3, సెప్టెంబర్ 2022, శనివారం

వినాయక చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 7 



ఓమ్ (ॐ) - వినాయకుడు



ఓమ్ (ॐ)    


    వేదాలను త్రయీ అంటారు. గద్య మంత్ర గాన భాగాలుగా అవి మూడు.

    మొదటి దానిలో తొలిమంత్రం "అగ్నిమీళే పురోహితమ్". అందులో మొదటి వర్ణం "అ".

    రెండవదానిలో మధ్యమంత్రం "యో నిస్సముద్రో బంధుః". అందులో మధ్య అక్షరం "ఉ".

    మూడవదానిలో చివరి మంత్రం "అసమానాంతరమ్". దానిలో చివరి వర్ణం "మ్".


      ఈ మొదలు, మధ్య, చివరలలోని అ + ఉ + మ్ = ఓమ్ అయింది.

      దీన్ని మనం "ॐ" గా వ్రాస్తాం కదా! ఇది వినాయకుని రూపమే!            


     ఈ ॐ లో


1. "3" లా కనిపించే భాగం ఉంది. ఆ 3 అనే అంకె కూడా అడ్డంగా సరిసమానంగా కాక, పై భాగం చిన్నగానూ, క్రింది భాగం పెద్దగానూ కన్పిస్తుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే - చిన్నగా కనిపించే ఆ పైభాగం వినాయకుని "శిరస్స"నీ, క్రింద పెద్దగా కనిపించే భాగం ఆయన "బొజ్జ" అనీ తెలుస్తుంది.


2. ఆ శిరస్సూ బొజ్జా కలసిన భాగం నుండి - మనకి కుడివైపునా, ఆ దేవునికి ఎడమవైపునా - ప్రక్కగానూ, వంకరగానూ కనిపించే భాగం ఆయన "తుండం".


3. ॐ కి తలమీద ఉన్న అర్ధ చంద్రాకారపు భాగం - ఆయన శిరస్సుమీద ఉండే "చంద్రవంక".

       అందుకే 'నుదిటిపై చంద్రరేఖ గలవాడు' అనే అర్థం వచ్చే "ఫాలచంద్రః" అనేది కూడా వినాయకుని పేర్లలో ఒకటి.


4. విద్యలన్నిటికీ మూలమూ, విజ్ఞాన సర్వస్వం "వేదం". వేదపఠనం ప్రారంభించేముందు పండితులు 

      "శ్రీ మహాగణాధిపతయే నమః - శ్రీ గురుభ్యో నమః - హరిః ఓమ్" - అని పలికి ఆ మీదటే వేదాన్ని వినిపిస్తారు.

      ఏది వ్రాయాలన్నా - వేదాధినేత వినాయకుని ధ్యానించి, వినాయక రూపాన్ని ॐ అని వ్రాసి, ప్రారంభిస్తాం కదా!


5. ప్రాణాయామం

       ముమ్మార్లు ॐ పలకడంద్వారా ప్రాణాయామం చేసి, ధ్యానార్చనాది ఏ భగవత్కార్యమైనా మొదలుపెడతాం కదా!

     ప్రణవంతో ప్రాణాయామం చేస్తే, మెదడులో - ఆలోచనకి కేంద్రస్థానమైన "పిట్యూటరీ" గ్రంధి ఉత్తేజితమౌతుంది. 


పరమాత్మకు కల మూడు పేర్లు 


   "ఓమ్ ఖమ్ బ్రహ్మ" అని వేదం చెబుతుంది. అందులో మొదటిది,


"అవతీతి ॐ" 

   - రక్షిస్తుంది కాబట్టి "ॐ" అని పేరు. 

    మనం జ్ఞానం చేత రక్షింపబడతాం. ఆ జ్ఞానం వేదం ద్వారా పొందగలుగుతాం. 

   "ॐ" ఉచ్చరించడం ద్వారా మెదడులోని "పిట్యూటరీ"గ్రంథి ఉత్తేజితమై ఆలోచన సక్రమంగా ఉండడమూ, 

    "ॐ" రూపంలోని "వినాయకుడు" సకల విద్యలూ అనుగ్రహించడమూ జరుగుతుంది. 


    దీన్నిబట్టీ "కోరిన విద్యలకెల్ల ఒజ్జ" - వేదస్వరూపమూ - ప్రణవస్వరూపంగా ఆరాధింపబడేది "వినాయకుడే" అనేది తెలుస్తోంది కదా!


                    =x=x=x=


    — రామాయణం శర్మ

            భద్రాచలం

కామెంట్‌లు లేవు: