17, జనవరి 2021, ఆదివారం

ఉత్తరాయణ

 *ఉత్తరాయణ పుణ్యకాలం*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️





*"సరతి చరతీతి సూర్యః"*  అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. *"ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత"*  అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. *"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే "చేరడం" లేదా "మారడం"అని అర్థం.* సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. *జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం"సంక్రాంతి"ని* ఇలా నిర్వచించింది. *"తత్ర మేషాదిషు ద్వాదశ*

*రాశి క్రమణేషు* *సంచరితఃసూర్యస్య పూర్వన్మాద్రాశేఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః"* మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది. *"రవి సంక్రమణే ప్రాపే నన్నా యాద్యన్తు మానవఃసప్త జన్మసు రోగీ స్యానిర్దేనశే్చన జాయతే"* అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే , రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా , దరిద్రునిగా ఉండిపోతాడని భావం.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి , దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ , ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.


ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు..  ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ , ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ , సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ , ముఖ్యం గా  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ , ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.


సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని , వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని , ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

 

ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా , ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం , ఫలాలు , విసనకర్ర, వస్త్రం , కాయగూరలు , దుంపలు , నువ్వులు , చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.


*"సంక్రాంతి వైభవం"*



సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని *"ఉత్తరాయణ పుణ్యకాలం"గా* పరిగణించిన సనాతన సిద్ధాంతంలో..  ప్రకృతి పరిశీలన , దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి , కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన , శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి , సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. 

*"తిల సంక్రాంతి"గా* కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి , పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని , మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను , ఆనందాన్ని కుటుంబంతో , సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు , మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది. 


రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా , చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం , దానం , పితృతర్పణం , జపతపాలు , దేవతార్చనలు - సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు , తల్లిదండ్రులు , సాటి మనుషులు , ప్రకృతి పట్ల కృతజ్ఞతను , ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి , ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. 

కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా - మంచి వృష్టిని , ఆరోగ్యాన్ని , సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం , నువ్వుల నూనె దీపం , బియ్యం కలిపిన తిలలతో పూజ , తిలలతో కూడిన పదార్థాల నివేదన - శాస్త్రం చెప్పిన విధులు. పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక - ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా - యమునా - సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం.


ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో , స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం , శక్తి... ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. 

సూర్యుణ్ని నారాయణుడిగా ; శోభను , శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు. సంక్రాంతినాటి సూర్య శోభయే కాక , పంటల శోభ , సంపదల పుష్టి... అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు , సంప్రదాయసిద్ధమైన కళలు , ఉత్సాహాల ఉత్సవాలు , బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు.. వెరసి సంక్రాంతి వైభవాలు !

కామెంట్‌లు లేవు: