16, ఫిబ్రవరి 2023, గురువారం

శ్రీరాముని శివలింగ ప్రతిష్ఠ

 *ॐ    శ్రీరాముని శివలింగ ప్రతిష్ఠ - శివభక్తి సందేశం* 

  

*రామచరితమానస్ - వాల్మీకి రామాయణం - కూర్మపురాణం* 


 *1. రామచరిత మానస్* 


(i) వారథి నిర్మాణాన ప్రారంభంలో శ్రీరాముడు 

   "నేనిచట పరమశివుని (శివలింగమును) ప్రతిష్ఠిస్తాను. ఇది నా సంకల్పం" 

   "కరిహఉఁ ఇహాఁ సంభు థాపనా I 

   మోరే హృదయఁ పరమ కలపనా ॥" 

    - లంకా కాండ 2/2 


(ii) శివలింగమును ప్రతిష్ఠించి, యథావిధిగా పూజించి, ఈ విధంగా పలికాడు.

* *శివునివలె ప్రియమైనవారు నాకెవ్వరునూ లేరు.* 

* *శివునకు ద్రోహము తలపెట్టి, నాకు భక్తుడనని పలికెడువాడు స్వప్నంలోకూడా నన్ను పొందజాలడు.* 

* *శంకరునకు విముఖుడై నా యెడ భక్తిని ప్రకటించువాడు మూర్ఖుడు, అల్పబుద్ధి. వానికి నరకము తప్పదు.* 

* *శంకరుని ప్రేమించి, నా యందు వైరము పూనువారును,* 

    *శంకరునికి వైరులై నాకు దాసులగు వారును కల్పాంతంవరకు రౌరవాది నరకయాతనలను అనుభవింతురు.*  

* *రామేశ్వరమును దర్శించినవారు శరీరత్యాగం చేసినపిమ్మట నా లోకమును చేరెదరు.*  

* *గంగా జలములతో శివునకు అభిషేకము చేసినవారికి సాయుజ్యముక్తి లభిస్తుంది.* 

* నిష్కాముడై కపటమును త్యజించి, శ్రీరామేశ్వరుని సేవించినవానికి శంకరుడు నా భక్తిని ప్రసాదిస్తాడు. 

* నేను నిర్మించిన ఈ సేతువును దర్శించినవాడు ఎట్టి ప్రయాస లేకుండానే సంసారసాగరాన్ని దాటతాడు. 


లింగ థాపి బిధివత కరి పూజా I 

సివ సమాన ప్రియ మోహి న దూజా ॥

సివ ద్రోహీ మమ భగత కహావా I 

సో నర సపనెహుఁ మోహి న పావా ॥ 

సంకర బిముఖ భగతి చహ మోరీ I 

సో నారకీ మూఢ మతి థోరీ ॥ 

          - లంకాకాండ చౌ 2/3,4 


సంకరప్రియ మమ ద్రోహీ, సివ ద్రోహీ మమ దాస I 

తే నర కరహిఁ కలప భరి, ఘోర నరక మహుఁ బాస ॥ 

          - లంకాకాండ దో 2 

          

జే రామేశ్వర దరసను కరిహహిఁ I 

తే తను తజి మమ లోక సిధరిహహి ॥ 

జో గంగాజలు ఆని చఢాఇహి I 

సో సాజుజ్య ముక్తి నర పాఇహి ॥

హోఇ అకామ జొ ఛల తజి సేఇహి I 

భగతి మోరి తెహి సంకర దేఇహి ॥ 

మమ కృత సేతు జొ దరసను కరిహీ I 

సో బిను శ్రమ భవసాగర తరిహీ ॥ 

          - లంకాకాండ చౌ 3/1,2 


*2. వాల్మీకి రామాయణం* 


    పుష్పక విమానంలో లంకనుంచి వస్తున్నప్పుడు, సీతమ్మకు చూపుతూ శ్రీరాముడు 


    ఈ ప్రదేశము మహిమాన్వితమైన సాగరముయొక్క తీరము. 

    దీనిని "సేతుబంధం" అని పిలుస్తారు. 

    సేతునిర్మాణం ఇక్కడినుండే ప్రారంభమైనది. 

    *ఇది ఒక మహాపుణ్యక్షేత్రం.* 

    *దీనిని దర్శించివారి సమస్త పాపాలూ నశిస్తాయి.*  

    *పూర్వం ఈ పవిత్రప్రదేశమునందే పరమశివుడు నన్ను అనుగ్రహించాడు.* 


ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః I 

సేతుబంధ ఇతిఖ్యాంతం త్రైలోక్యేనాఽభిపూజితమ్ ॥ 

ఏతత్ పవిత్రం పరమం మహాపాతకనాశనమ్ I

అత్రపూర్వం మహాదేవః ప్రసాదమ్ అకరోత్ ప్రభుః ॥ 

            యుద్ధకాండ 126/16,17 


*3. కూర్మపురాణం* 


    సేతునిర్మాణానికి ముందే శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి, చర్మాంబరధారియైన ఆ మహాదేవుని పూజించాడు. 

    అంతట ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితోగూడి ప్రత్యక్షమై శ్రీరామునకు శ్రేష్ఠమైన ఒక వరాన్ని ఇచ్చాడు. 

   "రామా! మహాపాపకృత్యాలొనర్చిన ద్విజులుసైతము నీవు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శిస్తే, వారి పాపాలన్నీ వెంటనే నశిస్తాయి. 

    *ఈ మహాసముద్రతీరాన స్నానమొనర్చి శివలింగాన్ని దర్శించినంతమాత్రాననే వారి ఇతర దోషాలూ తొలగిపోతాయి. ఇందు సందేహంలేదు.*" 

    

సేతుమధ్యే మహాదేవమ్ ఈశానం కృత్తివాససమ్ I 

స్థాపయామాస వై లింగం పూజయామాస రాఘవః ॥ 

తస్య దేవో మహాదేవః పార్వత్యా సహ శంకరః I 

ప్రత్యక్షమేవ భగవాన్ దత్తవాన్ వరముత్తమమ్ ॥ 

యే త్వయా స్థాపితం లింగం ద్రక్ష్యంతీహ ద్విజాతయః I 

మహాపాతకసంయుక్తాః తేషాం పాపం వినశ్యతి ॥ 

అన్యాని చైవ పాపాని తీరే తత్ర మహోదధేః I 

దర్శనాదేవ లింగస్య నాశం యాంతి న సంశయః ॥ 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

               భద్రాచలం

కామెంట్‌లు లేవు: