18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*నిత్య పారాయణ శ్లోకాలు*



*ప్రభాత శ్లోకం :*


కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !

కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!


*ప్రభాత భూమి శ్లోకం :*


సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !

విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!


*సూర్యోదయ శ్లోకం :*


బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!


*స్నాన శ్లోకం :*


గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!


*భస్మ ధారణ శ్లోకం :*


శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !

లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!


*భోజనపూర్వ శ్లోకం :*


బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!


అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !

ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!


త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !

గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!


*భోజనానంతర శ్లోకం :*


అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !

ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!


*సంధ్యా దీప దర్శన శ్లోకం :*


దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!


*నిద్రా శ్లోకం :*


రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !

శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!


*కార్య ప్రారంభ శ్లోకం :*


వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!


*గాయత్రి మంత్రం :*


ఓం భూర్భువస్సువ: ! తథ్స’వితుర్వరే’ణ్యం !

భర్గో దేవస్య’ ధీమహి ! థియో యోన: ప్రచోదయా’’త్ !!


*హనుమ స్తోత్రం :*


మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!


బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !

అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!


*శ్రీరామ స్తోత్రం :*


శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే 

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే


*దక్షినామూర్తి శ్లోకం :*


గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!


*అపరాధ క్షమాపణ స్తోత్రం :*


అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !

దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!


కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా 

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !


విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ 

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!


కాయే వాచా మనసేంద్రియైర్వా 

బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !


కరోమి యద్యత్సకలం పరస్మై 

నారాయణాయేతి సమర్పయామి !!


ఓం సహ నా’వవతు ! స నౌ’ భునక్తు ! సహవీర్యం’ కరవావహై !

తేజస్వినావధీ’ తమస్తు మా వి’ద్విషావహై !!


ఓం శాంతి: శాంతి: శాంతి: !!



 *గళం : గౌతమి* 🎙️

విలువ... యధార్థము

 .....


శ్రీ ఆది శంకరాచార్యుల వారు శిష్యులతో కలసి కాశి 

విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు. గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట..“నేను మూడు దోషములు చేశాను, నన్ను క్షమించండి” అని ప్రాధేయ పడ్డారు.. ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపమలు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు అని అనుకున్నారు. ఒక శిష్యుడు, ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని.. ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు...


1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేస్వరుడిని చూడడానికి మట్టుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను. అది నేను చేసిన మొదటి దోషము“.


2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే, అప్రాప్య మనసా సః”.. భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు.. ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు.


.....


3. నిర్వాణ శతకం లో.. “న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం, న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః".. అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను. ఇది నేను చేసిన మూడవ తప్పు. అని సమాధానమిచ్చారు..


అర్థము :


నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు, వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు.. నేను చిదానంద స్వరూపుడను, శివుడను..


ఇంత వ్రాసికుడా నేను తీర్త యాత్రలు చేస్తున్నాను.

అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.


నీతి :


మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది. బైట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కూడా చూస్తారు.


*“మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం..”*

ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధి తో ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము...

దేశ భాషలందు తెలుగులెస్స

 *ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు.*


మనం చాలా పదప్రయోగాలు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోతూ మర్చిపోతున్నాం.


 1.కలకల 2.కిలకిల 3.గలగల. 4.విలవిల. 5.వలవల. 6.మలమల. 7.వెలవెల. 8.తళతళ. 

9.గణగణ. 10.గునగున 

11.ధనధన. 12.ఝణఝణ. 13.కణకణ. 14.గడగడ. 15.గుడగుడ. 16.దడదడ. 17.కిటకిట. 18.గటగట. 19.కటకట. 20.పటపట. 21. కితకిత

22.గిలి గిలి. 23.కిచకిచ. 24.జిబ జిబ. 25.చక చక. 26.పక పక. 

27.మెక మెక 28.బెక బెక. 29.నకనక. 30.చురచుర. 31.చిరచిర. 32.బిరబిర. 33.బుర బుర. 34.పరపర. 35.జరజర. 36.కర కర. 37.బరబర. 38.చర చర. 39.గజగజ. 40.తపతప. 41.టపటప. 42.పదపద. 43.గబగబ. 44.గుసగుస.. 45.కువకువ..

 46.ఠవఠవ 47.చిమచిమ. 48.గురగుర. 49.కొరకొర. 

50.భుగభుగ. 

51.భగభగ. 52.ఘుమఘుమ. 53.ఢమఢమ. 54.దబదబ. 55.కుహుకుహు. 


అందుకే.......

..

అనుబంధాలు

 అనుబంధాలు రెండు రకాలు. 🙏మర్కట - కిషోర న్యాయం మార్జాల - కిషోర న్యాయం .

మర్కట - కిషోర న్యాయం :- కోతి 🦧తన పిల్లలని ఒక చోటి నించి మరో చోటికి తీసుకు వెళ్ళేటప్పుడు కోతి పిల్ల తల్లి కోతి పొట్టని గట్టిగ పట్టుకుని ఉంటుంది . ఇక్కడ పట్టుకోవలసిన బాధ్యత పిల్లది తప్ప తల్లిది కాదు.

మార్జాల-కిషోర న్యాయం :- పిల్లి 🐈తన పిల్లలని ఒక చోట నించి మరో చోటికి ఒక దాని తరవాత ఒక పిల్లని జాగ్రత్తగా నోట కరిచి తీసుకు వెళ్తుంది . ఇక్కడ పిల్లని మోయాల్సిన బాధ్యత తల్లిది కానీ పిల్లది కాదు .

ఇక్కడ ఏది మంచిది ఏది చెడ్డది అన్న వాదన కాని పోలిక కానీ అక్కర్లేదు. సృష్టి ధర్మం ప్రకారం రెండు న్యాయాలు సరి అయినవె. సమయానుకూలంగా ఆ ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కరు  పాటిస్తే ఎటువంటి అనుబంధమైన కలకాలం నిలిచి ఉంటుంది. ఇట్లు: కరణం శేష శయన రావు.🌱🙏

॥శ్రీ గణేశాయనమః॥


1)విఘ్నేశ విఘ్నచయఖణ్డననామధేయ శ్రీశఙ్కరాత్మజ సురాధిపవన్ద్యపాద । దుర్గామహావ్రతఫలాఖిలమఙ్గలాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 


 2)సత్పద్మరాగమణివర్ణశరీరకాన్తిః శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుఙ్కుమశ్రీః । దక్షస్తనే వలయితాతిమనోజ్ఞశుణ్డో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 


 3)పాశాఙ్కుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భిర్దోర్భిశ్చ శోణకుసుమస్రగుమాఙ్గజాతః । సిన్దూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 



 4)కార్యేషు విఘ్నచయభీతవిరఞ్చిముఖ్యైః సమ్పూజితః సురవరైరపి మోదకాద్యైః । సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 


 5)శీఘ్రాఞ్చనస్ఖలనతుఙ్గరవోర్ధ్వకణ్ఠస్థూలోన్దురుద్రవణహాసితదేవసఙ్ఘః । శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుఙ్గతున్దో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 


 6)యజ్ఞోపవీతపదలంభితనాగరాజో మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః । భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 


 7)సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుమ్భచారువసనద్వయ ఊర్జితశ్రీః । సర్వత్రమఙ్గలకరస్మరణప్రతాపో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 


 8)దేవాన్తకాద్యసురభీతసురార్తిహర్తా విజ్ఞానబోధేనవరేణ తమోపహర్తా । ఆనన్దితత్రిభువనేశు కుమారబన్ధో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 


ఇతి మౌద్గలోక్తం విఘ్ననివారకం సిద్ధివినాయకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

ఈశ గిరీశ నరేశ

 ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయభూషణ భో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪ ||


ఉమయా దివ్యసుమంగళవిగ్రహయాలింగితవామాంగ విభో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౫ ||


ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౬ ||


 శివాయ నమ ఓం శివాయ నమః శివాయ నమ ఓం నమశ్శివాయ 


 ఋషివరమానసహంస చరాచరజననస్థితిలయకారణ భో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౭ ||


అంతఃకరణ విశుద్దిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౪ ||


కరుణావరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో న హి భో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౬ ||


 శివాయ నమ ఓం శివాయ నమః శివాయ నమ ఓం నమశ్శివాయ 


జయ కైలాశనివాస ప్రమథగణాధీశ భూసురార్చిత భో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౩ ||


ఝణుతకఝంకిణుఝణుతత్కింటతక-శబ్దైర్నటసి మహానట భో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౪ ||


ధర్మస్థాపనదక్ష త్ర్యక్ష గురో దక్షయజ్ఞశిక్షక భో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౪ ||


 శివాయ నమ ఓం శివాయ నమః శివాయ నమ ఓం నమశ్శివాయ 


బలమారోగ్యం చాయుస్త్వద్గుణరుచితాం చిరం ప్రదేహి విభో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౮ ||


భగవన్భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాంగ విభో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౯ ||


సర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్తగర్వహరణ విభో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౫ ||


 శివాయ నమ ఓం శివాయ నమః శివాయ నమ ఓం నమశ్శివాయ 


సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేత్యేతల్లక్షణలక్షిత భో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౭ ||


హాహాహూహూముఖసురగాయకగీతాపదానపద్య విభో |

సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౮ ||


 శివాయ నమ ఓం శివాయ నమః శివాయ నమ ఓం నమశ్శివాయ

వసుదేవసుతం దేవం

 వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |

దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ ||


అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |

రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౨ ||


కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |

విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౩ ||


మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |

బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || ౪ ||


ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |

యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || ౫ ||


రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |

అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || ౬ ||


గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |

శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || ౭ ||


శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |

శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || ౮ ||


కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |

కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||

సుబ్రహ్మణ్య కరావాలంబ స్తోత్రం:

హే స్వామినాథ కరుణాకర దీనబంధో,

శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |

శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||


దేవాదిదేవనుత దేవగణాధినాథ,

దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |

దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||


నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,

తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |

శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||


క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,

పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |

శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||


దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||


హారాదిరత్నమణియుక్తకిరీటహార,

కేయూరకుండలలసత్కవచాభిరామ |

హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||


పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||


శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,

కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |

భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||


సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |

తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |

సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |

కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||


***********************

కామాక్షీ స్తోత్రం🙏

కల్పనోకహ పుష్పజాల విలసన్నీలాలకాం మాతృకాం

కాంతాం కంజదళేక్షణాం కలిమల ప్రధ్వంసినీం కాళికాం

కాంచీనూపురహార హీరసుభగాం కాంచీపురీనాయకీం 

కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ || ౧ ||

 

మాయామాదిమకారణం త్రిజగతామారాధితాంఘ్రిద్వయా-

-మానందామృతవరిదాసి జగతాం విద్యాం విపద్దుఃఖహాం

మాయామానుషరూపిణీ మణులసన్మధ్యాం మహామాతృకాం 

కామాక్షీం గజరాజ మందగమనాం వందే మహేశప్రియామ్ || ౨ ||

 

కాశాభాం శుకసుప్రభాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం

చంద్రార్కానలలోచనాం సురచితాలంకారభూషోజ్జ్వలాం

బ్రహ్మ శ్రీపతి వాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం

కామాక్షీం పరిపూర్ణచంద్రవదనాం వందే మహేశప్రియామ్ || ౩ ||

 

ఐం క్లీం సౌమితియాం వదంతి మునయస్తత్వార్థరూపాం పరాం 

వాచామాదిమకారణాం హృది సదా ధ్యాయంతి యాం యోగినః

బాలాం ఫాలవిలోచనాం నవజపావర్ణాం సుషుమ్నాలయాం 

కామాక్షీం సకలార్తిభంజనపరాం వందే మహేశప్రియామ్ || ౪ ||

 

యత్పాదాంబుజరేణులేశమనిశం లబ్ద్వా విధత్తే విధిః

విశ్వం తత్పరిపాతి విష్ణురఖిలం యస్యాః ప్రసాదాచ్చిరం

రుద్రస్సంహరతి క్షణాత్తదఖిలం యన్మాయయా మోహితం 

కామాక్షీమతిచిత్రచారుచరితాం వందే మహేశప్రియామ్ || ౫ ||

 

వాగ్దేవీమితి యాం వదంతి మునయః క్షీరాబ్ధికన్యామితి

క్షోణీభృత్తనయామితి శ్రుతిగిరో యామామనంతి స్ఫుటమ్

ఏకామేవ ఫలప్రదాం బహువిధాకారాం తనుం బిభ్రతీం 

కామాక్షీం కవిభిర్నుతాం చ సుభగాం వందే మహేశప్రియామ్ || ౬ ||

 

సూక్ష్మాం సూక్ష్మతరాం సులక్షితతనుం క్షాంతాక్షరైర్లక్షితాం

వీక్షాశిక్షితరాక్షసాం త్రిభువనక్షేమంకరీమక్షరాం  

సాక్షాల్లక్షణలక్షితాక్షరమయీం దాక్షాయణీం సాక్షిణీం

కామాక్షీం శుభలక్షణైస్సులలితాం వందే మహేశప్రియామ్ || ౭ ||

 

హ్రీంకారాత్మకమాతృవర్ణపఠనాదైంద్రీం శ్రియం తన్వతీం 

చిన్మాత్రాం భువనేశ్వరీమనుదినం భిక్షాప్రదానక్షమాం

విశ్వాఘౌఘనివారిణీం విజయినీం విశ్వంభరాం పార్వతీం 

కామాక్షీమమృతాన్నపూర్ణకలశాం వందే మహేశప్రియామ్ || ౮ ||

 

ఓంకారాంకణవేదికాముపనిషత్ప్రాసాదపారావతాం

ఆమ్నాయాంబుధిచంద్రికా మఘతమః ప్రధ్వంసినీం సుప్రభాం

కాంచీపట్టణపంజరాంతరశుకీం కారుణ్యకల్లోలినీం 

కామాక్షీం శివకామరాజమహిషీం వందే మహేశప్రియామ్ || ౯ ||

 

కాంతాం కామదుఘాం కరీంద్రగమనాం కామారివామాంకగాం

కల్యాణీం కలితాలకాళిసుభగాం కస్తూరికాచర్చితాం

కంపాతీరరసాలమూలనిలయాం కారుణ్యకల్లోలినీం

కామాక్షీం సుఖదాంచమే భగవతీం కాంచీపురీదేవతామ్ || ౧౦ ||

 

స్నాత్వాక్షీరాపగాయాం సకలకలుషహృత్సర్వతీర్థే ముముక్షుః

లక్ష్మీకాంతస్య లక్ష్మ్యా వరదమభయదం పుణ్యకోటీవిమానే

కామాక్షీం కల్పవల్లీం కనకమణిభాం కామకోటీ విమానే

కాంచ్యాం సేవేకదాహం కలిమలశమనీం నాథమేకాంబ్రనాథమ్ || ౧౧ ||

 

చూళీచుంబితకేతకీదళశిఖాం చూతప్రవాళాధరాం 

కాంచీశింజితకింకిణీముఖరిణీం కాంచీపురీనాయకీం

కారుణ్యామృతవాహినీముపనమద్గీర్వాణనిర్వాణదాం

కామాక్షీం కమలాయతాక్షి మధురామారాధయే దేవతామ్ || ౧౨ ||

 

పక్వాన్నప్రతిపాదనాయ పదయోర్నాదేన మంజీరయో-

-రార్తానామఖిలంధనం తనుభృతామాహూతిమాతన్వతీ

ఏకాంబ్రస్థలవాసినః పశుపతేరేకాంతలీలాసఖీ

కంపాతీర తపశ్చరీ విజయతే కాంచీపురీదేవతా || ౧౩ ||

 

కస్తూరీ ఘనసారకుంకుమలసద్వక్షోజకుంభద్వయాం

కేయూరాంగదదివ్యరత్నవిలసద్భూషోజ్జ్వలాం సుస్మితాం 

కాంచీధామ నిబద్ధ కింకిణిరవైర్భక్తాఘభీతాపహాం

కామాక్షీం కరిరాజ మందగమనాం వందే గిరీశప్రియామ్ || ౧౪ ||

 

కామాక్షీం కుటిలాలకాం ఘనకృపాం కాంచీపురీదేవతాం

ఏకామ్రేశ్వర వామభాగనిలయాం మృష్టాన్నదాం పార్వతీం

భక్తానామభయప్రదాంబుజ కరాం పూర్ణేందుబింబాననాం

కంఠే కాంచనమాలికాం శివసతీమంబామజస్రం భజే || ౧౫ ||

 

కేయూరాంగదదివ్యరత్నవిలసద్భూషోజ్జ్వలాం సుస్మితాం

కోటీరేవిలసత్సుధాంశు శకలాం కోకస్తనీం కోమలాం

హస్తాబ్జే కమనీయకాంచనశుకాం కామారిచిత్తానుగాం

కామాక్షీం నితరాం భజామ వరదాం కాంచీపురీదేవతామ్ || ౧౬ ||

 

వందే శంకరభూషణీం గుణమయీం సౌందర్యముద్రామణిం

వందే రత్నవిభూషణీం గుణమణిం చింతామణిం సద్గుణాం

వందే రాక్షసగర్వసంహరకరీం వందే జగద్రక్షణీం

కామాక్షీం కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ || ౧౭ ||

 

హేరాణీ గిరిజే త్రిమూర్తి విభవే నారాయణీ శంకరీ

గౌరీ రాక్షసగర్వసంహరకరీ శృంగారహారాధరీ 

శ్రీకైలాసనివాసినీ గిరిసుతా వీరాసనే సంస్థితా

కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ || ౧౮ ||

 

ఛందోభాషితశంకరీ ప్రియవధూర్దేవైస్సదా శోభితా

లక్ష్మీ కేశవయోర్విభాతి సదృశా వాణీవిధాత్రోస్సమా

మాణిక్యోజ్జ్వలపాదపద్మయుగళధ్యానే సదా శోభితా

కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ || ౧౯ ||

 

గంధర్వైశ్శృతిభిస్సదాఽసురసురైర్బ్రహ్మాదిదిగ్పాలకైః

వేదైశ్శాస్త్రపురాణవిప్రపఠితై స్తోత్రైస్సదా ధ్యాయినీ

సర్వేషాం సకలార్థ్యభీష్టఫలదాం స్తోతుస్సదా పార్వతీ

కామాక్షీ కరుణాకటాక్షవిభవీమంగీకరీ పాహిమామ్ || ౨౦ ||

 

కాంచీపురాధీశ్వరి కామకోటికామాక్షి కంపాతటకల్పవల్లి

ఏకాంబ్రనాథైకమనోరమేత్వమేనం జనం రక్ష కృపాకటాక్షైః ||


***********************

 సూర్య మండల స్తోత్రం 


నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే

సహస్రశాఖాన్విత సంభవాత్మనే |

సహస్రయోగోద్భవ భావభాగినే

సహస్రసంఖ్యాయుధధారిణే నమః || 1 ||


యన్మండలం దీప్తికరం విశాలం |

రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |

దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 2 ||


యన్మండలం దేవగణైః సుపూజితం |

విప్రైస్తుతం భావనముక్తికోవిదమ్ |

తం దేవదేవం ప్రణమామి సూర్యం |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 3 ||


యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |

త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

సమస్త తేజోమయ దివ్యరూపం |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 4 ||


యన్మండలం గూఢమతి ప్రబోధం |

ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |

యత్సర్వ పాపక్షయకారణం చ |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 5 ||


యన్మండలం వ్యాధివినాశదక్షం |

యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 6 ||


యన్మండలం వేదవిదో వదంతి |

గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |

యద్యోగినో యోగజుషాం చ సంఘాః |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 7 ||


యన్మండలం సర్వజనైశ్చ పూజితం |

జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |

యత్కాల కాలాద్యమరాది రూపం |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 8 ||


యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |

యదక్షరం పాపహరం జనానామ్ |

యత్కాలకల్పక్షయకారణం చ |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 9 ||


యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |

ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |

యస్మిన్ జగత్సంహరతే ఖిలం చ |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 10 ||


యన్మండలం సర్వగతస్య విష్ణోః |

ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |

సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 11 ||


యన్మండలం వేదవిదోపగీతం |

యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |

తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 12 ||


సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |

సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||


ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం.. ||

ప్రదోషకాల శివస్మరణ ముక్తిదాయకము🙏

     స౦ధ్యాసమయ౦ పూర్తి అవుతూ రాత్రి వస్తూన్న సమయాన్ని ప్రదోష౦ అ౦టారు. దోష౦ అ౦టే రాత్రి, ప్ర అ౦టే ప్రార౦భదశ. రాత్రికి ప్రార౦భము. ప్రభాతము అనగా ఉదయ కాలము. ప్రదోషము అనగా సాయ౦కాల౦. ఈ ప్రదోషకాల౦లో పరమేశ్వరుని ఆరాధి౦చాలి అని శాస్త్ర౦ మనకి చెప్తో౦ది. ఆ సమయ౦లో ఈశ్వరారాధన విశేష౦. రాత్రి అనేది అ౦తర్ముఖత్వానికి, పగలు బహిర్ముఖత్వానికి స౦కేత౦. కర్మకు స౦బ౦ధి౦చినది పగలును తెలియచేస్తు౦ది. జ్ఞానానికి స౦బ౦ధి౦చినది రాత్రికి తెలియచేస్తు౦ది. "యా నిశా సర్వభూతానామ్ తస్యా౦ జాగర్తి స౦యమీ! యస్యా౦ జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః!!" మన౦దర౦ దేన్లో నిద్ర పోతామో యోగి దానిలో మేల్కొ౦టాడు. దీని అ౦తరార్ధ౦ ఏమిట౦టే మన౦ భగవద్విషయ౦లో నిద్రపోతాము. ప్రప౦చ౦ విషయ౦లో మేల్కొ౦టా౦. యోగి ప్రప౦చ౦ విషయ౦లో నిద్రపోతాడు. భగవద్విషయ౦లో మేల్కొ౦టాడు. ఈస్థితికి ప్రదోష౦ అని పేరు. ఈ సమయ౦లో శివుని తప్ప ఇ౦కో దేవతను ఆరాధి౦చరాదు అని కూడా శాస్త్ర౦ చెబుతో౦ది. ఎ౦దుక౦టే ఆ సమయ౦లో వార౦దరూ శివతా౦డవ౦ చూస్తూ ఆన౦దమయులై ఆయనలో లీనమవుతారట. ఆసమయ౦లో శివుని ఆరాధిస్తే సర్వ దేవతలను ఆరాధి౦చిన ఫలిత౦ లభిస్తు౦ది. జాతక౦లో  దోషాలు పోతాయి

****************

అధికమాసాదిదోషములు

 గర్భాదిప్రాశనాంతాని ప్రాప్తకాలం న లంఘయేత్  

అను న్యాయముచే!? అధికమాసాదిదోషములు.. మౌఢ్యాది దోషాలు.. సంవత్సరాశౌచ దోషాలు.. 

ఈ ఆరు సంస్కారములకు ఉండకపోవటంచే చేయమని చెప్పటం,.... 

.............. 

[ఈ న్యాయము ఇతరసంస్కారములకు వర్తించకపోవటంచే వద్దని చెప్పటం జరిగినది...] 🙏💖🌷



గర్భాధాన

పుగ్ంసవన

సీమంతోన్నయన

జాతకర్మ

నామకరణ

అన్నప్రాశనాదులు చేసుకోవచ్చు...



¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡¡


నామకర్మద్విజైఃకుర్యాత్,

ఆసంవత్సరం నైవదోషో

మూఢయోర్గురుశుక్రయోః|

మలమాసేపితత్కుర్యాత్

ఉక్త కాలే నదోషభాక్ ||

....శిశువు పుట్టిన పదవరోజు నుండి సంవత్సర పర్యంతమూ వారివారి సంప్రదాయముననుసరించి నామకరణము  చేయవచ్చును.గురుశుక్రమౌఢ్యదోషముగానీ అధికమాస దోషముగానీ లేదని వసిష్ఠుడు చెప్పినట్టుగా..ధర్మప్రవృత్తి గ్రంథం 115 లో ఉంది.

...మరియు నక్షత్రవిచారముతో పనిలేదని జ్యోతిర్నబంధమను జ్యోతిషగ్రంథం లో ఉన్నట్టు భారతీయ సంస్కారముల అను గ్రంథంలో 121 వ పేజీ లో ఉంది.

..."దశమ్యాం" అను పదమునకు "అతీతే దశరాత్రేతు కర్తవ్యే జాతనామనీ"అను అర్థం అన్వయం చేసుకొనవచ్చును.అందువల్ల ఎప్పుడైననూ నామకరణముచేయుటకు తిథితోగానీ నక్షత్రముతో గానీ వారముతో గానీ ప్రతిబంధకము ఉండదని భావము.....

నవగుంజర

 నవగుంజర ఇది ఎప్పుడైనా విన్నారా????

ఇది ఇక జంతువు, ఇది 9 జంతువులుగా మారగలదు, కనిపించగలదు. మహాభారతంలో దీని పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి అవతారం అయిన మృగంగా ఇది వస్తుంది. ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో ఆ పరమాత్మ గీతలో కూడా చెప్పబడింది.


ఒడియాలో మహాభారతాన్ని Poet సరళదాసగారు రాశారు. అందులో ఈ నవగుంజర యొక్క గోప్పత్తనాన్ని వర్ణించాడు. ఒకప్పుడు, ఎప్పుడైతే అర్జునుడు ఒక కొండ మీద తపస్సు చేయగా అప్పుడు విష్ణుమూర్తి ఈ నవగుంజర రూపం లో ప్రత్యక్షమయ్యాడు.


నవగుంజర అనేది ఇలా ఉంటుంది.దీని తల కోడిలాఉండి, మొత్తం నాలుగు కాళ్లతో ఉంటుంది. అందులో మూడు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. ఆ కాళ్లు ఎలా ఉంటాయంటే, వరుసగా ఏనుగు కాలు, పులి కాలు, గుర్రంకాలు, నాలుగవ కాలు మాత్రం ఒక మనిషి చేతిగా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది. దాని మెడ నెమలి మెడలా, తల పైభాగంలో ఒక దున్నపోతులా, పూర్తి వెనక భాగం ఒక సింహములా దాని తోక పాములా ఉంటుంది. దీనినే నవగుంజర అంటారు....        

మంచి విషయాలు అందరికీ తెలుపుదాం, జ్ఞానాన్ని పంచుదాం.

51వ పద్యం


శా.

ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ర్పేక్షాధ్వనివ్యంగ్య శ

బ్దాలంకార విశేషభాషల కలభ్యంబైన నీ రూపమున్

జాలుంజాలు గవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో

ఛీ! లజ్జింపరుగాక మాదృశ కవుల్, శ్రీకాళహస్తీశ్వరా!

50వ పద్యం


మ.  

జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము

ల్కల శబ్దధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తుల్ మెఱుం

గులు నైవేద్యము మాధురీమహిమగా గొల్తు న్నినున్ భక్తి రం

జిల దివ్యార్చన గూర్చినేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా!

శ్రీలలిత ఆవిర్భావము – నేపథ్యము

సహస్రనామ స్తోత్రములు చాలావరకు వ్యాసప్రోక్తములు. శ్రీలలితాసహస్రనామ స్తోత్రము మిగిలిన సహస్రనామస్తోత్రముల వంటిది కాదు. సాక్షాత్తుగా అమ్మవారే వశిన్యాది దేవతల చేత పలికించింది. అమ్మవారే ఫలశ్రుతిని కూడా చెప్పింది. ఒక పెద్ద దేవతాసభలో చెప్పిన లలితాసహస్రనామ స్తోత్రమును వ్యాసభగవానుడు బ్రహ్మాండపురాణములో మనకి అందించాడు. 

లలితాసహస్రనామ స్తోత్రము ఆవిర్భావము వెనక చాలా పెద్ద నేపథ్యము ఉన్నది. తారకాసుర సంహారము జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మించాలి. పార్వతీదేవియందు పరమశివుడు అనురక్తతను పొందడము కోసము మన్మధుడు తన పుష్పబాణములను విడిచి పెట్టాడు. కృద్ధుడైన శివుడు మూడవనేత్రము తెరిస్తే అందులోనుంచి వచ్చిన అగ్నిజ్వాలలో మన్మధుని శరీరము దగ్ధమై పెద్దభస్మరాశి కింద పడింది. మన్మధ బాణములు పడితే పార్వతీ పరమేశ్వరులకు అనురాగము కలుగుతుందని దేవతలు ఆశించారు. మన్మధదహనము జరిగింది. చిత్రకర్మ అనే ఆయన ఆప్రాంతమునకు వచ్చి తెల్లగా ఉన్న బూదికుప్పను చూసాడు. ఆయన కంటికి అందముగా కనపడింది. దానితో ఒక బొమ్మను చెయ్యాలనుకుని తయారు చేసాడు. దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది పరమశివుడు రుద్రమూర్తయి తన మూడవకన్ను తెరిస్తే భస్మమైన మన్మధుని బూది. అందులోనుంచి తయారయిన వ్యక్తి వ్యగ్రతతో ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి బ్రహ్మగారు ‘భండ భండ’ అన్నారు. ఆయనతో పాటుగా విషంగుడు, విశుక్రుడు అని ఇద్దరు జన్మించారు. సోదరులతో భండుడు లోకములను బాధ పెట్టసాగాడు. ఈ లోకములో ఎవరైనా తన ఎదురుగా నిలబడిన వాళ్ళ బలములో సగము బలము ఆయనకు వచ్చేట్లుగా భండుడు రుద్రుని వలన వరము పొందాడు. రాక్షసులకు ఇటువంటి వాడే కావాలి. వారందరూ వచ్చి తమ నాయకునిగా మూర్ధాభిషిక్తుడిని చేసారు. వాళ్ళు ముగ్గురు రాక్షసులకు నాయకులు అయ్యారు. భండుడు ఈవిధముగా భండాసురుడు అయ్యాడు. 

భండాసురునికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అని నలుగురు భార్యలు. విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు ఒకచోట సమావేశమయ్యి మనము ఎలా జన్మించాము అన్నది పక్కన పెట్టి మనలను ఆశ్రయించిన వాళ్ళు, మనము, సుఖములు భోగములు అనుభవించడము చాలా బాగున్నది. మనలను నాయకులుగా అంగీకరించని యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్యజాతితో సహా ఎన్నో జాతులు లోకములో మనలను నాయకులుగా అంగీకరించడము లేదు. వీళ్ళు భోగములు అనుభవించడానికి వీలులేదని వాళ్ళు ఒక ఆలోచన చేసారు. సుఖములన్నిటికీ ఆలవాలము ఎక్కడ ఉన్నదో చూసి దానిని నిర్వీర్యము చేద్దాము. భండుడు స్వర్గమునకు, విశుక్రుడు భూలోకమునకు, విషంగుడు రసాతలమునకు సూక్ష్మశరీరముతో వెళ్ళి పురుషులకు పుంసత్వమును, స్త్రీలకు రసోత్పతనము రేతస్సు లేకుండా చేస్తే, స్త్రీపురుషుల మధ్య భోగేశ్చ ఉండదు. ప్రత్యుత్పత్తి లేక మనుష్య జాతులు తమంత తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకు జంతులోకము నశించిపోతుంది, దేవతలు నశించిపోతారు. మనసుని సంతోషముగా ఉంచుకోవడమన్న ప్రశ్న లేనప్పుడు లలితకళలు నశించిపోయి ప్రతివారు నీరసపడిపోతారు. భోగేశ్చ కలిగిన రాక్షసులు తప్ప ఎవ్వరూ మిగలకూడదు. మనము మాత్రమే భోగము అనుభవించాలని చిత్రమైన ఆలోచన చేసారు. ఆ కోరిక ఎంతో దూరము వెళ్ళింది. ముగ్గురూ బయలు దేరి సమస్తలోకములలో అన్ని జాతులవారికి పుంసత్వము లేకుండా, స్త్రీలలో రసత్వము – రేతస్సు లేకుండా చేసారు.


రసయేవ పరంబ్రహ్మ రసయేవ పరాగతిః

రసోఽహికాంతితత్ పురుషాం రసోరేత ఇతిస్మృతః  


మనుష్యులలో ఈశ్వరానుగ్రహము వలన పెరిగే వీర్య రేతస్సులే కాంతిగా, స్మృతిగా, ఉత్సాహముగా, ప్రాణశక్తిగా ద్యోతకము అవుతూ ఉంటాయి. అవి నశిస్తే సమస్తజీవకోటి నీరస పడిపోతుంది. ఎక్కడా యజ్ఞములు, యాగములు, హోమములు లేవు. ఎవరిని చూసినా దిగులుగా ఉంటున్నారు. చిరునవ్వులు, సంతోషములు లేవు. ముగ్గురు రాక్షసులు యుద్ధము చేయకుండా లోకములో కామప్రళయమును సృష్టించారు. ఇది లలితా సహస్రనామస్తోత్రమునకు ఆవిర్భావమునకు కారణము. ఎవరికీ ఎందుకు ఇలా ఉన్నామన్న ప్రశ్న వేసుకునే ఉత్సాహముకూడా లేదు. జాతులు నశించి పోవడము ప్రారంభమయింది. లోకమంతా రాక్షసగణములు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భండాసురుని నాయకత్వము వర్దిల్లుతున్నదని దేవతలు గుర్తించారు. తన సోదరులతో కలసి పైకి కనపడకుండా, మిగిలిన రాక్షసుల వలే యుద్ధము చెయ్యకుండా సూక్ష్మరూపముతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతులవారి తేజస్సునీ పాడుచేస్తున్నాడు. ఈ పరిస్థితులలోనుంచి రక్షణ కల్పించే వారు ఎవరా అనుకుని దేవతలు అందరూ కలసి వైకుంఠమునకు వెళ్ళి స్థితికారుడైన శ్రీమహావిష్ణువుని ప్రార్థన చేసారు. ఆయన ఇదివరకు నేను అవతారములను స్వీకరించి మిమ్ములను కాపాడిన మాట యథార్థము. భండుడికి ఎదుటివారిలోని సగబలమును తీసుకునే వరము ఉన్నది. అతని ముందు ఎవ్వరూ పనికిరారు. బ్రహ్మాండమునకు అవతలున్నవారిని తీసుకుని వచ్చి భండాసురుని నిర్జింపచేయాలి. బ్రహ్మాండము బయటికి వెళ్ళి ఒక తల్లిని పిలవాలి ఆవిడ వచ్చి భండాసురుని నిర్జిస్తుందని చెప్పారు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

14-21-గీతా మకరందము


        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - త్రిగుణములను దాటినవాడు మోక్షపదవినొందునని శ్రీకృష్ణభగవానుడు చెప్పగనే, అట్లు దాటిన వాడు ఏయే లక్షణములతో గూడియుండునో తెలిసికొనవలెనని అర్జునునకు కుతూహలముగలుగ, ఆ విషయమును గుఱించి భగవానుని ప్రశ్నించుచున్నారు–


అర్జున ఉవాచ :-

కైర్లింగైస్త్రీన్గుణానేతాన్ 

అతీతో భవతి ప్రభో | 

కిమాచారః కథం చైతాం స్త్రీన్గుణానతివర్తతే || 


తాత్పర్యము:- అర్జును డడిగెను -- ప్రభువగు ఓ కృష్ణా! ఈ మూడుగుణములను దాటినవాడెట్టి లక్షణములతో గూడియుండును? ఎట్టి ప్రవర్తన గలిగియుండును? మఱియు ఈ మూడు గుణములను నాతడు ఏ ప్రకారము దాటివేయగలడు?


వ్యాఖ్య:-మూడుగుణములను దాటినవాడు జన్మమృత్యుజరాదుఃఖములనుండి విడివడి అమృతత్వము (మోక్షము)ను బొందునను భగవద్వాక్యమును వినినవెంటనే అర్జునునకు ఆ గుణము లెట్లు దాటబడునో, అట్లు దాటినవా డెట్లు ప్రవర్తించునో ఏ లక్షణములు, గుర్తులు గలిగియుండునో తెలిసికొనదలంచి వెంటనే ఆ విషయమును గూర్చి భగవానుని ప్రశ్నించివైచెను.


“కైర్లిఙ్గైః” = "ఏ లక్షణములచే, ఏ గుర్తులచే గుణాతీతుడు తెలియబడగలడు?" అని అర్జునుడు అడుగుట చాల సమంజసముగా నున్నది. ఏలయనిన కొందఱు తాము చాల క్రిందిస్థితియం దున్నప్పటికిని, దృశ్యవాసనలు తమకింకను నశింపకున్నప్పటికిని, తాము సిద్ధపురుషులమనియు, గుణాతీతులమనియు, జీవన్ముక్తుల మనియు చెప్పకొని తిరుగుచు ప్రజలను మోసము చేయవచ్చును. గుణాతీతుని యథార్థమగు లక్షణములు, చిహ్నములు తెలిసికొనినచో, ఇక నట్టిస్థితికి అవకాశములేదు. పైగా అట్టి లక్షణములను ఎఱిగియున్నచో మనుజుడు తానుకూడ ప్రయత్నాతిశయముచే వానిని సాధించుటకును వీలుండును. ఇవియన్నియు ఆలోచించి అర్జునుడు సమయోచితమగు ప్రశ్నగావించెను. ఇదివఱలో గీతప్రారంభమునందు రెండవ అధ్యాయమున 'స్థితప్రజ్ఞస్య కా భాషా" - అను నీప్రకారముగ ఇట్టి ప్రశ్ననే అర్జునుడు కావించి యుండుట ఈ సందర్భములో గమనింపదగియున్నది. ఈ స్థితప్రజ్ఞలక్షణములుగాని, గుణాతీతుని లక్షణములుగాని, అద్వేష్టృత్వాది భక్తలక్షణములుగాని, అమానిత్వాది జ్ఞానగుణములుగాని ఒక "బరామీటరు” (Barometre) వంటివి. ‘బరామీటర్' చే శీతోష్ణస్థితు లెట్లు కొలవబడునో, అట్లే మనుజుని ఆధ్యాత్మికౌన్నత్యము ఈ లక్షణములచే కొలవబడగలదు. ఈ లక్షణములను బట్టి చూచినచో జనులలో ఆధ్యాత్మికశక్తిగలవారెవరో, వేషధారులెవరో సులభముగ తేలిపోవును, శుష్కవేదాంతమును రూపుమాపుటకు, పరమార్థక్షేత్రమునందు 

సోమరులచే కల్పింపబడిన కృత్రిమవాతావరణమును విచ్ఛిన్నమొనర్చుటకు ఇట్టి ప్రశ్నలెంతయో ఆవశ్యకములైయున్నవి.


‘కిమాచారః’ - గుణాతీతుని ఆచరణ, అనుష్ఠానము ఎట్టిదో అర్జును డెఱుగ దలంచెను. "కిమాసీత వ్రజేత కిమ్" - అని యిట్టి యాచరణనుగూర్చియే యిదివఱలో అర్జునుడు ప్రశ్నించియుండెను. ఆధ్యాత్మికక్షేత్రమున అనుష్ఠానమునకు గొప్ప ప్రాధాన్య మొసంగబడియున్నది. "సాధ్య” వస్తువునుగుఱించి, లక్ష్యమును గురించి తెలిసికొనుట అవసరమైయున్నను, ఆ లక్ష్యము ఏ సాధనచే బొందబడగలదో దాని నెఱుగుట ఇంకను ఆవశ్యకమైయున్నది. ఏలయనిన, ‘సాధన' నవలంబించినచో “సాధ్యము" దానియంతట నదియే చేకూరును. కనుకనే అర్జునుడు గుణాతీతునియొక్క ప్రవర్తనయెట్టిదో తెలిసికొన దలంచెను. అర్జునుని ఈ ప్రశ్న దానికి భగవాను డొసంగబోవు సమాధానము పాఠకలోకమునకు చాల ముఖ్యములైయున్నవి. గీతలో సాధనసంబంధమైన ప్రముఖ ఘట్టములలో నిదియు నొకటైయున్నది. కావున ముముక్షువులీ గుణాతీతుని లక్షణములను బాగుగ మననముచేసి, కార్యాన్విత మొనర్చుకొనవలయును.


ప్రశ్న:- అర్జునుడు భగవానునిద్వారా ఏ యే విషయములను తెలిసికొనదలంచెను?

ఉత్తరము:- (1) గుణాతీతుని లక్షణము లెవ్వి? (2) ఆతని ప్రవర్తన యెట్టిది? - అను విషయములను తెలిసికొనదలంచెను.

రామాయణమ్.82

 

...

అన్నగారు కోరినదే తడవుగా మంచి దృఢమైన వృక్షశాఖలు తెచ్చి చక్కటి స్థిరమైన పర్ణశాల నిర్మించాడు లక్ష్మణుడు.మెత్తటిచాపలల్లి విశాలమైన ఆవరణం ఏర్పరచి అన్న ఎదుట సావధాన చిత్తుడై నిలిచాడు లక్ష్మణుడు.

.

అందంగా నిర్మింపబడిన ఆ పర్ణశాలను చూస్తూ రామచంద్రుడు ,లక్ష్మణా ఈ పర్ణశాలలో మనము చాలాకాలము జీవించవలసి ఉంటుంది కావున ప్రవేశించే ముందు వాస్తుదేవతా శాంతి చేసుకోవాలి.అందు నిమిత్తమై నీవు లేడిమాంసము తీసుకొనిరమ్ము శాలాపూజ చేసుకుందాము.శాస్త్ర విహితమైన కార్యముకదా ! 

.

రాముడినోట మాటవెలువడిన మరుక్షణమే అక్కడ కృష్ణసారము అనే లేడిమాంసం సిద్ధంచేశాడు లక్ష్మణుడు.

.

ఆ మాంసాన్ని ప్రజ్వరిల్లే అగ్నిలో రక్తముపూర్తిగా తొలగిపోయేటట్లు బాగా కాల్చి పక్వమైనదని తెలుసుకొని ,రామునితో ,రామా ! ఇక దేవతాపూజ ప్రారంభించవచ్చు అని తెలిపాడు.

.

ఒక స్థిరముహూర్తంలో రాముడు శుచిగా నదిలో స్నానం చేసినవాడై విశ్వేదేవతలను,రుద్రుని,విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తుశాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా వాస్తుపూజాసమయంలో పఠించవలసిన మంత్రములు స్వయంగా తానే చదివి పర్ణశాలలో ప్రవేశించగనే ఆయన మనస్సులో అమితమైన ఆనందం కలిగింది.

.

అంత సీతారామలక్ష్మణులు అడవిలోదొరికే పూలు,పండ్లు కందమూలములు ,పక్వమైనమాంసముతో సకల భూతములకు తృప్తికలుగచేశారు.

.

లక్ష్మణుడుఆపర్ణశాలలోవేదికలు ,చైత్యములు,అగ్నిగృహాలు

కూడా ఏర్పాటు చేశాడు.

.

మనోహరమైన చిత్రకూటపర్వతసానువులు,మాల్యవతీనదీ ,రమణీయమైన ప్రకృతి ,ఆహ్లదకరమైన వాతావరణంలో నిర్మింపబడిన ఆ పర్ణశాలలో ప్రవేశించగనే అయోధ్యను విడవటం వలన వారిలో కలిగిన దుఃఖం మటుమాయమయ్యింది....

....

అక్కడ! ..

రాముడు గంగదాటినవైపే వారు కనుమరుగయ్యేంతవరకు చూస్తూ నిలుచున్న సుమంత్రుడు రాముడు చిత్రకూటము చేరుకున్నాడన్న వార్త తెలిసేవరకు గుహుని వద్దనే ఉండి భారమైన మనస్సుతో ఆనందశూన్యమైన అయోధ్య చేరాడు.

.

సుమంత్రుని చూడగనే రాముడెక్కడ? మా రాముడెక్కడ ? అంటూ నగర ప్రజలందరూ ఆయన చుట్టూ గుమికూడి ప్రశ్నలవర్షం కురిపించారు.


రామాయణమ్.83

..

సుమంత్రుడు తిరిగి వచ్చాడు .రాముడు గంగదాటి అడవులలోకి వెళ్ళిపోయాడనే వార్త అయోధ్యప్రజలలో హాహాకారాలు పుట్టించింది.మరొక్కసారి రోదనలు మిన్నుముట్టాయి..

.

సుమంత్రుడు మెల్లగా రాజప్రాసాదంలోకి ప్రవేశించాడు.అక్కడ సర్వమూ కోల్పోయినవాడిలా దీనుడై,దుఃఖితుడై,కాంతిహీనుడై చతికిలపడి కూర్చున్న దశరధుడిని సమీపించాడు‌.

.

రాజుకు నమస్కరించి రాముడి వనప్రవేశ వృత్తాంతము వినిపించాడు.అది మౌనంగా విని ఒక్కసారిగా మూర్ఛిల్లి నేలమీద దబ్బున పడిపోయాడు మహారాజు.

.

కౌసల్యా సుమిత్రలు పరుగుపరుగున వచ్చి ఆయనను లేవదీసి మంచముమీద పరండబెట్టి ఓ రాజా ఎందుకంత మౌనంగా ఉన్నావయ్యా ! జరుగరానిది జరిగిపోయింది ఇప్పుడు నీవు బాధపడి ఏం ప్రయోజనం ! అదుగో సుమంత్రుడు వచ్చాడు రాముడి వార్తలు చెపుతాడు లేచి వినవయ్యా అంటూ దుఃఖమువలన చపల అయిన కౌసల్య డగ్గుత్తికతో మాట్లాడుతూ తానుకూడా నేలపై ఒరిగిపోయింది.

.

కొంతసేపటికి తేరుకున్న దశరధుడు సుమంత్రుని పిలిచి ,నా రాముడు ఎలా ఉన్నాడు ? ఏమి తింటున్నాడు? ఎక్కడ పడుకున్నాడు?అడివంతా క్రూరమృగాలు ,కృష్ణసర్పాలతో నిండిఉన్నది గదా వారు ఎలా ప్రయాణిస్తున్నారు.సుకుమారి సీత ఈ కష్టాలు ఎలా ఓర్చుకుంటున్నది?.రాముడిగురించి ప్రశ్నలవర్షం కురిపిస్తూనే ఉన్నాడు.

.

సుమంత్రుడు రాముడు తండ్రిక్షేమమే కోరుకుంటున్నాడు అన్న విషయము ,భరతునిపట్ల ఆయనకు గల ప్రేమను కూడా మహారాజుకు తెలిపి లక్ష్మణకుమారుడి కోపం గురించి కూడా తెలియచేసినాడు.

.

ప్రభువుగా ముందువెనుకలు ఆలోచించకుండా ఏ నేరమూ చేయని రాముని అడవులకు వెళ్ళగొట్టడము తెలివితక్కువవాడు చేసేపని .నేను ఇకనుండీ ఆయనను తండ్రిగా పరిగణింపను నాకు సోదరుడైనా,బంధువైనా,హితుడైనా ,రాజైనా ,తండ్రి అయినా రాముడే అని చెప్పాడు ప్రభూ!.

.

మహాఇల్లాలు సీతమ్మ మాత్రము ఏ పలుకూలేక మౌనంగాఉన్నది మహారాజా!

.

మన అయోధ్య అంతా కళావిహీనమై ,కాంతినికోల్పోయి ఆనందశూన్యమై ఎడారిని తలపిస్తున్నది ప్రభూ .

.

సుమంత్రుడి ఈ మాటలు విని అయ్యో నేనెంత తెలివితక్కువ వాడను ! ఒకస్త్రీ మాట విని ఎవరినీ సంప్రదించకుండా ,వృద్ధులతో విచారించకుండా ,మంత్రులతో సమాలోచనలు చేయకుండా,వర్తకులతో మాటైనా చెప్పకుండా ఒక్క ఆడుదానిమాట విని ఏకపక్షముగా తొందర పాటు తో ఎంత పాడు పని చేశాను?

.

సుమంత్రా ఇప్పటికి కూడా నా ఆజ్ఞ చెల్లుబాటు అవుతున్నట్లయితే నన్ను వెంటనే నా రాముడి వద్దకు తీసుకొనిపో!

.

ఆజానుబాహువు,అరవిందదళాయతాక్షుడు,మణికుండలభూషితుడూ ,మూపున పెనువిల్లు ధరించి మనోహరంగా కనపడే నారాముడు నా ఎదుట లేకపోతే నాకీ బ్రతుకు ఎందుకు? వాడిని చూడని ఈ కనులెందుకు? వాడి గాఢపరిష్వంగానికి నోచని ఈ శరీరమెందుకు?.

.

ఓ కౌసల్యా! నేను శోకమనే మహాసముద్రంలో మునిగి పోతున్నాను.

రామ శోకమే దీని వైశాల్యము

సీతదగ్గరలేకపోవడమే ఆవలి ఒడ్డు

నా నిట్టూర్పులే తరంగాలు

నా కన్నీళ్ళే నీటి సుడులు

కైకేయి ఈ సముద్రములో పుట్టిన బడబాగ్ని

మంధర అతిపెద్ద మొసలి

రామా,రామా,రామారామా నిను విడిచి ఉండలేనురా అంటూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు దశరధుడు

ఆదిపర్వము – 23

 


ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజుల జన్మవృత్తాంతం


ఇది అంతా విన్న సత్యవతికి ఒక ఆలోచన వచ్చింది. తను కన్యగా ఉండగా పరాశరుని వలన పుట్టిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే ఆ విషయం భీష్మునికి చెప్పింది.


“కుమారా, వ్యాసుడు సమస్త ధర్మాలు తెలిసినవాడు. గొప్ప తపస్వి. ఆయన వలన నీ తమ్ముడి భార్యలకు సంతానం కలుగుతుంది” అని చెప్పింది. వెంటనే మనసారా తన కుమారుడైఅ వ్యాసుని ప్రార్థించింది. వ్యాసుడు తల్లి ముందు ప్రత్యక్షం అయ్యాడు. చాలా రోజూల తరువాత వచ్చిన కొడుకుని చూసి ఆనందించింది సత్యవతి. వ్యాదుడు తల్లికి నమస్కరించాడు. భీష్ముడు వ్యాసుని సత్కరించాడు. సత్యవతి కుమారుని చూసి “కుమారా, ఈ రాజ్యానికంతా వారసుడైన ఈ భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞతో, వివాహానికి, రాజ్యాధికారానికి దూరం అయ్యాడు. నాకు వేరే కుమారులు లేకపోవడం వల్ల ఈ వంశం ఇంతటితో ఆగిపోయే ప్రమాదం ఉంది. ధర్మ సమ్మతమైన దేవర న్యాయమున, నీ తమ్ముని భార్యలయందు సంతానము పొందుము” అని చెప్పింది సత్యవతి.


“అమ్మా, నీవు అజ్ఞాపించినట్లే చేస్తాను” అని అన్నాడు వ్యాసుడు.


(దేవర న్యాయమనగా, ఎవరైనా ఒక మహారాజుకు సంతానం లేనపుడు గాని, సంతాన హీనునిగా మరణించినపుడు గాని, ఆ మహారాజు భార్య, ఒక వేద విదుడు, పుణ్య చరితుడు, సద్గుణ సంపన్నుడు అయిన బ్రాహ్మణునితో సంగమించి సంతానమును పొందుట)


సత్యవతి తన పెద్దకోడలు అంబికను ఆరోజు రాత్రి వ్యాసుని వద్దకు పంపింది. సన్నగా, నల్లగా పొడుగ్గా, జడలతో వికృతంగా ఉన్న వ్యాసున్ని చూసి భయంతో కళ్లు మూసుకుంది అంబిక. వ్యాసుడు ఆమెకు పుత్ర దానం చేసాడు. అంబికకు మహా బల పరాక్రమవంతుడైన కొడుకు పుట్టాడు, కాని సంగమ కాలంలో ఆమె కళ్లు మూసుకున్నందున గుడ్డి వాడుగా పుట్టాడు. అతనే ధృతరాష్ట్రుడు.


సత్యవతి తన రెండవ కోడలు అంబాలికను వ్యాసుని వద్దకు పంపింది. అంబాలిక వ్యాసున్ని చూసి భయంతో తెల్లగా పాలిపోయింది. ఆమెకు గుణవంతుడు, వంశకర్త అయిన కొడుకు పుట్టాడు. కాని సంగమ కాలంలో ఆమె పాలిపోయినట్టుగా అయినందున, ఆ కొడుకు పాండు వర్ణం అంటే తెల్లని వర్ణంతో పుట్టాడు. అతనే పాండు రాజు.


కాని అంబాలికకు గుడ్డి వాడైన కొడుకు పుట్టినందుకు దుఃఖించింది. మరొక కుమారుడిని ప్రసాదించమని వ్యాసుడిని కోరింది. దానికి వ్యాసుడు సమ్మతించాడు.


వెంటనే సత్యవతి పెద్ద కోడలు అంబాలికను మరల వ్యాసుని వద్దకు వెళ్లమని కోరింది. కాని అంబాలికకు వ్యాసుని వద్దకు వెళ్లి సంగమించడం ఇష్టంలేదు. కాని అత్తగారి మాట కాదనలేక, తన దాసికి, తన మాదిరి అలంకరణ చేసి వ్యాసుని వద్దకు పంపింది.


ఆమె వ్యాసుని చూసి భయపడలేదు, అసహ్యించుకోలేదు. హాయిగా వ్యాసునితో కామక్రీడలలో తేలియాడింది. అందువల్ల ఆమెకు, మాండవ్య మహ ముని శాపం కారణంగా యమధర్మరాజు, విదురుడుగా జన్మించాడు

*స్థిరచిత్తం*



జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తిచెయ్యాలంటారు పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం పనుల్ని సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.


ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు, మత్స్యయంత్రం ఛేదనకు పూనుకొన్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు- రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.


మనసు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా కడవరకు సాగదు. ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు మనసుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్యసఫలతకు కృషి చేసే సాధకుడు మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనసును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి.


అహంకారం అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్యసాధనకోసం పురోగమించే వ్యక్తి అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలి రా, నేను కనబడతాను’ అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలా అహంకరించినవాడు కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు ప్రతీక.


మనిషి తన జీవిత కాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటల్ని ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి. నరికిన మోడు నుంచి చిగురించిన పచ్చని మొక్కలా తనను తాను మలచుకోవాలి.


సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు. సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాలదృక్పథుడిగా మార్చడమే. భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను... సమయానుకూలతను బట్టి ధాన్యరూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప- అనుకొని పంటసిరి మురిసిపోతుంది!

అభ్యున్నతి

 వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..

🔸 అతినిద్ర

🔸 బద్ధకం

🔸 భయం

🔸 క్రోధం

🔸 అలసత్వం

🔸 ఎడతెగని ఆలోచన

...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. 


ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..


నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. 


రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. 


అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. 


ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.


అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. 


అలాగే.. 


ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.

భారతం లో "కుంతీ కుమారి

 "


 (ఆదిపర్వం, పంచమాశ్వాసం.)


 తరువోజ వృత్తం.



"ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర? మిమ్మంత్రశక్తి యే నెరుగంగ వేడి


యేల పుత్త్రకు గోరి యెంతయు భక్తి నిను దలంచితి బ్రీతి? నినుడును నాకు


నేల సద్యోగర్భమిచ్చె? గుమారు డేల యప్పుడ యుదయించే? నిం కెట్టు


లీ లోకపరివాద మే నుడిగింతు? నింతకు నింతయు నెరుగరె జనులు?


వసంత తిలక వృత్తం.


"ఈ బాలు నెత్తుకొని యింటికి జన్న, నన్నున్‌

నా బంధు లందరు మనంబున నేమనా? రె

ట్లీ బాలసూర్యనిభు నిట్టుల డించి పోవం

గా బుద్ధిపుట్టు? నని కన్య మనంబులోనన్‌".

 

-ముందూ వెనుకా ఆలోచించకుండా తాను చేసిన ఈ పనికి ఫలితం ఎలా వుండబోతోందో ఊహించుకుంటూ కుంతి బాధపడుతున్న సందర్భం లోనివి ఈ పద్యాలు.

 

‘ఎందుకు ఆ ముని (దుర్వాసుడు) అడగగానే ఆ మంత్రం నాకు ఉపదేశించాడు?


 ఆ మంత్ర శక్తిని నేను పరీక్షించే ఆలోచనతో పుత్రునికోసం ప్రార్థించి ఎంతో భక్తితో నిన్ను ఎందుకు మనసులో ప్రీతితో తలుచుకున్నాను? 


సూర్యభగవానుడు కూడా దయతలచి ఎందుకు నాకీ సద్యోగర్భం ఇచ్చాడు? 


అలా వరం ఇచ్చిన వెంటనే, ఈ కుమారుడు ఇప్పటికిప్పుడే ఎందుకు ఉదయిం చాడు? 


దీనివలన లోకులు వేసే అపనిందను నేను ఏ విధంగా ఆపగలను?


 జరిగినదంతా ఇంతకింతకూ పసిగట్టి తెలుసుకోకుండా జనులు మానతారా?


 ఈ పసిబాలుని ఎత్తుకుని ఇంటికి వెళితే, నా బంధువులంతా నన్ను ఏమీ అనకుండా ఊరకుం టారా? 


అలాగని, ఎట్లా ఈ సూర్యప్రభతో సమానంగా వెలిగిపోతున్న బాలుడిని ఇక్కడే వదిలిపెట్టి పోవడానికి మనసు పుడుతుంది?


’ అని పై పద్యంలో కుంతి మనసులోని ఎన్నో ప్రశ్నలకు రూపమిస్తుంది. 

 

 మూలంలో రెండు శ్లోకాలలో ఛాయామాత్రంగా ఉన్న విషయాన్ని నాటకీయంగా పెంపొందించి రచించాడు నన్నయ. (జంధ్యాల వారు మరింత హృద్యం గా మలచేరు.)



వ్యాసభారతంలోని ఆ రెండు శ్లోకాలు :

 

"దృష్ట్వా కుమారం జాతం సా వార్ష్ణేయీ దీనమానస్ఢా


ఏకాగ్రం చిన్తయామాస కిం కృత్వా సుకృతం భవేత్ఢ్ఢ్‌"


‘అప్పుడే పుట్టిన ఆ కుమారుడిని చూసి వృష్ణివంశ కన్య అయిన కుంతి హృదయం చాల దుఃఖంతో నిండిపోయింది. ఆమె ఏకాగ్ర చిత్తంతో అప్పుడు ఏమి చేయడం వలన అంతా మంచి జరుగుతుందో అది చేయడానికి సంకల్పించుకున్నది’ అని పై శ్లోకం భావం.

 

"గూహమానాపచారం సా బన్ధుపక్షభయాత్‌ తద్ఢా

ఉత్ససర్జ కుమారంతం జలే కుంతీ మహాబలమ్ఢ్ఢ్‌"

 

‘ఆ సమయంలో కుటుంబజనుల వలన భయంతో తాను చేసిన ఆ అనుచిత కృత్యం వారికి ఎప్పటికీ తెలియకుండా పోయే విధంగా ఆ మహాబలుడైన కుమారుడు, కర్ణుడిని నదీ జలంలో వదిలివేసింది’ అని పై శ్లోకం భావం.


 సేకరణ.

చాటువు

 ;


ఉ. “కప్పుర భోగి వంటకము కమ్మని గోధుమ పిండివంటయున్ 


గుప్పెడు పంచదారయును గ్రొత్తగ గాచిన యాలనేయి పెస 


ర్పప్పు ను నల్లపు గొమ్మ నటి పండ్లును, నాలుగు నైదు నంజలున్ 


లప్పల తోడ క్రొంబెరుగు లక్షణ వజ్జల యింట రూకకున్.”



ఈ పద్యం క్రీడాభిరామం లోనిది. దీనిని శ్రీ నాధుడు వ్రాశాడనీ , వినుకొండ వల్లభ రాయుడు వ్రాశాడనీ రెండు రకాలుగా జనశ్రుతి వుంది. 


మంచన భట్టు , టిట్టిభ సెట్టి అనే ఇద్దరు దేశాటనం చేస్తున్నప్పుడు ఒక పూట కూళ్ళ యింటిలో లభించే భోజనాన్ని వర్ణించే పద్యం ఇది. 


( ఓరుగల్లు లో వాళ్ళిద్దరూ సంచారం 

చేస్తున్నప్పుడు చేసిన వర్ణన )


ఒక రూక కు ( ఇప్పటి రూపాయి కాదు. ) లక్ష్మణ వజ్జల అను వాని పూటకూటి యింటిలో లభించే భోజనం : 


 కప్పురభోగి అనే మేలిరకం బియ్యపు అన్నమూ, గోధుమ పిండి పణ్యారాలు , పంచదార, తాజా ఆవునేయి, పెసరపప్పు, అల్లపుకొమ్మూ, అరటి పండ్లూ, నాలుగైదు కూరలు ,గిన్నెలతో అప్పుడే తోడుకొన్న గడ్డ పెరుగు - వీటన్నిటి తో ఒక్క రూక కే కమ్మటి భోజనం !.


 “ లప్ప” : పాత్ర, గుండిగ , తప్పేల , తళిగ , బాన , బిందె మొ. 

 .

మూర్తికవి

 శ్రీకృష్ణదేవరాయల సభలో ‘మూర్తికవి’ ఉండేవాడు. (రామరాజభూషణునికి మూర్తికవి అన్న పేరుంది కాని ఈ మూర్తికవి వేరొకరు కావచ్చు). ఒకసారి అతని కవిత్వాన్ని మెచ్చుకొని రాయలు ‘కాకమాను’ అనే గ్రామాన్ని దానంగా ఇచ్చి ఇంద్రనీలమణులు పొదిగిన కుండలాలను బహూకరించాడు. మూర్తికవి రోజూ వాటిని ధరించి సభకు వచ్చి అష్టదిగ్గజాలకు సమీపంగా కూర్చునేవాడు. ఆ మణులనుండి పరావర్తనం చెందిన నలుపువల్ల కవులందరి ముఖాలు నల్లగా కనిపించేవి. అది గమనించిన రాయలు నవ్వుతూ “అష్టదిగ్గజాల ముఖాలు ఎందుకో వివర్ణమయ్యాయి” అని పరిహాసం చేశాడట.

ఈ అవమానాన్ని కవులు భరించలేకపోయారు. ఎలాగైనా అతని దగ్గర ఆ కుండలాలు లేకుండా చేయాలని నిశ్చయించుకున్నారు. కాని ఆ పనికి ఎవరు పూనుకోవాలా అనేది సమస్య. చివరికి తెనాలి రామకృష్ణుడు ఆ కార్యభారాన్ని తాను స్వీకరించాడు.

ఒకరోజు మూర్తికవి తన ఇంట్లో భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నవేళ రామకృష్ణుడు వెళ్ళాడు.

“ఓహో.. రామకృష్ణకవి గారా? ఏమిటిలా దయచేశారు?” అడిగాడు మూర్తికవి.

రామకృష్ణకవి వినయంగా “రాయలవారి మెప్పు పొందిన మేటికవులు మీరు. ఏదో కుర్రవాణ్ణి! మీమీద ఒక పద్యం వ్రాశాను. మీకు వినిపించాలని ఉబలాటంగా ఉంది” అన్నాడు.

“ఆలస్య మెందుకు? వినిపించు” అన్నాడు మూర్తికవి.

రామకృష్ణకవి వినిపించిన పద్యం ఇది....

“అల్లసానివాని యల్లిక జిగిబిగి

ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు

పాండురంగవిభుని పదగుంఫనంబును

కాకమానిరాయ! నీకె తగుర.”

(కాకమాని గ్రామానికి అధిపతివైన ఓ మూర్తికవీ! అల్లసాని పెద్దన కవిత్వంలోని అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మన ముద్దుమాటలతో కవిత్వం చెప్పే నైపుణ్యం, పాండురంగమాహాత్మ్య కర్త తెనాలి రామకృష్ణుని కవిత్వంలోని పదగుంఫనం నీకే తగినట్టివి)

ఆ పద్యాన్ని విని మహదానందభరితుడైన మూర్తికవి “ఏం కావాలో కోరుకో” అన్నాడు.

“మీ కుండలా లివ్వండి చాలు!” అన్నాడు రామకృష్ణుడు.

మూర్తికవి సంతోషంగా తన కుండలాలు తీసి ఇచ్చాడు.

మరునాడు కుండలాలు లేకుండా సభకు వచ్చిన మూర్తికవిని చూసి రాయలు “ఈరోజు కుండలాలు లేకుండా వచ్చారేం?” అని ప్రశ్నించాడు.

“రామకృష్ణకవి నామీద ఒక పద్యం చెప్పాడు. సంతోషించి బహుమానంగా ఇచ్చాను” అన్నాడు మూర్తికవి.

“ఔనా? ఒక కవిని మెప్పించిన పద్యం అంటే అది చాలా గొప్పదై ఉండాలి. ఏదీ వినిపించండి” అని కోరాడు రాయలు.

“నన్ను పొగడిన పద్యాన్ని నేనే చెపితే బాగుండదు. రామకృష్ణ కవి ఉన్నాడు కదా! అతణ్ణే చదవమనండి” అన్నాడు మూర్తికవి.

రాయల కోరికమీద రామకృష్ణుడు ఆ పద్యాన్ని చదివి వినిపించాడు. దాన్ని వినగానే రాయలతో సహా సభికులంతా గొల్లుమని నవ్వారు. ముఖం వివర్ణం కావడం ఈసారి మూర్తికవి వంతయింది.

చమత్కార మేమిటంటే...

మూర్తికవి వీపున తామర. అందుకని ఎప్పుడూ తన ఆసనాన్ని ఒక స్తంభం దగ్గర వేసికొని దురద పెట్టినప్పుడల్లా వీపును ఆ సంభానికి రాసేవాడు. రామకృష్ణుడు పద్యం చివరిపాదాన్ని “కాక - ‘మాని’ రాయ నీకె తగుర” అన్న విరుపుతో చదివాడు. మాను 

అంటే స్తంభం. ‘స్తంభానికి వీపురాయడం నీకే తగును’ అన్న అర్థం వచ్చేలా చదివాడు.

ఆ విధంగా మూర్తికవికి శృంగభంగం జరిగింది.


సేకరణ..శ్రీనివాస్

ఈ నెలలో పుణ్యకార్యాలు చేస్తే..

 రేపటి నుండి అధిక మాసం



🌹మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. అయితే ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన వచ్చింది.


🌹అయితే ఈ సమయంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రం కచ్చితంగా చేయాలంట. ఎందుకంటే శుభకార్యాలు వేరు. దేవతల పూజలు వేరు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.


🌹ఈ అధిక మాసంలోని 30 రోజులలోని ఏడు రోజులలో ప్రత్యేకించి పౌర్ణమికి ముందుగా భాగవతాన్ని పారాయణం చేయాలి లేదా భాగవతం పారాయణం చేసే పండితులకు ఆ గ్రంధాన్ని అందజేయాలి. భాగవతంలోని దశమ స్కందంలోని క్రిష్ణునికి సంబంధించిన కథనాలను పారాయణం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


🌹ఇలాంటి అవకాశం ప్రతి సంవత్సరం రాదు. ఈ అధిక మాసం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కాబట్టి ఇలాంటి సువర్ణాకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తే.. తమిళనాట ఉండే ప్రజలు సౌరమానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.


అధికమాసం అంటే ?

🌹చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చాంద్రమానం కు, సూర్యుని కదలికలను అనుగుణంగా ఉండే సౌర మానంకు లెక్కల్లో కొన్ని తేడాలు వస్తుంటాయి. అందులో సౌరమానంలో సంవత్సరానికి కేవలం 360 రోజులు మాత్రమే వస్తాయి. అదే చాంద్రమానంలో 365 రోజులు వస్తాయి. ఇలాంటి తేడాలను సరిచేసి ఒకే లైనుపై తీసుకొచ్చే ప్రయత్నాన్ని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చేశారు. ఇలా రెండు మానాలను సర్దుబాటు చేసిన కాలాన్నే అధిక మాసం అంటారు.


ఎప్పుడైతే సంక్రమణం ఉండదో..

🌹ఈ మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ, ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలు కనిపించవని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో సంక్రమణం కూడా రాదు. అసంక్రాంతి, ద్విసంక్రాంతి వస్తుంది. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతున్నారు.


శుభకార్యాలు చేయకూడదు..

🌹ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహ కార్యక్రమాలు, ఇంట్లోకి ప్రవేశించడం, ఉపనయనాల వంటివి చేయకూడదు.


దేవతలకు పూజలు..

🌹అయితే ఈ మాసంలో సకల దేవతలకు పూజలు మాత్రం చేయొచ్చు. ఎందుకంటే ఇవి శుభకార్యాలు కాదు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలైన సత్యనారాయణ వ్రతం, దేవుళ్లకు అభిషేకాలు, నవగ్రహ హోమాలు, నవగ్రహ జపాలు, శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం, రామాయణ పారాయణం, ఆంజనేయస్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా వంటివి కచ్చితంగా చేయాలి.


ఈ నెలలో పుణ్యకార్యాలు చేస్తే..

🌹ఈ నెల మొత్తం ఒక నియమం పెట్టుకోవాలి. నిత్యం ఇష్టదైవాన్ని తలచుకుని ద్యానం చేయడం లేదా జపం చేయడం వంటివి చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఉదాహరణకు మిగిలిన మాసాల్లో ఒకసారి రామ అంటే, ఒక్కసారే ఫలితం వస్తుంది. అయితే ఈ అధిక మాసంలో అంటే మాత్రం కోటి రెట్ల ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.


పురుషోత్తమ మాసం..

🌹ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. ఉత్తమ పురుషగా అందరి జీవులలో ఉండేవాడు.. సర్వజీవులలో ఆత్మస్వరూపుడిగా ఉండే వాడు పరమాత్ముడు. ఆ విధంగా పరమాత్ముడిని దర్శించడానికి, అందుకు ప్రాతిపదికగా తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది.

*ఆచార్య సద్భోదన*



మనల్ని మనం విస్మరించకుండా పరిపూర్ణ భక్తిలో మునగలేము. రెండు భిన్న విషయాలయందు ఒకే సమయంలో ఏకాగ్రతను చూపించలేము. మనం భగవంతుని గురించి ధ్యానిస్తూ, అదే సమయంలో మనలోని అహం ఎడల అప్రమత్తతను ప్రకటించలేము. పరిపూర్ణ హృదయంతో, భక్తితో ఆదర్శం పట్ల మెలగగలిగితే దాని సారాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది. మనలోని అవగాహన పెరిగే కొద్దీ ఉన్నతమైన ఆలోచనల ముడులు విడివడుతూ వస్తాయి. అప్పుడు విశ్వాసం, శరణాగతి సహజంగా మన వద్దకు చేరి మనలో నిశ్చలతనూ, ప్రశాంతతనూ కలిగిస్తాయి.

సర్వేజనా స్సుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

: *శత శ్లోకీ రామాయణము*

*(53)*

*గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్*

*రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః*


మరణించబోతున్న జటాయువు నుండి రావణుడు సీతను అపహరించిన విషయం తెలుసుకొని, రాముడు దుఃఖం ముంచుకు రాగా ఇంద్రియ వివశుడై విలపించాడు.


*జై శ్రీరామ. *శ్రీ కృష్ణ శతకము*


*(38)*

*అందరు సురలును దనుజులు*

*పొందుగ క్షీరాబ్ధి! దరవ పొలుపున నీ వా*

*నందముగ కూర్మరూపున*

*మందరగిరి యెత్తితౌర! మాధవ! కృష్ణా!*


లక్ష్మీదేవికి నాథుడవగు ఓ కృష్ణా! దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రమును చిలుకునపుడు నీవు తాబేలు రూపముతో నేర్పుగా మందర పర్వతమును ఎత్తితివి, ఎంత ఆశ్చర్యము!.


*జై శ్రీకృష్ణ*

దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించ కూడదు.

 🙏🙏🙏🙏🙏

పొరపాటున కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించ

కూడదు.

దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కున యమధర్మరాజు గారు ఉంటారు. ఎవరైనా మనకి నమస్కరిస్తే దానిని ఊరికే పుచ్చుకోకూడదు. వారిని ఆశీర్వదించి వారిని మనం ఏ రకంగా అనుగ్రహించగలమో ఆ విధంగా కాపాడాలి.

ఇప్పుడు యమధర్మరాజు గారికి నమస్కరిస్తే? ఆయన శక్తి అనుసారంగా ఆయన ఎలా అనుగ్రహించగలరో అలా అనుగ్రహిస్తారు. తప్ప నమస్కారాన్ని ఊరికే పుచ్చుకోరు ఎవరు. తప్పనిసరిగా ఆశీర్వదించి తీరాలి ఎంత మేరకు వీలైతే అంత వరకు. ఒహో వీడికి పాపం ఈ శరీరం బాధాకరంగా ఉన్నట్టుంది అందుకని నన్ను శరణు వేడుతున్నాడు అని శరీరంతో ఉన్న బంధనాన్ని తీసి వేస్తారు. లేదా, రోగాలు ప్రబలడానికి కారణం యమధర్మ రాజు గారి ఆగ్రహం అంటారు. ఒహో నాకు నమస్కరించావు కదా, సరేరా అబ్బాయి(అమ్మాయి), నువ్వు చేస్కున్న పాపాలన్ని ఈ రోగం రూపంలో అనుభవించేయి, అప్పుడు ఇక నీకు వాటితో ఒక గొడవ వదిలిపోతుంది అని ఒక రోగాన్ని ప్రసాదిస్తారు చేస్కున్న పాపాలు అన్ని పోయేలాగ. ఆయన చేతుల్లో పనులేంటో అవి కటాక్షించగలరు. కానీ ఈ రెండూ కూడా సహజంగా ఎవరూ కోరుకునే కోరికలు కాదు కాబట్టి దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.

ఒక్క సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని దిక్కులకి పెట్టే నమస్కారం తప్ప, ఇక వేరే ఎప్పుడూ దక్షిణ దిక్కుకి నమస్కారం పెట్టకూడదు. ఒకవేళ ఎవరైన పెద్దవారు దక్షిణ దిక్కున నిలబడినప్పుడు వారికి నమస్కరించాలి అనుకుంటే అయ్యా కాస్త ఇటుగా తిరగండి మీకు నమస్కరించుకుంటాను అని చెప్పి దిక్కు మరల్చి అప్పుడు నమస్కరించాలి. అది గురువుకైనా సరే తల్లిదండ్రులకైనా సరే

🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

🌸 *శ్రీమద్భాగవతము* 🌸

 

🌻 నీవు భూగోళమంతటి యందును తూర్పుదిక్కునకు కొసలుండునట్లుగా దర్భలను పరచితివి. దానితో ప్రాచీనబర్హి అని పేరు పొందితివి. యజ్ఞములను చేయుచున్నావు. అనేక జీవులను యజ్ఞ పశువులుగా చంపుచున్నావు‌. అది అహంకారము, అవినీతి అగును. ఇన్ని సత్కర్మలు ఆచరించియు కర్మ యొక్క స్వరూపమును, విద్య యొక్క రహస్యమును తెలియని అజ్ఞానివిగనే ఉన్నావు. 


(భూగోళమున సూర్యకిరణములు ఎచ్చట పుట్టిన వారికి అచ్చట ప్రాంతీయములై తూర్పున పుట్టి పడమరకు వ్యాపించుచుండును. అవియే ప్రాచీనబర్హి పరచిన దర్భలు. అతడు అహోరాత్రస్వరూపుడు. అతడు కర్మసిద్ధికై జీవులలోనికి దిగివచ్చెను‌ వేరు వేరు వ్యక్తులుగా వేరు వేరు తావులయందు జన్మించెను‌ వేర్వేరు సూర్యోదయములను, అహస్సులను అనుభవించుచున్నాడు. సూర్యోదయము వలన వేళలను ఏర్పరచుకొని కార్యక్రమములు బిగించుకొని కార్యములు ఆచరించుచున్నాడు.అవియే యజ్ఞములు. వేరు వేరుగా దేహములతో జన్మించుటలో ఒక జీవి దేహము ఇంకొక జీవి తినుట పుట్టెను. తృణమును పశువులు, ఎలుకను పిల్లి, పిల్లిని కుక్క తినుచున్నవి. మానవుడు చెట్లను, జంతువులను కూడా తినుచున్నాడు. పరబ్రహ్మము యొక్క దేహమగు సృష్టి యందే జీవులకు ఆహారము లభించుచున్నది. 


అంతవరకు మంచిదే. అంతటితో ఆగలేదు. రాగద్వేషాదులతో ఈర్ష్యలతో పట్టుదలతో జీవిని జీవి బాధ పెట్టుట, హింసించుట జరుగుచున్నది. నరసృష్టిలోన ఎక్కువగా జరుగుచున్నది. ఈ విధముగా సృష్టి యందలి పశుయజ్ఞము ఖండదృష్టిచే హింసాకాండగా ఆచరింపబడుచున్నది. తత్ఫలితములు అనుభవింపబడుచున్నవి. ఈ కర్మల యందు, వాని విలువల యందు బుద్ధి నిలుపక అంతర్యామి యందు నిలిపినవానికి కూడని పనులు చేయుట ఉండదు కనుక ఈ హింసాకాండ అంటదు. అవే కర్మలను ఆచరించి జ్ఞాని మోక్షము పొందుచున్నాడు. అవే కర్మలను ఆచరించి అజ్ఞాని కర్మస్వరూపమును జ్ఞానస్వరూపమును ఎరుగక మూర్ఖుడై జీవించుచున్నాడని అర్థము.) 


కర్మ యొక్క స్వరూపమును, విద్య యొక్క రహస్యమును తెలిపెదను వినుము. జీవులలో ఉన్న సర్వేశ్వరునకు సంతుష్టి కలిగించునది మాత్రమే పవిత్ర కర్మ. సర్వేశ్వరుని యందు మనస్సు నిలుచుట దేనివలన కలుగునో అది మాత్రమే విద్య. సర్వాంతర్యామియే దేహధారులకు ఎల్ల తానుగను, ఆ లోపల తన స్వామిగను కూడా ఉన్నాడు. దీనిని ఎరిగి ఆ స్వామికి అర్పించుచు ఆ జీవులకు క్షేమము కూర్చు కర్మలను ఆచరించుటయే ఈశ్వరుని ఆశ్రయించుట. జీవుల రూపమున ఈశ్వరుడు నీకు ప్రియుడై వర్తించినపుడు నీచే సేవింపబడును. నీకు అణుమాత్రము కూడా దుఃఖము లేని జీవితము సిద్ధించును. ఇట్లు తెలిసినవాడు ఒక్కడే విద్వాంసుడు, గురువు. వాడే శ్రీహరి స్వరూపుడు..........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 878 (For more Information about Master EK Lectures please visit www.masterek.org).

జీవన్ముక్తుడు

 *మనిషి జీవన్ముక్తుడు కావాలన్నది మన రుషుల ఆకాంక్ష. ఎందుకంటే, మృత్యువు ‘చితి’ వంటిది. అది ఒక్కసారే దహిస్తుంది. మృత్యుభయం ‘చింత’ వంటిది. అది నిత్యం దహిస్తూనే ఉంటుంది. చివరకు మరణం తప్పదనే పరమ సత్యాన్ని జీర్ణించుకుంటూనే- దానికి సంబంధించిన చింతను, భయాన్ని మనిషి జయించాలి. అలా మృత్యుభయాన్ని జయించినవాణ్ని ‘మృత్యుంజయుడు’గా చెబుతారు. మృత్యువును జయించడమంటే, మృత్యుభయాన్ని జయించడమే. దాన్ని ‘ముక్తస్థితి’గా భావిస్తారు.* 

 *ముక్తస్థితి- భారతీయతకు జీవనాడి. అది గొప్ప సంస్కార విశేషం. ఏ విషయంలో అయినా ‘ఇక చాలు’ అనాలంటే, ఆ రకం సంస్కారం అవసరం. ప్రసిద్ధులైన కొందరు క్రీడాకారులు, నటీనటులు, రాజకీయ నాయకులు ఎవరైనాగాని- తమ తమ రంగాల నుంచి ‘అప్పుడేనా’ అని ప్రజలు ఆశ్చర్యపడే స్థితిలో తప్పుకోవడం చూస్తుంటాం. ‘ఇంకానా’ అని చీదరించుకునేదాకా పట్టుకుని వేలాడకూడదన్న జ్ఞానాన్ని వారికి ఆ సంస్కారమే ప్రసాదించిందని గ్రహించాలి. ఇక్కడితో ‘నా కర్తవ్యం ముగిసింది’ అని గ్రహించడమే జీవన్ముక్తుడి లక్షణం. హుందాగా తప్పుకోవడం అతడి సంస్కారం. నిత్యజీవితంలో ఆ సంస్కార విశేషాన్ని సాధన చేసినవారు క్రమంగా అంతర్ముఖులవుతారు. జీవిత నాటకరంగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడూ దాన్ని తేలిగ్గా పాటించగలుగుతారు. మరణమంటే హడలిపోయే స్థితి నుంచి దాన్ని ఆహ్వానించగల స్థితికి ఎదగడమంటే అదే!*


🙏🙏🙏🙏🙏

పక్షులు

 *ఒక చెట్టుమీద రెండు పక్షులున్నాయి. ఒక పక్షి పై కొమ్మ మీద, మరోపక్షి క్రింది కొమ్మ మీద కూర్చున్నాయి. పై కొమ్మ మీద కూర్చున్న పక్షి సదా ప్రశాంతంగా, మౌనంగా గంభీరంగా వుంది. క్రింది కొమ్మపై కూర్చున్న పక్షి కొన్నిసార్లు తియ్యని ఫలాలను ,కొన్నిసార్లు చేదుఫలాలను తింటున్నది. ఒకసారి నాట్యం చేస్తుంది, మరోసారి దీనంగా వుంటుంది. ఒకసారి ఆనందింస్తుంది. మరోసారి దు:ఖిస్తుంది. కొన్నిసార్లు చాలా చేదుగా వున్న ఫలాన్ని తిని విసిగిపోతుంది. పై కొమ్మమీద సంతోషంగా వుండే బంగారు రంగు రెక్కలున్న పక్షిని చూస్తుంది. ఆ పక్షిగా మారాలని ఆలోచిస్తుంది. అంతలో మరచిపోతుంది.మళ్ళీ తీపి, చేదు ఫలాలను ఆరగించడం ప్రారంభిస్తుంది. అతి చేదుగా ఉండే మరో ఫలాన్ని ఆరగించి బాధపడుతుంది. పై కొమ్మ మీద కూర్చున్న పక్షిగా మారాలని తిరిగి ప్రయత్నిస్తుంది. క్రమంగా ఫలాలను తినడం మానేస్తుంది. పైన కూర్చున్న పక్షిలా ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది.* 


 *పై కొమ్మ మీద కూర్చున్న పక్షి పరమాత్మ లేదా బ్రహ్మం. క్రింది కొమ్మ మీద కూర్చున్న పక్షి సుఖదు:ఖాలనే కర్మఫలాలను ఆరగించే జీవాత్మ. జీవితమనే యుద్ధరంగంలో ఎడాపెడా దెబ్బలు తింటుంది. ఒకసారి పైకి లేచి ఇంద్రియాలు క్రిందికి లాగగానే క్రిందికి పడిపోతుంది. క్రమక్రమంగా వివేక, వైరాగ్యలను అభివృద్ధి చేసుకుని ధ్యానసాధన చేస్తూ, మనస్సును భగవంతుడి వైపు మళ్ళించి, ఆత్మసాక్షాత్కారం పొంది శాశ్వతబ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది.*

  🙏🙏🙏🙏🙏

*‘నిబద్ధత’.*

 ఒక దృఢసంకల్పానికో, మంచి మాటకో, సిద్ధాంతానికో కట్టుబడి ఉండటమే *‘నిబద్ధత’.* మనో వాక్కాయకర్మలతో నిరంతరం ఆ సత్సంకల్పాన్ని ఆచరించడం నిమగ్నం కావడమే నిబద్ధత అనిపించుకుంటుంది.

ప్రతి మనిషీ ఏదో ఒక విషయంలోనో, కొన్ని విషయాల్లోనో నిబద్ధుడై ఉంటాడు. అప్పుడే ఆయా పనుల్లో విజయం సాధించగలుగుతాడు. ఆధ్యాత్మిక సంపన్నులెవ్వరూ తాము ఏర్పరచుకున్న నియమ నిబంధనలను అతిక్రమించరు. విస్మరించరు. నిబద్ధులైనవారికి ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా తోడుంటుంది. వారికెప్పుడూ నిరాశా నిస్పృహలు కలగవు. పైగా అంతర్యామికి అధీనులై ఆత్మ సమర్పణ భావంతో, సర్వదా చైతన్యమూర్తులై ఉంటారు. నారాయణుడే వారికి నమ్మకం. నారాయణ శరణాగతే వారి ఆశయం.

నిబద్ధత లేనివాడి మనసు చాంచల్యమనే బలహీనతకు బానిసైపోతుంది. అటువంటివాణ్ని కామక్రోధాది అరిషడ్వర్గాలు ఆవరించి అధఃపాతాళానికి తొక్కేస్తాయి. వాడు భూమికి భారమై చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.


🙏🙏👍👍🙏🙏

అష్టమహాదానాలని వేటిని అంటారు

 🙏🙏🙏🙏🙏

🌹🌹🌹🌹🌹

?

వాటిని దానం చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే ఫ‌లితాలు ఏంటీ?


సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ

పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు. నువ్వులు,

ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదో

దానం కింద ఏడు ధాన్యాలను చేర్చారు. ఇందులో గోధుమలు, కందులు, పెసలు,

శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు వున్నాయి. వీటిలో ఏదైనా ఒకటిని లేదా

అన్నింటినీ దానంగా ఇవ్వవచ్చు. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి

ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ

ఫలితాలుంటాయి.


ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా వుండవచ్చని శాస్త్రం

తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించివుంటారు. దీంతో ఇనుము

దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు. భూమిని దానం చేయడం ద్వారా

సమస్తభూతాలు సంతృప్తి చెందుతాయి. సువర్ణదానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు

సంతోషించేందుకు దోహదపడుతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భ‌యం

ఉండ‌దు. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో

వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం

ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు.


ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు,

ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం ద్వారా లేనివానికి

మనకున్నంతలో ఇవ్వడమే అని పరమార్థం.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

సర్పాలకు అధిపతి – మానసా దేవి!

 


హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతారు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒకో ప్రత్యేకత. ఒకొక్కరికీ ఒకో ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది. అలా ఉత్తరభారత ప్రజలంతా భయంతోనూ భక్తితోనూ కొలుచుకునే మానసాదేవి ఒకరు. ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట. పృధ్వి మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులని చేస్తున్నాయట. అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యప ముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు. ఆమే మానసాదేవి! మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుని కుమార్తెగా పేర్కొన్నారు. ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం సందేహం లేదు. క్షీరసాగరమథనం సందర్భంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగినప్పుడు, ఆ విషం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెబుతారు.


కేవలం సర్పాలకే కాదు... సంతానానికీ, సంపదకు కూడా మానసాదేవి అధిపతే! అందుకనే కులాలకు అతీతంగా బెంగాల్లోని ఇంటింటా మానసాదేవి ప్రతిమ పూజలందుకుంటూ కనిపిస్తుంది. ఒంటి నిండా సర్పాలతో, తల మీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తాయి. మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె కుమారుడైన అస్తీకుడే అంటారు! ఈ అస్తీకుని జననం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన పురాణగాథ వినిపిస్తుంది....


పూర్వం జరత్కారు అనే మహాముని ఉండేవాడట. ఆయన కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ఆయన దేశసంచారం చేస్తుండగా కొందరు చెట్టుకి తలకిందులుగా వేలాడటం గమనించాడు. ‘ఎవరు మీరు! ఎందుకిలా తలకిందులుగా వేలాడుతున్నారు?’ అని అడగ్గా ‘మేమంతా మీ పితృదేవతలం. నువ్వు వివాహం చేసుకోకపోవడం వల్ల మాకీ కర్మ పట్టింది. నువ్వు వివాహం చేసుకుని, సంతానాన్ని కంటే కానీ మాకు ఉత్తమగతుల కలగవు,’ అని చెప్పుకొచ్చారు. అంతట జరత్కారు తనకు తగిన జోడైన మానసాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు వారికి జన్మించిన కుమారుడే అస్తీకుడు!


మానసాదేవి, జరత్కారు, అస్తీకుల గురించి అనేక కథలు పురాణగాథలలోనూ, ప్రాచీన కావ్యాలలోనూ కనిపిస్తాయి. మానసాదేవి మహిమ గురించి వందల ఏళ్ల క్రితమే ‘మంగళకావ్యాల’ పేరుతో బెంగాల్లో అనేక కావ్యాలు వెలువడ్డాయి. వీటిలో చిత్రవిచిత్రమైన గాథలెన్నో కనిపిస్తాయి. మానసాదేవి ఆరాధన చాలా చిత్రంగా ఉంటుంది. చెట్టు కొమ్మ, మట్టి కుండ, నాగరాయి, పుట్ట... ఇలా ఏ రూపులో అయినా ఆమెను కొలుచుకోవచ్చు. అసలు ఏ రూపూ లేకుండా కూడా ఆమెను ధ్యానించవచ్చు. ఇటు ఆచారయుక్తమైన ఆలయాలలో మూలవిరాట్టుగా, అటు గ్రామదేవతగానూ ప్రజల పూజలందుకుంటూ ఉంటుంది. ఆ పూజలకు తగిన ఫలితం ఉంటుందన్నది ఆమెను నమ్మినవారి భావన.

మధురాంతేశ్వర సిద్ధి* *వినాయక ఆలయం, మధూరు

 *.* 



కాణిపాకం వినాయకుడి గురించి తెలుసు..కానీ అలాగే రోజు రోజుకూ పెరిగే గణేశుడు ఎక్కడ వున్నాడో తెలుసా..



జగన్మాత కుమారుడైన విఘ్నేశ్వరుడి విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని మధూరు మధురాంతేశ్వర సిద్ది వినాయక ఆలయం ఒకటి.


 మధురవాహినీ నదీతీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువు దీరిన ఆ విఘ్నరాజు దర్శనానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు బారులు తీరతారు.



మధూరు ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు. ఇక్కడ కొలువైన వినాయకుడు మధురాంతేశ్వర స్వామిగా పూజలందు కుంటాడు. గర్భగుడిలో ఆ గజముఖుడి పక్కనే జగన్మాత పార్వతీదేవి కూడా కొలువై కుమారుడితో 

సమానంగా నిత్యపూజలూ అభిషేకాలూ అందుకుంటుంది. 


అలానే ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి, వీరభద్రుడితోపాటు గణపతి సోదరులైన అయ్యప్ప, సుబ్రమణ్య స్వామి కూడా కొలువు దీరి ఉన్నారు


మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనిపిస్తుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఇది ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని ‘గజప్రిస్త’ గోపురాలని అంటారు. ఆలయంలోని చెక్క మీద రామాయణ, మహాభారత ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు.



ఈ ఆలయానికి ముందు భాగంలో నదీ, మిగతా మూడు వైపులా కొబ్బరి తోటలూ, వరి పొలాలూ... ఉండి పచ్చదనంతో కళకళలాడుతూ దర్శనమిస్తాయి. 


స్థల పురాణం ...


ఒకానొకప్పుడు మధురవాహినీ నదీతీరంలో మధూరు అనే మహిళ నీటికోసం వెళ్లినప్పుడు గణపతి ఆమె ఎదుట సాక్షాత్కారించి విగ్రహంగా మారిపోతాడు. వెంటనే ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియ జేసి వారి సాయంతో ఆ ఉద్భవమూర్తిని నది ఒడ్డునే ఉన్న శివాలయంలోకి చేర్చు తుంది మధూరు. అందుకనే ఆమె పేరు పైనే మధూరు ఆలయంగా ప్రసిద్ది చెందింది.


 అలానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని టిప్పు సుల్తాన్ దండెత్తి వస్తాడు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలోని బావి 

నీళ్లను తాగిన తరవాత మనసు మార్చుకుని దాడిని విరమించుకుని... స్వామిని భక్తితో కొలిచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు స్థల పురాణం చెబుతోంది.


 బ్రహ్మాండపురాణంలో సాక్షాత్తూ భార్గవ రాముడే ఈ గుడిని నిర్మించి 

వినాయకుడికి పూజలు జరిపించినట్టుగా ఉంది. అయితే 10వ, 15వ శతాబ్దాల్లో ఈ గుడిని పునర్నిర్మించినట్టూ, పలువురు రాజవంశీయులు ఈ గుడికి ధర్మకర్తలుగా ఉన్నట్టూ చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. 



కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్నే ఇక్కడ మహాగణపతికి నైవేద్యంగా పెడతారు. అదే భక్తులకు ప్రసాదంగానూ ఇస్తారు. ప్రతిరోజూ ఉదయాస్తమాన సేవలను ఘనంగా నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి 

అప్పాలతో ప్రతిరోజూ పూజలు జరిపించడం విశేషం. మూడ అప్పం పేరుతో మరో పూజా కార్యక్రమం కూడా జరుపుతారు. 


అందులో

భాగంగా స్వామి వారికి ఏ అలంకారం లేకుండా విగ్రహాన్ని అప్పాలతో కప్పేసి పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. 


వినాయక చవితికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 


🍁🍁🍁

నారాయణ అస్త్రాన్ని"*

 🙏🙏🙏🙏🙏🙏🙏

మహాభారత యుద్ధంలో తన తండ్రి ద్రోణాచార్యుడు చంపబడినప్పుడు అశ్వత్థామకు చాలా కోపం వచ్చింది.

అతను చాలా భయంకర ఆయుధమైన...

*"నారాయణ అస్త్రాన్ని"*

 పాండవ సైన్యం మీదకు వదిలివేసాడు.

అప్పుడు "శ్రీ కృష్ణుడు" ఇలా అన్నాడు.... 

ఎవ్వరూ కూడా...

 *"నారాయణ అస్త్రానికి"*

 ప్రతీకారం తీర్చుకోలేరు.

ఇది మనల్ని... 

మన సేనల్ని కాల్చడానికి వదిలిన అస్త్రం... 

మరియు చేతిలో ఆయుధాలు ఉన్నవారిని వెంటనే నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది....

"శ్రీ కృష్ణుడు" సైన్యంతో తమ ఆయుధాలను విడిచిపెట్టి...

చేతులు నిశ్శబ్దంగా ముడుచుకోవాలని ఆదేశించాడు. 

మరియు యుద్ధం యొక్క ఆలోచనను కూడా మనస్సులోకి తీసుకురావద్దు...

అది వారిని కూడా నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు.

*"నారాయణ అస్త్రమ్"* సమయం ముగిసినప్పుడు నెమ్మదిగా శాంతించింది....

ఈ విధంగా పాండవ సైన్యం రక్షించబడింది.

ఈ కథ మనకు ఒక నీతిని బోధిస్తుంది....

ప్రతిచోటా యుద్ధం విజయవంతం కాదు. 

ప్రకృతి కోపాన్ని నివారించడానికి...

మనం కూడా అన్ని పనులను కొంతకాలం వదిలి...

నిశ్శబ్దంగా చేతులు ముడుచుకుని... 

మంచి మనస్సును దృష్టిలో ఉంచుకుని ఒకే చోట ఉండాలి.

అప్పుడే మనం దాని నాశనాన్ని చూడగలుగుతాము.

👹కరోనా దాని కాల వ్యవధిని పూర్తి చేయడం ద్వారా కూడా చల్లబడుతుంది.

🙏శ్రీ కృష్ణ భగవానుడు పరిహారం చెప్పారు🙏

మనమందరం ఆచరించి తరిద్దాం.

జై శ్రీ కృష్ణా...💐🙏

దైవగతి

 కాన్తం వక్తి కపోతికాకులతయా నాథాన్తకాలోఽధునా


వ్యాధోఽధో ధృతచాపసజ్జితశరః శ్యేనః పరిభ్రామ్యతి


ఇత్థం సత్యహినా స దష్ట ఇషుణా శ్యేనోఽపి తేనాహతః


తూర్ణం తౌ తు యమాలయం ప్రతిగతౌ దైవీ విచిత్రాగతిః



ఆడ పావురం భయంతో వ్యాకులురాలై భర్తతో ఇలా అంటున్నది. "నాథా! ఇప్పుడు మనకు మరణసమయం ఆసన్నమైనది. క్రింద బోయవాడు ధనుస్సు ఎక్కుపెట్టి గురి చూస్తున్నాడు.పైన డేగ తిరుగుతోంది." ఇలా అంటూండగానే ఒక సర్పం బోయవాణ్ణి కాటేసింది.బాణం గురితప్పి డేగకు తగిలింది.ఈ విధంగా బోయవాడు, డేగ కూడ చచ్చినారు.దైవగతి చిత్రంగా ఉంటుంది!


శుభోదయము !

అధిక మాసం. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా ? చేయకూడదా ?_*

 *_నేటి నుండి అధిక మాసం. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా ? చేయకూడదా ?_*


మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. అయితే ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన వచ్చింది.


అయితే ఈ సమయంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రం కచ్చితంగా చేయాలంట. ఎందుకంటే శుభకార్యాలు వేరు. దేవతల పూజలు వేరు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.


ఈ అధిక మాసంలోని 30 రోజులలోని ఏడు రోజులలో ప్రత్యేకించి పౌర్ణమికి ముందుగా భాగవతాన్ని పారాయణం చేయాలి లేదా భాగవతం పారాయణం చేసే పండితులకు ఆ గ్రంధాన్ని అందజేయాలి. భాగవతంలోని దశమ స్కందంలోని క్రిష్ణునికి సంబంధించిన కథనాలను పారాయణం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


ఇలాంటి అవకాశం ప్రతి సంవత్సరం రాదు. ఈ అధిక మాసం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కాబట్టి ఇలాంటి సువర్ణాకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తే.. తమిళనాట ఉండే ప్రజలు సౌరమానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.


*అధికమాసం అంటే ?*

చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చాంద్రమానం కు , సూర్యుని కదలికలను అనుగుణంగా ఉండే సౌర మానంకు లెక్కల్లో కొన్ని తేడాలు వస్తుంటాయి. అందులో సౌరమానంలో సంవత్సరానికి కేవలం 360 రోజులు మాత్రమే వస్తాయి. అదే చాంద్రమానంలో 365 రోజులు వస్తాయి. ఇలాంటి తేడాలను సరిచేసి ఒకే లైనుపై తీసుకొచ్చే ప్రయత్నాన్ని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చేశారు. ఇలా రెండు మానాలను సర్దుబాటు చేసిన కాలాన్నే అధిక మాసం అంటారు.


*ఎప్పుడైతే సంక్రమణం ఉండదో..*


ఈ మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ , ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలు కనిపించవని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో సంక్రమణం కూడా రాదు. అసంక్రాంతి , ద్విసంక్రాంతి వస్తుంది. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతున్నారు.


*శుభకార్యాలు చేయకూడదు..*


ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహ కార్యక్రమాలు , ఇంట్లోకి ప్రవేశించడం , ఉపనయనాల వంటివి చేయకూడదు.


*దేవతలకు పూజలు..*


అయితే ఈ మాసంలో సకల దేవతలకు పూజలు మాత్రం చేయొచ్చు. ఎందుకంటే ఇవి శుభకార్యాలు కాదు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలైన సత్యనారాయణ వ్రతం , దేవుళ్లకు అభిషేకాలు , నవగ్రహ హోమాలు , నవగ్రహ జపాలు , శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం , రామాయణ పారాయణం , ఆంజనేయస్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా వంటివి కచ్చితంగా చేయాలి.


*ఈ నెలలో పుణ్యకార్యాలు చేస్తే..*

ఈ నెల మొత్తం ఒక నియమం పెట్టుకోవాలి. నిత్యం ఇష్టదైవాన్ని తలచుకుని ద్యానం చేయడం లేదా జపం చేయడం వంటివి చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఉదాహరణకు మిగిలిన మాసాల్లో ఒకసారి రామ అంటే , ఒక్కసారే ఫలితం వస్తుంది. అయితే ఈ అధిక మాసంలో అంటే మాత్రం కోటి రెట్ల ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.


*పురుషోత్తమ మాసం..*


ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. ఉత్తమ పురుషగా అందరి జీవులలో ఉండేవాడు.. సర్వజీవులలో ఆత్మస్వరూపుడిగా ఉండే వాడు పరమాత్ముడు. ఆ విధంగా పరమాత్ముడిని దర్శించడానికి , అందుకు ప్రాతిపదికగా తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది.


*దానం చేయడం..*


ఈ కాలంలో దానం చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసంలో పేదలకు లేదా ఇతరులకు ఏమి దానం చేసినా ఎంతో మంచిది. అయితే అన్నిదానాల్లో కన్న మిన్న అయిన అన్నదానం చేస్తే మంచిది లేదా విద్యా దానం చేసినా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలొస్తాయట. ఈ రెండింటికి అధిక ప్రాధాన్యం ఉంది. అయితే ఇవే చేయాలని నియమనిబంధనలేమీ లేవు. కాబట్టి మీరు నిరంతరం భగవంతుడి స్మరణ చేస్తూ.. మీ శక్తి మేరకు మీకు తోచిన సాయం చేయండి.

అద్భుత సృష్టి - 26


 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

          

🌟. *1. మూలాధార చక్రం:-*


ఇది శరీరంలోని (అడ్రీనల్ గ్రంథి) కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మూలాధార చక్రం శరీర అవయవాలు అయిన ఎముకలు, బోన్ మ్యారో (ఎముకల మజ్జ), జుట్టు, కంటి రెటీనా, చర్మం, జాయింట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. 


ప్రాణమయ శరీరంలో పైన చెప్పిన శరీర అవయవాల ప్రాంతంలో బ్లాక్స్ ఏర్పడి ఉంటే ఆ శరీర అవయవంలో ఇబ్బందులు (వ్యాధులు) సంక్రమించడం జరుగుతుంది. ఈ *"బ్లాక్స్"* అనేవి మనలోని అరిషడ్వర్గాల ద్వారా ఏర్పడతాయి. ఇది పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది.


💫. భయం వల్ల ఈ చక్రం బ్లాక్ చేయబడుతుంది. ఈ చక్రంలో *"సర్వైవల్ (మానవ మనుగడ)"* అనే శక్తి ఉంటుంది. ఈ శక్తి ద్వారా భౌతిక అవసరాలు, భౌతిక ఆనందాలు పొందటం జరుగుతుంది.


Eg:-వ్యక్తిత్వ వికాసానికి భౌతికపరమైన అవసరాలకు ఇది సహాయం చేస్తుంది. భూమితో అనుసంధానమై ఉన్నామన్న భావనను కలిగిస్తుంది. సెల్ఫ్ ఇంపార్టెన్స్ ని కలిగిస్తుంది. స్థిరత్వం లభిస్తుంది. భద్రత దొరుకుతుంది. ఈ చక్రం సక్రమంగా పని చేయడం వలన భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయి భౌతిక వాస్తవంతో జీవిస్తాం.


💠. *ఈ చక్రం అండర్ యాక్టివ్ అయితే:-* భయం, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, నిరాశకు గురి అవ్వడం జరుగుతుంది.


🔹. *ఇది ఓవర్ యాక్టివ్ అయితే:-*

అధిక భౌతిక వాదాన్ని కలిగి ఉండటం జరుగుతుంది.


🌈. *ఇది సమస్థితిలో ఉంటే:-*


సర్వైవల్ శక్తి జాగృతి, కుండలినీ జాగృతి అవుతుంది. ఈ చక్రం రంగు ఎరుపు, పృధ్వీతత్వం, గంధం వాసన దీని క్వాలిటీ. ఈ క్వాలిటీ ఎక్కువ అయితే భౌతిక వాసనలో పడిపోతాం. 


ఈ చక్రం ద్వారా మనం భూలోకం తో అనుసంధానం అయినప్పుడు మనం ముముక్షువుగా మన ఆధ్యాత్మిక ప్రగతిని మొదలుపెడతాం! సత్యాన్ని వెదకడం మొదలుపెడతాం.


ఈ చక్రం అడ్రీనల్ గ్రంధి ద్వారా మొదటి స్ట్రాండ్DNAని కనెక్ట్ చేసుకుంటుంది. దీని ద్వారా *"నేను ఏ సత్యాన్ని అయితే స్వీకరిస్తున్నానో.. ఆ సత్యంపై స్థిరంగా ఉన్నాను"* అని చెబుతుంది. (నేనే అంతా- అహం బ్రహ్మాస్మి)


🌀. *సాధన, సంకల్పం:-*


*1.నా మూలాధార చక్రంలో భయం తాలూకు, భౌతికవాదం తాలూకు బ్లాక్స్ మరి వీటికి సంబంధించిన కర్మ ముద్రలు, కర్మ కనెక్షన్స్ అన్నీ రిలీజ్ కావాలని నా పూర్ణాత్మ, పరమగురుమండలిని, మూలచైతన్యాన్ని, కర్మ యొక్క అధి దేవతలను ప్రార్థిస్తున్నాను."*


🌀. *సంకల్పం:-2.* 

*"నేను అహం బ్రహ్మాస్మి స్థితిని అంగీకరిస్తున్నాను. నా మూలాధార చక్రాన్ని పూర్తిగా ఆక్టివేట్ చేసుకుంటున్నాను. నా సర్వైవల్ శక్తి నాలో 100% డెవలప్ చేసుకుంటున్నాను. నా యొక్క అడ్రీనల్ గ్రంధి మరి దానికి అనుసంధానం చేయబడిన శరీర అవయవాలు అన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి."*.. 

🌹 🌹 🌹 🌹 🌹

శివామృతలహరి

            .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||


శివుడే సత్యము; నిత్యమున్ శివుడె; రాశీభూత సౌందర్యమున్

శివుడే; ధర్మముమర్మమున్ శివుడె; సుజ్జేయంబు విజ్ఞానమున్

శివుడే; జ్ఞాతయు నేతయున్ శివుడె ; సంక్షేపింప సర్వాత్ముడౌ

శివుడే లేని శరీరముండు శవమై శ్రీ సిద్ధలింగేశ్వరా!


భావం; ( నాకు తెలిసినంత వరకు)

ఈ చరాచర సృష్టి జగత్తులో

శివుడే నిజము,నిత్యము ప్రకాశించేది శివుడే, నిలువెత్తు అందానికి నిర్వచనము శివుడే, సృష్టి ధర్మమూ, సృష్టి రహస్యం కూడా శివుడే, సమస్త విజ్ఞాన సంపత్తి శివుడే,ఎరుక ఉన్నవాడు శివుడే, ఏలిక శివుడే.

సంగ్రహంగా చెప్పాలంటే అన్ని ప్రాణులలోనూ ఆత్మ స్వరూపంగా శివుడే వెలుగొందుచున్నాడు.

శివుడు లేని శరీరం శవం తో సమానం కదా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

🌸 *సుభాషితమ్* 🌸




శ్లో|| సత్యమేవ జయతే నా2నృతం

సత్యేన పంథా వితతో దేవయాన:

యేనా క్రమం తృషయో హా్యప్త కామా

యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్


తా|| సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

*ధార్మికగీత - 24*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                   

                                        *****

             *శ్లో:- ఆహార నిద్రా భయ మైథునం చ ౹*

                    *సమాన మేతత్ పశుభి ర్నరాణాం ౹*

                    *జ్ఞానో హి తేషా మధికో విశేష: ౹*

                    *జ్ఞానేన హీనాః పశుభి స్సమానాః*

                                        *****

*భా:- సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. ఆహారము, నిద్ర, భయము, దాంపత్య ధర్మము అనే నాలుగు సహజాతాలు పశు పక్ష్యాదులకు, మానవులకు సమానమే. ఇక వాటికి మనకు తేడా ఏముంది ? ఒక్క జ్ఞానమే వాటినుండి మనిషిని వేరు చేస్తున్నది. అన్ని జన్మలలో నరజన్మ దుర్లభమని , మానవునిగా పుట్టడమే సుకృతంగా భావించాలని శాస్త్రం చెబుతోంది. మనిషిగా వివేకము, వివేచన, విచక్షణలతో జ్ఞానంలో పారమ్యమును సాధించాలి. భక్తియోగంలో పునీతుడై, కర్మయోగంలో నిష్ఠాగరిష్ఠుడై, జ్ఞానయోగంలో మేథోమథనం చేస్తూ పరిణతి చెంది , ముక్తిని పొందాలి అనేది గీతాప్రవచనము. '"జ్ఞానే నైవతు కైవల్యం"- జ్ఞానసముపార్జనతోనే మోక్షప్రాప్తి లభిస్తుంది. జ్ఞానం వల్లనే త్రికరణ శుద్ధి,వైరాగ్యము,శమదమాదుల యందు పరిపక్వత, తదేకనిష్ఠ సాధ్యపడతాయి. నరునిగా అట్టి జ్ఞానాన్ని సాధన చేయకపోతే పశువుతో సమానమే సుమా! అనే హెచ్చరికను అనుక్షణం మననం చేసుకొంటూ, కర్తవ్య పరాయణుడై మానవజన్మను సార్థకం చేసుకోవాలి*.

                                *****

                  *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

-- జగమునందు కల్పాంత మగుట ----

 మత్స్యావ తార చరితము -- 4

        మంజరీ ద్విపద 




అంత కల్పాంతంబు యయ్యెను యపుడు 

మెఱుపులు గూడిన మెఘంబు లెన్నొ 

నింగిని జేరియు నిర్విరామముగ 

జడివాన గురిపించె జగములు ముణుగ 

కడలులు చలియలికట్టలన్ దాటి 

యుప్పొంగి పొంగియు నుఱకలు వేసి 

జనపదముల ముంచె జనులు భీతిల్ల 

సర్వ లోకంబులు సంద్ర నీరముతొ 

విస్మయంబుగ నయ్యె నేకార్ణవంబు . 

కల్పాంతమైన యా కాలంబు నందు 

యలలన్ని యగసియు నంబరంబంటె 

మున్నీట మునిగెను ముజ్జగం బంత 

గాఢాంధకారంబు కమ్మెను యపుడు 

అమ్మహా రాత్రందు యజుడద్భుతముగ 

నిరతంబు ప్రాణుల నిర్మించు కతన 

యావులించె నపుడు యలసటం జెంది 

నీల్గించె తనువును నిట్ట నిల్వుగను 

అంత నా పరమేష్టి యాపియు సృష్టి 

కన్నుల ఱెప్పలు కరము వాలంగ 

తనకేలు నునిచియు తలగడ గాను 

నిద్రించ పడుకొనె నిశ్చింత గాను 

అలసి సొలసి నిద్ర నొంది నాతండు 

గొప్ప శబ్దంబుతో గుఱు పెట్ట సాగె 

అలసి సొలసి నిదుర నొందిన యజుని 

ముఖము నుండి వెడలె మొదటి వేదములు 

అప్పుడచ్చోటనే యదనుకై నున్న 

దనుజ హయగ్రీవు డనియెడు దొంగ 

యపహరించి సృతుల నటనుండి బాఱె 

ఇక వాని బట్టంగ నెవరికి తగును ?

తస్కరించిన యట్టి చదువుల నెల్ల 

పఠనంబు సేయుచు బయటుండు టకును 

భయపడె దనుజుండు పగవారి దలచి 

పరమేష్థి యప్పుడే పవళించి యుండి 

గాఢ నిద్రలొ నుంట గాంచి దైత్యుండు 

వేగంబుగా జొచ్చె యుదధి లోపలికి 

అట్లు హయగ్రీవు డంబుధిం దూర 

యాగమ తస్కరుం డతని జయించి 

నిగమంబు లెల్లను మగిడి తెచ్చుటయు 

మ్రాను తీగలయందు మాటున నున్న 

వివిధౌషదంబుల విత్తనంబులను 

సంద్రపు జలముల తడువ కుండగను 

కాపాడ వలసిన కార్యంబు దలచి 

పరమాత్మ శ్రీహరి బ్రహ్మాండమైన 

మత్స్య రూపము దాల్చె మహిమాన్వితముగ 

కుఱుచ ఱెక్కల తోడ గొప్ప మీసలతొ 

పుత్తడి మేనుతో పొట్టి వాలముతొ 

సొంపగు ముఖముతో సొగసు మచ్చలతొ 

మిరుమిట్లు చూపుతో మీద శృంగముతొ 

నమ్మహా మత్స్యంబు నలరారు చుండె .

లక్ష యోజన దైర్ఘ్య లక్షితంబైన 

పాఠీన రూపట్లు పరమాత్మ దాల్చి 

సాగరంబున జొచ్చె సంరంభముగను .

చిద్విలాసుండైన శ్రీమహ విష్ణు 

కల్లోల కడలిలో కలయ దిర్గుచును 

వివిధ విన్యాసముల్ వెడ్కతో జూపె 

ఒకమాటు జలజంతు యూధమున్ గూడు 

నొకమాటు దరులకు నుఱికి తా వచ్చు 

నొకమాటు మింటికి నుఱికి తా నెగురు 

నొకమాటు లోపల నొదియున్ నుండు 

నొకమాటు నొడలను నుదధిలో ముంచు 

నొకమాటు నొడ పెంచి నుదధంత నిండు 

నొకమాటు ఝషకోటి నొడిసియు దినును 

నొకమాటు జలముల నుమియును మిగుల 

గఱులను సారించు గడలు మీసముల 

నొడలను ఝళిపించు పొడలు మెఱ్పించు 

విష్ణు డీరీతిగా వివిధ చేష్టలతొ 

విహరించె మున్నీట వేదముల్ గావ 


గోపాలుని మధుసూదన రావు

వేమన పద్యం *



   


విత్తహీనమైన వేళలందున తల్లి, 

తనయు లాలుసుహృదులనెడు లోకు, 

లెల్ల శత్రు లగుదు రెందును నిజమిది, 

విశ్వదాభిరామ వినురవేమ *


భావము =


ఉద్యోగం పురుష లక్షణం అని పెద్దలు చెబుతారు. మరి అలాంటప్పుడు మగ వాడిగా పుట్టి, ఏపని చేయక ఇంట్లో కూచుని తింటూ ఉంటే, అంతకంటే దౌర్భాగ్యం ఆ మగాడికి ఇంకోటి లేదు. అతి భయంకరమైన, దుర్గతి పట్టించే రోగం సోమరి తనం. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించుకొని ఈ రోజు ఏవిటి పని అని, ఆ పనిలో నిమగ్నం కాకపోతే మగవాడికి (మగ జాతికే )అవమానమ్. అలా సోమరి తనం తో సంపాదన లేకపోతే, భార్య పిల్లలను పోషించలేనపుడు, నిన్ను కన్న తల్లి, కడుపున పుట్టిన పిల్లలు, అగ్నిసాక్షిగా వివాహమాడిcన భార్య, తోబుట్టువులు, స్నేహితులు, ఒకరేమిటి, అందరూ నిన్ను విడచి పోయి, నీ పైన ఓ రకమైన ద్వేషం పెంచుకొని, శత్రుత్వాన్ని ప్రకటిస్తారని, వేమన పద్య భావన, నిజమే గృహ యజమానిగా కస్టపడి నీవు చేస్తున్న పనికి అంకితమైతే, తప్పకుండ మెరుగైన ఫలితాలు ఉంటాయి, అవి నీ కుటుంబానికి, నీకు, నీ సమాజానికి ఎంతో మేలు చేస్తాయి. సోమరులకు గుణ పాఠం చెప్పాలిసిందే. 


మీ రాజబాబు 😷🎹🎼🎤

*అధికమాసంలో శుభకార్యాలు చేయకూడదా?*

 

        ఈ ఏడాది ఆశ్వయుజం అధిక మాసంగా వచ్చింది. ఇది నేటి నుంచి (శుక్రవారం) మొదలవుతోంది. సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ రోజుల సంఖ్యలో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని సమం చెయ్యడానికి నిర్దేశించిన కాలమే అధికమాసం. ఈ సమయంలో సంక్రమణం రాదు. సంక్రమణం రాని మాసాన్ని ‘అధికమాసం’ అంటారు. సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలను అధిక మాసంలో నిర్వహించరు. అయితే శుభ కార్యాలు వేరు, దైవ కార్యాలు వేరు. అధిక మాసంలో దైవ పూజలు తప్పనిసరిగా చేయాలి. దానధర్మాలు ఆచరించాలి. రామాయణ, భాగవతాలనూ, హనుమాన్‌ చాలీసానూ పారాయణం చేయడం పుణ్యప్రదం. అలాగే సత్యనారాయణ వ్రతం, గ్రహ జపాలు ఆచరించాలనీ, దానివల్ల ఫలం అధికంగా ఉంటుందన్నది పెద్దల మాట.

తిరుమల

 .


*సెప్టెంబ‌రు 19నుండి27వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు*


తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్-19 కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో రోజువారీ వివరాలు ఇలా వున్నాయి‌.


...వాహన సేవల సమయాలలో మార్పులు.


..ఉదయం 9 నుండి 10 గంటలు, రాత్రి 7 నుండి 8 గంటల మధ్య వాహన సేవలు.



15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.


18-09-2020

అంకురార్పణం 5pm to 6pm (సాయంత్రం)


19-09-2020

ధ్వజారోహణం 6.00pm to 6.30pm (సాయంత్రం)


19-09-2020

పెద్దశేషవాహనం (రాత్రి)8-30Pm to 9-30 Pm


20-09-2020

చిన్నశేషవాహనం (ఉదయం)9-10 AM

హంస వాహనం (రాత్రి)7-8PM


21-09-2020

సింహ వాహనం(ఉదయం)9-10AM

ముత్యపుపందిరి వాహనం (రాత్రి)7-8PM


22-09-2020

కల్పవృక్ష వాహనం(ఉదయం)9-10AM

సర్వభూపాల వాహన (రాత్రి)7-8PM


23-09-2020

మోహినీ అవతారం (ఉదయం)9-10AM

గరుడ సేవ (రాత్రి)7-8.30 PM


24-09-2020

హనుమంత వాహనం (ఉదయం)9-10AM

స్వర్ణరథం(సర్వభూపూల వాహనం) (సాయంత్రం)4-5PM

గజవాహనం (రాత్రి)7-8PM


 25-09-2020

సూర్యప్రభ వాహనం (ఉదయం)9-10AM

చంద్రప్రభ వాహనం (రాత్రి)7-8PM


26-09-2020

శ్రీవారి రథోత్సవం(సర్వభూపూల వాహనం) 7AM

అశ్వవాహనం (రాత్రి)7-8PM


27-09-2020

చక్రస్నానం (ఉదయం)6-9AM

ధ్వజావరోహణం (రాత్రి)8-9PM


🙏🏻🙏🏻

_*ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు*_


*ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి 27 వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు , అక్టోబరు 16 నుంచి 24 వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు*



తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జన 

ప్రవాహం , తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామ 

స్మరణ , మాడ వీధుల్లో దేవేరులతో స్వామి ఊరేగింపులూ , సాటిలేని 

వైభవంతో సాగే వాహన సేవలు కళ్ళ ముందు కదులుతాయి. ఈ ఏడాది 

అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలను 

నిర్వహించబోతున్నారు. కానీ కరోనా కారణంగా ఈసారి అన్నీ  

ఏకాంతంగానే జరుగుతాయి. ఇలా జరగడం ఇదే మొదటిసారి!



శ్రీవేంకటేశ్వరస్వామి వేంకటాద్రిపై వెలసిన తొలినాళ్ళలో ఆయన బ్రహ్మదేవుడిని పిలిచి , లోక కల్యాణంలో కోసం తనకు విశేషమైన ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు సంతోషంగా అంగీకరించి , శ్రీనివాసుడి కొలువైన తిరుమల క్షేత్రంలో కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణం నక్షత్రం రోజుకు పూర్తయ్యేలా తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించాడట. అందుకే ఈ ఉత్సవాలు ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధి చెందాయి.


తిరుమల చరిత్రను పరిశీలిస్తే వందల ఏళ్ళ నుంచీ వివిధ ఉత్సవాల నిర్వహణ సాగుతోంది. క్షేత్ర పరిపాలన బాధ్యతలను 1843 వరకు ఎందరో రాజులు , ఆర్కాటు నవాబులు , ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు , బ్రిటిష్‌ అధికారులు చేపట్టారు. ఆ తర్వాత హథీరాం మహంతులు 1933 వరకు నిర్వహించారు. ఒకప్పుడు నెలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు జరిగేవట. కొన్ని ఇబ్బందులు , సమస్యల కారణంగా ఏడాదికి ఒకసారి , అధిక మాసంలో రెండుసార్లకు బ్రహ్మోత్సవాలు పరిమితం అయ్యాయి. ఈ వేడుకల్లో శ్రీ వేంకట్వేరుడు తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాలను రద్దు చేయడం కానీ , ఏకాంతంగా నిర్వహించడం కానీ తిరుమయ క్షేత్ర చరిత్రలో లేదు. కాగా 1998లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రాత్రి అశ్వవాహన సేవ ప్రారంభానికి ముందు కుండపోత వర్షం కురిసింది. తిరుమల చెరువును తలపించింది.


మోకాళ్ళ లోతువరకు నీరు రావడంతో ఆ వాహన సేవను రద్దు చేయాలని అర్చకులు , ఆగమపండితులు , అధికారులు నిర్ణయించారు. అయితే రెండు గంటల తర్వాత వర్షం నిలిచిపోయింది. వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోయింది. దీంతో రద్దు చేద్దామనుకున్న అశ్వ వాహన సేవను మాడవీధుల్లో యథాప్రకారం కొనసాగించారు. పూర్వం యుద్ధాలు , దండయాత్రలు జరిగిన రోజుల్లోనూ బ్రహ్మోత్సవాలూ , స్వామి ఊరేగింపులూ ఆగిన సందర్భాలు తమకు తెలిసి ఎక్కడా లేవని అర్చకులు చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా శ్రీనివాసుడు తన ఉభయ దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటిని కటాక్షిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఏడాది ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల మీద కూడా పడింది. వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. తిరుమల చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం.


*మహా రథానికి సైతం విరామం*


ఈ ఏడాది ఆశ్వయుజంలో అధికమాసం వచ్చింది. కాబట్టి వార్షిక (సాలకట్ల) బ్రహ్మోత్సవాలను అధిక మాసంలో , నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిజ మాసంలో నిర్వహించబోతున్నారు. ఇవన్నీ ఆలయంలోని కల్యాణమండపం , రంగనాయక మండపంలోనే జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే తొలి రోజు పెద్దశేషవాహనం నుంచి చివరిరోజు అశ్వవాహనం వరకు అన్ని వాహన సేవలనూ కల్యాణ వేదికలోనే కొనసాగిస్తారు. ఉత్సవమూర్తులకు అలంకరణ , సల్లింపు , శాత్తుమెర , స్నపన తిరుమంజనం వంటి కార్యక్రమాలు రంగనాయక మండపంలో జరుగనున్నాయి. ఏ రోజు వాహనాన్ని ఆ రోజు కల్యాణ వేదికలో సిద్ధంగా ఉంచుతారు. విశేష అలంకరణలో ఉత్సవమూర్తులను తిరుచ్చిపై మంగళవాయిద్యాలతో పక్కనే ఉన్న కల్యాణవేదికకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి , వాహనంపై కొలువు తీర్చుతారు. అక్కడ దివ్య ప్రబంధ పారాయణం , వేదపారాయణం , హారతి , నైవేద్య సమర్పణ చేస్తారు. అనంతరం జీయర్‌ బృందం శాత్తుమొర నిర్వహిస్తుంది. ఆ తర్వాత మరోసారి హారతి సమర్పించి ఉత్సవమూర్తులు తిరిగి రంగనాయక మండపానికి వేంచేపు చేస్తారు. ఈ విధంగా ఆలయం నుంచి వాహనాన్ని వెలుపలకు తీసుకురాకుండా , భక్తులెవరినీ అనుమతించకుండా పూజలను , ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏకాంత కార్యక్రమాల్లో అర్చకులు , జీయర్‌స్వాములు , అధికారులు సైతం పరిమిత సంఖ్యలో పాల్గొంటారు.



సాధారణంగా మాడవీధుల్లో రెండు గంటల పాటు కొనసాగే వాహనసేవ రంగనాయక మండపంలో నలభై అయిదు నిమిషాల నుంచి గంట సేపు మాత్రమే ఉంటుంది. ఉదయం వాహన సేవలు తొమ్మిది గంటలకు , రాత్రి వాహన సేవలు ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులూ వైదిక కార్యక్రమాలన్నిటినీ ఆలయానికే పరిమితం చేస్తున్నారు. చివరి రోజు పుష్కరిణిలో అత్యంత వైభవంగా జరిగే చక్రస్నానం కూడా ఆలయంలోనే నిర్వహించనున్నారు. అదే విధంగా బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన స్వర్ణ రథోత్సవం , మహా రథోత్సవాల ఊరేగింపులను రద్దు చేశారు. వాటికి బదులు ఆ సమయాల్లో సర్వభూపాల వాహనంపై ఉత్సవమూర్తులను కొలువుతీర్చి హారతులిస్తారు. దాదాపు ఆరువందల ఏళ్ళ చరిత్ర కలిగిన మహారథం సైతం ఈసారి బ్రహ్మోత్సవాల్లో కనిపించదు. 


*ఈ ఏడాది రెండుసార్లు..*    


చాంద్రమానం ప్రకారం మూడేళ్ళకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక (సాలకట్ల) బ్రహ్మోత్సవాలనూ , నిజ ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అధికమాసం ఆశ్వయుజంలో వచ్చింది. కాబట్టి వార్షిక బ్రహ్మోత్సవాలు అధిక ఆశ్వయుజంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్దగా వత్యాసం లేదు. వైఖానస ఆగమం ప్రకారం మొదటి బ్రహ్మోత్సవాల కన్నా రెండవ బ్రహ్మోత్సవాలను కాస్త తక్కువ స్థాయిలో, కొద్దిపాటి మార్పులతో నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం , ధ్వజావరోహణం , ప్రభుత్వం పట్టువస్త్రాల సమర్పణ , స్నపన తిరుమంజనం , కొత్త గొడుగుల సమర్పణ , మహారథం ఊరేగింపు , శ్రీవిల్లిపుత్తూరు మాలల సమర్పణ లాంటివి ఉండవు. ఉత్సవాల ఆరో రోజున సాయంత్రం స్వర్ణ రథోత్సవానికి బదులుగా పుష్పకవిమానంలో స్వామివారు విహరిస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి 27 వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు , అక్టోబరు 16 నుంచి 24 వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ఈ శతాబ్ధపు అధిక మాసాలు



సంవత్సరముమాసము

2001 వృష– ఆశ్వీయుజ మాసము

2004 తారణ– శ్రావణ మాసము

2007 సర్వజిత్తు– జ్యేష్ట మాసము

2010 వికృతి– వైశాఖ మాసము

2012 నందన– భాద్రపద మాసము

2015 మన్మథ– ఆషాడ మాసము

2018 విలంబి– జ్యేష్ట మాసము

2020 శార్వరి– ఆశ్వీయుజ మాసము

2023 శోభకృతు– శ్రావణ మాసము

2026 పరాభవ– జ్యేష్ట మాసము

2029 సాధారణ– చైత్ర మాసము

2031 విరోధికృతు– భాద్రపద మాసము

2034 ఆనంద– ఆషాడ మాసము

2037 పింగళ– జ్యేష్ట మాసము

2039 సిధ్ధార్థి– ఆశ్వీయుజ మాసము

2042 దుందుభి– శ్రావణ మాసము

2045 క్రోధన– జ్యేష్ట మాసము

2048 శుక్ల– చైత్ర మాసము

2050 ప్రమోదూత– భాద్రపద మాసము

2053 శ్రీముఖ– ఆషాడ మాసము

2056 ధాత– వైశాఖ మాసము

2058 బహుధాన్య– ఆశ్వీయుజ మాసము

2061 వృష– శ్రావణ మాసము

2064 తారణ– జ్యేష్ట మాసము

2067 సర్వధారి– చైత్ర మాసము

2069 విరోధి– శ్రావణ మాసము

2072 నందన– ఆషాడ మాసము

2075 మన్మథ– వైశాఖ మాసము

2077 హేవిలంబి– ఆశ్వీయుజ మాసము

2080 శార్వరి– శ్రావణ మాసము

2083 శోభకృతు– జ్యేష్ట మాసము

2086 ప్లవంగ– చైత్ర మాసము

2088 కీలక– శ్రావణ మాసము

2091 విరోధికృతు– ఆషాడ మాసము

2094 ఆనంద– వైశాఖ మాసము

2096 నల– భాద్రపద మాసము

2099 సిధ్ధార్థి– శ్రావణ మాసము


.

*స్థిరచిత్తం*



జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తిచెయ్యాలంటారు పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం పనుల్ని సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.


ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు, మత్స్యయంత్రం ఛేదనకు పూనుకొన్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు- రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.


మనసు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా కడవరకు సాగదు. ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు మనసుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్యసఫలతకు కృషి చేసే సాధకుడు మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనసును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి.


అహంకారం అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్యసాధనకోసం పురోగమించే వ్యక్తి అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలి రా, నేను కనబడతాను’ అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలా అహంకరించినవాడు కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు ప్రతీక.


మనిషి తన జీవిత కాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటల్ని ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి. నరికిన మోడు నుంచి చిగురించిన పచ్చని మొక్కలా తనను తాను మలచుకోవాలి.


సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు. సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాలదృక్పథుడిగా మార్చడమే. భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను... సమయానుకూలతను బట్టి ధాన్యరూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప- అనుకొని పంటసిరి మురిసిపోతుంది!

పోత‌న త‌ల‌పులో ...56



             ***

ఈ యుత్తమశ్లోకుఁ డెలమి జన్మింపంగ-

  యాదవకుల మెల్ల ననఘ మయ్యె,

నీ పుణ్యవర్తనుం డే ప్రొద్దు నుండంగ-

  మథురాపురము దొడ్డ మహిమఁ గనియె,

నీ పూరుషశ్రేష్ఠు నీక్షింప భక్తితో-

  ద్వారకావాసులు ధన్యులైరి,

యీ మహాబలశాలి యెఱిఁగి శిక్షింపంగ-

  నిష్కంటకం బయ్యె నిఖిలభువన,

               **

మీ జగన్మోహనాకృతి నిచ్చగించి

పంచశర భల్ల జాల విభజ్యమాన

వివశమానసమై వల్లవీసమూహ

మితని యధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు.


       *****

“ ఈపుణ్యమూర్తి జన్మించటం మూలంగానే యాదవవంశం పవిత్రమైనది. ఈ సచ్చరిత్రుడు నివసిస్తు ఉండటం వలననే మధురానగరం మహిమాన్వితమై ప్రసిద్ధమైనది. ఈ పురుషోత్తముణ్ణి అనుక్షణం వీక్షించటం చేతనె ద్వారకలో ఉండే పౌరులు ధన్యాత్ములైనారు. ఈ వీరాధివీరుడు క్రూరాత్ములను ఏరి పారవేయటం ద్వార ఈ విశాల విశ్వం ప్రశాంతంగా మనగలుగుతున్నది. ఈ జగన్మోహనుని సౌందర్యాన్ని సందర్శించి, మన్మథ శరపరంపరలకు చలించిన హృదయాలతో వ్రేపల్లెలోని గోపస్త్రీలు ఎల్లవేళల ఈ నల్లనయ్య మోవి తేనియలు త్రావుచూ ఉంటారు.


🏵️పోత‌న ప‌ద్యం🏵️

🏵️జగన్మోహనకరం🏵️

అనుభవించుటకు ఆయువు కావలెను

 పరి త్వా గిహి వణో గిహ/ ఈ మా భవన్తు విశ్వతః/ వృధ్దాయుం అను వృధ్దయెూ జుష్టా భవన్తు జుష్టయః. యిక్కడ మీఢుష్టమ శివ తమ శివోన సుమనా భవ. వక సారి మనం కనుక ఆలోచన చేస్తే అమిత మైన శక్తి ప్రకంపనలు వినడం కాని చూచుట కాని మన తరం కాదు. ఎందుకనగా మావ పంచేన్ద్రియములు వాటి మనుగడకు వీలుపడదు.వీటికి మనస్సనే యింద్రయములు మాత్రమే గుర్తిచగలదు.ఈ మా భవన్తు విశ్వతః ఈ అనే శక్తి మా పూర్ణమైన జీవ లక్షణము విశ్వవ్యాప్తియైయున్నది ఈ మా గ్ం రుద్రాయ తపసే కపర్దినే . తపస్సు చేస్తే అనగా ఆనందంగా కర్మ ఫలములను అనుభవించుటకు తపస్సు యని తెలియును. వృధ్దాయుం అను వృధ్దయెూ, ఆయువు అనగా జీవ శక్తి పూర్ణమైనది వృధ్ది చెందిన అనగా ఈ జన్మలో చేసిన పాప పుణ్యములు శేషమైనను పరంపరగా వచ్చు కర్మములు యీ జన్మ లోనే ఆనందంగా అనుభవించుటకు దేహము కారణము. అనుభవించుటకు ఆయువు కావలెను

లేనిచో శేషం మిగిలి యుండును. మిగిలిన యున్న మరో జన్మ ఎత్త వలెను. అలా కాకుండా ఆయువు వృధ్ది పొందుట కర్మ ఫలములను ఆనందంగా అనుభవించి సశేషంగా జీవి ముక్తి పొందునట్లు పూర్ణ లక్షణమని వేద వాక్కు.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

సంతాన సాఫల్యం..


సుమారు ఆరేడు ఏళ్ల క్రిందట..నవంబరు నెల చివరి శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం దగ్గరకి ఓ భార్యా భర్త వచ్చారు..


"ఇక్కడ ఈ రాత్రికి నిద్ర చేయాలంటే..రూము ఏదైనా ఉంటుందా ?.." అని అడిగారు..అప్పటికి శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద ఒకటి రెండు రూములు తప్ప మరేమీ లేవు..వచ్చిన భక్తులలో ఎక్కువమంది శ్రీ స్వామివారి మందిరం లోని మంటపాల లోనే కాలం గడుపుతూ వుండేవారు..ఆ వచ్చిన దంపతులు అదే మొదటిసారి శ్రీ స్వామివారి మందిరానికి రావడం..ఆ శనివారం నాడు పెద్దగా భక్తుల తాకిడి లేని కారణంగా వారి పేర్లు నమోదు చేసుకొని..ఒక గది వాళ్లకు ఇచ్చాము..


ఇద్దరూ తమ గదికి వెళ్లి..స్నానాదికాలు ముగించుకొని..మళ్లీ ఐదు గంటలకల్లా మందిరం లోకి వచ్చారు..నేరుగా నేను కూర్చుని ఉన్న చోటుకి వచ్చి.."అయ్యా!..మేము ఇదే మొదటిసారి ఈ గుడికి రావడం..ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి?..ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే..చాలా మంచి జరుగుతుందట కదా..మాకు మా ఊళ్ళో వాళ్ళు చెప్పగా విని..ఒకసారి చూసి..నిద్ర చేసిపోదామని వచ్చాము..శ్రీ స్వామివారి గురించి కూడా మాకు పెద్దగా తెలీదు.. మీరు మాకు వివరిస్తారా?.." అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలుంకురిపించారు..


ముందు వాళ్ళను స్థిమితంగా కూర్చోమని చెప్పి..క్లుప్తంగా శ్రీ స్వామివారి గురించి..ఆయన చేసిన తపోసాధన గురించి..వివరించి..ఏదైనా సమస్యలున్నవాళ్ళు..ఇక్కడ నిద్ర చేసి..ఆ స్వామివారికిి తమ సమస్య గురించి చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందనే విశ్వాసం ఉన్నదనీ..మీకు కూడా ఏదేని సమస్య ఉన్నట్లయితే..మీరు కూడా మొక్కుకోవచ్చనీ తెలిపాను..అంతా విన్న తరువాత..ఆ దంపతులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని.."మాకు వివాహం జరిగి దాదాపు పది సంవత్సరాలు గడిచాయండీ..సంతానం లేదు..మూడు నాలుగు సంతాన సాఫల్య కేంద్రాలలో పరీక్షలు కూడా చేయించుకున్నాము..ఏవో ట్రీట్మెంట్ అంటూ చెప్పారు గానీ..ఫలితం లేదు..డబ్బు మాత్రం ఖర్చు అయింది..ఇక్కడికొచ్చి మ్రొక్కుకుంటే...సంతానం కలుగుతుందని విన్నాము.. అందుకోసమే ఇక్కడ నిద్ర చేయాలని నిశ్చయించుకుని..వచ్చాము.." అన్నారు..


"మీరు మనస్ఫూర్తిగా శ్రీ స్వామివారి మీద విశ్వాసం ఉంచి..ఆ సమాధి ముందు మ్రొక్కుకోండి..ఆ పై మీ అదృష్టం.." అని చెప్పి.."ఇంకాసేపటిలో పల్లకీ సేవ మొదలవుతుంది..అందులో పాల్గొనండి.." అని చెప్పాను..సరే అన్నట్లు తలా ఊపారిద్దరూ..


ఆరోజు పల్లకీ సేవలో ఆ దంపతులిద్దరూ తమ పేరుతో అర్చన చేయించుకున్నారు..భర్త మాత్రం శ్రీ స్వామివారి మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు పల్లకీ మోస్తూ తిరిగాడు..రాత్రికి ఆ మంటపం లోనే పడుకున్నారు.. మళ్లీ ఉదయం లేచి..శ్రీ స్వామివారి సమాధికి మ్రొక్కుకొని..తమ ఊరికి వెళ్లిపోయారు..వెళ్లేముందు నా దగ్గరకు వచ్చి..నా ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్లారు..


ఆ తరువాత వాళ్ళ గురించి వివరాలేమీ తెలియలేదు..మూడు నెలలు గడిచిపోయాయి..మళ్లీ మహాశివరాత్రి గడచిపోయిన తరువాత..ఒక శనివారం మధ్యాహ్నం నాడు..మళ్లీ మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఇద్దరి ముఖాలూ సంతోషంతో విప్పారి ఉన్నాయి..నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చి.."అయ్యా..శ్రీ స్వామివారు మమ్మల్ని కరుణించారు.." అన్నారు..

నేను మాట్లాడేలోపలే.."ఆరోజు ఇక్కడ నిద్రచేసి..తెల్లవారి శ్రీ స్వామివారి సమాధికి మ్రొక్కుకొని మా ఊరికి వెళ్ళామా..ఆరోజు రాత్రి తనకు స్వప్నంలో శ్రీ స్వామివారు ఆశీర్వదించినట్లు కనిపించింది..తాను ఉలిక్కిపడి లేచి కూర్చుని..నన్ను నిద్రలేపి..నాకు విషయం చెప్పింది..ఆ ప్రక్కరోజు నుంచి..ఇద్దరమూ అత్యంత విశ్వాసం తో శ్రీ స్వామివారి ని కొలుచుకుంటున్నాము..ప్రస్తుతం తనకు రెండో నెల!.." అని చెప్పాడు..ఆ దంపతుల విశ్వాసమే వాళ్లకు ఫలితాన్ని ఇచ్చింది..నమ్మి కొలిచిన వాళ్ల కోరికలు తీరుస్తాననీ.. తన సమాధి నుంచే తాను అందరినీ కాపాడుతాననీ..శ్రీ స్వామివారు చెప్పిన మాట మరొక్కసారి ఋజువు అయింది..


మొదటి సంతానంగా ఆడపిల్ల, ఆతరువాత మరో రెండేళ్లకు మగపిల్లవాడు పుట్టారు..అమ్మాయి కి మూడోనెల వయసు వచ్చిన తరువాత మందిరానికి వచ్చి..అన్నదానం చేసి వెళ్లారు..అలాగే పిల్లవాడు పుట్టిన మూడు నెలలకు మళ్లీ అన్నదానం చేసి వెళ్లారు..ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఆనందంగా వున్నారు..తరచూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి నిద్ర చేసి వెళుతుంటారు..


ఎందరో భక్తులు..ఒక్కొక్కరివి ఒక్కొక్క అనుభవం..తెలుసుకోవాలే గానీ..శ్రీ స్వామివారు చూపిన..చూపుతున్న మహిమలను లెక్కగట్టగలమా?..మనం గోరంత విశ్వాసాన్ని చూపితే..కొండంత ఫలితాన్ని ఇస్తాడు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).