🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴
_*బుధవారం*_
_*ఫిబ్రవరి 15, 2023*_
_*మాఘ పురాణం*_
_*25 వ అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*
🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️
గృత్నృమద మహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ఓయీ ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతము నాచరించి పాప విముక్తుడగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథామహిమను తెలుపును.
పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు , పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు , ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని బలవంతముగ తీసికొనెను.
ఓయీ ! నీవు దాచిన ధనమునిమ్ము , లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును *'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి వారి నగలను , ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని గూడ దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను.
ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె క్రూరుడు , వంచనాపరుడు , బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చావర్తను రాలయ్యెను. ఈ విధముగ నా కుటుంబమున కుమారుడు , తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలయిన తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయనుకొనెను , వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు యెరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి , సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను , బ్రాహ్మణుడగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు , కల్లుత్రాగువాడు , క్రూరుడు , బంగారము నపహరించినవాడు , గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను , అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయిదీనుడై యున్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను , కిరాతుని వద్ద పని చేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి యిట్లనెను.
ఓయీ ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు , హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో తిరిగి నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను , వారిని చూచినను , తాకినను , వాడును వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేత బట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు , మద్యపానము చేసినవాడు , గురుతల్పగమనము చేసినవాడు , బంగారమును దొంగలించిన వాడు , వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.
నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి విముక్తి యెట్లు కల్గును ? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని , దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని , సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మము నుపదేశింప గోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.
నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును , పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము , మాఘస్నానము చేసి పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము , ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.
వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్టసాంగత్యజనిత దోషము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూరితమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ నీవీ మూడు దినములుండుము. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.
వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము , సంధ్యా వందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను , బిల్వ దళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము , యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము , మాఘస్నానమును మానకుము , మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము , అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.
నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.
_*ఇరవైఅయిదవ అధ్యాయము సమాప్తం*_
🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹
🙏🙏 *సేకరణ*🙏🙏
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి