1, నవంబర్ 2020, ఆదివారం

ధార్మికగీత -67*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత -67*

                                       *****

     *శ్లో:- సంసార   విషవృక్షస్య ౹*

            *ద్వే ఫలే అమృతోపమే ౹*

            *కావ్యామృతరసాస్వాదః ౹*

            *సంగమ  స్సజ్జనై  స్సహ ౹౹*

                                       *****

*భా:-  సంసారం ఒక విషవృక్షము. కాండము, వేరు దంపతులైతే, సంతానము శాఖోపశాఖలు. ఆశ్రయం పొందే పక్షిజాతులు బ్రహ్మచర్య,వానప్రస్థ, సన్న్యా సాశ్రమవాసులు.  ఈ వృక్షానికి రెండే అమృతముతో సమానమైన ఫలాలు.  1. కావ్యామృతము :- "గృహస్థు" కావ్యముల సందేశ సారాన్ని  గ్రహించాలి. రాముని వలె ధర్మంతో  నడుచుకోవాలని, రావణుని వలె ప్రలోభంతో కాదని తెలిసికోవాలి. కావ్యం వల్ల మనకు కీర్తి, విత్తము, ఉపదేశము, సదాచారణ,  శోక నివృత్తి, ఆనందము, దైవప్రీతి, పాపభీతి,  సంఘనీతి సిద్ధిస్తాయి. జ్ఞానదాయినియై ముక్తిని  ప్రసాదిస్తుంది.    2.సజ్జన  సంగమము:-  సత్పురుషుల యొక్క దర్శన, స్పర్శన, భాషణముల వలన   మన పాపాలు, తాపాలు, దైన్యము, హైన్యము సమసిపోగలవు. సద్భావన, సద్వాక్కు,సత్క్రియానిరతి అలవడతాయి. చతుర్విధ పురుషార్థాలకు సాధన సంపత్తి చేకూరుతుంది. ఈ విధంగా      పైన తెలిపిన రెండు ఉపకరణాలతో   "గృహస్థు"    సత్యనిష్ఠ, ధర్మాచరణతో  సుఖసంతోషాలతో, శాంతిసౌమనస్యాలతో  జీవనయానం చేసి, జ్ఞానసిద్ధితో ముక్తిమార్గంలో పురోగమిస్తాడు. కాన ప్రతి "గృహమేధి"కి సద్గ్రంథ పఠనము , సత్పురుష సమాశ్రయము ఆలంబనము కావాలని సారాంశము.*

                                     *****

                       *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: