గుణత్రయవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - త్రిగుణములను దాటినవాడు మోక్షపదవినొందునని శ్రీకృష్ణభగవానుడు చెప్పగనే, అట్లు దాటిన వాడు ఏయే లక్షణములతో గూడియుండునో తెలిసికొనవలెనని అర్జునునకు కుతూహలముగలుగ, ఆ విషయమును గుఱించి భగవానుని ప్రశ్నించుచున్నారు–
అర్జున ఉవాచ :-
కైర్లింగైస్త్రీన్గుణానేతాన్
అతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాం స్త్రీన్గుణానతివర్తతే ||
తాత్పర్యము:- అర్జును డడిగెను -- ప్రభువగు ఓ కృష్ణా! ఈ మూడుగుణములను దాటినవాడెట్టి లక్షణములతో గూడియుండును? ఎట్టి ప్రవర్తన గలిగియుండును? మఱియు ఈ మూడు గుణములను నాతడు ఏ ప్రకారము దాటివేయగలడు?
వ్యాఖ్య:-మూడుగుణములను దాటినవాడు జన్మమృత్యుజరాదుఃఖములనుండి విడివడి అమృతత్వము (మోక్షము)ను బొందునను భగవద్వాక్యమును వినినవెంటనే అర్జునునకు ఆ గుణము లెట్లు దాటబడునో, అట్లు దాటినవా డెట్లు ప్రవర్తించునో ఏ లక్షణములు, గుర్తులు గలిగియుండునో తెలిసికొనదలంచి వెంటనే ఆ విషయమును గూర్చి భగవానుని ప్రశ్నించివైచెను.
“కైర్లిఙ్గైః” = "ఏ లక్షణములచే, ఏ గుర్తులచే గుణాతీతుడు తెలియబడగలడు?" అని అర్జునుడు అడుగుట చాల సమంజసముగా నున్నది. ఏలయనిన కొందఱు తాము చాల క్రిందిస్థితియం దున్నప్పటికిని, దృశ్యవాసనలు తమకింకను నశింపకున్నప్పటికిని, తాము సిద్ధపురుషులమనియు, గుణాతీతులమనియు, జీవన్ముక్తుల మనియు చెప్పకొని తిరుగుచు ప్రజలను మోసము చేయవచ్చును. గుణాతీతుని యథార్థమగు లక్షణములు, చిహ్నములు తెలిసికొనినచో, ఇక నట్టిస్థితికి అవకాశములేదు. పైగా అట్టి లక్షణములను ఎఱిగియున్నచో మనుజుడు తానుకూడ ప్రయత్నాతిశయముచే వానిని సాధించుటకును వీలుండును. ఇవియన్నియు ఆలోచించి అర్జునుడు సమయోచితమగు ప్రశ్నగావించెను. ఇదివఱలో గీతప్రారంభమునందు రెండవ అధ్యాయమున 'స్థితప్రజ్ఞస్య కా భాషా" - అను నీప్రకారముగ ఇట్టి ప్రశ్ననే అర్జునుడు కావించి యుండుట ఈ సందర్భములో గమనింపదగియున్నది. ఈ స్థితప్రజ్ఞలక్షణములుగాని, గుణాతీతుని లక్షణములుగాని, అద్వేష్టృత్వాది భక్తలక్షణములుగాని, అమానిత్వాది జ్ఞానగుణములుగాని ఒక "బరామీటరు” (Barometre) వంటివి. ‘బరామీటర్' చే శీతోష్ణస్థితు లెట్లు కొలవబడునో, అట్లే మనుజుని ఆధ్యాత్మికౌన్నత్యము ఈ లక్షణములచే కొలవబడగలదు. ఈ లక్షణములను బట్టి చూచినచో జనులలో ఆధ్యాత్మికశక్తిగలవారెవరో, వేషధారులెవరో సులభముగ తేలిపోవును, శుష్కవేదాంతమును రూపుమాపుటకు, పరమార్థక్షేత్రమునందు
సోమరులచే కల్పింపబడిన కృత్రిమవాతావరణమును విచ్ఛిన్నమొనర్చుటకు ఇట్టి ప్రశ్నలెంతయో ఆవశ్యకములైయున్నవి.
‘కిమాచారః’ - గుణాతీతుని ఆచరణ, అనుష్ఠానము ఎట్టిదో అర్జును డెఱుగ దలంచెను. "కిమాసీత వ్రజేత కిమ్" - అని యిట్టి యాచరణనుగూర్చియే యిదివఱలో అర్జునుడు ప్రశ్నించియుండెను. ఆధ్యాత్మికక్షేత్రమున అనుష్ఠానమునకు గొప్ప ప్రాధాన్య మొసంగబడియున్నది. "సాధ్య” వస్తువునుగుఱించి, లక్ష్యమును గురించి తెలిసికొనుట అవసరమైయున్నను, ఆ లక్ష్యము ఏ సాధనచే బొందబడగలదో దాని నెఱుగుట ఇంకను ఆవశ్యకమైయున్నది. ఏలయనిన, ‘సాధన' నవలంబించినచో “సాధ్యము" దానియంతట నదియే చేకూరును. కనుకనే అర్జునుడు గుణాతీతునియొక్క ప్రవర్తనయెట్టిదో తెలిసికొన దలంచెను. అర్జునుని ఈ ప్రశ్న దానికి భగవాను డొసంగబోవు సమాధానము పాఠకలోకమునకు చాల ముఖ్యములైయున్నవి. గీతలో సాధనసంబంధమైన ప్రముఖ ఘట్టములలో నిదియు నొకటైయున్నది. కావున ముముక్షువులీ గుణాతీతుని లక్షణములను బాగుగ మననముచేసి, కార్యాన్విత మొనర్చుకొనవలయును.
ప్రశ్న:- అర్జునుడు భగవానునిద్వారా ఏ యే విషయములను తెలిసికొనదలంచెను?
ఉత్తరము:- (1) గుణాతీతుని లక్షణము లెవ్వి? (2) ఆతని ప్రవర్తన యెట్టిది? - అను విషయములను తెలిసికొనదలంచెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి