🌹అన్నమాచార్య చరితము🌹
బాల భక్తుని పరికించి పరవశించి
యంత యలమేలు మంగమ్మ సంతసిల్లి
వృద్ధ వనితగు రూపాన సిద్ధ మయ్యు
యెదుట ప్రత్యక్ష మయ్యెను వేడ్కతోడ
మంత్ర జలమును ప్రోక్షించ మమత తోడ
యలసటను దీరి లేచియు యన్నమయ్య
కన్ను లెదుటున్న యమ్మను గాంచి మిగుల
విభ్రమం బొంది యత్యంత విస్తుపోయె
అంతట మాతృశ్రీ యలమేలు మంగమ్మ
యన్నమయ్యను జీరి యమిత దయతొ
తనువును స్పృశియించి తనివార నిమిరియు
బడలిక పోగొట్టి భయము దీర్చి
శ్రీ వెంకటేశ్వరు దివ్య ప్రసాదమున్
ప్రియమార తినిపించి పెంపు గూర్చి
యాకాశగంగను యందించి యతనికి
దీర్చియు దాహంబు తృప్తి గాను,
"గిరులు సర్వంబు దెలియగా హరి మయంబు
విమల మైనట్టి యీ గిరి నెక్కు తరిన
పాదరక్షలు ధరియించ పాప మగును "
యనుచు బోధించె నతనికి ననునయముగ
అమ్మ యమృతపు పలుకుల నాలకించ
యంతరంగంబు నందున యన్నమయకు
విమల జ్ఞానోదయంబయ్యు వింతగాను
తనువు పులకలు గల్గెను తన్మయమున
అమృత తుల్య ప్రసాదంబు నంద జేసి
చింత బోగొట్టి తనువుకు సేద దీర్చి
దివ్య సందేశ మిచ్చియు తీరు దెలిపి
యమ్మ కనుమరుగయ్యెను యంతలోనె
కనుల ముందర యాతల్లి కదలి పోగ
యన్నమయ్యకు యత్యంత యలజ డవగ
యంత నతనికి కన్పించె నంతరమున
యమ్మ యలమేలు దేవత యభయ మిడుచు
అమ్మ దయచేసి నట్టి యా కమ్మ నైన
దివ్య మగు ప్రసాదంబును దినిన వెంట
యాంధ్ర పదముల కాద్యుడౌ యన్నమయకు
కవిత యుప్పొంగె నంతట గంగ వోలె
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి