3, సెప్టెంబర్ 2022, శనివారం

వినాయక చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 7 



ఓమ్ (ॐ) - వినాయకుడు



ఓమ్ (ॐ)    


    వేదాలను త్రయీ అంటారు. గద్య మంత్ర గాన భాగాలుగా అవి మూడు.

    మొదటి దానిలో తొలిమంత్రం "అగ్నిమీళే పురోహితమ్". అందులో మొదటి వర్ణం "అ".

    రెండవదానిలో మధ్యమంత్రం "యో నిస్సముద్రో బంధుః". అందులో మధ్య అక్షరం "ఉ".

    మూడవదానిలో చివరి మంత్రం "అసమానాంతరమ్". దానిలో చివరి వర్ణం "మ్".


      ఈ మొదలు, మధ్య, చివరలలోని అ + ఉ + మ్ = ఓమ్ అయింది.

      దీన్ని మనం "ॐ" గా వ్రాస్తాం కదా! ఇది వినాయకుని రూపమే!            


     ఈ ॐ లో


1. "3" లా కనిపించే భాగం ఉంది. ఆ 3 అనే అంకె కూడా అడ్డంగా సరిసమానంగా కాక, పై భాగం చిన్నగానూ, క్రింది భాగం పెద్దగానూ కన్పిస్తుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే - చిన్నగా కనిపించే ఆ పైభాగం వినాయకుని "శిరస్స"నీ, క్రింద పెద్దగా కనిపించే భాగం ఆయన "బొజ్జ" అనీ తెలుస్తుంది.


2. ఆ శిరస్సూ బొజ్జా కలసిన భాగం నుండి - మనకి కుడివైపునా, ఆ దేవునికి ఎడమవైపునా - ప్రక్కగానూ, వంకరగానూ కనిపించే భాగం ఆయన "తుండం".


3. ॐ కి తలమీద ఉన్న అర్ధ చంద్రాకారపు భాగం - ఆయన శిరస్సుమీద ఉండే "చంద్రవంక".

       అందుకే 'నుదిటిపై చంద్రరేఖ గలవాడు' అనే అర్థం వచ్చే "ఫాలచంద్రః" అనేది కూడా వినాయకుని పేర్లలో ఒకటి.


4. విద్యలన్నిటికీ మూలమూ, విజ్ఞాన సర్వస్వం "వేదం". వేదపఠనం ప్రారంభించేముందు పండితులు 

      "శ్రీ మహాగణాధిపతయే నమః - శ్రీ గురుభ్యో నమః - హరిః ఓమ్" - అని పలికి ఆ మీదటే వేదాన్ని వినిపిస్తారు.

      ఏది వ్రాయాలన్నా - వేదాధినేత వినాయకుని ధ్యానించి, వినాయక రూపాన్ని ॐ అని వ్రాసి, ప్రారంభిస్తాం కదా!


5. ప్రాణాయామం

       ముమ్మార్లు ॐ పలకడంద్వారా ప్రాణాయామం చేసి, ధ్యానార్చనాది ఏ భగవత్కార్యమైనా మొదలుపెడతాం కదా!

     ప్రణవంతో ప్రాణాయామం చేస్తే, మెదడులో - ఆలోచనకి కేంద్రస్థానమైన "పిట్యూటరీ" గ్రంధి ఉత్తేజితమౌతుంది. 


పరమాత్మకు కల మూడు పేర్లు 


   "ఓమ్ ఖమ్ బ్రహ్మ" అని వేదం చెబుతుంది. అందులో మొదటిది,


"అవతీతి ॐ" 

   - రక్షిస్తుంది కాబట్టి "ॐ" అని పేరు. 

    మనం జ్ఞానం చేత రక్షింపబడతాం. ఆ జ్ఞానం వేదం ద్వారా పొందగలుగుతాం. 

   "ॐ" ఉచ్చరించడం ద్వారా మెదడులోని "పిట్యూటరీ"గ్రంథి ఉత్తేజితమై ఆలోచన సక్రమంగా ఉండడమూ, 

    "ॐ" రూపంలోని "వినాయకుడు" సకల విద్యలూ అనుగ్రహించడమూ జరుగుతుంది. 


    దీన్నిబట్టీ "కోరిన విద్యలకెల్ల ఒజ్జ" - వేదస్వరూపమూ - ప్రణవస్వరూపంగా ఆరాధింపబడేది "వినాయకుడే" అనేది తెలుస్తోంది కదా!


                    =x=x=x=


    — రామాయణం శర్మ

            భద్రాచలం

డబ్బుతో కొనుక్కోగలిగే అన్ని సౌకర్యాలుసరిపోదు

 ఒక యువ బిలియనీర్ ఆసుపత్రి కి హడావుడిగా వచ్చాడు

*డాక్టర్‌ని అడిగాడు, "మా అమ్మ ఎలా ఉంది? ఎప్పుడు, ఎందుకు అడ్మిట్ అయింది?"*


*"మీ అమ్మకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అక్కడే కూర్చున్న వృద్ధ దంపతులు సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు" అని డాక్టర్ చెప్పారు.

* కొడుకు వృద్ధ దంపతులకు కృతజ్ఞతలు తెలిపాడు. "మిమ్మల్ని గుర్తించలేకపోయినందుకు క్షమించండి" అన్నాడు. అతను కూడా తమకు తెలియదని ఆ మహిళ సమాధానం ఇచ్చింది. కొడుకు ఆశ్చర్యపోయాడు* 😳

*"మా అమ్మ మీకు ఎలా తెలుసు?" అని అడిగాడు. ఆ పెద్దమనిషి,* *"ఆమె మా వాట్సాప్ గ్రూప్‌లో మెంబర్‌" అని జవాబిచ్చాడు.* *కొడుకు కన్ఫ్యూజ్ అయ్యాడు.

*పెద్దమనిషి కొనసాగించాడు,* *"మాకు WhatsAppలో ఒక గ్రూప్ ఉంది — _"The 60 Plus Group."_*

*అరవై ఏళ్లు పైబడిన వారందరూ సభ్యులుగా ఉంటారు. తమ ఇరుగుపొరుగు వారిని చేర్చుకోవడం సభ్యుల విధి.*

*_ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ "గుడ్ మార్నింగ్" సందేశాన్ని పంపాలి. అదేవిధంగా మధ్యాహ్నం మరియు రాత్రి కూడా. సభ్యులు చాట్ చేయవచ్చు, వీడియో లు మార్పిడి చేసుకోవచ్చు._*

_*ఏ రోజైనా ఎవరినుంచైనా తప్పనిసరి సందేశం రాకపోతే, పక్కింటి సభ్యులు అప్రమత్తం చేయబడతారు మరియు వారు సభ్యుడిని సందర్శించడాన్ని ఒక విధిగా చేస్తారు.*_

*"ఈ ఉదయం, మీ అమ్మ నుండి మాకు మెసేజ్ రాలేదు. అందుకే మేము ఆమె వద్దకు వెళ్లి ఆమెను ఇక్కడకు తీసుకు రాగలిగాము."*

*"మీరు మీ తల్లిదండ్రులకు డబ్బుతో కొనుక్కోగలిగే అన్ని సౌకర్యాలు కల్పిస్తే సరిపోదు, వారికి మాట్లాడటానికి వ్యక్తులు కావాలి. మీరు మీ అమ్మను చివరిసారి ఎప్పుడు కలిశారు?"*

* కొడుకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు

*"చూడండి, అందుకే మాకు ఈ గ్రూప్ ఉంది. లేకపోతే, మేము 60+ వయసులో గోడలు మరియు కిటికీలతో మాట్లాడాలి", అని చెప్పి ఆ దంపతులు వెళ్లిపోయారు.*

*_మనం ఎదుగుతున్నప్పుడు, మన తల్లిదండ్రులు పెద్దవుతున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు.

*పెద్దవారికి ఇది చాలా ముఖ్యమైన, అవసరమైన విషయం ఇది

(1)తప్పనిసరిగా వాట్సప్ గ్రూప్‌లో చేరడం

*మరియు*

*(2) ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ సందేశాన్ని పంపడం!*

*మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటే మీ సర్కిల్‌లో అమలు చేయడానికి అద్భుతమైన ఆలోచన!*

మంచికర్మలు* చెయ్యండి

 ఋణానుబంధం..అంతా ఋణానుబంధం.. జగమంతా  ఋణానుబంధం....................!!


ఒక తండ్రి 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్దకొడుకు  వయస్సు 40, రెండవకొడుకు  వయస్సు  37, 

మూడవ కొడుకు వయస్సు 33, 

నాలుగవ కొడుకు వయస్సు 30. సంవత్సరాలు అయితే...


అంటే పెద్ద కొడుకుతో 40 ఏళ్ళు ఉంటే , 

చివరి నాలుగవ కొడుకుతో  30 ఏళ్ళు మాత్రమే వున్నాడు ఎందుకు ?


మీ అనుభవంలో .....ఒక సంతానం ఏదైనా కోరితే.. డబ్బులు లేకున్నా అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాము , కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో  డబ్బులున్నా వాడి కోరిక   తీర్చాలనిపించదు ఎందుకని ?


అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం  ఎందుకని ?

చదవండి !


మనకు పూర్వ జన్మ కర్మల వలననే ఈ జన్మలో...

తల్లి, 

తండ్రి, 

అన్న, 

అక్క, 

భార్య, 

భర్త, 

ప్రేమికుడు, ప్రియురాలు, 

మిత్రులు, శత్రువులు 

మిగతా సంబంధాలు...

ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి. 


ఎందు కంటే మనం వీళ్లకు...ఈ జన్మ లో...

ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.


మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు.

మనకు....

పూర్వ జన్మ లో సంబంధం వున్న వాళ్ళే..

ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. 

వాటినే  మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...


ఋణాను బంధం.

గత జన్మ లో మనం ఎవరి వద్ద నైనా రుణం తీసుకుని వుండచ్చు  లేదా 

ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండొచ్చు. 

అటు వంటి వాళ్ళు మీకు సంతాన రూపం లో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మన తోనే వుంటారు.


శత్రువులు - పుత్రులు.

మన పూర్వ జన్మ లో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు. 

అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, 

నానా గొడవలూ చేస్తారు. 

జీవిత మంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు. 

ఎల్లప్పుడును తల్లితండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ... ఆనంద పడు తుంటారు.


తటస్థ పుత్రులు.

వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు... 

మరో వైపు సుఃఖం గా కూడా వుంచరు, 

వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు.

వాళ్ళ వివాహా నంతరం తల్లి దండ్రులకు దూరంగా జరిగి పోతారు.


సేవా తత్పరత వున్న పుత్రులు.

గత జన్మలో మీరు ఎవరి కైనా బాగా సేవచేసి వుండవచ్చును, 

ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా, కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు. 

అలా వచ్చి బాగా సేవను చేస్తారు. 

మీరు గతం లో  ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. 


మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే, 

ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు. 

లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారు కూడా మన వద్ద వుండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది.

అని అనుకోవద్దు. 


ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్ట వచ్చును..


ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును.

వాళ్ళే మీ  కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట 

పుట్ట వచ్చును. 


ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు. 


లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపం లో పుట్టి 

మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.


అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్య వద్దు. 

ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే...

దానికి ఈ జన్మ లో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం  అనుభవం లోకి తెస్తుంది.  


మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే 

అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్య బడతాయి. 


ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసి వేయ బడతాయి. 


(అనగా పాప పుణ్యాలు)

 కొద్దిగా ఆలోచించండి.

మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు.


