...
అన్నగారు కోరినదే తడవుగా మంచి దృఢమైన వృక్షశాఖలు తెచ్చి చక్కటి స్థిరమైన పర్ణశాల నిర్మించాడు లక్ష్మణుడు.మెత్తటిచాపలల్లి విశాలమైన ఆవరణం ఏర్పరచి అన్న ఎదుట సావధాన చిత్తుడై నిలిచాడు లక్ష్మణుడు.
.
అందంగా నిర్మింపబడిన ఆ పర్ణశాలను చూస్తూ రామచంద్రుడు ,లక్ష్మణా ఈ పర్ణశాలలో మనము చాలాకాలము జీవించవలసి ఉంటుంది కావున ప్రవేశించే ముందు వాస్తుదేవతా శాంతి చేసుకోవాలి.అందు నిమిత్తమై నీవు లేడిమాంసము తీసుకొనిరమ్ము శాలాపూజ చేసుకుందాము.శాస్త్ర విహితమైన కార్యముకదా !
.
రాముడినోట మాటవెలువడిన మరుక్షణమే అక్కడ కృష్ణసారము అనే లేడిమాంసం సిద్ధంచేశాడు లక్ష్మణుడు.
.
ఆ మాంసాన్ని ప్రజ్వరిల్లే అగ్నిలో రక్తముపూర్తిగా తొలగిపోయేటట్లు బాగా కాల్చి పక్వమైనదని తెలుసుకొని ,రామునితో ,రామా ! ఇక దేవతాపూజ ప్రారంభించవచ్చు అని తెలిపాడు.
.
ఒక స్థిరముహూర్తంలో రాముడు శుచిగా నదిలో స్నానం చేసినవాడై విశ్వేదేవతలను,రుద్రుని,విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తుశాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా వాస్తుపూజాసమయంలో పఠించవలసిన మంత్రములు స్వయంగా తానే చదివి పర్ణశాలలో ప్రవేశించగనే ఆయన మనస్సులో అమితమైన ఆనందం కలిగింది.
.
అంత సీతారామలక్ష్మణులు అడవిలోదొరికే పూలు,పండ్లు కందమూలములు ,పక్వమైనమాంసముతో సకల భూతములకు తృప్తికలుగచేశారు.
.
లక్ష్మణుడుఆపర్ణశాలలోవేదికలు ,చైత్యములు,అగ్నిగృహాలు
కూడా ఏర్పాటు చేశాడు.
.
మనోహరమైన చిత్రకూటపర్వతసానువులు,మాల్యవతీనదీ ,రమణీయమైన ప్రకృతి ,ఆహ్లదకరమైన వాతావరణంలో నిర్మింపబడిన ఆ పర్ణశాలలో ప్రవేశించగనే అయోధ్యను విడవటం వలన వారిలో కలిగిన దుఃఖం మటుమాయమయ్యింది....
....
అక్కడ! ..
రాముడు గంగదాటినవైపే వారు కనుమరుగయ్యేంతవరకు చూస్తూ నిలుచున్న సుమంత్రుడు రాముడు చిత్రకూటము చేరుకున్నాడన్న వార్త తెలిసేవరకు గుహుని వద్దనే ఉండి భారమైన మనస్సుతో ఆనందశూన్యమైన అయోధ్య చేరాడు.
.
సుమంత్రుని చూడగనే రాముడెక్కడ? మా రాముడెక్కడ ? అంటూ నగర ప్రజలందరూ ఆయన చుట్టూ గుమికూడి ప్రశ్నలవర్షం కురిపించారు.
రామాయణమ్.83
..
సుమంత్రుడు తిరిగి వచ్చాడు .రాముడు గంగదాటి అడవులలోకి వెళ్ళిపోయాడనే వార్త అయోధ్యప్రజలలో హాహాకారాలు పుట్టించింది.మరొక్కసారి రోదనలు మిన్నుముట్టాయి..
.
సుమంత్రుడు మెల్లగా రాజప్రాసాదంలోకి ప్రవేశించాడు.అక్కడ సర్వమూ కోల్పోయినవాడిలా దీనుడై,దుఃఖితుడై,కాంతిహీనుడై చతికిలపడి కూర్చున్న దశరధుడిని సమీపించాడు.
.
రాజుకు నమస్కరించి రాముడి వనప్రవేశ వృత్తాంతము వినిపించాడు.అది మౌనంగా విని ఒక్కసారిగా మూర్ఛిల్లి నేలమీద దబ్బున పడిపోయాడు మహారాజు.
.
కౌసల్యా సుమిత్రలు పరుగుపరుగున వచ్చి ఆయనను లేవదీసి మంచముమీద పరండబెట్టి ఓ రాజా ఎందుకంత మౌనంగా ఉన్నావయ్యా ! జరుగరానిది జరిగిపోయింది ఇప్పుడు నీవు బాధపడి ఏం ప్రయోజనం ! అదుగో సుమంత్రుడు వచ్చాడు రాముడి వార్తలు చెపుతాడు లేచి వినవయ్యా అంటూ దుఃఖమువలన చపల అయిన కౌసల్య డగ్గుత్తికతో మాట్లాడుతూ తానుకూడా నేలపై ఒరిగిపోయింది.
.
కొంతసేపటికి తేరుకున్న దశరధుడు సుమంత్రుని పిలిచి ,నా రాముడు ఎలా ఉన్నాడు ? ఏమి తింటున్నాడు? ఎక్కడ పడుకున్నాడు?అడివంతా క్రూరమృగాలు ,కృష్ణసర్పాలతో నిండిఉన్నది గదా వారు ఎలా ప్రయాణిస్తున్నారు.సుకుమారి సీత ఈ కష్టాలు ఎలా ఓర్చుకుంటున్నది?.రాముడిగురించి ప్రశ్నలవర్షం కురిపిస్తూనే ఉన్నాడు.
.
సుమంత్రుడు రాముడు తండ్రిక్షేమమే కోరుకుంటున్నాడు అన్న విషయము ,భరతునిపట్ల ఆయనకు గల ప్రేమను కూడా మహారాజుకు తెలిపి లక్ష్మణకుమారుడి కోపం గురించి కూడా తెలియచేసినాడు.
.
ప్రభువుగా ముందువెనుకలు ఆలోచించకుండా ఏ నేరమూ చేయని రాముని అడవులకు వెళ్ళగొట్టడము తెలివితక్కువవాడు చేసేపని .నేను ఇకనుండీ ఆయనను తండ్రిగా పరిగణింపను నాకు సోదరుడైనా,బంధువైనా,హితుడైనా ,రాజైనా ,తండ్రి అయినా రాముడే అని చెప్పాడు ప్రభూ!.
.
మహాఇల్లాలు సీతమ్మ మాత్రము ఏ పలుకూలేక మౌనంగాఉన్నది మహారాజా!
.
మన అయోధ్య అంతా కళావిహీనమై ,కాంతినికోల్పోయి ఆనందశూన్యమై ఎడారిని తలపిస్తున్నది ప్రభూ .
.
సుమంత్రుడి ఈ మాటలు విని అయ్యో నేనెంత తెలివితక్కువ వాడను ! ఒకస్త్రీ మాట విని ఎవరినీ సంప్రదించకుండా ,వృద్ధులతో విచారించకుండా ,మంత్రులతో సమాలోచనలు చేయకుండా,వర్తకులతో మాటైనా చెప్పకుండా ఒక్క ఆడుదానిమాట విని ఏకపక్షముగా తొందర పాటు తో ఎంత పాడు పని చేశాను?
.
సుమంత్రా ఇప్పటికి కూడా నా ఆజ్ఞ చెల్లుబాటు అవుతున్నట్లయితే నన్ను వెంటనే నా రాముడి వద్దకు తీసుకొనిపో!
.
ఆజానుబాహువు,అరవిందదళాయతాక్షుడు,మణికుండలభూషితుడూ ,మూపున పెనువిల్లు ధరించి మనోహరంగా కనపడే నారాముడు నా ఎదుట లేకపోతే నాకీ బ్రతుకు ఎందుకు? వాడిని చూడని ఈ కనులెందుకు? వాడి గాఢపరిష్వంగానికి నోచని ఈ శరీరమెందుకు?.
.
ఓ కౌసల్యా! నేను శోకమనే మహాసముద్రంలో మునిగి పోతున్నాను.
రామ శోకమే దీని వైశాల్యము
సీతదగ్గరలేకపోవడమే ఆవలి ఒడ్డు
నా నిట్టూర్పులే తరంగాలు
నా కన్నీళ్ళే నీటి సుడులు
కైకేయి ఈ సముద్రములో పుట్టిన బడబాగ్ని
మంధర అతిపెద్ద మొసలి
రామా,రామా,రామారామా నిను విడిచి ఉండలేనురా అంటూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు దశరధుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి