కుంబాభిషేకం - ఒక జ్ఞాపకం
పరమాచార్య స్వామివారి జ్ఞాపకశక్తి అమోఘం. ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని సరైన సమయంలో వాటిని తెలియజేస్తుంటారు. అటువంటి ఒక సంఘటన మీకోసం.
మహాస్వామి వారు ప్రకృతి ప్రేమికులు. యాత్రా సమయాలలో వారు ఎప్పుడూ పాకలలోనూ, ఛత్రాలలోనూ, చెట్లకింద, బయలు ప్రదేశాలలో ఎక్కువగా నివసించేవారు. ఒకసారి వారు మన ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. రోడ్డుపక్కనే ఒక చిన్న పాకలో ఉన్నారు. ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికై కార్లో వచ్చాడు. అతను మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, “నా పేరు కళ్యాణం పెరియవ. నేను తంజావూరు జిల్లా నుండి వచ్చాను. మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎవ్వరికీ మనఃశాంతి లేదు. నన్ను మహాస్వామి వారే కాపాడగలరని మీ దర్శనానికి వచ్చాను” అని అన్నాడు.
మహాస్వామి వారు అతన్ని కూర్చోమని చెప్పి, అతని గురించి వాకబు చేసి వారి సమస్యలన్నీ విన్నారు. వారి రెండు చేతులను పైకెత్తి అశీర్వదించి ఒక ఫలం ఇచ్చి పంపారు. ఒక రెండు సంవత్సరములు గడిచిపోయాయి. కళ్యాణం జీవితంలో వసంతం వచ్చింది. అతని బాధలన్నీ తొలగి సంతోషం వచ్చింది. అతను మహాస్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాడు. అప్పుడు కూడా మహాస్వామి వారు యాత్రలోనే ఉన్నారు. అతను మహాస్వామి వారి దర్శనం చేసుకుని తన కష్టాలు తొలగిపోయినందుకు, మహాస్వామి వారికి నమస్కరించి పక్కగా నిలుచున్నాడు.
“పరమాచార్య స్వామి వారి అవ్యాజ కరుణాకటాక్షాల వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. కావున నా మనః సంతోషము కోసం శ్రీమఠానికి ఏమైనా సమర్పించాలని అనుకుంటున్నాను” అని అన్నాడు. పరమాచార్య స్వామి వారు నవ్వి, ”నువ్వు ఇప్పుడేమి సమర్పించనక్కర లేదు” అని అన్నారు. కళ్యాణం అన్యమనస్కంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చిదంబరంలోని థిల్లై నటరాజ స్వామి వారి ఆలయ కుంబాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం నన్ను స్వామి వారు పిలిచారని శ్రీమఠం నుండి కబురు వచ్చింది. శ్రీమఠం శ్రీకార్యం తిరు టి.ఎన్. కృష్ణమూర్తి, నేను వెళ్ళి మహాస్వామి వారి ముందు నిలబడ్డాము. మహాస్వామి వారు మేనాలో కూర్చుని కుంబాభిషేకానికి జరగవలసిన తిరుమురై సంగీతం, తిరుమురై సదస్సు, తిరువాచక పారాయణం, దీక్షితర్ల(చిదంబరం ఆలయ వంశపారంపర్య అర్చకులు) పిల్లల చేత శంభునాథ స్తోత్ర పారాయణ వంటి ఏర్పాట్ల గురించి ఆదేశాలు ఇస్తున్నారు.
అంతలో ఒకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. మహాస్వామి వారు అతన్ని మాతోపాటు కూర్చోమన్నారు. ఆ వచ్చిన అతను కళ్యాణం.
“నువ్వు నన్ను ఫలానా రోజు ఫలానా చోట కలిసావు? గుర్తు ఉన్నాదా?” అని మహాస్వామి వారు అతణ్ణి అడిగారు.
అతను ఆశ్చర్యపోయాడు. అతను రెండవ సారి దర్శనం చేసుకున్న విషయం చెప్పగా అతను కొద్దిగా గుర్తు తెచ్చుకుని, అవునన్నట్టు తల పంకించాడు.
”ఇప్పుడు బావున్నావు కదా? నువ్వు మఠానికి డబ్బు ఇవ్వాలనుకున్నావు కదా ఇప్పుడు ఇవ్వగలవా?” అని అడిగారు.
”ఇప్పుడే సంతోషంగా ఇవ్వగలను పెరియవ” అని అన్నాడు.
”కాని ఆ డబ్బు శ్రీమఠం కోసం కాదు. ఇది చిదంబరం థిల్లై నటరాజ స్వామి వారి ఆలయ కుంబాభిషేక సమయం. అక్కడ జరగవలసిన పనుల గురించి నేను వీళ్లకు చెప్పాను. నువ్వు ఇచ్చిన డబ్బు ఆ పనుల కోసం ఉపయోగిస్తాము. ఆ ధనం నటరాజ స్వామికి చేరనీ!! నీవు వారితో చర్చించి రా” అని అన్నారు.
మేము ముగ్గురమూ బయటకు వచ్చి అన్ని విషయాలు చర్చించి లోపలికి వెళ్ళాము. పరమాచార్య స్వామి వారు కూడా సంతోషించి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు.
ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన చిన్న సంఘటనను గుర్తుపెట్టుకుని సరైన సమయంలో గుర్తుతెచ్చుకుని, ఆనాడు అతను కోరిన కోర్కెను నెరవేర్చి నటరాజ స్వామి వారి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసారు. ఇంతటి అదృష్టాన్ని పొందిన కళ్యాణం జన్మ ధన్యమైనది.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి