15, ఫిబ్రవరి 2023, బుధవారం

వేమన పద్యం

 🌹 *వేమన పద్యం - 27*🌹

           (శ్రీ హరిప్రియ గోష్ఠి నుండి)

            సేకరణ : డాక్టర్ తిరుమల నీరజ

            (15.2.23)


    *ఒరుని చెఱచెద మని ఉల్లమం దెంతురు*

     *తమదు చేటెఱుగని ధరణి నరులు*

*తమ్ము చెఱచు వాడు దైవంబు లేడొకో?*

*విశ్వదాభిరామ! వినుర వేమ!*


తాత్పర్యం


ఇతరులకు హాని కలిగించా లనుకుంటే, తమకు హాని తప్పదు. ఈ నిజం మూర్ఖులకు తెలియదు. ఒకరిని చెడగొట్టా లనుకుంటే, దేవుడు వారినే చెడకొడతాడు.

"చెరపకురా చెడేవు" అనే నానుడి లోక ప్రసిద్ధం. మానవుల బలహీనతలను అంచనా వేయటంలో వేమనకు వేమనే సాటి. సాధారణంగా లోకంలో కొందరు నిరంతరం ఇతరుల హాని కోరుతుంటారు. ఇతరుల వల్ల తమకు ఎలాటి అపకారమూ కలుగక పోయినా, ఈ దుశ్చింత - చెడు తలపు - మానరు. నిష్కారణంగా మంచి వారికి హాని తల పెట్టే వారిని భగవంతుడు శిక్షించి తీరుతాడు - అనే సంగతిని మొహమాటం లేకుండా చెప్పాడు వేమన. ఎందరో వేమనను -విప్లవ వాది, నాస్తికుడు" అంటారు కాని, నిశితంగా పరిశీలిస్తే, ఆయన భావాలలో ఆస్తికత కూడా సమానంగా కనిపిస్తుంది. దుర్మార్గులకు భగవంతుని చేతిలో తప్పకుండా శిక్ష పడి తీరుతుంది అనేది సారాంశం.

                         🌹🙏🌹

సైనసైటిస్

 సైనసైటిస్  కొరకు కొన్ని సులభ యోగాలు   -


 *  రోజు మంచి పలుచటి వేపనూనె రెండు ముక్కు రంధ్రాలలో ఒక్కో బొట్టు వేస్తుంటే క్రమంగా సైనస్ దూరం అవుతుంది.


 *  తులసి ఆకులని నీడలో ఎండబెట్టి తరువాత బాగా దంచి చూర్ణం చేయాలి . ముందు జల్లెడ పట్టి ఆ తరువాత వస్త్రగాలితం చేయాలి . అంటే పలుచని నూలుబట్టలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలబెట్టాలి. ఈ చూర్ణం ని కొద్దికొద్దిగా నస్యం లాగా పీలుస్తుంటే ముక్కుకి సంబందించిన సైనసైటిస్ , వూపిరి ఆడకపోవడం , తుమ్ములు , శ్లేష్మం , నీరు , రక్తం ధారగా కారడం , దగ్గు , పడిశం, రొంప , విపరీతమైన తలనొప్పులు కంటి మసకలు ఇలాంటి వ్యాధులు అన్ని ఎంతకాలం నుంచి మనలని వేధిస్తున్నా కొద్దిరోజులలోనే మటుమాయం అయిపొతాయి.

 


          , 

కలింగ కిరాతుడు - మిత్రుల కథ*

 🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*బుధవారం*_

    _*ఫిబ్రవరి 15, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*25 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉 


*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*


🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️


గృత్నృమద మహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ఓయీ ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతము నాచరించి పాప విముక్తుడగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథామహిమను తెలుపును.


పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు , పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు , ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని బలవంతముగ తీసికొనెను.


ఓయీ ! నీవు దాచిన ధనమునిమ్ము , లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును *'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి వారి నగలను , ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని గూడ దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను.


ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె క్రూరుడు , వంచనాపరుడు , బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చావర్తను రాలయ్యెను. ఈ విధముగ నా కుటుంబమున కుమారుడు , తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలయిన తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయనుకొనెను , వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు యెరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి , సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను , బ్రాహ్మణుడగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు , కల్లుత్రాగువాడు , క్రూరుడు , బంగారము నపహరించినవాడు , గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను , అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయిదీనుడై యున్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను , కిరాతుని వద్ద పని చేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి యిట్లనెను.


