరినవారందరి మదిలో ఆశ్చర్యం కలుగచేసింది.
.
ఆహా ధర్మమూర్తులైన వీరిని కన్న ఆ దశరధుడు ధన్యుడు కదా !
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి