16, జనవరి 2021, శనివారం

ప్రార్థనాశక్తి

 _*🧘ప్రార్థనాశక్తి🧘‍♂*_

🕉🌞🌎🌙🌟🚩


*_భక్తుడు ఆర్తితో, ఆర్ద్రతతో భగవంతుడికి చేసే విన్నపమే ప్రార్థన._*



*_ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి పట్ల ఉన్న అపారమైన విశ్వాసం ఎలాంటి కష్టాన్నయినా తొలగిస్తాయని పెద్దల మాట. శరణుజొచ్చి ఆర్తితో భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన తప్పక ఆదుకుంటాడని ఎందరో విశ్వసిస్తారు. ప్రార్థన అనేది గుండెల లోతుల నుంచి పెల్లుబికి వచ్చే మనోభావం._*



*_నోటితో ప్రార్థించలేనివారు మనసులో ప్రార్థించవచ్చు. నిజానికదే మేలైన ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలవల్లే ఉత్తమ సంస్కారాలు అలవడతాయి. సాధనా ప్రణాళికలో ప్రార్థనకు విశిష్టస్థానం ఉంది. పరిశుద్ధ అంతఃకరణం, నిర్మలమైన భక్తికి భగవానుడు సంతుష్టుడవుతాడు._*



*_ప్రార్థనకు శ్రద్ధాభక్తులతోపాటు దృఢమైన విశ్వాసం సైతం ముఖ్యం. ఇలాంటి ప్రార్థనలు శీఘ్రంగా ఫలవంతమవుతాయంటారు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ద్రౌపది, మీరాబాయి, త్యాగయ్య, గోపయ్య మొదలైన మహాభక్తుల ప్రార్థనలే ఇందుకు తార్కాణాలు. భగవంతుడు దయామయుడు. మనసారా ప్రార్థిస్తే కోరినవన్నీ ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు._*



*_మనిషి కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. స్వార్థపూరితమైన మనసుతో కోరిన కోరికలు మనిషి వినాశనానికి దారితీస్తాయి. ఘోర తపస్సుచేసి ఆ పరమాత్మ నుంచి వరాలు పొందిన హిరణ్యకశిపుడు, రావణాది రాక్షసుల జీవిత చరిత్రలే దీనికి నిదర్శనాలు._*



*_ప్రార్థన మనోమాలిన్యాన్ని నిర్మూలిస్తుంది. భవభయాన్ని తొలగిస్తుంది. ప్రార్థనల వల్ల మానసిక ఒత్తిడులన్నీ మటు మాయమవుతాయి. మనసులో ప్రశాంతత గూడుకట్టుకుంటుంది._*



*_ప్రార్థనా సమయంలో మనసంతా ఒకచోట కేంద్రీకృతమవుతుంది. అప్పుడు సంశయాలన్నీ తొలగి పోతాయి. ఆందోళన తగ్గుతుంది. మనసు నిర్మల తటాకమవుతుంది._*



*_భారతీయ సంస్కృతి మానవాళికి అందించిన అద్భుతవరం- ఈ ప్రార్థనాశక్తి. అనాది నుంచి తత్వవేత్తలు, ఆచార్యులు, యోగులు ప్రార్థన ద్వారానే పరిపూర్ణతను సాధించారు._*



*_గాంధీజీకి ప్రార్థనా శక్తిమీద అపారమైన విశ్వాసం ఉంది. ‘మన లక్ష్యాన్ని పరమాత్మగా భావించాలి. అందుకోసం త్రికరణ శుద్ధితో నిజాయతీగా కృషిచేస్తే ఆ భగవంతుడు తప్పక సహకరిస్తాడు. అదే అసలైన ప్రార్థన’ అనేవారు గాంధీజీ._*



*_రామకృష్ణ పరమహంస ప్రార్థన గురించి చెబుతూ- ‘మనం భగవంతుణ్ని ప్రాపంచిక కోరికలు కోరకుండా భక్తితో ఆయన అనుగ్రహం కోసం ప్రార్థన చెయ్యాలి. అలా చేస్తే దుఃఖాలు శాశ్వతంగా తొలగిపోతాయి. అప్పుడే ఆయన ముక్తికి సరైన మార్గం చూపిస్తాడు’ అని బోధించేవారు._*



*_కొందరు లౌకిక సంపదలతోనే చిరశాంతి లభిస్తుందని భావిస్తారు. ఆ సంపదలకోసం దైవాన్ని ప్రార్థిస్తారు. నిజానికి లౌకికమైనది ఏదైనా శాశ్వతశాంతిని మానసిక ఆనందాన్ని ప్రసాదించలేదు. రాగద్వేషాలకు అతీతంగా లోకకల్యాణం కోసం, పరహితం కోసం చేసే ప్రార్థనలే మహత్తరమైనవి. అవే ఉదాత్తమైనవి. ఈ ప్రార్థనలు చేసేవారి మనసులు కూడా ప్రేమానురాగాలతో నిండి ఉంటాయి._*



*_ప్రార్థన మనిషిలో మంచిని పెంచుతుంది. వ్యక్తిత్వంలో మార్పు తెస్తుంది. ప్రార్థన ఎప్పుడైనా చేయవచ్చు. సమయ నియమం లేదు. ఎవరిని ప్రార్థిస్తున్నామో వారిమీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. వేదం ప్రతిపాదించిన ‘వ్యాసవిద్య’ ఇది. ఉపనిషత్తులు విశదీకరించిన ‘ప్రపత్తి’ ఇది._*



*_సర్వేజనా స్సుఖినోభవంతు అనే మహత్తరమైన ప్రార్థనను ఈ లోకానికి అందించిన సంస్కృతి మనది._*



*_వ్యక్తిగతమైన కోరికల కోసం కాకుండా సర్వ  మానవాళి శ్రేయస్సుకోసం ప్రార్థన చేయడం చాలా మంచిది. అదే మనిషికి మనశ్శాంతిని కలిగిస్తుంది !_*


🕉🌞🌎🌙🌟🚩

నిత్య పారాయణ శ్లోకాః

 నిత్య పారాయణ శ్లోకాః


ప్రభాత శ్లోకః

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |

కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ‖

[పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ‖]


ప్రభాత భూమి శ్లోకః

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |

విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ‖


సూర్యోదయ శ్లోకః

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ ‖


స్నాన శ్లోకః

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ‖


నమస్కార శ్లోకః

త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ‖


భస్మ ధారణ శ్లోకః

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ |

లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ‖


భోజన పూర్వ శ్లోకాః

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ‖


అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ‖


అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే |

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ‖


త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే |

గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ‖


భోజనానంతర శ్లోకః

అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ |

ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ‖


సంధ్యా దీప దర్శన శ్లోకః

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం |

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఽస్తుతే ‖


నిద్రా శ్లోకః

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం |

శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి ‖


అపరాధ క్షమాపణ స్తోత్రం

అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా |

దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ‖


కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ‖


కాయేన వాచా మనసేంద్రియైర్వా

బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యత్సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయామి ‖


దేవ స్తోత్రాః


కార్య ప్రారంభ స్తోత్రాః

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజం |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ‖


యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం |

విఘ్నం నిఘ్నంతు సతతం విష్వక్సేనం తమాశ్రయే ‖


గణేశ స్తోత్రం

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ‖


అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |

అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ‖


ప్రణమామ్యహం సర్వజ్ఞా సర్వదా సదా అభీష్ట ఫల సిధ్యర్థం కుల దైవం నమోస్తుతే //3 times//



విష్ణు స్తోత్రం

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ‖


గాయత్రి మంత్రం

ఓం భూర్భువస్సువః | తథ్స'వితుర్వరే''ణ్యం |

భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్ ‖


శివ స్తోత్రం

త్ర్యం'బకం యజామహే సుగంధిం పు'ష్టివర్ధ'నం |

ఉర్వారుకమి'వ బంధ'నాన్-మృత్యో'ర్-ముక్షీయ మాఽమృతా''త్ ‖


వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిమ్‌ |

వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ‖


సుబ్రహ్మణ్య స్తోత్రం

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం

దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం |

స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం

కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ‖

గురు శ్లోకః

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ‖


హనుమ స్తోత్రాః

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం |

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ‖


బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా |

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ‖


జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః |

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ‖


దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః |

హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ‖


శ్రీరామ స్తోత్రాం

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే


శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః |

సీతాముఖాంభోరుహాచంచరీకో నిరంతరం మంగళమాతనోతు ‖


శ్రీకృష్ణ స్తోత్రం

మందారమూలే మదనాభిరామం

బింబాధరాపూరిత వేణునాదం |

గోగోప గోపీజన మధ్యసంస్ఠం

గోపం భజే గోకుల పూర్ణచంద్రమ్ ‖


గరుడ స్వామి స్తోత్రం

కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ |

విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః ‖


దక్షిణామూర్తి స్తోత్రం

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |

నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ‖


సరస్వతీ శ్లోకః

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ‖


యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |

సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |


లక్ష్మీ శ్లోకః

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం |

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |

శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం |

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ‖


సరస్వతీ స్తోత్రం

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీమ్ |

విద్యారంభం కరిష్యామి సిధ్ధిర్భవతు మే సదా ‖


దుర్గా దేవీ స్తోత్రం

సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే |

భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ‖


యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |

యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |


త్రిపురసుందరీ స్తోత్రం

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ |

ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్ ‖


దేవీ శ్లోకః

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ‖


వేంకటేశ్వర శ్లోకః

శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ |

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ‖


దక్షిణామూర్తి శ్లోకః

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ‖

శాంతి మంత్రం

అసతోమా సద్గమయా |

తమసోమా జ్యోతిర్గమయా |

మృత్యోర్మా అమృతంగమయా |

ఓం శాంతిః శాంతిః శాంతిః


సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ‖


ఓం సహ నా'వవతు | స నౌ' భునక్తు | సహ వీర్యం' కరవావహై |

తేజస్వినావధీ'తమస్తు మా వి'ద్విషావహై'' ‖

ఓం శాంతిః శాంతిః శాంతిః' ‖


స్వస్తి మంత్రాః

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం

న్యాయేన మార్గేణ మహీం మహీశాః |

గోబ్రాహ్మణేభ్య-శ్శుభమస్తు నిత్యం

లోకా-స్సమస్తా-స్సుఖినో భవంతు ‖


కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ |

దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః ‖


విశేష మంత్రాః

పంచాక్షరీ మంత్రం - ఓం నమశ్శివాయ

అష్టాక్షరీ మంత్రం - ఓం నమో నారాయణాయ

ద్వాదశాక్షరీ మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ.

అన్నమాచార్య చరితము

 🙏అన్నమాచార్య చరితము 🙏


అంత శ్రీవారి హుండీలొ సంతసమున 

పంచ యందున ముడివేసి పదిల పరచి 

వెంట గొనితెచ్చి నటువంటి నొంటి కాసు 

భక్తితోడను యర్పించె పరవశమున 


అమిత భక్తితోడ యర్పించి కాసును 

యన్నమయ్య కదలి యచట నుండి 

యిలను స్వామివారు నెలకొన్న మందిర 

పసిడివాకిలికిని ప్రణతు లిడెను 


పసిడి వాకిలి దాటి పదపడి కదలియు 

           పరికించె కనులార పరవశమున 

కాంచన మణిమయ కటకాంగదములతొ

            విభ్రాజమానుడై వెలుగు చున్న 

మకరకుండల ద్యుతి మణిమయ మకుటంబు 

            తిరునామ శోభిత చిద్విలాసు 

శ్రీ వేంకటేశ్వర దివ్యమూర్తిని గాంచి 

            తనువెల్ల పులకించె తన్మయమున 

యుభయ కరములు జోడించి యొడలు పొంగ 

" యేడుకొండల దేవరా ! వేంకటేశ ! 

జన్మ ధన్యంబు నయ్యె నీ దర్శ నమున "

యనుచు ప్రణమిల్లె నేలపై యన్నమయ్య 


స్వామి దర్శన భాగ్యంబు తనర బొంది 

దివ్య తీర్థ ప్రసాదముల్ దీసుకొనియు 

భవ్య శఠకోప దీవెనల్ బడసి  యంత 

ప్రణతు లర్పించె ప్రభువుకు భక్తి తోడ 


ఏడుకొండల వేలుపు వేంకటేశు 

భక్తి మనసార ప్రార్థించి పరవశించి 

మందిరము నందు శ్రీ మహామంటపమున 

యపుడు విశ్రాంతి నొందెను యన్నమయ్య 


సుప్రభాత ద్యుతులు తోచెను దిక్కుల 

తెల్లవారె నపుడు తిరుమలందు 

యమిత భక్తితోడ యర్చకస్వాములు 

పలికి రపుడు సుప్రభాత వినుతి 


అన్నమయ్య లేచి యానంద డెందాన 

దివ్య పుష్కరణిలో తీర్థ మాడె 

సంతసమున మఱల స్వామిని దర్శించి 

పరిసరముల గాంచ బయట కొచ్చె 


✍️గోపాలుని మధుసూదనరావు🙏

*శ్రీ లలితా నామ వైభవం-20*

 *శ్రీ లలితా నామ వైభవం-20*


 *నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా*


నవచంపకము అంటే అప్పుడే విరిసిన సంపంగిపువ్వు. వశిన్యాది దేవతలు అమ్మవారి ముక్కుని నవచంపకము అని పోల్చారు. లోకములోని ముక్కులన్నీ వాసన చూడటానికి పనికి వస్తాయి. అమ్మవారి శరీరము, జుట్టు దగ్గరనుంచీ అన్నీ పరిమళములు కలిగి ఉంటాయి. ఈ నామము చాలా గొప్ప నామము. వాసన అన్న దానిని పక్కన పెడితే ముక్కు ఊపిరికి చిహ్నము. ముక్కు ఊపిరిని తీసి మళ్ళీ వదలకపోతే ప్రమాదము వచ్చేసిందని గుర్తు. చేసిన కర్మలకు ఆధారముగా ఈశ్వరుడు శరీరము ఇస్తాడు. ఆఖరి ఊపిరినాడు ఏమి చేసాడు అన్నదానిబట్టి పునర్జన్మ ఉంటుంది. ఏ భాష్యమైనా అదే చెపుతున్నది. ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే ఆయన మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. ఒక సాలె పురుగుకి, పాముకి, ఏనుగుకి ఇచ్చాడు. పునర్జన్మను ఫలానాదిగా పుట్టించమని అంటే తనకు సంబంధము లేదని చెపుతాడు. మళ్ళీ మంచిజన్మలోకి దేనివలన వెడతారు బ్రతికి ఉండగా చేసిన కర్మానుష్టానములోమనసు ఎంత రంజిల్లినదని చూస్తారు. జాగరూకత కలిగి దీపము ఉండగా ఇల్లు చక్కపెట్టుకున్నట్టుగా ఈశ్వరోపాసన ఎక్కువ చేసుకోవలిసి ఉంటుంది.


   అమ్మవారు ఎప్పుడైనా ఒక రూపము తీసుకుంటే కర్మకొరకు తీసుకోదు. ఒకనాడు దక్షప్రజాపతి కోరుకుంటే ఆయనకు కూతురిగా పుట్టి దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నది. అలా పెట్టుకోవడము వలన కీర్తి తండ్రయిన దక్షప్రజాపతికి దక్కింది. నిరీశ్వర యాగము చేస్తూ, శివుడిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శివుని రుద్రుని చెయ్యగలనని నిరూపించడానికి శరీరము వదిలి పెట్టింది. శివుడు వీరభద్రుని సృష్టించాడు. దక్షయజ్ఞం సర్వనాశనము అయిపోయింది. యజ్ఞము ఆగిపోయిందని ఏడిస్తే దక్షునికి మేకతల పెట్టి యజ్ఞము పూర్తిచేసారు. అమ్మవారి ముక్కు వేరొక చోట ఊపిరి పోసుకున్నది. నిజానికి ఆవిడకు పుట్టుక, ఊపిరి ఆగడము లేదు. ఒక ప్రయోజనము కోసము శరీరము తీసుకున్నది. 


ఒకనాడు మేనకాదేవి హిమాలయ పర్వతముల మీద తిరుగుతున్నది. అక్కడ పార్వతీపరమేశ్వరులు విహారము చేస్తున్నారు. పార్వతీదేవి అందచందములను చూసి మేనకాదేవి ఇటువంటి కుమార్తె నాకు ఉంటే అనుకున్నది. మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు ఇచ్చేస్తుంది. దాక్షాయణిగా శరీరము వదిలి హైమవతిగా పర్వతరాజు పుత్రిక పార్వతిగా వస్తాను అన్నది. ఆవిడ ఎక్కడ పుడితే అక్కడ వారి జీవితములు ధన్యము.    ఊపిరికి ముక్కును సంకేతిస్తాము. వాసన ఊపిరికి అంతర్గతము. వాసన – ఊపిరి రెంటినీ ఏకీకృతముగానే సంకేతిస్తాము. పరమేశ్వరుడు ఇన్ని ఊపిరులని లెక్క కట్టి ఇస్తాడు. ముక్కు ఆయుర్దాయములను నిర్ణయించగల  చిహ్నం. అమ్మవారు కూడా ఊపిరితీస్తుంది, విడచి పెడుతుంది. అవి ఆవిడ ఆయుర్దాయమునకు సూచనలు కావు. అమ్మవారి ఊపిరియే శృతి – వేదము. ఆమె ముక్కువంక చూసి నమస్కారము చేస్తే ఎక్కడ గాడితప్పితే అక్కడ దిద్దుబాటు చేస్తుంది. అదంతా ముక్కుకి సంబంధించిన గొప్పతనము. అమ్మవారి ముక్కుని సంపంగి పువ్వుతోనే ఎందుకు పోల్చారు? అనగా సంస్కృతములో తుమ్మెదను షట్పదము అంటారు అనగా ఆరుకాళ్ళున్నదని అర్థము. పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనసు ఈ ఆరింటితోటి అన్ని సుఖములు అనుభవించి సంసారములో మగ్నులమై ఆ పువ్వుమీదనుంచి ఈ పువ్వుమీదకి, ఈ పువ్వుమీదనుంచి ఆ పువ్వుమీదకు వాలుతూ తేనె త్రాగి బ్రతుకుతూ ఉంటాము. సంపంగిపువ్వు ఒక్కదాని మీద తుమ్మెద వాలదు. పంచ ఇంద్రియములు బహిర్ముఖము కాకుండా అంతర్ముఖమై భగవంతుని పాదములలో ఉండే మందారమకరంద పానముచేసి మత్తెక్కి ఉండే హృదయము కలిగిన మహాపురుషుడై జ్ఞానబోధ చేయకలిగిన అధికారము కలిగిన మహాపురుషుడు ఒక గొప్ప గురువు లోకములో పుట్టాలి అంటే అమ్మవారి నాసాదర్శనము తప్ప వేరొకమార్గము లేదు. అందుకని నవచంపకముతో పోలిక వేసి ఈ నామము చెప్పారు.


*శ్రీ మాత్రే నమః*

శరణు శరణు ఈశ్వరా

 శరణు  శరణు ఈశ్వరా


కన్నిచ్చిగాంచెను కన్నప్ప నిన్నిల

చేయలేనట్టుల చేతమిత్తు

విల్లుతో కొట్టిన వేడుకయ్యెను నీకు

    వరములిత్తువుగదా వరదు డీవు

ముసలకమునుబట్టి ముద్దను తినిపించ

మోదంబు నందితే మోహదూర

బొజ్జమహాదేవి బుజ్జగింపునుపొంది

  ఆనంద మందిన యభయ దాత

పిట్టవ్వ పెట్టిన పిండిని తింటివి

ప్రేమగొప్ప దనుచు ప్రీత చిత్త


కరికి లూతకు హస్తికి కరుణ తోడ

ముక్తినిచ్చినపరమేశమోహనాశ

నన్ను చూడుమట్టులదేవ నందివాహ

శరణు శరణయ్యమాయయ్యశరణు శరణు

భాగవతము

 భాగవతము -- సుయజ్ఞోపాఖ్యానము


అప్పుడు మృతపతి  యమధర్మరాజు 

యతివల రోదన లాలకించియును 

భూసురబాలుడై భూమిపైకొచ్చె 

భూపతి చావుకు బొగులు చున్నట్టి 

ప్రేత బంధువులను ప్రియమార గాంచి 

వినుచుండ వారితో నిట్లని బలికె


చచ్చిన వానికై హెచ్చగు నట్టి 

విపరీత మోహంబు వింతయే యగును 

పుట్టుక చావులు పుడమి దేహులలొ 

కన్నార మనుజులు  గాంచు చుండేరు 

అయినను యీ నరుల్ యాశ్చర్యముగను 

తము జావ మనయును  తలచియు మదిలొ 

చచ్చిన వానికై తా మేడ్చు చుంద్రు 

తప్పునే దేహికి చావు వద్దన్న 

చావున కొల్లక దాగుండ గలమె 

ఎచ్చట బుట్టెనో నచ్చటి కేగ

ప్రాణుల నైజంబు భావించి జూడ 

తప్పించ లేరది తప్పదేరికిని 


తల్లిని దండ్రిని తా మెడబాసి 

ఘనమగు తోడేళ్ళ గాటున పడక 

తా వని నున్ననూ తప్పించు కొంద్రు 

హేతువు యేమని యెంచి చూడంగ 

తల్లి గర్భమునందు తా ముండు నపుడె 

యెవ్వండు పోషించ యెదుగు చున్నా మొ 

యడవిలో నున్ననూ యతడె పోషకుడు 


ఎవ్వండు సృజియించు నెల్ల ప్రాణులను 

యెవ్వండు రక్షించు నెల్ల ప్రాణులను 

యెవ్వండు ద్రుంచును నెల్ల ప్రాణులను 

యెవ్వ డనంతుండు యెవ్వండు విభుడు 

యత డివ్విధంబున యఖిల లోకముల 

రక్షించు పోషించు రాగంబు తోడ 

అవ్వాని లీలయే నరయ నీ జగతి 

సర్వేశ్వరుని దివ్య సంకల్ప మునను 

సర్వంబు లీలగా సాగుచూ నుండు 


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

శ్రీ.అన్నపూర్ణాష్టకం

 *శ్రీ.అన్నపూర్ణాష్టకం* 


🌸🌺🌸🌺🌸🌺🌸🌺


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧ ||


నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ

కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౨ ||


యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౩ ||


కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ

కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ

మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౪ ||


దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ

లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ

శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౫ ||


ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ

కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ

స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౬ ||


ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౭ ||


దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ

వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ

భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౮ ||


చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ

చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ

మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౯ ||


క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ

సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే


జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః


బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||


🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము🌹



అంతట యాశువు తోడను 

సంతసమున యన్నమయ్య శతకం బొకటిన్ 

వింతగ జెప్పెను తెలివితొ 

స్వాంతము పొంగగ తెలుగు సాహిత్య మునన్ 


శ్రీకరమగు దివ్య "శ్రీ వేంకటేశ్వర 

శతక " మొకటి జెప్పె సమ్మతిగను 

అందు తనివిదీర " యమ్మ" ను బొగిడియు

 సంతసంబు నొందె స్వాంత మందు


అమ్మ జెప్పిన రీతిగా యన్నమయ్య 

పాదరక్షలు విడనాడి భక్తి తోడ 

యేడుకొండల నెక్కియు నేక బిగిన 

చేరె తిరుమలక్షేత్రంబు చివరగాను 


శ్రీకరంబైనట్టి తిరుమల జేరియు 

           యానంద మొందెను యన్నమయ్య 

స్వామి పుష్కరణిలో స్నానంబు జేసియు 

            శ్రీ వరాహుని జూచె చిత్త మలర 

అచట వరాహుని యర్చించి భక్తితో 

            గాలిగోపుర స్థలి కడకు జనియె 

యా మహాద్వారంబు కానించి శిరమును 

            ప్రణతుల నర్పించె భక్తి తోడ 

ద్వారమును దాటి ముందుకు తరలి కదల 

దివ్యమౌ ధ్వజ స్తంభంబు తేజరిల్లి 

యెదుట కన్పించ నిండుగా విభవ మొప్ప 

యర్పణము జేసె నతులను యన్నమయ్య 


అంత ముందుకేగి యచ్చోట నెలకొన్న 

వకుళమాత దివ్య వంటశాల 

భక్తితోడ గాంచి ప్రణతుల నర్పించి 

తన్మయత్వqమునను దలచె మదిలొ 


చిద్విలాసుడైన శ్రీ వేంకటేశ్వరు 

మహితమైన దివ్య మందిరంబు,

యతిశయ మగుదివ్య యానందనిలయంబు 

గాంచె నన్నమయ్య కన్నులార 


మహిత మైనట్టి శిల్పపు మంటపములు 

సతత యగ్నుల వెల్గెడి సవన శాల 

వాహనంబుల నుంచెడి వసతి శాల 

నచట గాంచెను కనులార యన్నమయ్య



✍️గోపాలుని మధుసూదనరావు 🙏

*🚩నేటి నుండి పుష్యమాసం ప్రారంభం🚩*_

 _*🚩నేటి నుండి పుష్యమాసం ప్రారంభం🚩*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. *“పుష్య”* అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.


ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. 


విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. 


ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు , బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. 


శని ధర్మదర్శి న్యాయం , సత్యం , ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను , పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి , నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.


అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.  


పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.


అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి ) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.  


ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. 


పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ , ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.


ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ , నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. 


సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి, షట్తిలైకాదశి , కల్యాణైకాదశి అని పిలుస్తారు.


సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం , నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం , మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం , తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు.


ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి , పితృ తర్పణాలు , ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.


పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము.


మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము , ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము🌹


బాల భక్తుని  పరికించి పరవశించి 

యంత యలమేలు మంగమ్మ సంతసిల్లి 

వృద్ధ వనితగు రూపాన సిద్ధ మయ్యు 

యెదుట ప్రత్యక్ష మయ్యెను వేడ్కతోడ



మంత్ర జలమును ప్రోక్షించ మమత తోడ 

యలసటను దీరి లేచియు యన్నమయ్య 

కన్ను లెదుటున్న యమ్మను గాంచి మిగుల 

విభ్రమం బొంది యత్యంత విస్తుపోయె 


అంతట మాతృశ్రీ యలమేలు మంగమ్మ 

            యన్నమయ్యను జీరి యమిత దయతొ 

తనువును స్పృశియించి తనివార నిమిరియు 

            బడలిక పోగొట్టి భయము దీర్చి 

శ్రీ వెంకటేశ్వరు దివ్య ప్రసాదమున్ 

             ప్రియమార తినిపించి పెంపు గూర్చి 

యాకాశగంగను యందించి యతనికి 

            దీర్చియు దాహంబు తృప్తి గాను,

"గిరులు సర్వంబు దెలియగా హరి మయంబు 

విమల మైనట్టి యీ గిరి నెక్కు తరిన 

పాదరక్షలు ధరియించ పాప మగును "

యనుచు బోధించె నతనికి ననునయముగ 


 అమ్మ యమృతపు పలుకుల నాలకించ 

యంతరంగంబు నందున యన్నమయకు 

విమల జ్ఞానోదయంబయ్యు వింతగాను 

తనువు పులకలు గల్గెను  తన్మయమున 



అమృత తుల్య ప్రసాదంబు నంద జేసి 

చింత బోగొట్టి తనువుకు సేద దీర్చి 

దివ్య సందేశ మిచ్చియు తీరు దెలిపి 

యమ్మ కనుమరుగయ్యెను యంతలోనె 


కనుల ముందర యాతల్లి కదలి పోగ 

యన్నమయ్యకు యత్యంత యలజ డవగ 

యంత నతనికి కన్పించె నంతరమున 

యమ్మ యలమేలు దేవత యభయ మిడుచు 



అమ్మ దయచేసి నట్టి యా కమ్మ నైన 

దివ్య మగు ప్రసాదంబును దినిన వెంట 

యాంధ్ర పదముల కాద్యుడౌ యన్నమయకు 

కవిత యుప్పొంగె నంతట గంగ వోలె




✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ఉత్తరాయణ పుణ్యకాలం

 *ఉత్తరాయణ పుణ్యకాలం*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️





*"సరతి చరతీతి సూర్యః"*  అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. *"ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత"*  అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. *"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే "చేరడం" లేదా "మారడం"అని అర్థం.* సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. *జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం"సంక్రాంతి"ని* ఇలా నిర్వచించింది. *"తత్ర మేషాదిషు ద్వాదశ*

*రాశి క్రమణేషు* *సంచరితఃసూర్యస్య పూర్వన్మాద్రాశేఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః"* మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది. *"రవి సంక్రమణే ప్రాపే నన్నా యాద్యన్తు మానవఃసప్త జన్మసు రోగీ స్యానిర్దేనశే్చన జాయతే"* అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే , రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా , దరిద్రునిగా ఉండిపోతాడని భావం.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి , దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ , ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.


ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు..  ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ , ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ , సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ , ముఖ్యం గా  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ , ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.


సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని , వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని , ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

 

ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా , ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం , ఫలాలు , విసనకర్ర, వస్త్రం , కాయగూరలు , దుంపలు , నువ్వులు , చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.


*"సంక్రాంతి వైభవం"*



సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని *"ఉత్తరాయణ పుణ్యకాలం"గా* పరిగణించిన సనాతన సిద్ధాంతంలో..  ప్రకృతి పరిశీలన , దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి , కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన , శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి , సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. 

*"తిల సంక్రాంతి"గా* కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి , పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని , మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను , ఆనందాన్ని కుటుంబంతో , సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు , మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది. 


రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా , చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం , దానం , పితృతర్పణం , జపతపాలు , దేవతార్చనలు - సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు , తల్లిదండ్రులు , సాటి మనుషులు , ప్రకృతి పట్ల కృతజ్ఞతను , ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి , ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. 

కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా - మంచి వృష్టిని , ఆరోగ్యాన్ని , సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం , నువ్వుల నూనె దీపం , బియ్యం కలిపిన తిలలతో పూజ , తిలలతో కూడిన పదార్థాల నివేదన - శాస్త్రం చెప్పిన విధులు. పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక - ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా - యమునా - సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం.


ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో , స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం , శక్తి... ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. 

సూర్యుణ్ని నారాయణుడిగా ; శోభను , శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు. సంక్రాంతినాటి సూర్య శోభయే కాక , పంటల శోభ , సంపదల పుష్టి... అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు , సంప్రదాయసిద్ధమైన కళలు , ఉత్సాహాల ఉత్సవాలు , బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు.. వెరసి సంక్రాంతి వైభవాలు !

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము🌹


ప్రథమ ప్రాయమైన బాల్యంబు నుండియు 

యమిత ప్రజ్ఞుడైన యన్నమయ్య 

తల్లి దండ్రి వలన సంగీత పాండిత్య 

కళల నెల్ల నేర్చి  ఘనత గాంచె 


నారాయణ సూరంతట 

పారాయణ జేయుటకును బహువిధ నీతుల్ 

యూరిలొ గురుకుల మందున 

చేరిచె శ్రీ యన్నమయను స్థిర విద్య లకున్ 


అంత గురుకుల మందున యన్నమయ్య 

వేంకటేశ్వరు కృపవల్ల విమల మదితొ 

యనతికాలంబు నందునె యఖిలమైన 

వేదశాస్త్రంబులను నేర్చి విజ్ఞుడయ్యె 


         అన్నమయ్య  తిరుమల దర్శనము 


అన్నమయ్య తనదు యష్టమవయసులో 

కాలినడక తోడ కదలి వెడలి 

చేరె పట్టుదలతొ తిరుపతి పురముకు 

తాళ్లపాకనుండి తన్మయమున 


తిరుపతి గంగమ్మ దివ్యదర్శన మొంది 

              ప్రణతుల నర్పించె భక్తి తోడ 

కాలిద్రోవను బట్టి కనుమలు దాటుచూ 

              చేరగా సాగెను తిరుమలకును 

దుర్గమంబైనట్టి మార్గంబు నందున 

               యాగక నడువగా యలసటొచ్చె 

తడియారె గొంతుక దాహంబు గల్గగా 

               యత్యంత బడలికన్ యాకలయ్యె 

కనులు దిరుగుచుండ కాయంబువణుకగా 

యడుగు ముందుకేయ నలవిగాక 

నడువ శక్తిలేని తడబడు స్థితియందు 

యవనిపైన బడెను యన్నమయ్య



✍️గోపాలుని మధుసూదనరావు 🙏

అన్నమాచార్య చరితము

    🌹అన్నమాచార్య చరితము🌹


అట్లు నారాయనయ్యయు లక్కమాంబ 

తిరుమలేశుని దర్శించి తృప్తితోడ 

దారి యందున్న కపిలతీర్థంబు గాంచి 

యిల్లు జేరిరి యత్యంత యుల్లసమున 


కాల మారీతి తృప్తితో గడచి పోగ 

తిరుమలేశుని దివ్యమౌ వరము వలన 

భవ్య నారాయణయసూరి భాగ్యమునను 

గర్భమును దాల్చె లక్కమ ఘనము గాను 


       అన్నమయ్య జననము 


శుద్ధ శ్రోత్రి నారాయణసూరి శర్మ 

లచ్చికెనయగు యిల్లాలు లక్కమాంబ 

ధరను వెల్గొందు యాదర్శదంపతులకు 

బుట్టె నన్నమాచార్యుడు  పుణ్యమునను 


వరలు సర్వ ధారి వైశాఖ మాసాన 

శుక్ల పూర్ణిమనెడి శుభపు తిథిన 

కడప ప్రాంత మందు ఘనమైన గ్రామమౌ 

తాళ్లపాక యందు సంభవించె 


పది నాల్గొందల యెనిమిది

సదమలమగు మే నెలందు సరి తొమ్మిదినన్ 

పద కవితల పేర్గాంచిన 

సదమలుడగు యన్నమయ్య సంభవ మొందెన్ 


అన్నమయ్య బుట్టి హరికృప తోడను 

దిన దినాభి వృద్ధి చెందు చుండి

యాట పాట లందు హరినామమును బల్క 

తల్లి దండ్రు లెంతొ సంత సిలిరి 


వేదప్రోక్తమైన విధులను సేయంగ  

విహిత వయసు నందు విప్రు లెదుట 

బడసె నన్నమయ్య  బ్రహ్మోపదేశంబు 

కన్నతండ్రి నుండి ఘనముగాను 


అంత ' ఘనవిష్ణు' వనియెడి హరి సముండు 

యన్నమయ్యకు యష్టమ వర్షమందు 

దివ్య మైనట్టి వైష్ణవ దీక్ష నొసగ 

యన్నమాచార్యు డయ్యెను యన్నమయ్య



✍️గోపాలుని మధుసూదనరావు 🙏

బ్రహ్మ జ్ఞానం

 



బ్రహ్మ జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం                                 [ఉపనిషత్తులు]


 


బ్రహ్మ జ్ఞానం కలగటం అనేది చాలా కష్టమైన పని. అట్లా అంత కష్టపడి సాధించాల్సిన అవసరం ఏముంది అనే సందేహం రావచ్చు. ఎందుకు బ్రహ్మ జ్ఞానం కావాలి, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఈ మంత్రం తెలుపుతుంది.


 


స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్

అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్ |

కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః

యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః || (8)


 


 


ఎవడైతే బ్రహ్మ జ్ఞానం పొందుతాడో వాడు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతాడు. ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుపుతుంది ఈ మంత్రం. బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన "చ్ఛుక్రమ్"- పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు. జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు. పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు. "అకాయమ్" - ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం . "అవ్రణమ్" - రోగాలు, వ్యాదులు అంటని శరీరం. "అస్నావీరమ్"- ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక "శుద్ధమపాపవిద్ధమ్" ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది. పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు. కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో. మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా ? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది. ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ వలె జ్ఞానం అంతటా విస్తరించి ఉంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు. వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది.  వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు. అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.



 

అన్నమాచార్య చరితము

 అన్నమాచార్య చరితము 


ధర నారాయణసూరికి 

హరిచింతన నెపుడుసేయు యా లక్కమకున్ 

పురప్రముఖులు  యాత్మీయులు

పరిణయమును జేసిరంత బహు విభవమునన్ 


ఎంతయో యన్యోన్యంబుగ 

సంతసమున జీవయాత్ర సాగుచు నుండన్ 

యెంతటి భాగ్యము లున్నను 

సంతానము లేని లోటు  తారస పడియెన్ 


నారాయణసూరి తిరుమల పయనము 


సంతు లేక వారు సంతాప మొందియు

యిలను దైవతంబు యింటివేల్పు 

తిరుమలేశుడైన శ్రీ వేంకటేశుని 

దర్శనంబుసేయ తరలి రంత 


తిరుమలందు వారు దివ్యపుష్కరణిలో 

పుణ్య మజ్జనంబు పొంది పిదప 

తొలివరాహు జూచి ఫలముల నర్పించి 

దేవమందిరముకు జేరి రంత 


శ్రీవేంకటేశుని దివ్య మందిరమందు 

                నారాయణయ్యయు లక్కమాంబ 

మూలవిరాట్టును ముదమార గాంచియు 

                గోవింద యనుచును గొంతు కలిపి 

ముడుపులు గట్టిన మూటల నర్పించి 

                తీర్థ ప్రసాదముల్ దీసుకొనిరి 

దివ్య ధ్వజస్తంభ మెదుట యా లక్కమ 

                సాష్టాంగ దండంబు సల్పె నపుడు 

యంత  దివ్య కాంతి హరి దయ తోడను 

వెలసి యచట మిగుల వైభవముగ 

గరిమ లక్క మాంబ గర్భంబు నందున 

శ్రీకరంబు గాను చేరె పోయె


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ప్రపంచమంతా పరమాత్మ దేహం

 ప్రపంచమంతా పరమాత్మ దేహం అని తెలిస్తే శోకం ఉండదు (7వ మంత్రం)                     [ఉపనిషత్తులు]


ప్రపంచంలో అన్నీ పరమాత్మ దేహంలో భాగాలే, పరమాత్మ అన్నింటిలో లోన బయట వ్యాపించి ఉన్నాడు కనుక.  కానీ మనిషికి ఎల్లప్పుడూ దుఃఖమే. దాన్ని ఎలా దూరం చేసుకోవాలో ఈ మంత్రం చెబుతుంది.


యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః |

తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః || (7)


లోకంలో నా అనుకున్నవాడు దగ్గరవుతే మోహం, దూరమైతే శోకం కలుగుతున్నాయి. ఇష్టం లేనిది దూరం పోతే సంతోషం, అది దగ్గరికి వస్తే భాధ కలుగుతుంది. "యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః" ఒకటే అందరికీ ఆధారం అని తెలిస్తే, ఇది వరకు మోహము, శోకము కలిగాయి కానీ ఈనాడు అందరి యందు "ఏకత్వమనుపశ్యతః" ఏకత్వ భావన కలిగితే కనిపించే వాటి యందు జాలి కలుగుతుంది తప్ప ద్వేషం కాదు. కాలిలో ముల్లు దిగితే చేయి అలా ఊరికే కూర్చుంటుందా ? వెళ్ళి తీసే ప్రయత్నం చేస్తుంది. అట్లానే ఒకడు శోకిస్తుంటే నీవూ వెళ్ళి వాడి శోకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తావు. ఒకడికి కలిగిన ఆనందానికి నీవూ ఆనందించగలుగుతావు. ప్రత్యేకించి ఒక్కడి యందు కాదు, విశ్వం అందరి యందు కలిగినా ఆ భావం ఏర్పడుతుంది. వాల్మీకికి కౌంచపక్షికి భాణం కుచ్చుకుంటే ఏడుపు వచ్చింది. విశ్వం అంతా అట్లాంటి భావన ఉండాలి.


ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ వాడివి అని గుర్తించినప్పుడు, వాడు నీ వాడైనప్పుడు ఇక నీవు కోల్పోయేది అంటూ ఏమి ఉండనే ఉండదు. ఇక మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది. ఈ భావన లేని నాడు మోహ శోకాలకు తావు ఉంది. పరమాత్మను గుర్తించిన నాడు అవి వాటంతట అవే దూరం అవుతాయి.


జనకుడు మిథిలానగరి రాజ కుమారుడు, యాజ్ఞవల్క్యుడి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురువుగారికి జనకుడంటే ప్రియం. రాకుమారుడని అట్లా జనకులవారిపై ఇష్టం చూపిస్తున్నారని మిగతా శిష్యులు అనుకునేవారు. గురువు గారు వారి కళ్ళు తెరిపిద్దాం అని అనుకున్నారు. వారికున్న యోగిక శక్తిచే అక్కడ కుటీరంలో మంటలు కనిపించేట్టు మాయను చేసారు. అది చూసి శిష్యులంతా లేచి వాళ్ళ వాళ్ళ వస్తువులను కాపాడుకోవడానికి వెళ్ళారు, అసలు వారికి ఉన్న వస్తువులు అంటూ ఏమీ లేవు పెద్దగా. జనకుల వారు అక్కడే కూర్చొని ఉన్నారు. కాసేపటికి మిథిలానగరం తగలబడుతున్నట్టు కనిపించింది. అయినా జనకుల వారు అక్కడే ఉన్నారు, పెద్దగా పట్టించుకోలేదు. అసలు ప్రమాదం ఏమీ జరగలేదు అని శిష్యులంతా వచ్చి కూర్చున్నారు. గురువుగారు జనకుడిని అడిగాడు, మీ నగరం తగలబడుతుంటే  ఏమీ చేయడం లేదేమిటని. నావద్ద అగ్నికి కాలనిది, నీటికి తడవనిది, గాలికి చెదరనిది ఉంటుంటే ఏదో తగలబడుతుంటే నాకెందుకు అని అన్నాడు. బాహ్యమైన వస్తువుల యందు వారికి ఎట్లాంటి మోహం ఉండేదే కాదు. తనలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే అంతటా ఉన్నాడు అని గుర్తించాడు.  ఈ విషయం గుర్తించడానికి జనకులవారు మనకు ఆదర్శం.

పతంజలి కృత శంభు నటన స్తోత్ర

 *పతంజలి కృత శంభు నటన స్తోత్ర విశిష్టత*


ఒకసారి పతంజలి మహర్షి మహాశివ దర్శనానికి అనుమతి కోరగా, నందీశ్వరుడు అనుమతించక పోవడంతో పాటు పతంజలి మహర్షి సర్పాకారాన్ని చూసి హేళనచేసి నీకు నాకున్నట్లు కాళ్ళు, కొమ్మలు లేవని నవ్వాడట. అందుకు పతంజలి మహర్షి ఆగ్రహించి, ద్వారం వెలుపలి నుండే శంభు నటన స్తోత్రాన్ని చరణ శృంగ రహితంగా ఆశువుగా చెప్పాడట. ఆ స్తోత్రానికి పరవశుడై పరమశివుడు ప్రత్యక్షమైనాడట. 


ఈ స్తోత్రము యొక్క గొప్పదనమేమో చూద్దాము. దేవనాగరి లిపిలో आ, का అన్న అక్షరాలలో ा ఈ సంకేతములను చరణములు(కాళ్ళు) అంటారు. అదేవిధముగా ओ, औ లలో ोौ పైన వంపుతో ఉన్న గీతలను శృంగములు (కొమ్ములు ) అంటారు. నిజముగా ఈ కవనము చిత్ర కవిత్వపు కోవకు చెందినది. ఆకార, ఏకార, ఐకార, ఓకార, ఔకారములతో ఉండే దీర్ఘాక్షరములు లేవు. అనుస్వారము, విసర్గము, సంయుక్తాక్షరములు, మాత్రమే ఇందులో గురువులను కలిగిస్తాయి. ఇకార, ఈకార, ఉకార, ఊకారములు అంగీకృతములు. రండి మనమూ ఈ స్తోత్రాన్ని విని తరిద్దాము.


******************************

*పతంజలి కృత శంభు నటన స్తోత్రం*


సదంచిత ముదంచిత నికుంచిత పదం

ఝలఝలం చలిత మంజు కటకం

పదంజలి దృగంజన మనంజన

మచంచల పదం జనన భంజనకరం


కదంబ రుచిం మంబరవసం పరమ

మంబుద కదంబక విడంబక గళం

చిదంబుధి మణిం బుధ హృదంభుజ 

రవిం పర చిదంబర నటం హృది భజే


హరం త్రిపుర భంజన మనంత కృత

కంకణ మహంత దయ మంత రహితం

విరించి సురవంహతి పురంధర విచింతిత 

పదం తరుణ చంద్ర మకుటం పరం 

పద విఖండిత యమం భసిత 

మండిత తనుం మదన వంచన పరం 

చిరంతన మముం ప్రణవ సంచిత నిధిం 

పర చిదంబర నటం హృది భజే


అనంత మఖిలం జగద భంగ గుణ తుంగ

మమతం ధృత విధుం సుర చరీత్

తరంగ నికురుంబ ధృతి లంపట 

జటం శమనదం పశుహరం భవహరం

శివం దశ దిగంతర విజృంభిత కరం 

కరలసం మృగశశిం పశుపతిం

హరం శశి ధనంజయ పతంగ అయనసం

పర చిదంబర నటం హృది భజే


పరం సురవరం పురహరం పశుపతిం 

జనిత దంతిముఖ షణ్ముఖ మముం

మృదం కనక పింగళ జటం శనక పంకజ రవిం సుమనసిం హిమ రుచిం

అళంగ మనసం జలధి జన్మ గరళం 

కబలయంత మధుకరం గుణనిధిం

సనంద వరదం శమిత మిందు వదనం 

పర చిదంబర నటం హృది భజే


ఇతి స్తవం మముం భుజగ పుంగవ కృతం 

ప్రతి దినం పఠతి యః కృత ముఖా

సదః ప్రభు పద ద్వితియ దర్శన పదం

సులలితం చరణ శృంగ రహితం

సః ప్రభవ సంభవ హరిత్పతి హరి

ప్రముఖ దివ్య నుత శంకర పదం

సగచ్ఛతి పరం నతుజను ర్జలనిధిం

పరమ దుఃఖ జనకం దురితదం


                        - పతంజలి మహర్షి

              గానం - సిక్కిల్ గురుచరణ్

అన్నమాచార్య చరిత్ర

 అన్నమాచార్య చరిత్ర 


అంత టమ్మవారు యద్భుత మహిమతో 

కరుణ తోడ నతని గావ నెంచి 

బాలు నెదుట తాను  ప్రత్యక్ష మయ్యును 

పరమ వత్స లతతొ బలికె నిట్లు 


"సాహసం బేల నీకిట్లు చచ్చుటకును 

కలత చెందకు బాలక కలదు శుభము 

తప్పకను నీదు మూడవతరము నందు 

బాలుడుదయించు శ్రీహరి భావమందు "


అంతట శ్రీ నారాయణ 

సంతోషము పొంది మిగుల స్వాంతము నందున్ 

గెంతుచు వెళ్ళియు గృహముకు 

పంతుళ్ళకు జెప్పి మిగుల పరవశమొందెన్ 


అవని నారాయణయ్యయు యమ్మ కృపన

పెఱిగి పెద్దయ్యు ద్విజులందు పెంపు పొందె 

పరిణయంబాడి పుత్రుని బడసి యతడు 

పేరు నారాయణ నుచును బెట్టు కొనియె 


నారాయణు కృప వల్లను 

నారాయణ సూరి బెఱిగి నాలుగు చదువుల్ 

పారాయణ మొనరించియు 

పారీణత పొందె మిగుల పండితు లందున్ 


తాళ్లపాక గ్రామ సామీప్య మందున 

మాడుపూరు నందు మహితమైన 

విప్రవంశమందు విభవంబుగా బుట్టి 

లచ్చి వోలె బెఱిగె లక్కమాంబ 


లచ్చి కెనయైన మానినౌ లక్కమాంబ 

విష్ణుకోవెల యందున విభవముగను 

మహితమొప్పగ నెలకొన్న మాధవునికి 

యర్చనము సేయు చుండును యనయముగను


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కుంబాభిషేకం

 కుంబాభిషేకం - ఒక జ్ఞాపకం


పరమాచార్య స్వామివారి జ్ఞాపకశక్తి అమోఘం. ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని సరైన సమయంలో వాటిని తెలియజేస్తుంటారు. అటువంటి ఒక సంఘటన మీకోసం.


మహాస్వామి వారు ప్రకృతి ప్రేమికులు. యాత్రా సమయాలలో వారు ఎప్పుడూ పాకలలోనూ, ఛత్రాలలోనూ, చెట్లకింద, బయలు ప్రదేశాలలో ఎక్కువగా నివసించేవారు. ఒకసారి వారు మన ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. రోడ్డుపక్కనే ఒక చిన్న పాకలో ఉన్నారు. ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికై కార్లో వచ్చాడు. అతను మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, “నా పేరు కళ్యాణం పెరియవ. నేను తంజావూరు జిల్లా నుండి వచ్చాను. మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎవ్వరికీ మనఃశాంతి లేదు. నన్ను మహాస్వామి వారే కాపాడగలరని మీ దర్శనానికి వచ్చాను” అని అన్నాడు.


మహాస్వామి వారు అతన్ని కూర్చోమని చెప్పి, అతని గురించి వాకబు చేసి వారి సమస్యలన్నీ విన్నారు. వారి రెండు చేతులను పైకెత్తి అశీర్వదించి ఒక ఫలం ఇచ్చి పంపారు. ఒక రెండు సంవత్సరములు గడిచిపోయాయి. కళ్యాణం జీవితంలో వసంతం వచ్చింది. అతని బాధలన్నీ తొలగి సంతోషం వచ్చింది. అతను మహాస్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాడు. అప్పుడు కూడా మహాస్వామి వారు యాత్రలోనే ఉన్నారు. అతను మహాస్వామి వారి దర్శనం చేసుకుని తన కష్టాలు తొలగిపోయినందుకు, మహాస్వామి వారికి నమస్కరించి పక్కగా నిలుచున్నాడు.


“పరమాచార్య స్వామి వారి అవ్యాజ కరుణాకటాక్షాల వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. కావున నా మనః సంతోషము కోసం శ్రీమఠానికి ఏమైనా సమర్పించాలని అనుకుంటున్నాను” అని అన్నాడు. పరమాచార్య స్వామి వారు నవ్వి, ”నువ్వు ఇప్పుడేమి సమర్పించనక్కర లేదు” అని అన్నారు. కళ్యాణం అన్యమనస్కంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చిదంబరంలోని థిల్లై నటరాజ స్వామి వారి ఆలయ కుంబాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం నన్ను స్వామి వారు పిలిచారని శ్రీమఠం నుండి కబురు వచ్చింది. శ్రీమఠం శ్రీకార్యం తిరు టి.ఎన్. కృష్ణమూర్తి, నేను వెళ్ళి మహాస్వామి వారి ముందు నిలబడ్డాము. మహాస్వామి వారు మేనాలో కూర్చుని కుంబాభిషేకానికి జరగవలసిన తిరుమురై సంగీతం, తిరుమురై సదస్సు, తిరువాచక పారాయణం, దీక్షితర్ల(చిదంబరం ఆలయ వంశపారంపర్య అర్చకులు) పిల్లల చేత శంభునాథ స్తోత్ర పారాయణ వంటి ఏర్పాట్ల గురించి ఆదేశాలు ఇస్తున్నారు.


అంతలో ఒకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. మహాస్వామి వారు అతన్ని మాతోపాటు కూర్చోమన్నారు. ఆ వచ్చిన అతను కళ్యాణం.


“నువ్వు నన్ను ఫలానా రోజు ఫలానా చోట కలిసావు? గుర్తు ఉన్నాదా?” అని మహాస్వామి వారు అతణ్ణి అడిగారు.


అతను ఆశ్చర్యపోయాడు. అతను రెండవ సారి దర్శనం చేసుకున్న విషయం చెప్పగా అతను కొద్దిగా గుర్తు తెచ్చుకుని, అవునన్నట్టు తల పంకించాడు.


”ఇప్పుడు బావున్నావు కదా? నువ్వు మఠానికి డబ్బు ఇవ్వాలనుకున్నావు కదా ఇప్పుడు ఇవ్వగలవా?” అని అడిగారు.


”ఇప్పుడే సంతోషంగా ఇవ్వగలను పెరియవ” అని అన్నాడు.


”కాని ఆ డబ్బు శ్రీమఠం కోసం కాదు. ఇది చిదంబరం థిల్లై నటరాజ స్వామి వారి ఆలయ కుంబాభిషేక సమయం. అక్కడ జరగవలసిన పనుల గురించి నేను వీళ్లకు చెప్పాను. నువ్వు ఇచ్చిన డబ్బు ఆ పనుల కోసం ఉపయోగిస్తాము. ఆ ధనం నటరాజ స్వామికి చేరనీ!! నీవు వారితో చర్చించి రా” అని అన్నారు.


మేము ముగ్గురమూ బయటకు వచ్చి అన్ని విషయాలు చర్చించి లోపలికి వెళ్ళాము. పరమాచార్య స్వామి వారు కూడా సంతోషించి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు.


ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన చిన్న సంఘటనను గుర్తుపెట్టుకుని సరైన సమయంలో గుర్తుతెచ్చుకుని, ఆనాడు అతను కోరిన కోర్కెను నెరవేర్చి నటరాజ స్వామి వారి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసారు. ఇంతటి అదృష్టాన్ని పొందిన కళ్యాణం జన్మ ధన్యమైనది.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।