16, జనవరి 2021, శనివారం

అన్నమాచార్య చరిత్ర

 అన్నమాచార్య చరిత్ర 


అంత టమ్మవారు యద్భుత మహిమతో 

కరుణ తోడ నతని గావ నెంచి 

బాలు నెదుట తాను  ప్రత్యక్ష మయ్యును 

పరమ వత్స లతతొ బలికె నిట్లు 


"సాహసం బేల నీకిట్లు చచ్చుటకును 

కలత చెందకు బాలక కలదు శుభము 

తప్పకను నీదు మూడవతరము నందు 

బాలుడుదయించు శ్రీహరి భావమందు "


అంతట శ్రీ నారాయణ 

సంతోషము పొంది మిగుల స్వాంతము నందున్ 

గెంతుచు వెళ్ళియు గృహముకు 

పంతుళ్ళకు జెప్పి మిగుల పరవశమొందెన్ 


అవని నారాయణయ్యయు యమ్మ కృపన

పెఱిగి పెద్దయ్యు ద్విజులందు పెంపు పొందె 

పరిణయంబాడి పుత్రుని బడసి యతడు 

పేరు నారాయణ నుచును బెట్టు కొనియె 


నారాయణు కృప వల్లను 

నారాయణ సూరి బెఱిగి నాలుగు చదువుల్ 

పారాయణ మొనరించియు 

పారీణత పొందె మిగుల పండితు లందున్ 


తాళ్లపాక గ్రామ సామీప్య మందున 

మాడుపూరు నందు మహితమైన 

విప్రవంశమందు విభవంబుగా బుట్టి 

లచ్చి వోలె బెఱిగె లక్కమాంబ 


లచ్చి కెనయైన మానినౌ లక్కమాంబ 

విష్ణుకోవెల యందున విభవముగను 

మహితమొప్పగ నెలకొన్న మాధవునికి 

యర్చనము సేయు చుండును యనయముగను


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: