మత్స్యావ తార చరితము -- 4
మంజరీ ద్విపద
అంత కల్పాంతంబు యయ్యెను యపుడు
మెఱుపులు గూడిన మెఘంబు లెన్నొ
నింగిని జేరియు నిర్విరామముగ
జడివాన గురిపించె జగములు ముణుగ
కడలులు చలియలికట్టలన్ దాటి
యుప్పొంగి పొంగియు నుఱకలు వేసి
జనపదముల ముంచె జనులు భీతిల్ల
సర్వ లోకంబులు సంద్ర నీరముతొ
విస్మయంబుగ నయ్యె నేకార్ణవంబు .
కల్పాంతమైన యా కాలంబు నందు
యలలన్ని యగసియు నంబరంబంటె
మున్నీట మునిగెను ముజ్జగం బంత
గాఢాంధకారంబు కమ్మెను యపుడు
అమ్మహా రాత్రందు యజుడద్భుతముగ
నిరతంబు ప్రాణుల నిర్మించు కతన
యావులించె నపుడు యలసటం జెంది
నీల్గించె తనువును నిట్ట నిల్వుగను
అంత నా పరమేష్టి యాపియు సృష్టి
కన్నుల ఱెప్పలు కరము వాలంగ
తనకేలు నునిచియు తలగడ గాను
నిద్రించ పడుకొనె నిశ్చింత గాను
అలసి సొలసి నిద్ర నొంది నాతండు
గొప్ప శబ్దంబుతో గుఱు పెట్ట సాగె
అలసి సొలసి నిదుర నొందిన యజుని
ముఖము నుండి వెడలె మొదటి వేదములు
అప్పుడచ్చోటనే యదనుకై నున్న
దనుజ హయగ్రీవు డనియెడు దొంగ
యపహరించి సృతుల నటనుండి బాఱె
ఇక వాని బట్టంగ నెవరికి తగును ?
తస్కరించిన యట్టి చదువుల నెల్ల
పఠనంబు సేయుచు బయటుండు టకును
భయపడె దనుజుండు పగవారి దలచి
పరమేష్థి యప్పుడే పవళించి యుండి
గాఢ నిద్రలొ నుంట గాంచి దైత్యుండు
వేగంబుగా జొచ్చె యుదధి లోపలికి
అట్లు హయగ్రీవు డంబుధిం దూర
యాగమ తస్కరుం డతని జయించి
నిగమంబు లెల్లను మగిడి తెచ్చుటయు
మ్రాను తీగలయందు మాటున నున్న
వివిధౌషదంబుల విత్తనంబులను
సంద్రపు జలముల తడువ కుండగను
కాపాడ వలసిన కార్యంబు దలచి
పరమాత్మ శ్రీహరి బ్రహ్మాండమైన
మత్స్య రూపము దాల్చె మహిమాన్వితముగ
కుఱుచ ఱెక్కల తోడ గొప్ప మీసలతొ
పుత్తడి మేనుతో పొట్టి వాలముతొ
సొంపగు ముఖముతో సొగసు మచ్చలతొ
మిరుమిట్లు చూపుతో మీద శృంగముతొ
నమ్మహా మత్స్యంబు నలరారు చుండె .
లక్ష యోజన దైర్ఘ్య లక్షితంబైన
పాఠీన రూపట్లు పరమాత్మ దాల్చి
సాగరంబున జొచ్చె సంరంభముగను .
చిద్విలాసుండైన శ్రీమహ విష్ణు
కల్లోల కడలిలో కలయ దిర్గుచును
వివిధ విన్యాసముల్ వెడ్కతో జూపె
ఒకమాటు జలజంతు యూధమున్ గూడు
నొకమాటు దరులకు నుఱికి తా వచ్చు
నొకమాటు మింటికి నుఱికి తా నెగురు
నొకమాటు లోపల నొదియున్ నుండు
నొకమాటు నొడలను నుదధిలో ముంచు
నొకమాటు నొడ పెంచి నుదధంత నిండు
నొకమాటు ఝషకోటి నొడిసియు దినును
నొకమాటు జలముల నుమియును మిగుల
గఱులను సారించు గడలు మీసముల
నొడలను ఝళిపించు పొడలు మెఱ్పించు
విష్ణు డీరీతిగా వివిధ చేష్టలతొ
విహరించె మున్నీట వేదముల్ గావ
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి