తొందరలేదు మీరు కోరింది దొరుకుతుంది పార్ట్ 3
స్వామివారు చలించలేదు. నిశ్చలంగా మౌనంగా వుండిపోయారు. చాలా సేపయాక “అలాగే పంపుతాను. భారతదేశంలోని యోగసిద్దుల్లో ఇద్దరినే నే నెరుగుదును. వారిలో యెవరైనా మీ కోరిక తీర్చగలరు. వారిలో ఒకరు వారణాసిలో వున్నారు. విశాలమైన మైదానంలోని విశాలమైన యింట్లో ఎక్కడో దాగినట్లుంటారు. వారిని కలుసుకోటం చాలా కష్టం. ఏ కొందరికో అనుమతి దొరుకుతుంది. ఏ పాశ్చాత్యుడూ ఇంతవరకు వారి సమక్షంలోకి వెళ్లలేకపోయాడనేది మాత్రం నిజం. మిమ్ము వారి దగ్గరకు పంపవచ్చు. కాని, వారు పాశ్చాత్యునికి దర్శన మివ్వరేమో అని నా భయం” అన్నారు.
“రెండోవారు?” రెట్టింపు కుతూహలంతో అడిగాను.
“దక్షిణాదిన దూరానెక్కడో వున్నారు. వారు ఉత్తమ గురువులని నే నెరుగుదును. వారి దగ్గరకు వెళ్లండి” అన్నారు. “వారిని 'మహర్షి' అంటారు. అరుణాచలంలో వారి నివాసం. అరుణాచల మంటే పొడుపుమల అని అర్థం. ఉత్తరార్కాటుజిల్లాలో వుంది. వారిని కలుసుకోటానికి కావలసిన వివరాలన్నీ యిచ్చేదా”? అని అడిగారు.
నా మనోనేత్రాల ముందు ఒకమూర్తి ఆకస్మికంగా కదిలింది.
కాషాయవస్త్రాలు కట్టిన సన్న్యాసి ఒకడు తన గురువు దగ్గరకు రమ్మని వృథాగా నాకు నచ్చచెప్పబోవటమూ, ఆ కొండ పేరు అరుణాచలమనటమూ గుర్తొచ్చాయి. “మీ కెంతో కృతజ్ఞుణ్ణి. నన్నక్కడకు తీసుకువెళ్లే వారున్నారు. వారిది ఆ ఆశ్రమమే” అన్నాను.
"అయితే మీ రక్కడికి వెళతారా?” అని స్వామి వారడిగారు.
నేను అజ్జాయించాను. “నేను దక్షిణ భారతంనుండి వెళిపోవటానికి ప్రయాణ సన్నాహాలన్నీ పూర్తిచేసుకు కూర్చున్నా”నని మాత్రం అన్నాను, ఏం చెప్పటానికీ పాలుపోక.
"అయితే, నాకొక మాటివ్వండి” అన్నారు వారు.
"తప్పకుండా” అనేశాను భరోసాగా.
“మహర్పుల వారిని సందర్శించకుండా దక్షిణాన్ని వదలి వెళ్లనని మాటివ్వండి అన్నారు.
ఎలాగైనా ఆధ్యాత్మిక మార్గంలో నాకు సాయపడాలనే కృతనిశ్చయం వారి కళ్లల్లో కనబడింది.
అలాగే వాగ్దానం చేశాను.
దయార్ద్రమైన హాసరేఖ వారి ముఖంలో తారాడింది.. “తొందరలేదు. మీరు కోరింది దొరుకుతుంది” అభయకంఠంతో అన్నారు.
వీథిలో ఏదో, సందడి వినబడింది.
“విలువైన మీ కాలం చాలా సేపు వాడుకున్నాను. మన్నించండి” అన్నాను.
గంభీరమైన వారి పెదవులు విచ్చుకున్నాయి. వెనుకగదిలోకి నాతోబాటు వచ్చి, నా సహచరుడికేదో రహస్యంగా చెప్పారు. అందులో నా పేరు వినబడింది.
తలుపు దగ్గర వారికి వీడ్కోలుగా నమస్కరించి వెనుదిరిగాను. స్వామివారు మళ్లీ పిలిచి -.
“నన్నెప్పుడూ గుర్తుంచుకోండి. మిమ్మూ నేను గుర్తుంచుకుంటాను” అన్నారు.
గూఢమైన యీ మాట లెంతో దిగ్ర్భాంతి కలిగించాయి నాకు. పసితనంనుండి జీవితాన్ని భగవంతునికే అంకితం చేసిన ఆ వింతవ్యక్తిని అయిష్టంగానే వదలి బయటికి వచ్చాను.
వారు పరమాచార్యులు. ప్రాపంచికమైన అధికారాలు లక్ష్యపెట్టనివారు. అన్నీ రోశారు. అన్నీ రోశారు. అన్నీ వదిలేశారు. మనం ఏ వస్తువు లిచ్చినా వాటిని అవసరమున్న వారికి తక్షణం ఇచ్చేస్తారు. వారి సౌమ్యసుందరమైన మూర్తిని నేను మరిచిపోను, మరచిపోలేను.
నేను విడిదికి వచ్చేసరికి దాదాపు అర్ధరాత్రయింది. తలెత్తి పైకి చూచాను. లెక్కలేనన్ని నక్షత్రాలు - వినువీథిలో క్రిక్కిరిసి కనిపించాయి. యూరప్ లో ఎక్కడా యిన్ని నక్షత్రాలు కనిపించవు. చరచరా మెట్లెక్కి వరండాలోకి వెళ్లాను. చేతిలో టార్చి వెలుగుతోంది. ఎవరో, ఆ చీకటో ఓమూర్తి నన్ను చూచి నమస్కరించింది. “సుబ్రహ్మణ్యా”! అని ఆశ్చర్యపడి పిలిచాను. కాషాయాంబరధారియైన ఆ యోగి చిరునవ్వు నవ్వారు.
“నేను మళ్లా వస్తానని చెప్పానుగా” అని మందలింపుగా గుర్తుచేశారు.
నిజమే.
పెద్దగదిలోకి వచ్చాక అడిగాను. “మీ గురువుగారిని 'మహర్షి' అంటారా”? అని.
ఆశ్చర్యపడి ఒక్కడుగు వెనక్కి వేశారు వారు.
“మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు?” అన్నారు.
“ఎవరోలెండి. రేపు మనిద్దరం వారి దగ్గరకు వెళుతున్నాం. నా ప్రయాణం మారింది” అన్నాను.
“ఎంత మంచిమాట చెప్పారు!” అన్నారు.
“ఎక్కువరోజు లుండనక్కడ, బహుశా కొన్నాళ్లు” అంటూనే ప్రశ్నలు గుప్పించాను, ఓ అరగంట దాకా. అలసిపోయి పడుకున్నాను.
సుబ్రహ్మణ్యం ఓ కొబ్బరాకు చాప మీద క్రిందే పడుకున్నారు. ఓ పలచటిగుడ్డ పరుచుకుని దాన్నే కప్పుకున్నారు. పక్కబట్ట లిస్తానంటే ఒప్పుకోలేదు.
తరువాత నాకు తెలిసిందల్లా ఎవరో తట్టితే, ఉలిక్కిపడి లేచి కూర్చోటం. చుట్టూ కటిక చీకటి. నరాలు హఠాత్తుగా బిగుసుకున్నట్లు, గాలిలో విద్యుత్తు నిండినట్లూ అనిపించి దిండు క్రిందున్న 'వాచ్' తీసి చూచాను. దానిది రేడియం డయల్. రెండూ నలభై అయిదయింది.
ఇంతలో కాళ్లవైపున ఓ మనిషి! మనిషిని చుట్టుకుని వెలుగు, మళ్ళీ ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాను. ఎదురుగా శంకరాచార్యస్వామివారు. నిశ్చయంగా స్పష్టంగా స్వామివారే! వారు లౌకికమైన అతీంద్రియమూర్తిగా లేరు. పాంచభౌతికమైన స్థూలదేహంతోనే వున్నారు. చుట్టూ దురవగాహమైన వెలుగు. ఆ రూపాన్ని నుండి వేరుచేస్తున్న వెలుగు.
ఆ దృశ్యం నిజంగా అసాధారణమైన దృశ్యం. అసంభావ్యమైన దృశ్యం అయినా కళ్ల యెదుట నిజంగా కనబడుతున్న దృశ్యం. అయితే, మరి, వారిని చెంగల్పట్టులో వదిలిరాలేదా?
కళ్లు గట్టిగా, మరీ గట్టిగా మూసుకున్నాను. అయినా ఆ రూపం స్పష్టంగా ఎదుట కనబడుతూనే వుంది. మార్పు లేదు.
సౌహార్దంతో, కారుణ్యంతో నన్ను కనిపెట్టి వుండే అండ ఒకటి దొరికిందని తృప్తిపడ్డాను. కళ్లు తెరిచాను. కాషాయాంబరధారి కనబడ్డాడు.
ముఖంలో మార్పుంది. పెదవులమీద చిరునవ్వు. నన్ను చూచి "అణకువగా వుండు. అలా వున్నావా, నీవు కోరింది దొరుకుతుంది” అన్నట్లనిపించింది.
ఓ వ్యక్తి, సజీవంగా వున్న వ్యక్తి! నాతో అన్నారని యెందుకనుకోవాలి? కనీసం, ఓదయ్యమో, భూతమో నా కలా చెప్పిందని యెందుకనుకోకూడదు?
ఆ దర్శనం ఎలా కలిగిందో రెప్పపాటులో మాయమయింది. నాకు మాత్రం, ఓ అనిర్వచనీయమైన ఔన్నత్యం, ఆనందం, తృప్తి మిగిలాయి. ఆ సంఘటనకు సంబంధించిన అలౌకికత్వాన్ని పట్టించుకోలేదు. కల అని కొట్టేసినా ఒరిగేదేముంది? జరిగింది జరిగిపోయింది.
ఆ రాత్రి మరి నిద్రపోలేదు, పగలు జరిగింది తలపోస్తూ, మేలుకునే వున్నాను. ఆ సమావేశం, ఆ సంభాషణ దక్షిణ భారతంలోని సామాన్యజనం దేవుడి వారసుడుగా కొలిచే ఆ నిరాడంబరవ్యక్తి, కళ్లల్లో కదులుతూనే వున్నారు.
--- పాల్ బ్రంటన్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం