16, జనవరి 2021, శనివారం

ప్రార్థనాశక్తి

 _*🧘ప్రార్థనాశక్తి🧘‍♂*_

🕉🌞🌎🌙🌟🚩


*_భక్తుడు ఆర్తితో, ఆర్ద్రతతో భగవంతుడికి చేసే విన్నపమే ప్రార్థన._*



*_ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి పట్ల ఉన్న అపారమైన విశ్వాసం ఎలాంటి కష్టాన్నయినా తొలగిస్తాయని పెద్దల మాట. శరణుజొచ్చి ఆర్తితో భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన తప్పక ఆదుకుంటాడని ఎందరో విశ్వసిస్తారు. ప్రార్థన అనేది గుండెల లోతుల నుంచి పెల్లుబికి వచ్చే మనోభావం._*



*_నోటితో ప్రార్థించలేనివారు మనసులో ప్రార్థించవచ్చు. నిజానికదే మేలైన ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలవల్లే ఉత్తమ సంస్కారాలు అలవడతాయి. సాధనా ప్రణాళికలో ప్రార్థనకు విశిష్టస్థానం ఉంది. పరిశుద్ధ అంతఃకరణం, నిర్మలమైన భక్తికి భగవానుడు సంతుష్టుడవుతాడు._*



*_ప్రార్థనకు శ్రద్ధాభక్తులతోపాటు దృఢమైన విశ్వాసం సైతం ముఖ్యం. ఇలాంటి ప్రార్థనలు శీఘ్రంగా ఫలవంతమవుతాయంటారు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ద్రౌపది, మీరాబాయి, త్యాగయ్య, గోపయ్య మొదలైన మహాభక్తుల ప్రార్థనలే ఇందుకు తార్కాణాలు. భగవంతుడు దయామయుడు. మనసారా ప్రార్థిస్తే కోరినవన్నీ ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు._*



*_మనిషి కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. స్వార్థపూరితమైన మనసుతో కోరిన కోరికలు మనిషి వినాశనానికి దారితీస్తాయి. ఘోర తపస్సుచేసి ఆ పరమాత్మ నుంచి వరాలు పొందిన హిరణ్యకశిపుడు, రావణాది రాక్షసుల జీవిత చరిత్రలే దీనికి నిదర్శనాలు._*



*_ప్రార్థన మనోమాలిన్యాన్ని నిర్మూలిస్తుంది. భవభయాన్ని తొలగిస్తుంది. ప్రార్థనల వల్ల మానసిక ఒత్తిడులన్నీ మటు మాయమవుతాయి. మనసులో ప్రశాంతత గూడుకట్టుకుంటుంది._*



*_ప్రార్థనా సమయంలో మనసంతా ఒకచోట కేంద్రీకృతమవుతుంది. అప్పుడు సంశయాలన్నీ తొలగి పోతాయి. ఆందోళన తగ్గుతుంది. మనసు నిర్మల తటాకమవుతుంది._*



*_భారతీయ సంస్కృతి మానవాళికి అందించిన అద్భుతవరం- ఈ ప్రార్థనాశక్తి. అనాది నుంచి తత్వవేత్తలు, ఆచార్యులు, యోగులు ప్రార్థన ద్వారానే పరిపూర్ణతను సాధించారు._*



*_గాంధీజీకి ప్రార్థనా శక్తిమీద అపారమైన విశ్వాసం ఉంది. ‘మన లక్ష్యాన్ని పరమాత్మగా భావించాలి. అందుకోసం త్రికరణ శుద్ధితో నిజాయతీగా కృషిచేస్తే ఆ భగవంతుడు తప్పక సహకరిస్తాడు. అదే అసలైన ప్రార్థన’ అనేవారు గాంధీజీ._*



*_రామకృష్ణ పరమహంస ప్రార్థన గురించి చెబుతూ- ‘మనం భగవంతుణ్ని ప్రాపంచిక కోరికలు కోరకుండా భక్తితో ఆయన అనుగ్రహం కోసం ప్రార్థన చెయ్యాలి. అలా చేస్తే దుఃఖాలు శాశ్వతంగా తొలగిపోతాయి. అప్పుడే ఆయన ముక్తికి సరైన మార్గం చూపిస్తాడు’ అని బోధించేవారు._*



*_కొందరు లౌకిక సంపదలతోనే చిరశాంతి లభిస్తుందని భావిస్తారు. ఆ సంపదలకోసం దైవాన్ని ప్రార్థిస్తారు. నిజానికి లౌకికమైనది ఏదైనా శాశ్వతశాంతిని మానసిక ఆనందాన్ని ప్రసాదించలేదు. రాగద్వేషాలకు అతీతంగా లోకకల్యాణం కోసం, పరహితం కోసం చేసే ప్రార్థనలే మహత్తరమైనవి. అవే ఉదాత్తమైనవి. ఈ ప్రార్థనలు చేసేవారి మనసులు కూడా ప్రేమానురాగాలతో నిండి ఉంటాయి._*



*_ప్రార్థన మనిషిలో మంచిని పెంచుతుంది. వ్యక్తిత్వంలో మార్పు తెస్తుంది. ప్రార్థన ఎప్పుడైనా చేయవచ్చు. సమయ నియమం లేదు. ఎవరిని ప్రార్థిస్తున్నామో వారిమీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. వేదం ప్రతిపాదించిన ‘వ్యాసవిద్య’ ఇది. ఉపనిషత్తులు విశదీకరించిన ‘ప్రపత్తి’ ఇది._*



*_సర్వేజనా స్సుఖినోభవంతు అనే మహత్తరమైన ప్రార్థనను ఈ లోకానికి అందించిన సంస్కృతి మనది._*



*_వ్యక్తిగతమైన కోరికల కోసం కాకుండా సర్వ  మానవాళి శ్రేయస్సుకోసం ప్రార్థన చేయడం చాలా మంచిది. అదే మనిషికి మనశ్శాంతిని కలిగిస్తుంది !_*


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: