హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతారు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒకో ప్రత్యేకత. ఒకొక్కరికీ ఒకో ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది. అలా ఉత్తరభారత ప్రజలంతా భయంతోనూ భక్తితోనూ కొలుచుకునే మానసాదేవి ఒకరు. ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట. పృధ్వి మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులని చేస్తున్నాయట. అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యప ముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు. ఆమే మానసాదేవి! మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుని కుమార్తెగా పేర్కొన్నారు. ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం సందేహం లేదు. క్షీరసాగరమథనం సందర్భంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగినప్పుడు, ఆ విషం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెబుతారు.
కేవలం సర్పాలకే కాదు... సంతానానికీ, సంపదకు కూడా మానసాదేవి అధిపతే! అందుకనే కులాలకు అతీతంగా బెంగాల్లోని ఇంటింటా మానసాదేవి ప్రతిమ పూజలందుకుంటూ కనిపిస్తుంది. ఒంటి నిండా సర్పాలతో, తల మీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తాయి. మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె కుమారుడైన అస్తీకుడే అంటారు! ఈ అస్తీకుని జననం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన పురాణగాథ వినిపిస్తుంది....
పూర్వం జరత్కారు అనే మహాముని ఉండేవాడట. ఆయన కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ఆయన దేశసంచారం చేస్తుండగా కొందరు చెట్టుకి తలకిందులుగా వేలాడటం గమనించాడు. ‘ఎవరు మీరు! ఎందుకిలా తలకిందులుగా వేలాడుతున్నారు?’ అని అడగ్గా ‘మేమంతా మీ పితృదేవతలం. నువ్వు వివాహం చేసుకోకపోవడం వల్ల మాకీ కర్మ పట్టింది. నువ్వు వివాహం చేసుకుని, సంతానాన్ని కంటే కానీ మాకు ఉత్తమగతుల కలగవు,’ అని చెప్పుకొచ్చారు. అంతట జరత్కారు తనకు తగిన జోడైన మానసాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు వారికి జన్మించిన కుమారుడే అస్తీకుడు!
మానసాదేవి, జరత్కారు, అస్తీకుల గురించి అనేక కథలు పురాణగాథలలోనూ, ప్రాచీన కావ్యాలలోనూ కనిపిస్తాయి. మానసాదేవి మహిమ గురించి వందల ఏళ్ల క్రితమే ‘మంగళకావ్యాల’ పేరుతో బెంగాల్లో అనేక కావ్యాలు వెలువడ్డాయి. వీటిలో చిత్రవిచిత్రమైన గాథలెన్నో కనిపిస్తాయి. మానసాదేవి ఆరాధన చాలా చిత్రంగా ఉంటుంది. చెట్టు కొమ్మ, మట్టి కుండ, నాగరాయి, పుట్ట... ఇలా ఏ రూపులో అయినా ఆమెను కొలుచుకోవచ్చు. అసలు ఏ రూపూ లేకుండా కూడా ఆమెను ధ్యానించవచ్చు. ఇటు ఆచారయుక్తమైన ఆలయాలలో మూలవిరాట్టుగా, అటు గ్రామదేవతగానూ ప్రజల పూజలందుకుంటూ ఉంటుంది. ఆ పూజలకు తగిన ఫలితం ఉంటుందన్నది ఆమెను నమ్మినవారి భావన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి