23, ఏప్రిల్ 2024, మంగళవారం

Panchang


 

హనుమత్ విజయోత్సవం

 *** అందరు గమనించవలసిందిగా అభ్యర్ధన, రేపు హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం..


మీడియాలో వచ్చే వార్తలు, తెలిసీ తెలియని వారి ప్రచారం వలన చాలా మంది రేపు హనుమత్ జయంతి అని పొరబడుతున్నారు. వాస్తవానికి రేపు శ్రీ సీతారామచంద్రుని పట్టాభిషేకము తరువాత వచ్చిన మొదటి పౌర్ణమి కావున, శ్రీరామునికు యుద్ధములో అమితంగా సహాయం చేసిన స్వామి హనుమకు అయోధ్య ప్రజలు కృతజ్ఞతాపూర్వకముగా పూజలు చేయుట సంప్రదాయంగా వచ్చింది. అది స్వామి హనుమత్ విజయోత్సవముగా జరుపుకోవాలి. స్వామి హనుమ వైశాఖమాసమున కృష్ణపక్ష దశమి పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతియోగమున, మధ్యాహ్న సమయమున కర్కాటకలగ్నమందు, జన్మించెను అని గమనించగలరు. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నాడు హనుమత్ జయంతి.


"పరాశరసంహిత యే హనుమ చరిత్రకు ప్రమాణం

వైశాఖే మాసి కృష్ణాయామ్, దశమ్యాం మందవాసరే

పూర్వాభాద్రా ప్రభూతాయాం మంగళం శ్రీ హనూమతే!!"


జై శ్రీ హనుమాన్ 🚩

సంజాయిషీ

 *సంజాయిషీ*


చేసిన తప్పు కంటే, చెప్పుకున్న సంజాయిషీ పెద్ద తప్పు అయ్యిందట.


ఈ విచిత్రకథ విన్నారా ఎప్పుడైనా...?


మంత్రి ఓ రోజు  మసక చీకట్లో రాజును కౌగిలించుకున్నాడు.


ఇది తప్పు.


"ఎందుకు ఇలా చేసావు?" నిలదీసాడు రాజు మహోగ్రుడై...


"మహారాణి అనుకున్నాను మహారాజా..." అన్నాడు మంత్రి.


ఇది సంజాయిషీ.


* * *


చేసిన తప్పు కంటే

చెప్పుకున్న సంజాయిషీ 

ఎంత పెద్ద తప్పు అయిందో చూశారా?


* * *


ఆధ్యాత్మిక విషయంగా-

ఒకడు అడగడం

ఇంకొకడు చెప్పడం అనేది కూడా ఇలాంటిదే.


ప్రశ్న, సమాధానము రెండూ తప్పే...


ఎవరు చెప్పినా సరే,

చెప్పబడిన ప్రతి సమాధానము తప్పే.


వాచా చెప్పబడిన సమాధానం ఎప్పుడూ దోష భూయిష్టంగానే ఉంటుంది.


అందుకే పరమశివుడు గురుదక్షిణామూర్తిగా మౌనస్వరూపంగా అవతరించాడు. 

మౌనమే నిజమైన సమాధానం.


ఎంత పెద్ద సత్యమైనా సరే,

ప్రస్తావిస్తున్నావంటే "అది" అది కాకుండా అయిపోతుంది


సత్యం ఎప్పుడూ ప్రస్తావనలోకి రాదు.

ప్రస్తావనలోకి వచ్చింది అంటే అది సత్యం కాదు.


ఊరికే ఉంటే అది అదిగానే ఉంటుంది.


"ఒకటి" అంటే రెండు అయిపోతుంది.

రెండు అంటే మూడు అయిపోతుంది.

ఊరికే ఉంటే "ఒకటి"గా ఉంటుంది.


* * *


వేదాలు... ఉపనిషత్తులు...

రమణ భాషణములు...

సద్గురు భాషణములు...

ప్రవచనకర్తల ప్రవచనాలు...

కొన్ని లక్షల ఆధ్యాత్మిక గ్రంథాలు...


అయినా సరే సమాధానం దొరకలేదు...

"నష్టోమోహః" అని ఎవడూ అనడం లేదు...


జ్ఞాని పుట్టుక  మాత్రం వీటితో సంబధం లేకుండా జరుగుతూనే ఉన్నది ప్రతి దశాబ్దంలోనూ.


అది ఈశ్వరనియతి.


అతనికి అక్కడ నించి వచ్చిన దారి మాత్రమే తెలుసుగాని, ఇక్కడనుండి అక్కడకు వెళ్లే మార్గం తెలియదు.


మధురైలో రమణుణ్ణి ఆత్మ ఆవహించింది...


అరయనినల్లూరులో రమణుణ్ణి జ్యోతి ఆవరించింది...


రెంటిలోనూ తన ప్రమేయం ఏమీ లేదు.


ఈశ్వర నియతి ప్రకారమే అలా జరిగింది.


ఇక ప్రతి ఒక్కడూ "ఆ స్థితిని పొందాలంటే ఏం చేయాలి?" అని అడుగుతూనే ఉన్నారు. వారు జీవితాంతం చెబుతూనే ఉన్నారు.

కానీ మరో రమణుడు రానేలేదు, రాడు.


నిజానికి ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లే మార్గం అస్సలు లేనేలేదు.


ఈ ధ్యానాలు, ఈ జపాలు, ఈ యోగాలు.... ఇవేవీ మార్గాలు కావు.


నిజం.


అక్కడ నుంచి ఇక్కడకు ఎలా వచ్చామో.... ఇక్కడ నుంచి అక్కడకు కూడా అలానే వెళతాము.


ఇది తప్పదు.


కాబట్టి ప్రత్యేకించి దానికై వెతకనవసరం లేదు.... అనేదే నా ఈ వ్యాస ఉద్దేశం.


మరేం చేయమంటారు? అంటారా?


శిల్పం ఉంది అంటే, శిల్పి ఉన్నట్టే.

జగత్తు ఉంది అంటే జగదీశ్వరుడు ఉన్నట్టే.


వాడొకడు ఉన్నాడని తెలిస్తే చాలు...

తనకు గొప్ప జ్ఞానం ఉన్నట్టే.


ఈశ్వరుడు నియంత...


నియంత అంటే దాని అర్థం హిట్లర్ లాంటి దుర్మార్గుడు అనికాదు.


కర్త-కర్మ-క్రియ మూడూ తానైనవాడు అని అర్థం.


నియంత అంటే సర్వశక్తిమంతుడు అని అర్థం.


తిరుగలి తిప్పేది తానే.

తిరుగలిలో నలిగేదీ తానే.

తిరుగలీ తానే.


ఆయన్ను పొందటానికి రెండవ వస్తువు లేదు.


బాబు చిటికెనవ్రేలు,

బాబును పొందండానికి

సాధన చేయడం లాంటిదే.


ఈశ్వర శరీరంలో నేనొక చిటికెనవ్రేలు అని ఉండడమే అద్వైతం.


"ఆయన కంటే వేరుగా నేను లేను"

అన్న జ్ఞప్తికి మించిన సాధన లేదు. సిద్ధి కూడా అదే.


"పొందటం" అనే క్రియ అస్సలు లేనే లేదు.


నక్షత్రాలను చూస్తాం. అంతే.

పొందటం అంటూ ఏమీలేదు కదా!


ఈశ్వరుడు జగద్రూపంగా ఉన్నాడు. అంతే. పొందటం అంటూ ఏమీలేదు.


ఈ చూడటమే ఈశ్వర సాక్షాత్కారం.

ఈ అవగాహనే ఈశ్వరానుభవం.


"దేవుడు ప్రత్యక్షం కాడు.

ప్రత్యక్షమే దేవుడు."


* * *


ఎవడి సమాధానమూ నాకొద్దు.

నేనే సమాధానం అని ఉండు.


ఏ దైవమూ నాకొద్దు.

నేనే దైవం అని ఉండు.


ఏ క్షేత్రమూ నాకొద్దు.

నేనున్న చోటే క్షేత్రం అని ఉండు.


మాటలు వొదిలి "మౌనంగా" ఉండు.

పరిధిని వొదిలి "కేంద్రంగా" ఉండు.

తెలుసుకోవడం వొదిలి "తెలివి"గా ఉండు.

దర్శనం వొదిలి "ద్రష్ట"గా ఉండు. 

కర్తవ్యం వొదిలి "సాక్షి"గా ఉండు.


* * *


ఇలా స్థిర నిశ్చయంతో ఉన్నట్లయితే

నిశ్చయంగా దేవుడే నీ దర్శనానికి వస్తాడు.