ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయారు. చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు ఆత్మని తీసుకుని బయలుదేరారు. దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు. ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు వెళ్ళాలో తేల్చుకోమని అందుకుగాను ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ ఉండమని తీర్పు ఇచ్చారు. అదే తడవుగా యమభటులు ముందు మా లోకం చూడమని తీసుకుని వెళ్లారు. లోనికి వెళ్ళగానే తనకంటే ముందు చనిపోయిన పాత మిత్రులు ఎదురొచ్చి ఆహ్వానించారు. సరదా పలకరింపులు, తాను భూలోకంలో ఆడిన ఆటలు అన్నీ సరదాగా సాగుతున్నాయి. ఒకవైపు ఫాస్ట్ బీట్ పాటలతో, బిర్యానీ, మందు పార్టీలతో, ఆటపాటలతో సమయం గడిచింది కూడా తెలియకుండా రోజు పూర్తయింది.
మరుక్షణం స్వర్గలోక భటులు ప్రత్యక్షమై తమలోకానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా పరిచయం ఉన్న కొందరు మిత్రులు సాదరంగా ఆహ్వానించారు. మంద్రమైన సంగీతం హాయిగా ఉంది. భగవంతుని కీర్తనలు, సత్సంగాలు, ఆలోచింపచేసే బోధలతో నిండుగా సాగింది ఆరోజు. సాత్విక ఆహారం, అవసరమైన పోషకాలు నిండిన పానీయాలతో భోజనం పెట్టారు. మనసుకి హాయిగా ఉండగా నిద్ర పట్టేసింది. తెల్లవారుతూనే యమధర్మరాజు ముందు నిలబెట్టారు. నీ నిర్ణయం ఏమిటని అడగగానే కాస్త సందిగ్ధంలో పడి మళ్ళీ తన మిత్రులు అంతా ఉన్నారు, విలాసవంతమైన జీవితం అటే ఉందని యమలోకమని బదులిచ్చాడు.
వెంటనే యమభటులు ఆ వ్యాపారవేత్తని తీసుకొని వెళ్ళి పోయారు. నరక ద్వారం లోకి రాగానే అంతా మురికి కూపంలా కనిపించింది. నిన్న తనను ఆహ్వానించిన మిత్రులు మురికి వస్త్రాలతో, వెట్టి చాకిరి చేస్తూ, మధ్యలో భటుల చేతిలో దెబ్బలు తింటూ కనిపించారు. వెంటనే "ఇదేమిటీ? నిన్న ఇలా లేదు కదా నరకం ఈనాడు ఇలా ఉంది" అని భటులను ప్రశ్నించాడు.
"నిన్న మేము ప్రచారంలో భాగంగా నిన్ను ఆకర్షించేలా అన్నీ అలా చూపించాము. నిన్ను మా వైపు తిప్పుకునే ప్రయత్నం అది. నువ్వు అదే నిజమనుకుని మాకే ఓటు వేసావు. ఇక నువ్వు మా బానిసవి పద!" అంటూ చేతిలోని శూలంతో బాధించడం మొదలుపెట్టారు.
"అయ్యో! సాదాగా ఉన్న నిజమైన స్వర్గాన్ని వదిలి ఆర్భాటాలు అద్దిన నరకాన్ని నిజమని నమ్మి చేజేతులా వచ్చిన అవకాశం నాశనం చేసుకున్నా"నని చింతిస్తూ నరకకూపంలోకి చేరిపోయాడు.
మిత్రులారా! ఓటన్నది మన హక్కయితే, ఈ ఆకర్షణలు, ప్రలోభాలు, ధనం ఇవన్నీ మన బలహీనతలను లొంగదీసుకోవాలనుకునే ప్రయత్నాలు. నిజంగా మనకోసం, మనకి ఉపయోగపడే నాయకులు ఎవరో ఆచి తూచి ఎన్నుకోండి. ప్రలోభాలకు లోనయితే మరో అయిదేళ్ళవరకూ వారికి మనం బానిసలమవుతాం!! మేలుకోండి మిత్రులారా మనకి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది, వదులుకోవదు... నిర్ణయిద్దాం!!
మన నగర, రాష్ట్ర, దేశ ప్రగతికి దిశను నిర్ణయిద్దాం ఓటన్న చిరుదీపంతో!!!