24, నవంబర్ 2022, గురువారం

చండీశ్వరుడు

 🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°:

🎻🌹🙏 శివుడు - చండీశ్వరుడు..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.


🌿ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు.


🌸గోవులు, దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.


🌿నీవు ఈ ఆవులను కొట్టవద్దు, 'తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.


🌸బ్రాహ్మణుడు, బ్రహ్మచారి.. వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా... అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.


🌿ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.


🌸వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.


🌿ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి.


🌸ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకము చేయదలచాడు.


🌿రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.


🌸అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి, ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.


🌿అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.


🌸చెప్తే..అది విన్న యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టిక్కి కూర్చున్నాడు.


🌿పూర్వకాలం కౄర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.కాసేపయింది,


🌸కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.


🌿తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.


🌸అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు.


🌿ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.


🌸తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు.


🌿ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయి, క్రిందపడిపోయాడు.


🌸నెత్తుటి ధారలు కారిపోతున్నాయి, కొడుకు చూశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు.


🌿ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.


🌸మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో అయిదవవాడవు.


🌿నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే, నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.


🌸ఇకనుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు.


🌿భార్యకొక్క దానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహించాడో చూడండి.


🌸పార్వతీ... నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.


🌿ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.

బయట పడలేక పోతున్నాను

 చెడు చేయకపోయినా చెడు ఆలోచనల నుండి నేను బయట పడలేక పోతున్నాను ! ఎలా ?"*


*"సాధకుడు మోహంతో కూడిన ఆలోచనలు ఏవీ చేయకూడదు. మన అవసరాలను గుర్తించి దైవమే నెరవేస్తుంది. అవసరం కోసం ఆలోచన కావాలి కానీ ఆలోచనలతో అవసరాలు వెదకనక్కర్లేదు. చెడు అలవాట్లే కాదు వాటి తాలూకా ఆలోచనలు కూడా మనసును కలుషితంచేస్తాయి. శారదా మాతను ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు - అమ్మా ఈ జనం ఎందుకు చెడు గుణాల నుండి బయట పడలేకపోతున్నారు ? మాత సమాధానమిస్తూ 'తప్పు నాన్నా, చెడు గుణాలన్న మాటకూడా మంచిది కాదు.. కీడు చేస్తుందని హెచ్చరించారు.' మనం ఎదుటివారిలో ఒక లోపం చూస్తున్నామంటే అది అప్పటికే మనలో ఉందని అర్థం ! వీటన్నింటిని అధిగమించటం కోసం గురువును ఆశ్రయించాలి. ఆ తర్వాత కూడా భ్రష్టులమైతే అది గురుద్రోహమే అవుతుంది. ఫ్యాషన్ల పేరుతో ముందుకి వెనక్కి ఊగే ఈ ప్రపంచంతో పరుగులు పెట్టకుండా అవసరాల వరకు గుర్తించి ముందుకుసాగాలి. సద్గురువు మనకి మంత్రం చెప్పాల్సిన పనిలేదు ! ఆయన జీవనమే మనకు మహామంత్రం కావాలి. గురువు అందరి కష్టాలు ఎలా తీరుస్తున్నారని వెతుకులాట కాకుండా అంతటి కష్టంలో కూడా గురువు ఎలా నిర్మలంగా ఉంటున్నారో చూసి నేర్చుకోవాలి !"*

మానవ సంబంధాలు

 *పలచబడి పోతున్న మానవ సంబంధాలు* 


 గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము .

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా (చిక్కగా )వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..ఈ సంబంధల్లో కూడా compitetion మొదలైంది... పిల్లలో ఈర్ష్య, పెద్దల్లో అసూయ..


             మొదట్లో success అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..


             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది.... అంతా కమర్షియల్ అయిపోయింది 

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు..  కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే...


                ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..


                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాలు కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..


          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన స్వార్థం పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

దగ్గరి వాళ్ళ మధ్య కూడా గొడవలు.. మాట్లాడుకోక పోవడం.. షరా మాములు అయిపోయింది...

ఈ సందర్భంలోనే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా కోసం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రాసిన ఓ డైలాగ్‌ గుర్తుకు వస్తుంది...

‘"మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు"

వీలైతే  మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి.

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం, వదిలి వెద్ధాము....


ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం...

ఈ నడుమ అయినా అందరితో కలసి మెలసి ఉందాం... 🙏🙏

పరమాచార్యుల దుఃఖం

 పరమాచార్యుల దుఃఖం


పరమాచార్య స్వామివారు ఒకరోజు ఉదయం చెన్నైలోని మ్యూసిక్ అకాడమి నుండి పశ్చిమంగా నడుచుకుంటూ వస్తున్నారు. అది బహుశా 1964 - 1965 ప్రాంతం అనుకుంటా. మహాస్వామి వారితో పి.జి. పాల్ & కొ నిలకంఠ అయ్యర్, శ్రీమఠం శివరామ అయ్యర్, పానాంపట్టు కణ్ణన్, శ్రీకంఠన్, రోయపురం బాలు మరియు నేను ఉన్నాము. దారిలో పది ఇరవై మంది దాకా భక్తులు మాకు తోడయ్యారు.


గోపాలపురం వైపు వెళ్ళే మలుపులో స్వామివారు నన్ను పిలిచి, “వెనుక అక్కడ కిరాణా కొట్టు దగ్గర తలపై శిఖతో నోటినుండి పొగ వదులుతూ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు కదా చూశావా? అతని వద్దకు వెళ్లి పరవాక్కరై శ్రౌతిగళ్ గురించి అడిగి రా” అని చెప్పారు. నేను అతని వద్దకు పరిగెత్తాను. అతను ఆ కొట్టుకు వేలాడదీసిన తాడు చివరన ఉన్న నిప్పుతో బీడి అంటించుకుంటున్నాడు. అతని వద్దకు వెళ్లి అడిగాను,


“ఓయ్! నీకు పరవాక్కరై శ్రౌతిగళ్ తెలుసా?” అని.


అతను కాస్త కంగారు పడి, చేతిలోని బీడి క్రింద పడేసి “మీరు ఎవరు? ఎందుకోసం అడుగుతున్నారు?” అని అడిగాడు.


“ఆచార్య స్వాములు కనుక్కోమన్నారు. . .”


“పెరియవా? ఎక్కడా?”


“అక్కడ” అని నేను చేయి చూపించే సరికి అతను పరుగు లంకించుకుని అటువైపుగా వెళ్ళిపోయాడు. నేను కొద్దిసేపు వేచిచూసి, స్వామివారికి చెప్పాను “నేను అతణ్ణి అడిగాను. ఏమి బదులు చెప్పకుండా పారిపోయాడు” అని.


స్వామివారు మౌనంగా గోపాలపురం వైపు కదిలారు. కొద్దిదూరంలో, ప్రహరీ అవతల చక్కని పందిరి వేసి తోరణాలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని పూర్ణకుంభంతో స్వాగతించారు. పెద్ద భవంతి ముందర ఉన్న నాలుగు మెట్లు ఎక్కగానే వరండా మూలలో స్వామివారు ఆసనం వేయించుకుని కూర్చున్నారు.


భక్తులు స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. కార్యాలయాలకు వెళ్ళాలి కాబోలు! స్వామివారు లేచి లోపలి పోయేంతలో నుదుటిపై విభూతి రేఖలతో, చేతులు ఎదపై ఎలాపడితే అలా పెట్టిన విభూతితో, నడుముకు ఒక టవల్ చుట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు.


స్వామివారు మరలా కూర్చుని నన్ను చూపిస్తూ, “ఎవరతను?” అని అడిగారు. “కొద్దిసేపటి క్రితం పరమాచార్య స్వామివారే ఈ వ్యక్తి ద్వారా నాకు పరవాక్కరై శ్రౌతిగళ్ తెలుసేమో కనుక్కుని రమ్మని పంపారు”. “అవును నేను పరవాక్కరై శ్రౌతిగళ్ మనవడిని. నా పేరు ప్రణతార్థి”


“ప్రణతార్థి అని పలకవద్దు. అది స్వామివారి పేరు. ప్రణతార్థి హరణ్ లేదా హరణ్ అని చెప్పు. తనని నమస్కరించిన వారి పీడలను పోగొట్టే స్వామీ ఆయన. అది ఆ నామము యొక్క అర్థము”


“అందరూ నన్ను ఇలాగే పిలుస్తారు. అలవాటయిపోయింది”


“నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటి? అధ్యయనం(వేదాధ్యయనం) చేశావా?”


“తాత గారు సామము నేర్పించారు”


ఒక సామవేద పన్నమును ఉదాహరిస్తూ “ఏది ఈ సామ పన్నం చెప్పు” అన్నారు. రెండు మూడు వాక్యాలు చెప్పగలిగాడు. అతని సామగానము పెద్ద కంఠంతో మంచి సమ్మోహన శక్తితో చాలా దివ్యంగా ఉంది.


“తరువాత గుర్తులేదు” అన్నాడు.


“నీ తోడబుట్టిన వారు పెద్దవారా? చిన్నవారా?”


“ఇద్దరూ పెద్దవారు. వారు ఇంగ్లిషు చదువులు చదివి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. నా స్వరం బావుండడంతో తాత గారు సామవేదం నేర్పారు. నాకు అది ఇష్టం లేదు అందుకే ఇంటి నుండి పారిపోయాను”


“ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”


“నేను పోలీసులకు సహాయపడుతుంటాను”


“పోలీసులకు సహాయమా? ఏమి సహాయం చేస్తావు?”


“వారు నన్ను న్యాయస్థానాలకు తీసుకుని వెళతారు. నేను సాక్ష్యం చెబుతాను. వారు డబ్బులిస్తారు. . .”


“ధూమపానం ఎలా అలవాటు అయ్యింది?”


“వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎక్కువ మోతాదులో కొంటారు. నాకు రెండు మూడు ఇచ్చేవారు”


“నువ్వు చూసినవాటినే న్యాయస్థానంలో చేబుతుంటావు. అవును కదా?”


“నేను ఏమి చూడలేదు. వారు ఇలా చెప్పమని చెబుతారు. నేను అదే చెప్తాను”


“న్యాయవాదులు ఎక్కువ ప్రశ్నలు వేస్తారు కదా!”


“అవును. అందుకే పోలీసులు నన్ను హత్య జరిగిన స్థలానికి తీసుకుని వెళ్లి అది ఎలా జరిగిందో విపులంగా చెబుతారు. నేను ఇక్కడ నిలబడ్డాను; ఇంతమంది ఉన్నారు; నేను చూస్తున్నాను; హంతకుడు తూర్పు వైపుగా పరిగెత్తి వెళ్ళాడు; చేతిలో కొడవలి ఉంది; అందులో నుండి రక్తం కారుతోంది; ఇలా నాకు నేర్పిస్తారు. ఎన్నో కేసుల్లో సాక్ష్యం చెప్పాను కాదా. నాకు అనుభవం ఉంది. లాయరు నన్ను ఎంత తికమక పెట్టినా, నేను అంతే తెలివిగా సమాధానం ఇస్తాను. రెండు మూడు సార్లు మాట తడబడ్డాను. అప్పుడు నన్ను పోలీసులు బాగా కొట్టారు”


“కోర్టుకు వెళ్ళేటప్పుడు చొక్కా అవి వేసుకుంటావా?”


“లేదు లేదు. దానికి పోలీసులు ఒప్పుకోరు. నేను పెద్ద పెద్ద విభూతి పట్టలు పెట్టుకోవాలి. సబ్బు పెట్టి నా యగ్నోపవీతాన్ని తెల్లగా ఉంచుకోవాలి. నడుముకు తుండు కట్టుకోవాలని కూడా ఆదేశిస్తారు”


“ఇలా సాక్షిగా మారడం తప్పు కాదా?”


“అవును పాపమే. నాకు బాగా తెలుసు. కాని నాకు ఇక దారి లేదు”


“అలాగా! మరి ఒక దారి చూపిస్తాను. చేస్తావా?”


“దయచేసి సెలవివ్వండి”


“మైలాపూర్ లో కపాలీశ్వర దేవాలయం ఉంది. సాయింత్రాలు అక్కడకు వెళ్ళు. పడమర గోపురం దగ్గర రోజూ చత్త ఊడ్చి, నీళ్ళు చెల్లు. నీకు పది రూపాయలు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తాను”


“ఈ ఊడిగాలు, ప్రసాదాలు అవన్నీ నాకు పడవు”


“దేవాలయ ప్రసాదం కాదు. రోజుకొక భక్తుని ఇంట నీ భోజనం ఏర్పాటు చేస్తాను. నువ్వు ఆ పది రూపాయలతో రాత్రిపూట తిను”


“నాకు అవన్నీ సరిపడవు. నావల్ల కుదరదు”


“అంత ఆత్రుత ఎందుకు? మఠంలో రెండు రోజులు ఉండు. చంద్రమౌళిశ్వర పూజ చూడు. పూజ అయిన వెంటనే నీకు ఆహారం ఏర్పాటు చేయిస్తాను. తరువాత ఆలోచించి చెప్పు”


“ఈరోజు నాకు కుదరదు. ఎగ్మోర్ కోర్టులో ఒక పెద్ద కేసు ఉంది. నేను అక్కడకు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకపోతే, నా వీపు విరగ్గొడతారు. నన్ను వెళ్ళనివ్వండి” అని అతను వెళ్ళిపోయాడు.


