హిందువులు బహుదేవతలను పూజిస్తారా
ఇటీవల మనం తరచూఎడారి మత అజ్ఞ్యానులు హిందూ ధర్మం మీద బురజ చాల్లే ప్రయత్నంలో హిందువులు అనేక దేవతలను పూజిస్తారు, దేముడు ఒక్కడు ఉంటాడు కానీ అనేకమంది వుంటారా కాబట్టి హిందువులు అజ్ఞ్యానంలో వున్నారని వారే జ్ఞ్యానులన్నట్లు ప్రబోధిస్తుండటమే కాక హిందువులను చులకన చేస్తూ మాట్లాడటం హిందువుల మీద సవాళ్లు విసరటం చేస్తున్నారు. నిన్న కాక మొన్న పుట్టియిన వాళ్ళ మతం గొప్పదైనట్లుగా మాట్లాడటం మనం తరచూ వింటున్నాము, చూస్తున్నాము. మన హిందూ సోదరులకు హిందుత్వం మీద సరైన అవగాహనా లేకపోవడాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకొంటూ అమాయక హిందువులను మతమార్పిడి చేస్తున్నారు. కాబట్టి హిందువులారా జాగ్రత్తగా వుండండి మన ధర్మం యెక్కు గొప్పదనాన్ని తెలుసుకోండి.
ముందుగా చెప్పేది ఏమిటంటే ప్రపంచంలో మనుషులు బట్టలు కట్టుకోవటం కూడా నేర్వక ముందే మన భారతీయ సంస్కృతి ఎంతో వృద్ధి చెంది వున్నది.
మనకు వేదాలు నాలుగు, వేదాలు ఎప్పుడు పుట్టాయో ఎవ్వరికి తెలియదు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాయని చెపుతున్నారు.శుక్ల యజుర్వేద సంహితలోని నలుబదియవ అధ్యాయమునందు ఈశావా స్యోపనిషత్తు గలదు. ఇది మంత్రభాగమునకు చెందినదగుటచే దీనికి విశేష మహత్వమున్నది. ఇది ఉపనిషత్తులలో కెల్ల మొదటిదిగా పరిగణింపబడినది. శుక్లయజుర్వేదము నందలి మొదటి ముప్పదితొమ్మిది అధ్యాయములలో కర్మకాండము నిరూపింపబడినది. ఇది ఆ కాండము యొక్క అంతిమాధ్యాయము. దీనిలో భగవత్తత్త్వరూపమైన జ్ఞానకాండము నిరూపింపబడినది. దీని ప్రథమ మంత్రము (ఈశావాస్యమ్' అని ప్రారంభింపబడినందుననియ్యది 'ఈశావాస్యోపనిషత్' అని పేర్కొనబడినది.
ఈ ఉపనిషత్తులో పద్దెనిమిది మంత్రములు కలవు. ఈ ఉపనిషత్తు భగవత్స్వరూపాన్ని వివరిస్తూ మానవుడు తన జీవితాన్ని ఎలా గడపాలో తెలుపుతున్నది. మొట్ట మొదటి మంత్రము భగవత్స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. దానిని పరికించండి.
ఈశా వాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్,
తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్ ధనమ్.
జగత్యామ్ =అఖిల బ్రహ్మాండము నందు; యత్ కించ=ఏదైతే; జగత్ = జడ, చేతన స్వరూపమైన జగత్తుగలదో; ఇదమ్ = ఈ; సర్వమ్ = సమస్తమును; ఈశా= ఈశ్వ రునిచే; వాస్యమ్ =వ్యాపించియున్నది; తేన=అందుచే; త్యక్తేన త్యాగపూర్వకముగ (ఈశ్వరుని వెంట నిడుకొని); భుంజీథా= (దీనిని) అనుభవింపుము; మాగృధః=( దీనియందు) ఆసక్తుడవు గాకుండుము; (ఏలయన) ధనమ్= ధనము-సంపద-భోగ్య పదార్ధములు; కస్యస్విత్ = ఎవరిది? అనగా ఎవరిదీకాదు.
తాత్పర్యము: అఖిల బ్రహ్మాండము నందుగల చేతనా చేతన జగత్తంతయు వ్యాపించియున్నది ఈశ్వరుని చేత. అనగా ఈ జగత్తు మొత్తము ఈశ్వరుడి రూపమే కాక వేరొక్కటి కాదు. కాబట్టి ఈశ్వరునికన్నా భిన్నంగా ఇంకొకటి లేదు. అటువంటప్పుడు బహు దేవతలప్రసక్తే ఉండదు కదా? అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యము ననుభవించుచు, సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకముగ, ప్రాప్తించిన దానిని అనుభవింపుము. కాని దాని యందు ఆసక్తుడవు గాకుండుము. ఈ సంపద, ధనము, భోగ్యసామగ్రి ఎవరిది? అనగా ఎవరికీ చెందినది కాదు. అంతాఈశ్వరుడే అయి వున్నాడు అని అర్ధము.
వ్యాఖ్య: అఖిల విశ్వబ్రహ్మాండము నందుగల చరాచరాత్మకమైన జగత్తు నీ చూపుద్వారా, వినికిడి ద్వారా తెలియవచ్చు చున్నదంతయునూ సర్వాధారుడు, సర్వనియంత, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సకల కళ్యాణగుణ స్వరూపుడునగు పరమేశ్వరుని చేత వ్యాపింపబడి యున్నది; సదా, సర్వత్ర అతనిచేత పరపూర్ణమై యున్నది. (గీత.9-4) ఇందలి ఏ అంశము కూడా అతనితో రహితమైలేదు. గీత.10-39, 42) ఈ విధంగా తెలిసి ఆ పరమేశ్వరుని నిరంతరము సన్నిహితంగా భావిస్తూ సదా, సర్వదా అతనిని స్మరించుచునే నీవు ఈ జగత్తునందు త్యాగభావం కలిగి కేవలం కర్తవ్య నిర్వహణకై మాత్రమే విషయములను యధోచితముగా ననుభవింపుము. అనగా - విశ్వరూపుడగు ఈశ్వరుని అర్చించుట కొరకే కర్మలను ఆచరించుము. . విషయములందు మనస్సును చిక్కు కొననివ్వకుము. ఇందులోనే నీకు నిశ్చితమైన మేలు గలదు. (గీత.2-64; 3-9; 18–46) నిజమునకు ఈ భోగ్యపదార్ధములు ఎవరివీ కావు. మనుజుడు పొరపాటుగా వీనియందు మమతా, ఆసక్తిని పెంచుకుంటాడు (ముడి వేసుకొని కూర్చుంటాడు) ఇవన్నియును పరమేశ్వరునివే, ఆతని కొరకే వీటినుపయోగించ వలయును. (త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే) ) అని మనుజుల పట్ల వేదభగవానుడిచ్చిన పవిత్రమైన ఆదేశము నెరుగుము.(1) 846
ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే సర్వము ఈశ్వరుడే అయితే మరి మనం నిత్యం అనేక దేవి దేవతలను ప్రతిమలను ఎందుకు పూజిస్తాము. అది ఎంతవరకు సబబు అనే సందేహం ప్రతి మానవునిలో ఉదయిస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్నీ కూలంకుషంగా పరిశీలిద్దాం
మనకు ఫై శ్లోకంతో ఈ జగత్తు పూర్తిగా ఈశ్వరునిచే ఆవరించి వున్నదని తెలు.సుకున్నాం కదా. మరి మన కామ్యములు ఈడేరటానికి మనం అనేక దేవతలను ఎందుకు పూజిస్తాం అంటే దానిని మనం ఒక కార్యాలయ వ్యవస్థ ఉదాహరణతో చూద్దాం. ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఏదయినా పనివున్నదనుకోండి ఉదా: తహశీలుదారు కార్యాలయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్) కావాలనుకోండి అప్పుడు నీవు నీ దరఖాస్తుని ఆ కార్యాలయ ఇన్వార్డ్ ఔట్వేర్డ్ గుమస్తాకు అంతదాచేస్తావు. ఒక వారం రోజుల్తరువాత అతని వద్దకు వచ్చి నీ సర్టిఫికెట్ తీసుకొని పోతావు. నిజానికి నీ సర్టిఫికెట్ మీద సంతకం చేసిన అధికారి ఆ గుమస్తా కాదు తహసీల్దారు గారు. కానీ నీవు తహసీల్దారుని కలవను కూడా కలవలేదు కానీ సర్టిఫికేట్ ఆమోదించింది మాత్రం ఆయనే. అదెలా సాధ్యం అంటే తహసీల్దారు ఒక్కరు అన్ని పనులు చేయలేరు కాబట్టి ఆయన క్రింద అనేక మంది ఉద్యోగులు అయన వివిధ బాధ్యతలను నిర్వహించటానికి వున్నారు. అంటే గుమాస్తాలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దారు, అటెండర్లు ఆలా అనేక సిబ్బంది ఉండబట్టే ప్రజల సమస్యలను వారు సామూహికంగా తహసీల్దారు పేరుమీద జరుగుతున్నాయి. ఈ కార్యాలయ వ్య్వవస్థ మనకుభగవంతుని దగ్గరకుడా వున్నారు. అంటే మనం కార్యాలయ వ్యవస్థ మనం దేముళ్ళ దగ్గరనుండే అనుసరిస్తున్నాం అన్న మాట పూర్తీ జగత్తుకి భగవంతుడు ఒక్కరే అయినాకూడా వివిధ శాఖలకు వివిధ దేవి దేవతలు వున్నారు అన్నమాట.
మీకు విజ్ఞాలు కలుగకుండ ఆ శాఖకు అధిపతి వినాయకుడు, ధనానికి లక్ష్మి అమ్మవారు, దైర్యానికి పార్వతి అమ్మవారు, సృష్టి జరగటానికి బ్రహ్మ దేముడు, స్థితి కారకుడు మూర్తి, లయ కారకుడుగా పరమ శివుని ఇలా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క దేముడు ఉండి వారికి కేటాయించిన విధులను నిర్వహిస్తున్నారు. మీరు ఒక కార్యాలయంలో ఏపని కావాలంటే దానికి సంబంధించి గుమస్తా వద్దకు వెలుతారో అలానే భగవంతుని కార్యాలయంలో కూడా మీకు ఏ ఏ కోరికలకు సంబందించిన శాఖకు సంబందించిన దేముడివద్దకు వెళితే వారి వల్ల మీమీ కోరికలు తీరుతాయి. కానీ అన్నీ కూడా భగవంతుని వల్లనే అన్న విషయం మరువవద్దు.
కొందరు భక్తులు వారు కేవలం ఒక దేముడినే నిత్యం ఆరాధిస్తుంటారు మరి వారి పరిస్థితి ఏమిటి అని అడగవచ్చు, మీరు ఏ దేముడిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ రాధిస్తారో ఆ దేముడే మీకు అన్ని కోరికలను తీర్చగలడు. క్రింది శ్లోకాన్ని పరిశీలించండి.
ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం |
సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి ||
ఆకాశం నుండి జాలువారిన వర్షపు చినుకులు ఏరకంగా ఐతే సముద్రాన్ని చేరుతాయో అదేవిధంగా ఏ దేముడిని నమస్కరించినా అది కేశవునికేచందుతుంది, కాబట్టి ఎవరు ఏ ఏ రూపంలో దేముడిని ఆరాధించినా కూడా అందరి ఆరాధన ఆ భగవంతునికే చెంది వారి వారికి ఆ ఆయా రూపాలలో భగవంతుడు వారి కామ్యములను ఈడేర్చుతాడు. ఈ ప్రకృతి మొత్తం భగవంతుడే అని భావించే సాధకుడు సదా భగవంతుని సన్నిధిలోనే ఉంటాడు.
హిందూ ధర్మంలో వృక్షాలు, జంతుజాలం కూడా దేముడిగా పేర్కొని పూజించటం ఒక మహోన్నత ఉద్దేశ్యంగా కనపడుతుంది.
వృక్షాలలో దేముడు:
ఇంటిలో తులసి కోట ఉండని ఇల్లు ఉండదు, ప్రతి ఇల్లాలు ఉదయాన్నే తులసి చెట్టుని ఆరాధించటం నిత్యం ప్రతి హిందూ కుటుంబంలో చూస్తాం. ఏముంది అంతమహిమ ఈ తులసి చెట్టులో అంటే తులసి ఆకులు చక్కటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేదం చెపుతున్నది. ఆ చెట్టుపై నుండి వీచే గాలిమనలోని రుగ్మతలను తొలగిస్తుందని మన మహర్షులు ఏనాడో కనుగొని ఈ సంప్రదాయాన్ని నెలకొల్పారు.
తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని, దాని తో ఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవిత్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది .
యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా: యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం
మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవత లు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తు న్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్న విషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్ల నే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.
రావి
దేవతా వృక్షాల్లో రావి (అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది
మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణ! అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:
ఈ వృక్షం మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భం లో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతు న్నాయి. ఆయన ఆ చెట్టుగా మారాడని పురాణాలు చెబుతు న్నాయి. రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నర కడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహా పాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.
వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్ల నే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మల ను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చది వి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం
అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా గృహ్లామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్
మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ రాకంగా ఇంకా అనేక రకాల వృక్షాలను దేవి దేవతలుగా భావించటం, కొన్ని చెట్ల పాత్రలను, పుష్పాలను దేముళ్లను పూజించటానిని మనం నిత్యం ఆచరిస్తువున్నాం.
జంతువులలో కూడా దేముళ్ళు:
హిందూ సనాతన ధర్మంలో జంతువులను కూడా పూజించే ఆచారం వుంది.
ఏనుగు మనకు వినాయకుడు, ఎలుక ఆయన వాహనంగా పూజించబడుతున్నాయి. సర్పాలు సుబ్రహ్మణ్యస్వామిగా, సింహం నరసింహంగా, కోతిని ఆంజయస్వామిగా, పందిని వరాహస్వామిగా, తాబేలును శ్రీ కూర్మంగా, ఇలా చెప్పుకుంటూ పొతే అనేక విధాలుగా మనం పూజలు చేస్తున్నాము. ఆవును సాక్షాత్తు కామధేనువుగా పూజించటమే కాకుండా ఆవు, పేడ మూత్రం, పాలు హిందువులు ఔషదాలుగా భవిస్తూ రోజు ఎంతో పవిత్రంగా సేవిస్తున్నారు.
మనుషులు కూడా దేముళ్ళే
ప్రతి హిందువు తన జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దేవతలుగా పూజిస్తూ సేవిస్తారు. విద్యనేర్పిన గురువులను, అతిధులను కూడా దేముడిగా చూసే సాంప్రదాయం హిందువులది.
సర్వ-భూతేషు యః పశ్యేద్ భగవద్-భావం ఆత్మనః
భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః ( గీత . 11.2.45)
“భగవంతుడినే అంతటా చూసేవాడు, అందరిలో భగవంతుడినే చూసేవాడే, అత్యుత్తమ భాగవతుడు (ఆధ్యాత్మికవేత్త)” భగవంతుని యందే ఎల్లప్పుడూ మనస్సు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు, యజ్ఞము ఆచరించే వాడు, యజ్ఞ ద్రవ్యము, హోమ పరికరాలు, హోమ అగ్ని, యజ్ఞ ప్రక్రియ, ఇవన్నీ భగవంతుని కంటే అబేధమైనవే.కాబట్టి సదా సాధకుడు తానూ చూసేది, వినేది అంతా భగవత్ స్వరూపంగానే భావిస్తాడు.
ఇప్పుడు చెప్పండి హిందువులు అనేక దేముళ్ళను పూజిస్తారా?
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
భార్గవ శర్మ