ధర్మాకృతి : పరాపర గురువులు - 1
రాజా గోవింద దీక్షితుల వారి వంశానికి చెందినా శ్రీ వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు కామకోటి 64వ పీఠాధిపతులయ్యారు. వీరి సంయాసాశ్రమ నామము చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. స్వామివారు పీఠాధిపత్యానంతరము కొంతకాలము కుంభకోణములోనే ఉండి తపస్సు చేశారు. మంత్రశాస్త్రములో మంచి పరిశ్రమ చేశారు. శ్రీవిద్యా సంప్రదాయములో అందెవేసిన చేయిగా ప్రసిద్ధిచెందారు.
అమ్మవారు వీరికి అనవరతము ప్రత్యక్షముగా ఉండేదని ప్రసిద్ధి. ఒకసారి ఔత్తరాహికులైన పండితులు స్వామి దర్శనానికి వచ్చారట. స్వామివారు వారి బసకు, భోజనానికి తగిన ఏర్పాట్లు చేయించి, సన్మానం చేయబోతున్నంతలో వారు తమకు కావలసినది ఈ సన్మానం కాదనీ స్వామి వారితోనే శాస్త్రవాదం కావాలనీ కోరారట. స్వామివారు అలాగే కానీయండని తమ దైనందిన పూజాదికములు ముగించి తిరువిసైనల్లూరు, కుంభకోణము, తిరువిడైమరుదూరు, తంజావూరు ప్రాంతములలోని పండితులను రావించి విద్వత్సభ ఏర్పాటు చేశారు. ఔత్తరాహ పండితులు సుఖాసీనులయిన తరువాత పూర్వపక్షం ఆరంభించమన్నారు.
పూర్వపక్షం ప్రారంభించిన పండితుడు రెండు మూడు వాక్యములు చెప్పి శ్రీవారి వంకకు చూసి నిశ్చేష్టుడై ఊరకుండిపోయారు. వారిలో వారు మాట్లాడుకొని, చివరకు వారి పెద్ద స్వామివారితో మీ ఒళ్ళో కూర్చుని జ్యోతిలా వెలిగిపోతున్న ఆ బాలిక చిరు మందహాసపు సొగసు మాకు పైవాక్యం తోచకుండా చేస్తోంది. దయచేసి ఆమెను లోపలి పంపి వేస్తె వాదం ఆరంభిస్తామన్నారట. అక్కడున్న మిగతా పండిత గణము, పరిచారక వర్గం ఆశ్చర్యమగ్నులై పోయారు. స్వామివారు చిరునవ్వుతో “సన్యాసినైన నా ఒళ్ళో దండకమండలాదులు తప్పితే బాలిక ఉండే అవకాశమున్నదా? ధైర్యంగా మీరు పూర్వపక్షాన్ని ఆరంభించండి అన్నారట. వారంతా సాష్టాంగంగా నమస్కరించి ‘పరదేవతా స్వరూపులయిన మీతో వాదన కోరడం అపచారం. మా అజ్ఞానాన్ని క్షమించండి” అని ప్రార్థించారు. “అదృష్టవంతులయ్యా మీరు! అమ్మవారి దర్శనం లభించింది” అని సంతోషపడి తగిన సత్కారములు చేసి పంపారు.
వీరికి తమ మఠ ఆధ్వర్యములో నడుస్తున్న కామాక్షీ దేవాలయపు కుంభాభిషేకము చేయించాలని అభిప్రాయం కలిగింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారి తోడ్పాడుతో కంచికి విజయం చేశారు. కలాకర్షణ హోమము అయిన తరువాత అమ్మవారి కళను కలశములో ఆవాహన చేసి, అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి విగ్రహాన్ని కదిలించి జలావాసం చేయించారు. అప్పుడు చూస్తే గర్భాలయము అంతా పటిష్టము చేయవలసిన అవసరం కనిపించింది. ప్రభుత్వం వారు మంజూరు చేసిన ద్రవ్యం, మరి మఠద్రవ్యం కలిపినా ఈ కార్యానికి కావలసిన మొత్తానికి తక్కువగా కనిపించింది. ఇక తప్పదని స్వామివారు మద్రాస్ పర్యటనకు బయలుదేరారు.