ఆ ప్రహరి దాటి వెళ్లిపోఏంతవరకు అలా చూస్తుండిపోయారు. తరువాత స్వామివారు లేచి లోపలకు వెళ్ళారు. నిలకంఠ అయ్యర్, నేనూ వెనకాతలే వెళ్ళాము. స్వామివారు తిరిగి చూశారు. నిలకంఠ అయ్యర్ చిన్నగా అన్నారు, “మహాస్వామి వారు అంతగా చెప్పినా అతను వినిపించుకోలేదు”


“అలాగే ఉండని. జనాలకు తప్పుడు సాక్ష్యం చెప్పడం అలవాటు చేశారు ఈ పోలీసులు” అన్నారు స్వామివారు.


అందుకు నిలకంఠ అయ్యర్ “వారు మాత్రం ఏం చేస్తారు? పట్టపగలే అంతమంది ముందు ఒక హత్య జరిగినా కూడా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకురారు. అది ఎవరు చేశారో తెలిసి కూడా ఎవరూ సాక్షిగా రావడానికి ఒప్పుకోరు. అందరికి వాళ్ళ వాళ్ళ పనులు ఉన్నాయి. పోనీ అలా వెళ్ళినా ఈ లాయర్లు వారిని పదే పదే కోర్టుల చుట్టూ తిప్పుతారు. తీరా నిందితుడే ఒప్పుకున్నా, సాక్ష్యం లేదని కేసు కొట్టేస్తారు. తరువాత పొలిసు వ్యవస్థ సరిగా లేదని. కనుక వారికి తప్పుడు సాక్ష్యం చెప్పించడం తప్ప వేరే దారి లేదు”


“ఓహో! నేరం చెయ్యడం మొదటి తప్పు. చూసి కూడా సాక్ష్యం చెప్పడానికి రాకపోవడం రెండవ తప్పు. చూడనివారిని సాక్ష్యంగా తయారుచెయ్యడం మూడవ తప్పు. ఈ తప్పులను సమర్తిచడం మరొక తప్పు”


“మహాస్వామి వారు నన్ను మన్నించాలి. ప్రపంచంలో జరుగుతున్నడి నేను తెలిపాను అంతే”


“ఇది మరీ బాధాకరం. ఇదంతా ఒక బ్రాహ్మణుని విషయంలోనా! తప్పుడు సాక్ష్యం చెప్పినా ఒక బ్రాహ్మణుడు చెబుతున్నాడు అంటే కోర్టు కూడా నమ్ముతుందనే కదా పోలీసులు ఇలా చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ! ఆ శ్రౌతి మనుమడు ఇలా . . .”


“మహాస్వామి వారు చేప్పినదేదీ అతని చెవిన పడలేదు”


“చెప్పాడు కదా. కోర్టుకు వెళ్ళకపోతే పోలీసులు కొడతారు అని. అతడెంచేస్తాడు”


“పరమాచార్యుల వారు చాలా క్లేశ పడుతున్నారు. మేమేమైనా చెయ్యగలమా?”


“ఒక సన్యాసి తన మనస్సులో సుఖదుఖాలకు కష్టనష్టాలకు తావివ్వకూడదు అని మీకు తెలుసు కదా” అని స్వామివారు స్నానానికి వెళ్ళిపోయారు.


మధ్యాహ్నం మూడు గంటలప్పుడు పూజగది పక్కన ఉన్న వరండాలో నేను పడుకుని ఉన్నాను. “రామా!” అని అరుపు వినబడడంతో లేచి వచ్చాను. మేలూర్ మామ - రామచంద్ర అయ్యర్ - మహాస్వామి వారి పూజా పర్యవేక్షకులుగా ఉన్నారు. చాలా సంప్రదాయం పాటించే మనిషి. పూజ సహాయకులకు ఆయన సింహస్వప్నం. పూజకట్టులో చిన్న పొరపాటును కూడా సహించరు. దేవతా మూర్తులను లోపల పెట్టి తాళం వేసిన తరువాత కూడా వాటిని పర్యవేక్షిస్తుంటారు.


వారు లోపల నుండి పెద్ద ఇత్తడి గిన్నెతో బయటకు వచ్చారు. నన్ను అక్కడ చూసి రమ్మని సైగ చేశారు. 