ఓయీ ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు , హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో తిరిగి నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను , వారిని చూచినను , తాకినను , వాడును వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేత బట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు , మద్యపానము చేసినవాడు , గురుతల్పగమనము చేసినవాడు , బంగారమును దొంగలించిన వాడు , వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.


నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి విముక్తి యెట్లు కల్గును ? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని , దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని , సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మము నుపదేశింప గోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.


నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును , పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము , మాఘస్నానము చేసి పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము , ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.


వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్టసాంగత్యజనిత దోషము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూరితమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ  నీవీ మూడు దినములుండుము. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.


వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము , సంధ్యా వందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను , బిల్వ దళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము , యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము , మాఘస్నానమును మానకుము , మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము , అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.


నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.


_*ఇరవైఅయిదవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

బాధ్యత మన అందరిదీ

 Brahmin సోదరులకు గమనిక;-

—--—-----------------------------

ఇప్పటిదాకా, బ్రాహ్మణ కులానికి చేసినటువంటి ద్రోహం,మోసం సరిపోక, కేవలం అర్చక, పురోహితులను మరియు బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకొని ఈ క్రింది కొత్తరకం మోసాలు బయలుదేరాయి. వీటి ఉచ్చులో పడకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుని, తోటి బ్రాహ్మణులకు కూడా చెప్పి, వాళ్లు కూడా, తమ డబ్బును కోల్పోకుండా ఉండేటట్టుగా, చూడవలసిన బాధ్యత మన అందరిదీ.


1) గత కొద్ది కాలంగా బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ జరిగే మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలో నేను గమనించిన కొన్ని మోసాలు.

2). బ్రాహ్మణులను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం అని ఒక వెయ్యి మందికి భూదానం చేసి అందులో గంధం చెట్లను నాటుతామని తద్వారా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మీరు కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు. అయితే గంధం చెట్లను పెంచడానికి కొంత పెట్టబడి పెట్టాలని డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇది పక్కా మోసం. ఇది ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది. ఎవరూ ఈ మాయలో పడవద్దు.

3) బ్రాహ్మణులు అందరికీ సొంత ఇల్లు కల్పించడమే నా కల. అని చెప్పి కొంత కాలం క్రితం తక్కువ రేటు కు ఇళ్ళస్థలాలు ఇస్తామని నమ్మించి కొన్ని వందల మందిని కొన్ని కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటన ఎవరూ మర్చిపోలేదని అనుకుంటున్నాను.

ఇకపై ఎవరన్నా ఇలాంటి ప్రకటన చేసినా జాగ్రత్తగా ఉండండి.

4). అమెరికా లోనో, జపాన్ లోనో లేదా ఏదో దేశంలోనో లేకపోతే మనదేశంలో నే కాశీ, అయోధ్య లాంటి క్షేత్రం లో కొన్నివేలమందితో "మహాయాగం" జరుగనుంది. దానికి ముందు అప్లికేషన్ పెట్టాలని రిజిస్ట్రేషన్ ఫీజు కొంత కట్టాలని, యాగం అయ్యాకా మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని డబ్బులు వసూలు చేస్తున్నారు.

మనల్ని పూజలు చేయటానికి పిలిచేవారు ఎవ్వరూ మనల్ని డబ్బులు కట్టమని అడుగరు. ఇలాంటి వాటితో జాగ్రత్త.

5). మనకు తెలియని వారు ఎవరో ఫోన్ చేసి ఎవరో మీ నెంబర్ ఇచ్చారు మా ఇంట్లో ఏదో కార్యక్రమం చేయించాలని, మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఆ రోజు ఉదయమే దిగుతాడు. పూజా ద్రవ్యాలు మీరు ఏర్పాటు చెయ్యండి. అని చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్రస్ చెప్పకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసేవారు కొందరైతే, ఏదో ప్లేస్ చెప్పి అక్కడికి వెళ్ళాకా మనపై దాడిచేసి మన దగ్గరున్న బంగారం, డబ్బు దోచుకునే వారు కొందరు.

దయచేసి మీకు తెలియని వారు ఎవరన్నా ఇలా ఫోన్ చేస్తే ముందు అడ్వాన్స్ గా సగం డబ్బులు పంపించమనండి. డబ్బు పంపించాకే కార్యక్రమానికి బయలుదేరండి. వేరే దేశం నుండి అయినా డబ్బులు పంపిచవచ్చు. మనల్ని మోసం చేసేవారు డబ్బులు పంపించరు. అదే గుర్తు.

 6). బ్రాహ్మణుల కోసం ఏదో ట్రస్ట్ పెట్టామని, కొంత డబ్బు కట్టి అందులో జాయిన్ అయితే మీరు జాయిన్ అయిన సంవత్సరం తర్వాత నుండి ఒక లక్ష నుండి పది లక్షల వరకు వడ్డీ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి మనం డబ్బులు కట్టాకా పరారు అవుతారు. ఇలాంటి తప్పుడు సంస్థల పట్ల జాగ్రత్త.

7). మీకు తెలియని వారెవరో ఫోన్ చేసి గోదానం చేస్తామని కార్యక్రమం మాట్లాడి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి, మేము 20,000 వేలలో ఆవు కొందామని అనుకున్నాము. తీరా కొనడానికి వెళ్తే అక్కడ మంచి పుంగనూరు ఆవు కనిపించింది. 50,000 చెప్పారు. ఇలా పూజకి దానానికి అని చెప్తే చివరకు 40,000 కు ఇస్తా అన్నారు. మేము అనుకున్నది 20 వేలు. ఇంకో 20 వేలు మా వల్ల కాదు. ఆవు చాలా బాగుంది. ఒక పని చేద్దాం మీకు నచ్చతే ఇంకో 10వేలు వేసి నేను 30 వేలు పెడతాను. మీరు ఒక 10 వేలు పెట్టుకుంటారా? అని అడుగుతారు. సాధారణంగా ఎవరైనా సరే అని డబ్బు పంపిస్తే ఫోన్ ఆపేసి వారు పరార్ అయిపోతారు. 

8)ఇదే టెక్నిక్ బంగారు దానం చేస్తామని వాడచ్చు. భూదానం అని వాడచ్చు. భూదానం అయితే కొన్ని లక్షలు కూడా మోసం చెయ్యచ్చు. తస్మత్ జాగ్రత్త.

 ఫోన్ చేసిన వారు నిజాయితీ పరులని మీకు అనిపిస్తే కార్యక్రమం అయ్యాకా ఆవు మీ చేతికి వచ్చాకా మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని చెప్పండి.

      ఇతరులను మోసం చెయ్యడం కంటే బ్రాహ్మణులను మోసం చెయ్యడం తేలిక. ఎవరికైనా ఫ్రీగా ఏదైనా ఇస్తామంటే వెంటనే మోసం అని తెలుస్తుంది. మనకి ఫోన్ చేసి గోదానం చేస్తామంటే మోసం అని ఎవరనుకుంటారు.

       మోసం చేసేవారు వాడే మరో టెక్నిక్ ఏంటంటే

ఒకరిని లక్ష రూపాయలు మోసం చెయ్యడం, మోసం చేసి తప్పించుకోవడం కష్టం. కానీ ఒకరిని వెయ్యి రూపాయల మోసం చెయ్యడం తేలిక. వెయ్యి రూపాయల కోసం ఎవ్వరూ పోలీసుల దగ్గరకు వెళ్ళరు. కాబట్టి తప్పించుకోవడం తేలిక. అలా వెయ్యి మందిని మోసం చేస్తే 1000×1000=10,00,000 సంపాదించి,  రిస్క్ లేకుండా తప్పించుకుంటారు. ఇలా వెయ్యి మంది ఉండడం వలన మనకు తెల్సిన వారి ద్వారానే మనం కూడా ఆ ఉచ్చులో చిక్కుకుంటాం.

వెయ్యి రూపాయలు కాదు పది రూపాయలు మోసం చేసినా తప్పే. వారు మోసం చేసారని తగిన ఆధారం ఉంటే తప్పకుండా కేసు పెట్టవచ్చు.

దయచేసి ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.


🙏🙏🙏

భక్తే నాకు కావాలి

 శ్లోకం:☝️

*న ధనం న జనం న సుందరీం*

*కవితాం వా జగదీశ కామయే*

*మమ జన్మని జన్మనీశ్వరో*

*భవతాద్భక్తిరహైతుకీ త్వయ*

(శ్రీకృష్ణచైతన్య విరచితం, శిక్షాష్టకం)


భావం: జగదీశా! నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు. జన్మ జన్మాంతరాలలో నీపట్ల అహేతుక భక్తే నాకు కావాలి.🙏