మళ్లీ ఎంత ధనాన్ని..మీ వెంట తీసు కెళ్తారు..? 


ఇప్పటి వరకు పోయిన వాళ్లు ఎంత బంగారం, 

వెండి పట్టుకు పోయారు..? 


చివరగా ఒకమాట !


తాతగారు  సంపాదించిన ఆస్తినంతా  తగలేసి  మాకు ఏమి మిగల్చలేదని  ఒక కొడుకు బాధపడతాడు .

దానికి కారణం అతనికి తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే  యోగం లేదన్నమాట !


అతి బీద కుటుంబంలో  పుట్టిన  మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానానికి మిగిల్చి  చనిపోతాడు. 

దీనికి కారణం ఆ తండ్రి , తన కొడుకుకు  చెల్లించాల్సిన  అప్పన్నమాట !


మీ జీవితంలోని సంఘటనలను ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచించండి .


నేను, 

నాది, 

నీది అన్నది.

అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది. 


ఏది కూడా వెంట రాదు. 

ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య పాపఫలం వెంట వస్తుంది. 


జీవితమన్నా, సంసారమన్న ఏదైనా అనండి అంత ఋణానుబంధం.


కావున మీరు వాస్తవాలను గ్రహించి , 

వాస్తవాలను తెలుసుకొని , 

ఎంత వీలయితే అంత *మంచికర్మలు* చెయ్యండి.

సంకల్ప శుద్ధి

 ✡️  సంకల్ప శుద్ధి  ✡️


‘ఉత్త చేతులతో వచ్చాం. ఉత్త చేతులతోనే వెళ్తాం’ అనుకోవడంలోని తాత్త్వికతను వివేకంతో అన్వయించుకోవాలి తప్ప, నిష్క్రియా పరత్వాన్ని కప్పిపుచ్చుకొనే ముసుగులాగా వాడుకోవడం విజ్ఞత కాదు. అలాంటి సందర్భాల్లో అవి శుష్కప్రియాలవుతాయి. శూన్యహస్తాలుగా మిగిలిపోతాయి•


ఫలానాది సాధించామని చెప్పుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? ఆశల రెక్కలు విప్పి హాయిగా ఎగరాలని, చుక్కల లోకాన్ని చుట్టిరావాలని ఆశించనిదెవరు? ఆసరాగా పందిరి వేసి, వేళకిన్ని నీళ్లు పోస్తే ఎగబాకని తీగ ఉంటుందా, రేకులు విప్పారకుండా ఉంటుందా?


సాఫల్య సాధనలో తొలి అంశం, 'సానుకూల దృక్పథం.' ‘సాధిస్తాను’ అని సంకల్పం చెప్పుకోవడం చాలా అవసరం. అలాగని పని మొదలుపెట్టింది లగాయతు ఫలితం గురించి లెక్కలు వెయ్యడమన్నది సాధకుడి లక్షణం కాదు. దాని వల్ల ఆత్రుత, ఒత్తిడి హెచ్చి, ఏకాగ్రత పక్కదారి పడుతుంది. గమ్యం మరింత దూరమవుతుంది. *వాకిట్లో కాలుపెట్టింది మొదలు వారణాసి ఎంత దూరమని లెక్కలు వేస్తుంటే - ఇక గంగాతీరం చేరేదెన్నడు?


లౌకికం కావచ్చు - పారమార్థికం కావచ్చు... జీవిత సాఫల్యానికి వర్తించే సూత్రాలు, మార్గదర్శకాలు ఒకటే. అన్వయించుకోవడంలోనే ఉంది. ఆధ్యాత్మిక వేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆయా రంగాలకు వర్తించేలా వాటిని చెప్పినా అంతస్సూత్రం ఒకటే!


ఇందులో.. స్పష్టత, వ్యూహం, సహాయం- ఈ మూడు అంశాలూ ప్రధానమన్నది నిపుణుల మాట! ఎందుకు అని ప్రశ్నించుకోవడంలోనే సాధకుడి లక్ష్యం స్పష్టమవుతుంది. మానసికంగా సంబంధిత లక్ష్యంతో సారూప్యం చెందడం వీలవుతుంది. 


ముని బాలుడి శాపం వల్ల ఏడురోజుల్లో చావు తప్పదని తెలుసుకున్న పరీక్షిత్తు ప్రాయోపవేశానికి సిద్ధపడినా..., శుకమహర్షి రాకతో చేరాల్సిన గమ్యం పట్ల స్పష్టత ఏర్పరచుకున్నాడు. వారం తిరగ్గానే మరణం ఎలానూ వస్తుంది. ఇప్పుడే బతుకును బలవంతంగా ముగించడం దేనికని తర్కించుకున్నాడు. విష్ణు సన్నిధికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని స్పష్టంగా ఏర్పరచుకుని, దానికి అనుగుణమైన మానసిక వైఖరిని అవలంబించాడు. 'భాగవత సప్తాహం' ద్వారా జీవిత దిశగా పురోగమించాడు. 


సాఫల్యసాధనలో రెండో అంశం 'వ్యూహం.' ఏడు రోజుల్లో భాగవతాన్ని వినేందుకు సిద్ధపడ్డ పరీక్షిత్తు ఈసురోమని చెవులొగ్గ లేదు. తరిగిపోతున్న దినాలను, ఆయువును తలచుకుంటూ కంటతడి పెట్టనూలేదు. వినడాన్ని ప్రేమించాడు. విష్ణు సాన్నిధ్యం చేరుకోవడాన్ని ఆరాధించాడు. పరిపూర్ణమైన భక్తితో, అంకిత భావంతో, శ్రీమన్నారాయణుడి చరణయుగళంతో మమేకమై తనను తాను సమర్పించుకున్నాడు. విన్న కథల పట్ల, వినిపించిన శుక మహర్షి పట్ల కృతజ్ఞతను కలిగి ఉన్నాడు. ఈ వ్యూహమే ఆయనను సఫలుణ్ని చేసింది. పరీక్షిత్తు ఏ దశలోనూ నిరాశకు తావివ్వలేదు. నీలినీడలను సోకనివ్వలేదు. శుకమహర్షి చెబుతున్న కొద్దీ, శ్రద్ధాసక్తులు మూటకట్టుకుని, అడుగడుగునా పరిప్రశ్నలు వేస్తూ, అడిగి మరీ చెప్పించుకున్నాడు. 


సాఫల్యాన్ని పొందడంలో నిపుణులు సూచించిన మూడో అంశం - 'సహాయం.' అది శుకమహర్షి రూపంలో సరైన సమయానికి లభించడం పరీక్షిన్మహారాజు చేసుకున్న అదృష్టం.


 రాముడి విషయంలో - రావణుడి చెరనుంచి సీతను విడిపించడాన్ని, పాండవుల విషయంలో - కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించడాన్ని సాఫల్య సాధనలుగా భావిస్తే వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించిన - ‘స్పష్టత, వ్యూహం, సహాయం’ అనే సూత్ర త్రయం వారికి ఎంత చక్కగా వర్తించిందో విశదమవుతుంది. 


 దేశ కాలాదులతో నిమిత్తం లేకుండా జీవితంలోని లౌకిక, ఆధ్యాత్మిక రంగాలు రెండింటిలోనూ సాఫల్య సాధన సుసాధ్యమవుతుంది. చక్కని మార్గం ఉండి... సంకల్ప శుద్ధి పట్ల మనసుండాలి.

గోవు వెనక వెళ్ళడమెందుకు

 గోవు వెనక వెళ్ళడమెందుకు?

పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.

భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.

ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు.

ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.

కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.

చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.

ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.

చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.

స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.

స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 

తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.

స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.

స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?

--- “కడవులిన్ కురల్” - తిరువారూర్ దివాకరన్. ‘కుముదం’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।