“ఉదయం పరమాచార్య స్వామివారితో పాటుగా వచ్చావా?” అని అడిగారు.


“అవును వారితోపాటే వచ్చాను”


“అప్పుడు ఏమైనా జరిగిందా?”


“ఏమిలేదు”


“లేదు. ఏమో జరిగింది. మహాస్వామి వారు ఈరోజు పూజ చెయ్యలేదు”


“అలాగా! అది ఏం జరిగిందంటే. . .” అని పరవాక్కరై శ్రౌతిగళ్ మనవడి గురించి మొత్తం జరిగినదంతా చెప్పాను. చేతిని నుదిటిపై బాదుకుంటూ ఆయన చలించిపోయారు. అప్పుడే స్వామివారు అటువైపుగా వచ్చారు. నేను నమస్కరించాను. 


“మేలూర్ మామ ఏం చెప్పాడు. చూస్తె ఈరోజు భోజనం చేసినట్టు లేదు. ఏమైనదో కనుక్కున్నావా?” అని అడిగారు.


నేను కళ్ళు తుడుచుకున్నాను. “నాతో ఎదో చెప్పాలని అనుకుంటున్నావు కదా! చెప్పు మరి”


“నేనేమి చెప్పగలను పెరియవా! శ్రీధర అయ్యవాళ్ శ్లోకం ఒకటి స్ఫురించింది”


“అయ్యవాళ్ శ్లోకమా? భక్తి రసంలో ముంచుతుంది. ఏది చెప్పు ఒకసారి”


“త్వన్ నామధ్యేయ రసికాః తరుణేందు మౌళే

దుఃఖం న యాన్తి కిమపీతి హి వాదమాత్రం

దేశమీకిల స్వవిపతీవ వహంతి దుఃఖం

త్రుకోకరీభవతి దుఖాని జంతుమాత్రే”


“మరొక్క సారి చెప్పు!” నేను మరలా చెప్పాను. “అర్థం కూడా చెప్పు చూద్దాం”


“తలపై నెలవంకను ధరించిన స్వామి ఎవరో ఆ స్వామి పేరు శివా శివా అని తలచిన వారికి దుఃఖము కలగదు అని. కాని వారు కూడా ఇతరుల కష్టములను చూసి చలించిపోతారు. అదేదో ఆ కష్టము వారికే వచ్చింది అన్నట్టుగా”


“సరిగ్గా చెప్పావు. ఇందులో నువ్వు ఒకటి గమనించావా?”


“దేని గురించి? నాకు తెలియదు”


“ఇక్కడ “తరుణేందు మౌళే” అని అంటున్నాడు. అది మన చంద్రమౌళీశ్వరుడే. వారి గురువు అయిన బోధేంద్ర సరస్వతీ పూజించిన చంద్రమౌళీశ్వరుని పైనే ఇలా కీర్తించాడు” అని చెప్పి స్వామివారు తాదాత్మ్యం చెందారు.


నేను స్వామివారికి ఒక విషయం చెప్పదలచుకున్నాను. అది చెప్పి ఉంటే అది అపచారము అయ్యి ఉండేదేమో. అందుకే ఇక్కడ చెబుతున్నాను.


వేరొకరి బాధలకు చలించిపోయే మాహామనీషి పుట్టబోతున్నాడని మూడువందల యాభై సంవత్సరాల క్రితమే శ్రీధర అయ్యవాళ్ చంద్రమౌళీశ్వరునికి చెప్పుకున్నాడు. 


--- వి. విశ్వనాథ ఆత్రేయన్, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వర్ణాశ్రమ ధర్మము

 శ్లోకం:☝️

*దేవాన్ ఋషీన్ నృభూతాని*

  *పితౄనాత్మానమన్వహం |*

*స్వవృత్త్యాగతవిత్తేన*

  *యజేత పురుషం పృథక్ ॥*

  - మహాభారతం


భావం: గృహస్థుడు తన వర్ణాశ్రమ ధర్మముల ద్వారా ప్రాప్తించిన సంపదతో ప్రతిదినము దేవతలు, ఋషులు, మనుష్యులు, ప్రాణులు, పితృగణములు, ఇతర ప్రాణులు, మొదలగువాటిని తృప్తిపరచుట ద్వారా ఆరాధింపవలెను. అట్లే తన శరీరమును గూడ సేవింపవలెను. తద్ద్వారా వేర్వేరు రూపములలో గల భగవంతుని ఆరాధించినట్లగును.