కధానాయకుడు
పూర్వం మనం అనేక జానపద సినిమాలలో ఒక సాదారణ సన్నివేశాన్ని చూసేవారం. అదేమిటంటే రాజు ముందు కధానాయకుడు అనేక శృంఖలాలతో (గొలుసులతో) బందించి ఉండి వెనుక అటు ఇద్దరు ఇటు ఇద్దరు సైనికులు తాళ్లతో లాగుతూ ఉండగా వాళ్ళని ఈడ్చుకొని రాజు (విలన్) ముందుకు వచ్చి భారీ డైలాగులు కొట్టి ఆ శృంఖలాలను తెంచుకొని వెనుక వున్న సైనికులను చిత్తూ చిత్తుగా ఓడించి అక్కడినుండి పారిపోతాడు. అది చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఆ కధానాయకుని ధీరోదాత్తతను పొగుడుతారు. ఇది అందరు గమనించిన విషయమే. ఇదే మనం ఆధ్యాత్మిక జీవనానికి ఆపాదించుకుంటే
ఈ సన్నివేశంలో కధానాయకుడే సాధకుడు అతనికి కట్టి బంధించిన శృంఖలాలే సంసార బంధనాలు, వెనుక ఉండి లాగే సైనికులే అరిషడ్వార్గాలు (కామ, క్రోధ, మోహ, మద ,మాత్సర్యాలు) సాధకుడు తన అకుంఠిత దీక్షతో సంసార బంధనాలను ఛేదించి అరిషడ్వార్గాలను ఓడించి విముక్తుడై నప్పుడే మోక్షాపేదాన్ని చేరుకోగలడు.
ఏది ప్రతిబంధకం కాదు:
తరచుగా అనేకమంది చెప్పేది ఏమిటంటే నాకు అనేక సంసారిక సమస్యలు వున్నాయి, నా భార్యా నా మాట వినదు, నా కొడుకులు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాడు, మా అల్లుడు నా కూతురిని సరిగా చూసుకోవటం లేదు, ఇంతవరకు నేను సొంత ఇల్లు కొనుక్కోలేదు. ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. అందరు సొంత ఇళ్ళు కొనుక్కొని సుఖంగా వుంటున్నారు. నాకు ఇంకా ఈ అద్దె ఇల్లు బాధ తప్పలేదు. అందరి భార్యలు ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు, నా భార్య ఏమి చేయటంలేదు. నాకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. నా భార్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు మాకు వైద్యానికే బోలెడు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇలా ఇలా అనేక బాధలు గుక్క తిప్పకుండా చెపుతూ పోతారు. సాధక మిత్రమా భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నీవు చెప్పే సమస్యలు నీ ఒక్కడివి కావు. భూమి మీద వున్న ప్రతి మనిషికి వున్న సమస్యలే. కాకపొతే కొందరిని కొన్ని సమస్యలు బాదిస్తే ఇంకొందరిని ఇంకొన్ని సమస్యలు బాధిస్తాయి. ఈ లోకంలో పేదవాడు లేక బాధపడుతుంటే, ఉన్నవాడు ఉన్న దానిని ఎలా దాచుకోవాలా అని బాధపడతాడు.
సృష్టించుకున్న సమస్యలు: చాలావరకు మనకు కలిగే సమస్యలు మనం సృష్టించుకున్నవే. నిజానికి నీకు ఒక చిన్న సమస్య ఉంటే నీవు నీ తోటివానిలో పోల్చుకొని నీ సమస్య ఇంకా పెద్దది చేసుకొని ఆ సమస్య చుట్టూ నీ మనస్సును త్రిప్పుతూ ఇంకా ఇంకా పెద్దదిగా చూస్తున్నావు. నిజానికి నీవు నీ సమస్యను బూతద్దంలో పెట్టి చూస్తున్నావు. అందుకే నీవు భయపడుతున్నావు. దానివల్ల నీ మనస్సు సాధన వైపు మళ్లకుండా చేసుకుంటున్నావు. దీనికి పరిష్కారం ఏమిటంటే ముందుగా పోల్చుకుని తత్వాన్ని విడనాడాలి. ఎవరి బ్రతుకు వారిది, ఎవరి ఉద్యోగం వారిది. ఎవరో పదంతస్తుల భవనం కట్టారని నీవు కట్టలేదనే భావం విడనాడాలి. ఎవరి స్తోమత వారిది అనే సత్యాన్ని తెలుసుకోవాలి. తరువాత నేను నాకు లభించిందానితో తృప్తిగా జీవనం చేస్తాను అనే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు సగం సమస్యలు తొలగుతాయి.
నాకు ఈ రోజు చక్కటి ఆరోగ్యం, ఆహారం, ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను సదా ఆ భగవంతునికి కృతజ్ఞతగా వుంటాను అనే భావం పెంపొందించుకోవాలి. మనకు మొట్టమొదటిగా వెలసిన ఉపనిషత్తు "ఈశా వాసోపనిషత్తు" అందులోని మొదటి మంత్రాన్ని గమనించండి
ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం
ఈ జగత్తు మొత్తం కూడా ఈశ్వరునిచేతనే ఇమిడి ఉన్నది అంటే ఇక్కడ ఈశ్వరుడు కానిది ఏమి లేదు. ఇక్కడి ధనం, సంపదలు ఎవరివి అంటే ఎవరివి కావు కేవలం ఈశ్వరుడివి మాత్రమే కాబట్టి నీకు లభించినది అది ఈశ్వరుని అనుగ్రహంగా భావిస్తూ నీ జీవితాన్ని త్యాగభావనతో గడపాలి అని చెపుతున్నది.
మనం ఈ ద్వైత ప్రపంచాన్ని గమనిస్తే మనకు రెండు విషయాలు గోచరిస్తున్నవి. అవి ఒకటి ఇంద్రియాలకు గోచరించేవి రెండు ఇంద్రియాలకు గోచరించనివి. సృష్టిలో వున్న పంచభూతములు మనకు వున్న పంచేంద్రియాలకు గోచరిస్తున్నాయి. ఇక మన ఇంద్రియాలకు గోచరించేది ప్రతిదీ మనం అది ఉన్నట్లు తెలుసుకుంటున్నాము. ఒక మనషీ నీ కంటికి కనబట్టాడు, ఫోనులో మాట్లాడాడు, అతను నీ భుజం మీద తట్టాడు, ఇటువంటి వాటివల్ల మనకు ఆ మనిషి ఉనికి గోచరిస్తున్నది. అదే మనిషి నీ కలలో కనపడ్డాడు దానివల్ల తాను ఉన్నట్లు చెప్పట్లేదు. మనకు చనిపోయిన మనవారు తరచూ కలలో వస్తూవుంటారు. కానీ వారిని కలలో చూశామని చెప్పటమే కానీ వారు బౌతికంగా ఉన్నట్లు ఆనం. ప్రతిదీ కూలంకుషంగా విచారిస్తే కానీ మనకు భగవంతుని గూర్చి తెలియదు.
మన మనస్సు ఎప్పుడైతే దైవ చింతన మీదికి వెళుతుందో అప్పుడు మనం సంసారంలో వున్నా కూడా మన సంసార బాధ్యతలను నిర్వహిస్తున్నా కూడా వాటిని మన కర్తవ్యంగా మాత్రమే తీసుకొని వాటిమీద మనస్సు నిలపక మనస్సు కేవలం పరమాత్మ మీదనే ఉంచుతాడు సాధకుడు.
మోక్షానికి సన్యాసం ముఖ్యమా:
మన సనాతన ధర్మం మనకు ఆశ్రమ ధర్మాలు తెలియచేశాయి. అవి బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేవి నాల్గు రకాలైన ఆశ్రమ ధర్మాలు.ఇందులో బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమాలు రెండవది అయిన గృహస్ట ఆశ్రమం మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాలకు ఆధారభూతమైనది. ఇప్పుడు మనం ఆశ్రమ ధర్మాలను ఎంతవరకు ఆచరిస్తున్నాము అనేది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం. నిజానికి సన్యాసం మోక్షానికి ఆవలంబలం అయినా కూడా ఇప్పటి పరిస్థితుల్లో మనం వానప్రస్థ, సన్యాస ఆశ్రమ జీవనం చేయటం ఎంతవరకు ఆచరణ నీయం అనేది ప్రతివారు యోచించవలసిన విషయం.
To be continued