17, జనవరి 2021, ఆదివారం

పంచముఖ హనుమాన్

 పంచముఖ హనుమాన్


మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు. అయినా వాటిని చేధించుకుని అందరి కళ్లుగప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకు పోతాడు మైరావణుడు. దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు. మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు. అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. 


మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకొంటాడు. దాని కోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా అర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు.


పంచ అంటే అయిదు. ఐదు అనే సంఖ్య పంచ భూతాలకు సంకేతం. మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు. స్వామివారి పంచ ముఖాల్లో ఒక్కో మోముదీ ఒక్కో రూపం. దక్షిణాన నరసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ద్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఈ ఐదు రూపాలు అభయాన్నిస్తాయి.

కామెంట్‌లు లేవు: