16, జనవరి 2021, శనివారం

అన్నమాచార్య చరితము

    🌹అన్నమాచార్య చరితము🌹


అట్లు నారాయనయ్యయు లక్కమాంబ 

తిరుమలేశుని దర్శించి తృప్తితోడ 

దారి యందున్న కపిలతీర్థంబు గాంచి 

యిల్లు జేరిరి యత్యంత యుల్లసమున 


కాల మారీతి తృప్తితో గడచి పోగ 

తిరుమలేశుని దివ్యమౌ వరము వలన 

భవ్య నారాయణయసూరి భాగ్యమునను 

గర్భమును దాల్చె లక్కమ ఘనము గాను 


       అన్నమయ్య జననము 


శుద్ధ శ్రోత్రి నారాయణసూరి శర్మ 

లచ్చికెనయగు యిల్లాలు లక్కమాంబ 

ధరను వెల్గొందు యాదర్శదంపతులకు 

బుట్టె నన్నమాచార్యుడు  పుణ్యమునను 


వరలు సర్వ ధారి వైశాఖ మాసాన 

శుక్ల పూర్ణిమనెడి శుభపు తిథిన 

కడప ప్రాంత మందు ఘనమైన గ్రామమౌ 

తాళ్లపాక యందు సంభవించె 


పది నాల్గొందల యెనిమిది

సదమలమగు మే నెలందు సరి తొమ్మిదినన్ 

పద కవితల పేర్గాంచిన 

సదమలుడగు యన్నమయ్య సంభవ మొందెన్ 


అన్నమయ్య బుట్టి హరికృప తోడను 

దిన దినాభి వృద్ధి చెందు చుండి

యాట పాట లందు హరినామమును బల్క 

తల్లి దండ్రు లెంతొ సంత సిలిరి 


వేదప్రోక్తమైన విధులను సేయంగ  

విహిత వయసు నందు విప్రు లెదుట 

బడసె నన్నమయ్య  బ్రహ్మోపదేశంబు 

కన్నతండ్రి నుండి ఘనముగాను 


అంత ' ఘనవిష్ణు' వనియెడి హరి సముండు 

యన్నమయ్యకు యష్టమ వర్షమందు 

దివ్య మైనట్టి వైష్ణవ దీక్ష నొసగ 

యన్నమాచార్యు డయ్యెను యన్నమయ్య



✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: