17, జనవరి 2021, ఆదివారం

దాడులకు శృంగేరీ జగద్గురువుల ఆవేదన

 ఆలయాలపై జరుగుతున్న దాడులకు శృంగేరీ జగద్గురువుల ఆవేదన. బాధ్యులపై కఠిన చర్యలకు స్వామివారి సూచన


ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా ఆలయాలపై జరుగుతున్న దాడులపై దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రరాష్ట్రంలో ఆస్తిక మహాజనులందరకు శ్రద్దాకేంద్రాలైన కొన్ని దేవాలయములపై గత కొన్ని నెలలుగా దాడులు జరుగుతుండడం తీవ్రమైన వేదనను కలిగిస్తోందని, ఇటువంటి దాడులు రాజ్యాంగవిరుద్ధమని, వీటివల్ల దేశ ప్రజల సామరస్యానికి భంగమేర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.


ఇలాంటి దుశ్చర్యలను ఆరంభదశలోనే నివారించి ఇలాంటివి పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు.


శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి సందేశం పూర్తిపాఠం:


శృంగేరి 09.01.2021


సనాతనహిందూధర్మము ఈ ప్రపంచములో అన్ని ధర్మములకంటెను అత్యంత ప్రాచీనమైనదను విషయము సర్వవిదితము. మనుష్యునకు ఇహపరలోకములలో శ్రేయోదాయకమయిన ఈ ధర్మమును స్వయముగా భగవంతుడే ప్రతియొక్క యుగమునందవతరించి ఉద్దరింతునని భగవద్గీతయందు శెలవిచ్చియున్నాడు. అట్టి ఈ ధర్మమునకు మూలములైన వేద శాస్త్రములలో సకలమానవుల శ్రేయస్సు కొరకు భగవదుపాసన చెప్పబడియున్నది. మన పవిత్ర భారతదేశంలో విలసిల్లుచున్న అనేక పుణ్యక్షేత్రములలో మరియు ప్రాచీన దేవాలయములలో అనేకరూపములలో అనేకనామములతో భగవదుపాసన అనాదికాలముగ విశేషముగా ఆచరింపబడుచున్నది. ప్రస్తుతము ఆంధ్రరాష్ట్రంలో ఆస్తిక మహాజనులందరకు శ్రద్దాకేంద్రములైన కొన్ని దేవాలయములపై గత కొన్ని నెలలుగా అవిరతముగా దాడులు జరుగుచుండుట వీటికి కారకులైన వారిని గుర్తించి వారికి కఠినమైన శిక్షను విధింపకుండుట మా మనస్సుకు అత్యంత దుఃఖమును కలిగించినవి. ఇది అత్యంత ఖండనీయమైన విషయము. భగవంతుని విషయమున జరిగిన ఇట్టి అక్షమ్యమైన అపరాధములు వాటినొనర్చినవారిని జన్మ జన్మలకు ఎెంటాడి అపరిమితమైన దుఃఖమును కలిగించును. దాడులు మహాపాపములే కాక రాజ్యాంగమునకు కూడా అత్యంత విరుద్ధములు. వీటవలన దేశ ప్రజల సామరస్యమునకు భంగమేర్పడుటయే కాక అనేకవిధములైన అనిష్టములను ఎదుర్కొనవలసిన దుస్థితి కూడా రాగలదు. ఇట్టి దుశ్చర్యలను ఆరంభదశలోనే నివారించి ఇవి పునరావృత్తము కాకుండుటకు కఠినమైన చర్యలను తీసుకొనవలసిన బాధ్యత ప్రభుత్వమునకున్నది. హిందూధర్మములో అనేక సంప్రదాయ భేదములు ఉన్నప్పటికీ అవి ధర్మసంరక్షణకు విఘాతకములు కాకూడదను విషయమును చక్కగా ఆకళింపు చేసికొని ఆస్తికులందరూ ఇట్టి సందర్భమున ఐకమత్యమును ప్రదర్శించి ధర్మమును కాపాడి భగవదనుగ్రహపాత్రులై కృతార్థులగుదురుగాకయని మేమాశించుచున్నాము.

కామెంట్‌లు లేవు: