18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఆదిపర్వము – 23

 


ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజుల జన్మవృత్తాంతం


ఇది అంతా విన్న సత్యవతికి ఒక ఆలోచన వచ్చింది. తను కన్యగా ఉండగా పరాశరుని వలన పుట్టిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే ఆ విషయం భీష్మునికి చెప్పింది.


“కుమారా, వ్యాసుడు సమస్త ధర్మాలు తెలిసినవాడు. గొప్ప తపస్వి. ఆయన వలన నీ తమ్ముడి భార్యలకు సంతానం కలుగుతుంది” అని చెప్పింది. వెంటనే మనసారా తన కుమారుడైఅ వ్యాసుని ప్రార్థించింది. వ్యాసుడు తల్లి ముందు ప్రత్యక్షం అయ్యాడు. చాలా రోజూల తరువాత వచ్చిన కొడుకుని చూసి ఆనందించింది సత్యవతి. వ్యాదుడు తల్లికి నమస్కరించాడు. భీష్ముడు వ్యాసుని సత్కరించాడు. సత్యవతి కుమారుని చూసి “కుమారా, ఈ రాజ్యానికంతా వారసుడైన ఈ భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞతో, వివాహానికి, రాజ్యాధికారానికి దూరం అయ్యాడు. నాకు వేరే కుమారులు లేకపోవడం వల్ల ఈ వంశం ఇంతటితో ఆగిపోయే ప్రమాదం ఉంది. ధర్మ సమ్మతమైన దేవర న్యాయమున, నీ తమ్ముని భార్యలయందు సంతానము పొందుము” అని చెప్పింది సత్యవతి.


“అమ్మా, నీవు అజ్ఞాపించినట్లే చేస్తాను” అని అన్నాడు వ్యాసుడు.


(దేవర న్యాయమనగా, ఎవరైనా ఒక మహారాజుకు సంతానం లేనపుడు గాని, సంతాన హీనునిగా మరణించినపుడు గాని, ఆ మహారాజు భార్య, ఒక వేద విదుడు, పుణ్య చరితుడు, సద్గుణ సంపన్నుడు అయిన బ్రాహ్మణునితో సంగమించి సంతానమును పొందుట)


సత్యవతి తన పెద్దకోడలు అంబికను ఆరోజు రాత్రి వ్యాసుని వద్దకు పంపింది. సన్నగా, నల్లగా పొడుగ్గా, జడలతో వికృతంగా ఉన్న వ్యాసున్ని చూసి భయంతో కళ్లు మూసుకుంది అంబిక. వ్యాసుడు ఆమెకు పుత్ర దానం చేసాడు. అంబికకు మహా బల పరాక్రమవంతుడైన కొడుకు పుట్టాడు, కాని సంగమ కాలంలో ఆమె కళ్లు మూసుకున్నందున గుడ్డి వాడుగా పుట్టాడు. అతనే ధృతరాష్ట్రుడు.


సత్యవతి తన రెండవ కోడలు అంబాలికను వ్యాసుని వద్దకు పంపింది. అంబాలిక వ్యాసున్ని చూసి భయంతో తెల్లగా పాలిపోయింది. ఆమెకు గుణవంతుడు, వంశకర్త అయిన కొడుకు పుట్టాడు. కాని సంగమ కాలంలో ఆమె పాలిపోయినట్టుగా అయినందున, ఆ కొడుకు పాండు వర్ణం అంటే తెల్లని వర్ణంతో పుట్టాడు. అతనే పాండు రాజు.


కాని అంబాలికకు గుడ్డి వాడైన కొడుకు పుట్టినందుకు దుఃఖించింది. మరొక కుమారుడిని ప్రసాదించమని వ్యాసుడిని కోరింది. దానికి వ్యాసుడు సమ్మతించాడు.


వెంటనే సత్యవతి పెద్ద కోడలు అంబాలికను మరల వ్యాసుని వద్దకు వెళ్లమని కోరింది. కాని అంబాలికకు వ్యాసుని వద్దకు వెళ్లి సంగమించడం ఇష్టంలేదు. కాని అత్తగారి మాట కాదనలేక, తన దాసికి, తన మాదిరి అలంకరణ చేసి వ్యాసుని వద్దకు పంపింది.


ఆమె వ్యాసుని చూసి భయపడలేదు, అసహ్యించుకోలేదు. హాయిగా వ్యాసునితో కామక్రీడలలో తేలియాడింది. అందువల్ల ఆమెకు, మాండవ్య మహ ముని శాపం కారణంగా యమధర్మరాజు, విదురుడుగా జన్మించాడు

కామెంట్‌లు లేవు: