రామాయణమ్..110
..
రామా ! భరతుడు చెప్పినట్లుగా నీవు అంగీకరించు.అది ధర్మవిరుద్ధము కానేరదు.
జనులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు.అని వశిష్ఠుడు పలుకగా ,ఆయనతో వినయంగా రాముడిలా అన్నాడు.
.
.ఆచార్యా ,పిల్లలు పుట్టినప్పటి నుండీ తల్లిదండ్రులు వారి ఆలనాపాలనా చూస్తూ సమయానికి స్నానపానాదులు చేయిస్తూ ,వేళకు నిద్రపుచ్చుతూ వారికి సకలోపచారాలూ చేస్తారు. అలా సేవచేసిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా?
.
నాకు జన్మనిచ్చిన తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ వృధాగా పోనీయను .అని స్థిరగంభీరంగా పలికాడు రాఘవుడు.
.
భరతుడికి కన్నీరు ఆగటంలేదు .అది వరదగోదావరి అయ్యింది.సుమంత్రుని పిలిచి ఇక్కడ నేలపై దర్భలు పరిపించు ,అన్నగారు ప్రసన్నుడయ్యేంతవరకు నేను ఆయన ఎదురుగా ఆయనను అడ్డగించి కదలనీయను,
ఇక్కడే పడుకొంటాను,అని పలికి సుమంత్రుడు రాముని వైపు చూస్తూ ఉండటం గమనించి ,తానే స్వయంగా దర్భలు తెచ్చుకొని నేలపై పరుచుకొన్నాడు.
.
అప్పుతీసుకొని ఎగగొట్టిన వాడి ఇంటిముందు ఏ విధంగా హఠంచేస్తూ అడ్డంగా పడుకొంటారో ఆ విధంగా పడుకున్నాడు భరతుడు.
.
భరతా నేనేమి నేరం చేశానని ఇలా అడ్డంగా పడుకున్నావు.అయినా ఇలా అడ్డంగా పడుకొనుటకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంది ,క్షత్రియులకు లేదు. లేవయ్యా ! లే అని పలికాడు.
.
అప్పుడు భరతుడు చుట్టూ చేరిన ప్రజలకు నమస్కరించి అందరినీ ఉద్దేశించి నేనింతగా ప్రాధేయపడుతున్నా మీరెవ్వరూ ఉలకరూ పలుకరేమి? అని ప్రశ్నించాడు.
.
అప్పుడు ఆ పౌరజానపదులంతా ముక్తకంఠంతో రాముడి గూర్చి మాకు బాగా తెలుసు .ఆయన యుక్తమైనవే మాట్లాడతాడు.తండ్రిమాట పాలించాలనే ఉదాత్తమైన ఆశయమున్న రాముని మేము ఏ విధంగా మరలించగలం?
.
వారి మాటలు విన్న రాముడు ,భరతా ! విన్నావుగా అందరి అభిప్రాయము ,లే లేచి నన్నూ ,జలాన్ని తాకు అని అన్నాడు.
.
NB
.
( ఎందుకు ఆయనను స్పృశించి జలాన్ని తాకాలి?
ఏదైనా చిన్న దోషము సంభవించినప్పుడు మనకన్నా పెద్దవారిని తాకి ఆచమనం చేస్తే ఆ దోషం పోతుంది.
అక్కడ సాక్షాత్తు తమ గురువుగారుండగా వారిని కాదని తననెందుకు తాకమన్నాడు? అంటే ఇంకెప్పుడూ హఠం చేయక నా మీద ఒట్టుపెట్టుకో అని అర్ధమేమో!!!)
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి