18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

🌸 *శ్రీమద్భాగవతము* 🌸

 

🌻 నీవు భూగోళమంతటి యందును తూర్పుదిక్కునకు కొసలుండునట్లుగా దర్భలను పరచితివి. దానితో ప్రాచీనబర్హి అని పేరు పొందితివి. యజ్ఞములను చేయుచున్నావు. అనేక జీవులను యజ్ఞ పశువులుగా చంపుచున్నావు‌. అది అహంకారము, అవినీతి అగును. ఇన్ని సత్కర్మలు ఆచరించియు కర్మ యొక్క స్వరూపమును, విద్య యొక్క రహస్యమును తెలియని అజ్ఞానివిగనే ఉన్నావు. 


(భూగోళమున సూర్యకిరణములు ఎచ్చట పుట్టిన వారికి అచ్చట ప్రాంతీయములై తూర్పున పుట్టి పడమరకు వ్యాపించుచుండును. అవియే ప్రాచీనబర్హి పరచిన దర్భలు. అతడు అహోరాత్రస్వరూపుడు. అతడు కర్మసిద్ధికై జీవులలోనికి దిగివచ్చెను‌ వేరు వేరు వ్యక్తులుగా వేరు వేరు తావులయందు జన్మించెను‌ వేర్వేరు సూర్యోదయములను, అహస్సులను అనుభవించుచున్నాడు. సూర్యోదయము వలన వేళలను ఏర్పరచుకొని కార్యక్రమములు బిగించుకొని కార్యములు ఆచరించుచున్నాడు.అవియే యజ్ఞములు. వేరు వేరుగా దేహములతో జన్మించుటలో ఒక జీవి దేహము ఇంకొక జీవి తినుట పుట్టెను. తృణమును పశువులు, ఎలుకను పిల్లి, పిల్లిని కుక్క తినుచున్నవి. మానవుడు చెట్లను, జంతువులను కూడా తినుచున్నాడు. పరబ్రహ్మము యొక్క దేహమగు సృష్టి యందే జీవులకు ఆహారము లభించుచున్నది. 


అంతవరకు మంచిదే. అంతటితో ఆగలేదు. రాగద్వేషాదులతో ఈర్ష్యలతో పట్టుదలతో జీవిని జీవి బాధ పెట్టుట, హింసించుట జరుగుచున్నది. నరసృష్టిలోన ఎక్కువగా జరుగుచున్నది. ఈ విధముగా సృష్టి యందలి పశుయజ్ఞము ఖండదృష్టిచే హింసాకాండగా ఆచరింపబడుచున్నది. తత్ఫలితములు అనుభవింపబడుచున్నవి. ఈ కర్మల యందు, వాని విలువల యందు బుద్ధి నిలుపక అంతర్యామి యందు నిలిపినవానికి కూడని పనులు చేయుట ఉండదు కనుక ఈ హింసాకాండ అంటదు. అవే కర్మలను ఆచరించి జ్ఞాని మోక్షము పొందుచున్నాడు. అవే కర్మలను ఆచరించి అజ్ఞాని కర్మస్వరూపమును జ్ఞానస్వరూపమును ఎరుగక మూర్ఖుడై జీవించుచున్నాడని అర్థము.) 


కర్మ యొక్క స్వరూపమును, విద్య యొక్క రహస్యమును తెలిపెదను వినుము. జీవులలో ఉన్న సర్వేశ్వరునకు సంతుష్టి కలిగించునది మాత్రమే పవిత్ర కర్మ. సర్వేశ్వరుని యందు మనస్సు నిలుచుట దేనివలన కలుగునో అది మాత్రమే విద్య. సర్వాంతర్యామియే దేహధారులకు ఎల్ల తానుగను, ఆ లోపల తన స్వామిగను కూడా ఉన్నాడు. దీనిని ఎరిగి ఆ స్వామికి అర్పించుచు ఆ జీవులకు క్షేమము కూర్చు కర్మలను ఆచరించుటయే ఈశ్వరుని ఆశ్రయించుట. జీవుల రూపమున ఈశ్వరుడు నీకు ప్రియుడై వర్తించినపుడు నీచే సేవింపబడును. నీకు అణుమాత్రము కూడా దుఃఖము లేని జీవితము సిద్ధించును. ఇట్లు తెలిసినవాడు ఒక్కడే విద్వాంసుడు, గురువు. వాడే శ్రీహరి స్వరూపుడు..........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 878 (For more Information about Master EK Lectures please visit www.masterek.org).

కామెంట్‌లు లేవు: