17, జనవరి 2021, ఆదివారం

వివేకానంద జయంతి :

 స్వామి వివేకానంద జయంతి : ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

  దుర్లభమగు మానవ శరీరమును దాల్చి శాశ్వతానందప్రదమగు మోక్షమును బొందుటకై సాధనయొనర్చనివాని జీవితము నిరర్థకము. నిత్యానిత్యవస్తు వివేకముచే సర్వసంగపరిత్యాగ మొనర్చి,సత్యసందర్శనైక వాంఛచే బ్రహ్మచర్య వ్రతము దాల్చి,సంసారసాగరమునుండి తాము తరించుటయే కాక పరులను తరింపజేయుటకై తమ జీవితసర్వస్వములను సమర్పించునట్టి భగవదంశసంభూతులగు మహాత్ములు సర్వజనులకును మార్గదర్శకులై వెలయుచుందురు. స్వామి వివేకానందకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. నేడు ఆయన జయంతి సందర్భంగా దేశం ఆయన్ను మరోసారి స్మరించుకుంటోంది.

పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి

భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసి యోగి వివేకానంద. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు.. ఆ వాగ్దాటి.. ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానందనే కావడం విశేషం. అందుకే ఆయన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని 'జాతీయ యువజన దినోత్సవం'గా జరుపుతోంది.

వివేకానంద జీవిత వివరాలు

స్వామివివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మించాడు. బాల్యం నుంచే ఆటలలోనూ, చదువులోనూ చురుగ్గా ఉండేవాడు. ఏకసంథాగ్రాహిగా పేరు తెచ్చుకున్న వివేకానంద జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై.. ఆ తర్వాత తత్వశాస్త్రం,పాశ్చాత్య శాస్త్రాలను అభ్యసించాడు. ఇదే క్రమంలో సత్యాన్వేషణ కోసం తన సందేహాలను అనేకమంది పండితుల ముందు పెట్టాడు. అయితే ఎవరి సమాధానాలు ఆయనకు సంతృప్తినివ్వలేదు.

సత్యాన్వేషణ కోసం

సత్యాన్వేషణ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒకసారి నరేంద్రుడు తన స్నేహితులతో కలిసి దక్షిణేశ్వర్‌లోని రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లాడు. అక్కడ ఆయన ప్రసంగాలను శ్రద్దగా ఆలకించాడు. ఆ సమయంలో రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడిపై పడింది. నరేంద్రుడిని చూసి పరమహంస తెలియని తాద్యాత్మతకు లోనయ్యాడు. ఆ తర్వాతి కాలంలో పరమహంస శిశ్యుడిగా మారిపోయిన నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసిగా.. వివేకానందుడిగా మారిపోయాడు. ఆయన బోధనలు దేశంలో ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

స్ఫూర్తినిచ్చే సూక్తులు

'ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం', 'లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి' వంటి వివేకానంద సూక్తులు ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. నేడు ఆయన జయంతి సందర్భంగా భారతీయులు ఆయన్ను మరోసారి స్మరించుకుంటున్నారు.

మరిన్ని స్వామి వివేకానంద 



వివేకానంద స్వామి

కామెంట్‌లు లేవు: