8, మార్చి 2023, బుధవారం

WOMEN'S DAY

 ॐ           WOMEN'S DAY అవసరమా? 


భారతీయ శాస్త్రం 


యత్ర నార్యస్తు పూజ్యంతే 

రమంతే తత్ర దేవతాః I

యత్రైతాస్తు నపూజ్యంతే 

సర్వాస్తత్రాఫలాక్రియః ॥

              మనుస్మృతి 3/56 

  - ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో,అక్కడ దేవతలు నివసిస్తారనీ, 

    ఎక్కడ పూజింప బడరో అక్కడ కార్యాలన్నీ నిష్ఫలాలని తెల్పి, 


స్త్రియః శ్రియశ్చ గేహేషు  

నవిశేషోస్తి కశ్చన I

  - స్త్రీలు గృహంలో గృహలక్ష్ములే, ఇంతకన్నా వేరే విశేషపదం లేదని మనువు స్త్రీని కీర్తిస్తాడు. 


    అందుకనే వివాహ సమయంలో కన్యాదాత “లక్ష్మీ నామ్నీం" కన్యాం "శ్రీమన్నారాయణ" స్వరూపాయ వరాయ దదాతి - అనిచెప్పి కన్యాదానం చేస్తారు.   

    తమ ఇంటబుట్టిన ఆడపిల్లని తండ్రి,సోదరులు బాగా చూసుకోవాలనీ, అమ్మాయికి కావలసినవి సమకూర్చాలనీ మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు. 


స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. 


పౌరాణికం 


     ప్రహ్లాదుడు  

" కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన 

  మాతృ భావము జొచ్చి మరలువాడు" అని పోతన వివరిస్తాడు. 

    సీతని పరాభవించి రావణుడు, 

    ద్రౌపదిని అవమానపరచి  కౌరవులు ఎలా నాశానమయ్యారో మనకి తెలుసు. 


ప్రస్తుత పరిస్థితి 


    ప్రగతి పథంలో పయనించే ఈ ఆధునిక యుగంలో నవ నాగరిక సమాజంలో 

(i) కార్యాలయాల్లో, కళాశాలల్లో, అన్నిచోట్లా స్త్రీలు వేదింపబడటం శోచనీయం. 

(ii) చాటింగులు, డేటింగులతో, సెల్ ఫోను సంభాషణలతో యువత విచ్చలవిడిగా సంచరించడం ప్రమాదకారి అయింది. 

(iii) లేత వయస్సు లోనే విషయవాంఛలకు లోబడి జీవితాలను నాశనం చేసుకోడం చూస్తూనే ఉన్నాం. 

(iv) స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, అత్యాచారాలు ఇలా ఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. 

    ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, "అరణ్యరోదనన్యాయంలా” పనికి రాకుండా పోతోంది.   

    

పరిష్కారం 


    అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరూ సుఖశాంతులతో జీవించాలన్నా, సమతా - మమతా - మానవతలు సమాజంలో వెల్లివిరియాలన్నా ఒక్కటే మార్గం. 

    అది మన సంప్రదాయాలని పాటిస్తూ, పెద్దలుచేప్పిన మార్గంలో పయనించడమే. 


    అప్పుడు, సంవత్సరానికి ఒకరోజు తద్దినం పెట్టినట్లు "WOMEN'S DAY" జరుపుకోవలసిన అవసరం ఉండదు.

ఆనాటి జీవన శైలి

 🤘🤘 *"60 ఏళ్ళ  పూర్వానికి ఒక్కసారి వెళ్లి వద్దామా!.....ఆనాటి జీవన శైలి."* 🤘🤘


*"🌹ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు."*


*"🌹కొంతమంది కచ్చిక,  (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు."*


*"🌹మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే,  నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి."*


🌹 *ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు."*


*"🌹కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు."*


*"🌹బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ,  పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది."*


*"అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు."*


*"🌹ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే."*


*"🌹అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి."*


*"అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు."*


*"🌹బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు."*


*"🌹సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ, రాలేకపోతే,  అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం."*


*"🌹రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.*"


*"టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి."*


*"🌹పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు."*


*"🌹ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు."*


*"🌹డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి."*


*"3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది."*


*"🌹వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.  అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు."*


*"🌹ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు.  అంతే.   ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు."*


*"🌹పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే.    పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు."*


*"🌹రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం.  అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర.   వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే."*


*"🌹ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది.  రెండు రూపాయలు పెట్టి,  ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు."*


🌹 *అదీ ఆరోజుల్లో జీవన శైలి. ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు.* 😃🤷🏻‍♂️


🌹 *అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు  మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు. ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు...."*


*"కక్షలూ కార్పణ్యాలు.  కోప తాపాలు కుళ్ళూ కపటం.   ఈర్ష్యా ద్వేషాలు  వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు.   అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి."* 


🌹 *వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. మరుజన్మ ఉన్నదో లేదో ఆ రోజులు మరలా వస్తాయో రావో ! అంతా దైవేఛ్ఛ.."* 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఇవి ఒక మిత్రుని అనుభవాలు.

మనకు కూడా  బాల్యాన్ని తట్టిలేపే కమ్మని జ్ఞాపకాలు.

కష్టాలు_మన_మంచికే

 హర హర మహాదేవ శంభో శంకర!!!🥀🌺🙏🔔🛐🕉🛐🔔🙏🌺🥀


#కష్టాలు_మన_మంచికే


ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు,,, ఏమిటి స్వామీ నాకీ కష్టాలు...? ఇవి ఎప్పటికి తీరేను...?అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు...అని?😔


శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడు గురువు,,, నేనో చిన్నకథ చెప్తాను వింటావా...?

తలుపాడు శిష్యుడు ఆయన కథ చెప్పసాగాడు...!👍


ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోక చిలుక గూడుని చూశాడు...!దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు...!ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది...! సీతాకోక చిలుకగా మారిన అందులోని గొంగళి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు...!అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు...!అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు...!!!🐛


ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిందతనికి,,,దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడు గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు...!!!ఆ రంధ్రం లోంచి ఆ సీతాకోక చిలుక బయటికి వచ్చింది...!!!అయితే దాని శరీరం ఉబ్బి ఉంది...!రెక్కలు పూర్తిగా రాలేదు,,,దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది...!!!🐛


తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను..,,,ఆజీవి ఆ గూడులోనే మరికొంత కాలం ఉండి ఉంటే,,,దాని శరీరం లోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి,,,అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది...! అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకుని స్వేచ్ఛగా ఎగిరి పోయేది...!కాని అతడి లోని దయతో కూడిన తొందరపాటు తనం వల్ల ఇది అతను గ్రహించలేదు...!!!🦋


అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్న మవుతాయి...! మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మనమీద దయతలచి మధ్యలో తీసేయడు...!!!లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం,,,దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది...!!!👏


అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడుని పాడుచేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా,,, మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు...!!!🙏


             🔥ఓం నమః శివాయ 🔥

మాతృమూర్తి

 మహిళ - మాతృమూర్తి


నవమాసములు మోసి భవము నిచ్చెడి నాతి 

          శిశువుకు ధరపైన సృష్టికర్త

అమృతము నందించి యక్కున నిడుకొని

          లాలించి పాలించు రమ్యచరిత

యులకని శిశువుకు పలుకులు నేర్పించి

          మోదమున్ గూర్చెడి మొదటి గురువు 

సతతమ్ము శిశువుకై వెతలను తా నోర్చి

          బుజ్జి బొజ్జకు పాలు పోయు నెలత

యడుగు లేయు చుండ హస్తమ్ము నందించి

పడక  పట్టు కొనెడి ప్రాపు కాంత 

అతివ పతికితోడు  సతతమ్ము బ్రతుకున

అవని యన్నిటందు యతివ మిన్న 


గోపాలుని  మధుసూదన రావు

మానాన్నే నాకు గొప్ప అమ్మ!

 


       *మానాన్నే నాకు గొప్ప అమ్మ!*

                 ➖➖➖✍️


“గంగా  దాస్!  నిన్ను  ప్రిన్సిపాల్  మేడం  పిలుస్తున్నారు!” 

ఆయా  వచ్చి  చెప్పిన  మాటలకు  ఎండలో మొక్కలకు కుదురు తవ్వుతున్న గంగాదాస్  అదిరిపడ్డాడు.


“దేనికి ?” అడిగాడు  ఆయాను.


“ఏమో !  నాకేమి  తెలుసు?” అంటూ  వెళ్లిపోయింది ఆమె.


చేతులకు  ఉన్న  మట్టిని గబగబా   బకెట్  లోని  నీళ్ళల్లో  ముంచి  కడిగేసుకున్నాడు.  తలపాగా  విప్పి  చెమటలు  కారుతున్న  ముఖాన్ని  తుడుచుకున్నాడు . 


వడి వడిగా అడుగులు  వేస్తూ   కారిడార్  చివరన  ఉన్న   ప్రిన్సిపాల్  రూమ్  వేపు  వెడుతున్నాడు.  అతని  మనసులో   ఆందోళన.  ఏమి జరిగింది?  మొక్కల  గురించా? ఎక్కడైనా  పొరపాటు  చేశానా? లేక  తన  పిల్ల  ఏమైనా  తప్పు  చేసిందా?  ఎవరినయినా   కొట్టిందా?  అలా చెయ్యదే!  ఏమి జరిగింది?  ఇన్ని   రోజులుగా  ఒక్కసారీ  ఎప్పుడూ  తనను  పిలవని   ప్రిన్సిపాల్   మేడం  ఎందుకు  పిలిచారు?


అడుగులు  తడబడుతున్నాయి .  గుమ్మం   దగ్గరకి  వెళ్ళాడు. చిన్నగా  స్ప్రింగ్  డోర్   మీద  శబ్దం  చేశాడు.

“అమ్మగారండీ!”  లో  గొంతుకతో   పిలిచాడు.


“లోపలికి రా!”   ప్రిన్సిపాల్  గొంతు  అధికారికంగా  వినిపించింది . 

అతనిలో   ఆందోళన  పెరిగిపోయింది .


కళ్ళజోడు పెట్టుకుని, తెల్లని కాటన్ సారీ  కట్టుకుని ,  తెల్లని  జుట్టుతో ఉన్న  ప్రిన్సిపాల్ ని  చూడగానే   వంగి  వంగి  నమస్కరించాడు.


ఆమె తన టేబుల్ మీద ఉన్న ఒక  కాగితం  తీసి  అతనికి  ఇస్తూ

 “చదువు” అంది.


వణికిపోయాడు  గంగాదాస్ 


“మేడం  నేను చదువుకోలేదు.  నాకు  ఇంగ్లీష్  రాదు.  తెలుగు  కూడా రాదు . ఏదైనా పొరపాటు  చేస్తే  మన్నిచండమ్మా! తప్పు  చేస్తే  ఇంకొక్క  అవకాశం  ఇవ్వండమ్మా !

దయగలమీరే   పొమ్మంటే   ఎక్కడకి  పోవాలమ్మా?” దీనంగా అన్నాడు   గంగాదాస్. అతడి  కళ్ళల్లో  నీళ్ళు  ఆగడం  లేదు. 

“మీ దయవలన నేను నా కూతురిని  ఇక్కడ  చదివించుకుంటున్నాను.  మీరు  పొమ్మంటే  దానికి  ఇలాంటి  స్కూల్ లో  నా  జన్మలో  చేర్చలేను తల్లీ! పొమ్మని  అనకండమ్మా”  వణికిపోతున్నాడు.


“అరెరే !  ఏదేదో  ఊహించేసుకోకు !  మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె  తెలివి  తేటలు  చూసి,  నువ్వు  మా  సిన్సియర్ వర్కర్  వి  కాబట్టి.

ఈ కాగితం  నీకు  చదివి  పెట్టడానికి   టీచర్  గారిని  పిలుస్తా  ఉండు ! 

 ఇది నీ కూతురు రాసినదే!  నీకు అది  చదివి  వినిపించాలి!  అనిపించి   నిన్ను  పిలిపించాను .  ఇది  నువ్వు  వినాలి!”  


ప్రిన్సిపాల్ గారి  పిలుపు  విని  సరోజ  టీచర్ అక్కడకి వచ్చింది. ఆమె ఆ పేపర్  తీసుకుని చదవడం మొదలు పెట్టింది “ఈ రోజు మా క్లాసులో మాతృ దినోత్సవం గురించి  వ్యాసం  రాయమన్నారు. ‘నేను  ఒక  పల్లెటూరిలో పుట్టాను.  అక్కడ  ఇప్పటికీ  విద్య, వైద్యం అనేవి  రెండూ గగన  కుసుమాలే  పిల్లలను  కనడం  అంటే ఆడవాళ్ళకు మళ్ళీ పుట్టడమే 

మా పల్లెటూళ్ళల్లో! పిల్లలను  కనలేక పురిటిలోనే  చనిపోయే తల్లులు  ఎక్కువ  మా ఊరిలో!  అలాగే  మా అమ్మకూడా  నన్ను కంటూ తను కన్ను  మూసింది. 

నన్ను తన చేతుల్లోకి  తీసుకోకుండానే,  తన దగ్గర  పాలు  తాగకుండానే   పురిటిలోనే  చనిపోయింది.

నన్ను  తన చేతులలోకి  తీసుకున్నది  అప్పటికీ  ఇప్పటికీ  మా నాన్న  ఒక్కడే !


‘తల్లిని చంపి పుట్టాను అన్నారు- చాలామంది.  

"శనిగొట్టుదానిని"  అన్నారు.  ఎవ్వరూ  నన్ను  కనీసం  ఎత్తుకునేవారు కారు!

నాన్నను  మళ్ళీ  పెళ్లి  చేసుకోమని  అమ్మమ్మ,  నాన్నమ్మా ,  తాతలూ  అందరూ  బలవంతం  చేశారు…

కొడుకును  కనమని . 

ఎందరు  ఎన్ని  రకాలుగా  చెప్పినా  నాన్న  వినలేదు. ఆ ఊళ్ళో ఉంటె వాళ్ళు  అందరూ అలాగే బలవంతం చేస్తారని  ఉన్న ఇంటినీ,అన్నిటినీ వదిలి నన్ను .. రోజుల  పిల్లను  ఎత్తుకుని నాకోసం  నాకు   అన్నీ  తానే  కావాలని, నా జీవిత ఔన్నత్యం కోసం తనకు  అక్కడ  ఉన్న  అన్ని  సౌకర్యాలనూ వదిలి  వట్టి  చేతులతో, నా మీద ప్రేమతో,  నన్ను  పెంచాలి అనే కసితో  ఈ పట్టణం  వచ్చేశాడు.


చిన్నప్పుడు నాకోసం ఎన్నెన్ని  కష్టాలు  పడి ఉంటాడో! ఇప్పుడు  తలచుకుంటూ  ఉంటె  అనిపిస్తుంది. ఒక్కటే రొట్టె ఉంటె  తనకు రొట్టెలు ఇష్టం ఉండవు  అనేవాడు. 

నాకు  ఇప్పుడు  తెలుస్తోంది 

నా  ఆకలి  తీరితే  తన  ఆకలి  తీరిపోయినట్లు నాన్న  అనుకునేవాడు  అని! తాను  పస్తులు  ఉంటూ  నాకు  తినిపించాడు  అని  ఇప్పుడు  తెలుస్తోంది! తన శక్తికి  మించి  నాకు  ఎన్నో  సదుపాయాలూ నాన్న  నాకు  కల్పించాడు.

నన్ను ఈ స్కూల్ లో చదివించడం కోసం  నాన్న  ఇక్కడ  తోటమాలిగా చేరాడు!

ప్రేమ  ఆప్యాయత  అనేవి  అమ్మకు  మారుపేర్లు  అయితే అవి  నేను  పొందుతున్నది  నాన్న  నుండి!


సానుభూతి అనేది అమ్మకు నిర్వచనం  అయితే మా నాన్నే నాకు అమ్మ !

అమ్మకు  ప్రతిరూపం  త్యాగం !!


అయితే మా నాన్న త్యాగం ముందు  అది చాలా తక్కువ!

ప్రేమ,ఆప్యాయత, త్యాగం,సానుభూతి  ఇలాంటి  పదాలకు  నిర్వచనం  “అమ్మ” అయితే…మా నాన్న అంతకన్నా ఎక్కువ  నాకు!!

మా నాన్న ప్రపంచంలోని అందరి అమ్మల కన్నా గొప్ప  అమ్మ!!!


ఈ  మాతృదినోత్సవం  సందర్భంగా  నేను  నా తండ్రికి ఈ  ప్రపంచం లోని  తల్లితండ్రులు అందరికన్నా గొప్పవాడిగా  సెల్యూట్  చేస్తున్నా !


ఇంకా  ఈ స్కూల్ లో ఉన్న తోటమాలి   నా తండ్రి  అని  గర్వంగా  చెప్పుకుంటాను!


ఈ  వ్యాస రచనలో నేను ఫెయిల్  కావచ్చు. నా టీచర్ కి ఇది  నచ్చకపోవచ్చు 

కానీ నిస్వార్ధ ప్రేమకు  ప్రతిరూపం  అయిన నా తండ్రికి ఇది నేను అర్పించే   కృతజ్ఞత!


చదువుతున్న  సరోజ  టీచర్  గొంతులో కన్నీటి జీర !


వింటున్న  ప్రిన్సిపాల్   చీర  చెంగుతో   కళ్ళను  అద్ధుకుంటోంది.


గంగాదాస్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు  దిగమింగు  కుంటున్నాడు .


ఆA.C.గది  నిశ్శబ్దంగా  అతడి  వెక్కిళ్ళ చప్పుడు  వింటోంది .


ఆ పేపర్లను  సరోజ  టీచర్  చేతులలోనుండి  తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. నిలబడలేక  పోతున్నాడు. ప్రిన్సిపాల్ మేడం అతడికి  దగ్గరగా వచ్చింది. కుర్చీ  దగ్గరకి  తీసుకు  వెళ్ళింది. కూర్చో బెట్టింది తన టేబుల్  మీద  ఉన్న  గ్లాసులో  నీళ్ళను  అతడి  చేతికి  ఇచ్చింది. ఆమె  గొంతులో  ఏదో  తెలియని  ఆర్ద్రత.


“గంగా దాస్! మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి  మేము  10/10  మార్కులు  ఇచ్చాము.  ‘మాతృదినోత్సవం’ సందర్భంగా ఇంతకంటే గొప్ప వ్యాసం  ఎవరూ రాయలేరు!

ఎందుకంటే   ఇది  ఒక  కూతురు  తన  తల్లి  పట్ల  చూపే  అభిమానానికి  వెయ్యి  రెట్లు   అభిమానాన్ని  వ్యక్తపరుస్తున్న   వ్యాసం!

మేము  రేపు   మన స్కూల్  లో   ‘మాతృదినోత్సవం’  జరపబోతున్నాము  .  దానికి  ముఖ్య  అతిధి  నువ్వే !

నిన్ను మించిన తల్లి ఇంతవరకూ  మా స్కూల్ చరిత్రలో మాకు తెలీదు.

అందుకే నీకు సత్కారం చెయ్యాలని  నిర్ణయించుకున్నాము. నీ అంగీకారం కోసమే నిన్ను పిలిపించాను.” అంది.


“మేము ఈ సత్కారం  చెయ్యడానికి   ముఖ్య  కారణం పిల్లలను తల్లులే కాదు  తండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు   అనే విషయం అందరికీ  తెలియాలని!

నీవు చేసిన త్యాగానికి, నీవు నీ కుమార్తె  పట్ల చూపిన  ప్రేమకు గుర్తింపుగా  ఈ సత్కారం చెయ్యాలనుకుంటున్నాము .

 

ఇది ఎందరికో  స్పూర్తిదాయకం  కావాలి. నిన్ను  గౌరవించడం  ద్వారా  మీ  అమ్మాయి  తన  తండ్రి… ‘ప్రపంచంలో  గొప్ప  తల్లి’ అన్న  మాటలను  నిజం  చెయ్యాలి  అనుకుంటున్నాము.


మా స్కూల్ లో ఒక గొప్ప తండ్రి ఉన్నాడు  అని పిల్లల తల్లి  తండ్రులకు  చెప్పాలి  అనుకుంటున్నాము.

నువ్వు  మా బడి తోటలో పూల చెట్లను  కాపాడే  తోటమాలివి  మాత్రమే కాదు,

నీ  జీవితపు  తోటలో  పూసిన  పూబాలను   కాపాడుతున్న   ఒక  చక్కటి తోట  మాలివి!

అందుకే  రేపు  నీవే  మాకు  ముఖ్య  అతిధివి !”✍️


.                      🌷🙏🌷

మహిళాదినోత్సవం

 *మహిళాదినోత్సవం-మహిళామతల్లికి వందనం*


సీ॥మా॥

మాతృత్వమును పంచి మమకారమున పెంచి 

          మహిలోని దేవతై మనెడు తల్లి 

సహకారమున బ్రోచి సాయమెంతయు జేసి 

          సత్త్వగుణమును జూపు సదయ చెల్లి 

సాంఘికజీవనా సామరస్యము తోడ 

          సఖ్యతన్ కనిపెట్టు సఖి మతల్లి 

జీవనయాత్రలో చేదోడుగా నిల్చి 

          అందఱి మరపించు ఆంతరంగి 

రణరంగవిజయాల రాణకెక్కిన నారి 

          మంత్రాంగమర్మాల తంత్రనిఫుణ 

కవనకళాభిజ్ఞ కళలలో స్థితప్రజ్ఞ 

          కరుణలో తా విజ్ఞ కమలదేహి 

తే.గీ.

తలచి భువిలోన దివి జూపు తరుణి యామె 

తఱచు మగవాని కండయై తనరు యామె 

మమత సమతల మసలేటి మహిళ యామె 

ఆమె పాదాల తలనుంచి యభినుతింతు 

*~శ్రీశర్మద* 

మహిళాదినోత్సవం 

08-02-2023.

సహాయం లేకపోతే

 .


              _*సుభాషితమ్*_


శ్లో.

*అసహాయః సమర్థోऽపి* 

*తేజస్వీ కిం కరిష్యతి|*

*నిర్వాతే జ్వలితో వహ్నిః*

*స్వయమేవ ప్రశామ్యతి||*


తా॥

*ఎంత సమర్థుడైనా, తేజశ్శాలియైనా సహాయం లేకపోతే ఏం చేయగలడు? గాలి లేని చోట మండిన అగ్ని దానంతట అదే శాంతిస్తుందికదా!*....

అన్యాయంగా సంపాదించిన ధనం

 .


                _*సుభాషితమ్*_


.శ్లో.

*అన్యాయోపార్జితం విత్తం* 

*దశవర్షాణి తిష్ఠతి।* 

*ప్రాప్తే చైకాదశే వర్షే* 

*సమూలం చ వినశ్యతి॥*

                       -సుభాషిత రత్నకోశః


తా|| " *అన్యాయంగా సంపాదించిన ధనం పది సంవత్సరాలు ఉంటుంది. పదకొండవ సంవత్సరం రాగానే అది సమూలంగా నశిస్తుంది*".

వర్ణం

 వర్ణం..


ప్రకృతి అద్దుకున్న అందం

విశ్వమొక వన్నెల చిత్రం

అవని చూపే ఇంద్రధనస్సు

భువని దిద్దుకునే సప్తవర్ణం.


పుట్టిన చిగరాకు పసుపు

ముదురు మార్చే పచ్చన

రాలే సమయం ఎరుపెక్కి

ఆకు చెప్పే రంగు కధలు.


ఏ రంగుకు చెందని నీరు

సూరీడి కాంతి పడగానే 

మిలమిల మెరుయును

రంగు రంగులు గోచరించు.


గగనంలో వర్ణపు సోయగం

పరుగు పెట్టె నీటి కుండ.

తెలుపు నలుపులు కలిసి

కప్పేసిన మేఘ ఆచ్ఛాదన.


చిత్ర పటం చెప్పే గాధలు

రంగులు తీరు దృశ్యాలు

అమావాస్య చీకటి నల్లగా

పున్నమి చంద్రుడు తెల్లగా..


ఏ రంగు లేని వి'చిత్రంలో

రంగులన్ని కన పడినట్లు

నీలి వర్ణం శాసించినట్లు

సప్త వర్ణాల జీవ గమనం.


అంధకారంలో నల్లదనం

వెలుగు చూపు తెల్లదనం

అన్నింటా అవే బాహ్యం

బాహ్యంలో రంగు మయం.


రంగు ఓ శోభాయమానం

వర్ణము చూపు వైవిధ్యం

అందమొక నడిచే కధనం

అది యెంచును కదనం.


అర్రులు చాచిన మనిషి

కర్రులు కాల్చిన వాతలో

రంగుల మాయన పడ్డాడు

రంగు దూరం కాస్తున్నాడు.


మనిషి ఏ వర్ణమో అంటూ

సమాజం మధ్య గోడలు

కులం, సంకులం అంటూ

మనిషి జాతి వర్ణ వైరం.


ప్రతి మనిషిలో ప్రవహించే 

రుధిరం ఎర్రని రంగుతో..

మనిషే ఎరుపెక్కిన కండ్లతో

తరగని వర్ణ వివక్షతో..


రంగు చిత్రం దేవుని వైనం

మనిషికెందుకు వర్ణ వేదనం

ఏ వర్ణమైతే ఏముంది సాగే

చావు,పుట్టుక తప్పించవే.


వర్ణ విభేదాలు మానాలి

ప్రతి మనసు శ్వేతమయం

కావాలి సమ సమాజం

వర్ణ వివక్ష లేని ప్రపంచాన.


కవి హృదయాన అభివర్ణణ

కల గాసిన వేళ మనసున

భవిష్యత్ గాంచు మేలున

వర్ణణ జేయు ఆవిష్కరణ.


రంగుల యేలే ప్రపంచంలో 

అన్ని రంగులు మంచివే..

సప్త వర్ణాలతో రంగోత్సవం 

మేలు కోరును సమాజం.


రంగోళీ శుభాకాంక్షలు.


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.