శ్రీవారు చెన్నపురిలో ఒకరోజు రాత్రి రెండు గంటలకు ధ్యానమగ్నులై ఉండగా అమ్మవారు కనిపించి వారి చేయి తమ శిరోజములపై ఉంచి, పాలాభిషేకం అయిన కురులు ఎలా జటలు కట్టాయో చూడు. తిలాభిషేకము ఎప్పడు చేయిస్తావు. డబ్బులు కొరతపడితే నేనీయనా అని ప్రశ్నించిందట. ధిగ్గున లేచిన స్వామివారు వెంటనే కాంచీపురా ప్రయాణము సమకట్టారు. ఆ రోజుల్లో మదరాసు నగర ద్వారాలు రాత్రిపూట మూసివేసి ఉంచేవారట. శ్రీవారి కోర్కెపై తెల్లవారక ముందే నగర ద్వారాలు తెరిపించారు తెల్లదొరతనము వారు. స్వామివారు నేరుగా కంచి కామాక్షీ దేవాలయానికి వెళ్ళి జీర్ణోద్ధరణ పనులు పర్యవేక్షించారు. దానం ఎక్కణ్ణుంచి వచ్చిందో కానీ అవసరానికి వర్షించిందట. అమ్మవారికి అష్టబంధన మహా కుంభాభిషేకములు జరిపించి అమ్మ సన్నిధిలో ఆనంద భాష్పములతో మైమరచిపోయారు.
తరువాత మహాస్వామి వారు “శ్రీమఠం ఖైదు అయిన కథ’లో వివరించిన తాటంక ప్రతిష్ఠ ఉదంతం, తంజావూరు కనకాభిషేకం జరిగినాయి. కుంభకోణము చేరిన స్వామివారు తమకు అవసాన కాలమాసన్నమయిందని గ్రహించి తదనంతర శిష్యులను స్వీకరించి మహా దేవేంద్ర సరస్వతీ స్వామి వారనే పేరుతో సంయాసమిచ్చి, ప్రశాంతచిత్తులై బ్రహ్మలీనులైపోయారు. వీరి అధిష్ఠానము కుంభకోణపు మఠపు పెరటిలో తూర్పు మూలన వడకోటి బృందావనమనే పేరుతో పూజింపబడుతోంది. అయితే వీరి సమయములో శ్రీమఠాన్ని కదిలించి వేసిన సంఘటనల గురించి చెప్పుకోకుండా వీరి చరిత్ర పూర్తి కాదు.
క్రీ.శ. 1817 నుండి క్రీ.శ. 1879వరకు శృంగేరీ పీఠములో విరాజమానులయిన ఉగ్రనృసింహభారతీ స్వామివారు మహాప్రతిభాశాలురు. మన మహాస్వామి వారి మాటలలో మహా తపస్వి. మహా తేజస్వి. చిన్నతనములోనే కాలినడకన రెండు మార్లు కాశీయాత్ర చేసి విద్యాభ్యాసం చేశారు. మణికుట్టి శాస్త్రిగారి వద్ద ప్రస్థానత్రయ భాష్యశాంతి చేశారు. ఇరవై ఏళ్ళవయస్సులో శృంగేరీ పీఠాన్ని అధిష్ఠించారు. అప్పటికి మూడు తరములుగా శృంగేరీ ఆచార్యులు యుద్ధ భయం వలన పూనాలో ఎక్కువ కాలం గడిపారని బోడస్ వ్రాసిన మారాఠీ పుస్తకంలో ఉన్నది.
(సశేషం)
ధర్మాకృతి : పరాపర గురువులు - 2
వీరు ఆహార భయ నిద్రాడులను జయించినవారు. కేవలం కందమూలాలు కొంతకాలం, కాకరకాయలు కొంతకాలం భుజిస్తూ రోజుకు ఇరవై గంటలు అత్యాశ్చర్యకరమైన తపశ్చర్య ఆచరించారు. అణిమాది సిద్ధులు వీరి పాదాక్రాంతమయ్యాయి. శృంగేరీ బిరుదములలో చెప్పబడిన ‘సర్వతంత్రస్వతంత్ర’ బిరుదము వీరి యెడ సార్థకమైనది. వీరిని చూసినంతనే గౌరవభావము కలిగి సంస్థానాధీశులు పాదాక్రాంతులయిపోయేవారని, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని సాధించేదాకా వదలిపెట్టడం వారి మనస్తత్వం కాదని వారి చరిత్రలో వ్రాసి ఉన్నది. వీరి మహాత్తుల గురించిన అనేక సంఘటనలు చెప్పబడినవి. మచ్చుకు ఒకటి రెండు చెప్పుకొందాం.
ఒకప్పుడు వీరు మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్ళారు. అమ్మవారికి తామే స్వయంగా పూజ చేయాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. అక్కడి అర్చకులు శైవాగమమునకు సంబంధించిన వారు. వారు స్వామివారు సైతం లోపలి రావడానికి ఒప్పుకోలేదు. ఆగ్రహించిన స్వామివారు అమ్మవారి జీవకళను కొబ్బరికాయలోనికి ఆవాహన చేసి, తమతో విడిదికి పట్టుకొని పోయారు. ఆ విషయం బహిరంగంగా చెప్పి మరీ వెళ్ళారు. అమ్మవారి విగ్రహంలో జీవకళ లోపించిన విషయం అర్చకులు గ్రహించి కాళ్ళా వేళ్ళా పడితే క్షమించి స్వయంగా దేవాలయానికి వెళ్ళి తిరిగి కళాప్రతిష్ఠ చేశారు. ఈరోజునకు కూడా శృంగేరీ పీఠములో మీనాక్షీ దేవికి ప్రతిదినము మహా నివేదనము జరుగుతుందట.
ఒక సంస్థానాధీశులు స్వామివారిణి స్వయంగా వచ్చి ఆహ్వానించడానికి బదులు తమ ప్రతినిధి ద్వారా ఆహ్వానం పంపారట. రాజుగారికి పక్షవాతం వచ్చింది. తన తప్పు గ్రహించి, బుద్ధి తెచ్చుకొని స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే క్షమించి సంస్థానానికి విజయం చేశారు. పక్షవాతం గుణమయిందని వేరే చెప్పనక్కరలేదు కదా!
మహదేవ శాస్త్రి అనే పేరు గల మహా ప్రతిభాశాలి అయిన పండితుడు తన వాదనా పటిమతో అందరినీ పరాజితులను గావించి, శృంగేరీ స్వామివారితో వారి తపోవృద్ధత్వాన్ని, జ్ఞాన వృద్ధత్వాన్ని వయో వృద్ధత్వాన్ని కూడా గణనలోనికి తీసుకోకుండా వాడనలోనికి దిగి స్వామివారినే తికమక పెట్టారట. “మహాదేవా! నీకు సరస్వతి మంచి వాక్పటిమను ప్రసాదించింది. నామీదే ప్రయోగింప చూశావు. ఇమనుంచి మరచిపోతావు” అని నిగ్రహించారట. తరువాత మహదేవులు శివగంగ పీఠాధిపతులుగా చాలా కొద్దికాలం ఉన్నారు. మతిమరుపు సంభవించింది.
వీరి మహిమలు, ఆధ్యాత్మిక ఔన్నత్యం కారణంగా వీరి కీర్తి దిగంతాలకు పాకింది. ఉగ్ర నరసింహ భారతీ స్వామివారు శృంగేరీ పీఠపు ఔన్నత్యాన్ని పునరుద్ధరించడానికి అహర్నిశలూ కృషి చేశారు. కూడలి, శివగంగ, విరూపాక్ష పీఠములపై వివిధ కోర్టులలో కేసులు వేశారు. అయితే వాదనకు తగిన ఆధారాలు లేకపోవడంతో శృంగేరీ వాదము కొన్ని కేసులలో కోర్టులలో నిలువలేదు. వీరి విస్తృత దక్షిణ దేశ పర్యటనలో కంచి కామకోటి పీఠమునకున్న ప్రత్యేక మర్యాదలన్నీ తాము పొందాలని ప్రయత్నించారు.
1838లో మహా మఖ సందర్భంగా కామకోటి పీఠాధిపతులు పల్లకీలో వెళ్ళే మార్గంలోనే తమ పల్లకీ వెళ్లాలని పట్టుబట్టారు. అయితే కుంభకోణంలో ఉన్న ఇతర మఠాధిపతులు ఒప్పుకోనందున ప్రభుత్వమూ వారికి వేరే మార్గము నిర్ణయించింది. మిగిలిన మఠముల ఎదురుగా పల్లకీ పైన వెళ్ళే అధికారం కామకోటి పీఠాధిపటులకే ఉన్నదని నిర్ణయమయింది. 1844లో అఖిలాండేశ్వరీ దేవాలయ కుంభాభిషేకపు కేసులో వివిధ కోర్టులలో జరిగిన వివాదము శ్రీమఠం ఖైదు అయిన కథలో చూడవచ్చు. 1866లో తిరిగి కుంభకోణం కామకోటి మఠం వీధిలో ఊరేగింపుగా వెళ్ళడానికి ప్రయత్నించి నిరోధించబడ్డారు. తిరుచ్చి ప్రాంతాలలో అగ్ర సంభావనకు ప్రయత్నించి కలెక్టరు చేత కూడదని కట్టడి చేయబడ్డారు.
మద్రాసు సమీప ప్రాంతాలలో అగ్రపూజకై ప్రయత్నించడం చెన్నపురి మహాజనసభకు నచ్చలేదు. అది ఆ ప్రాంతాలకు పరంపరగా గురువులయిన కామకోటి పీఠ మర్యాదకు వ్యతిరేకమని ఆ ప్రాంత ప్రజలలో భావన కలిగింది. ఈ సమయంలో వీరు మదరాసు నగరానికి విచ్చేయనున్నామని చెన్నపురి మహాసభకు శ్రీముఖం పంపారు.
మదరాసు మహాజన సభ ప్రత్యేక సమావేశంలో ఈ శ్రీముఖాన్ని చర్చించింది. ఆ నగరంలో సర్వ ప్రాతినిధ్యం గల సభ నిర్ణయానుసారం ఆ సభాధ్యక్షులు కామకోటి పీఠ గౌరవ ప్రపత్తులకు భంగం కానివిధంగా మాత్రమే శృంగేరీ స్వామివారు మదరాసు విజయం చేయవచ్చునని ఆహ్వానించారు. డానికి ఆ స్వామివారు బదులు వ్రాస్తూ “శ్రీ కంచి కామకోటి పీఠానికి విరోధము చేయవలెనని అభిప్రాయము ఉండేది లేదని యీ వివరం తెలిసేది” అంటూ సమాధానంగా శ్రీముఖం పంపారు.
పై వివరాలను బట్టీ ఈ స్వామివారిని అన్యధా అర్థం చేసుకోరాదు. వారు తపస్సంపన్నులు, జీవన్ముక్తులు. మహాపురుషులనే విషయం మనం మరచిపోరాదు. బిసి అని చెప్పడానికే వీరి వృత్తాంతాన్ని చెప్పాను.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి