14. " మహాదర్శనము "--పదునాలుగవ భాగము--మడ్డి-మసి
14. పదునాలుగవ భాగము-- మడ్డి-మసి
తల్లికి ఇంకా ఆశ్చర్యము ఎక్కువైంది . శాస్త్ర విషయములు తెలుపుతుంటే , కొడుకు శ్రద్ధ చూపిస్తున్నాడు . తల్లి మాట అంటే చాలు , ఆమాటలో భావము, శ్రద్ధ ఉన్నాయి . నాకు తెలీదు , కానీ అమ్మకు తెలుసు , తానుగా తెలుసుకొనుట తనకు పట్టుపడు వరకూ , తానుగా విచారము చేసి అర్థము చేసుకొనువాడనగు వరకూ తల్లే తనకు గురువు , దైవము అన్న భావముంది. ఆమె మాటను తీసివేయునట్లు లేదు . దానిని అనుసరించియే కృతార్థుడను కావలెను అను నమ్మకము , శ్రద్ధ అందులో ఉన్నాయి .
ఆలంబినికి ఎందుకో గుండె బెదిరింది , " ఈ పసి బాలుడు ఇంతటి శ్రద్ధావంతుడైతే నా గతి ? వేళాకోళానికి కూడా వాడి దగ్గర ఒక అబద్ధమైనా చెప్పుటకు లేదు , తక్కెడలో పదార్థమును ఉంచునట్లు నాజూకుగా , నిష్ఠురముగా , నిజంగా ఉండవలెను . కాబట్టి వీడి దగ్గర నేను ఆలోచించకుండా ఏ మాటకూడా చెప్పుటకు లేదు . కానిమ్ము , నాకు ఇదీ ఒక సంస్కారమే . లోకోద్ధారము చేయు కొడుకును పొందిన భాగ్యము అంటే అది కొండ ఎక్కినట్లు కాదా ? ఆ దినమే వారు చెప్పినారు , ’ నీవలన వాడికి ఏ రీతిలోనూ ఇబ్బంది కాకుండా చూసుకో ’ యని . ఏదేమైనా , ఇక త్వరలోనే చౌలము అవుతుంది . ఆ తరువాత వారి భారమే . అంతవరకూ వీడు ఏమైనా అడిగితే , తనకు తెలిసినది మాయా మర్మము లేకుండా చెప్పవలెను . తనకు తెలియనిదైతే , తెలీదు , వారిని అడుగి చెపుతాను యని వ్యవధిని తీసుకొని , ఆ తరువాత చెప్పేది . ’ అని నిర్ణయించుకున్నది . సహజముగా అగ్ని మందిరము వైపుకు తిరిగి , ’ నా సంకల్పము సఫలమగునట్లు కరుణించు ’ అని నమస్కరించినది .
కొడుకు తల్లి చేసినది చూచినాడు . ఆమె తిరిగిన వైపుకు చూచినాడు . అక్కడ ఎవరూ కంట పడలేదు . అయినా అమ్మ చెప్పినది గుర్తుకొచ్చినది . తాను చేస్తున్నది ఎందుకు ఏమిటి అనునది లేశమైనా తెలియకుండానే తానూ అటువైపుకు తిరిగి నమస్కరించినాడు . తల్లి దగ్గరకు వచ్చి గొంతు అతి చిన్నదిగా చేసి , చెవిలో నోరు పెట్టి ’ అక్కడ ఎవరైనా దేవతలు వచ్చినారేమమ్మా ? " అని అడిగినాడు .
తల్లి , కొడుకు చెంపపై ఒక ముద్దిచ్చి చెప్పింది , ’ అగ్ని మందిరము ఉన్నది అటువైపే కదా ? కానీ , దేవతలు ఇక్కడున్నారు , అక్కడలేరు అనుటకు లేదు . వారు అంతటా ఉంటారు . "
" అంటే మన వంట్లోనూ ఉన్నారా ? ఈ కట్టెలలోనూ ఉన్నారా ? ఈ ఉడుకుతున్న పప్పులోనూ ఉన్నారా ? " అని అతి గంభీరముగా కొడుకు అడిగినాడు .
తల్లి కూడా అంతే గంభీరముగా చెప్పింది , " ఔనయ్యా , ఈ కట్టెలలో , ఈ బియ్యములో , ఈ పప్పులో , చిన్న పిల్లవాడివైన నీలో , పెద్దదాని నైన నాలో , అంతటా ఉన్నారు . అయితే , మండుటవలన , ఉడుకుట వలన వారికి నొప్పి కలగదు . మనము చేయునదంతా వారికే . అయితే , వారికి దానివలన నొప్పి లేదు , బాధ లేదు . వారిని మరచితే , వారికి నొప్పి . "
" మరచితే వారికి నొప్పి ! సరేనమ్మా , వారిని మరచిపోకుండా చూసుకుంటాను . అదే కదా నువ్వు ఆ మంత్రములో చెప్పింది ? సరే , మరచితే వారికి నొప్పి , కాబట్టి మరవరాదు "
ఆలంబినికి ఆశ్చర్యముల వాన కురుస్తున్నట్లాయెను . " ఇదేమిటి ? ఈ బాలుడు ఇంత గహనముగా , గంభీరముగా లోతుగా మాట్లాడుతున్నాడంటే అర్థమేమి ? " అని ఆశ్చర్యము . ఏమేమో లెక్కలు వేసుకుంటూ , " సరే , వీడు ఇతర పిల్లలవలె కాదు , దేహము చిన్నది గా ఉండుట చూసి , వీరు నా కడుపున పుట్టినారు యన్న మోహమునకు లోనై మేమూ చెడి , పిల్లలనూ చెడగొట్టుతున్నాము . దేవా ,ఈ మోహపు చెర నుండీ విడిపించు . ఎవరో జీవుడు నన్ను నిమిత్తము చేసుకొని ఈ లోకమునకు వచ్చినాడు . వాడు వచ్చిన కార్యము నావలన చెడిపోకుండా చూడు . ఇదే సద్భావము నాలో ఎప్పటికీ ఉండనీ " యని మరొకసారి నమస్కరించినది .
కొడుకు కూడా నిర్విషణ్ణముగా పవిత్రమైన చూపులతో ఏ సంశయమూ లేకుండా చేతులు జోడించినాడు . తల్లి అది చూచి , తనలోని మాతృ వాత్సల్యము ప్రవాహమై పొంగి బయటికి వస్తుండగా , ఇక దానిని తట్టుకొనలేక , వాడిని మరలా దగ్గరికి తీసుకొని , ముద్దు పెట్టుకొని , తొడపై కూర్చోబెట్టుకొని , హత్తుకున్నది . కొడుకు తన అంగములలో ఒక భాగము , వాటి కన్నా ఎలాగ వేరే అవుతాడు అన్న నమ్మకము ఉండవలెను , తన కాళ్ళూ చేతుల వలె వాడుకూడా తనవాడే అన్న ఖచ్చితమైన , దృఢమైన భావము ఆమెకు ఉండవలెను , లేకున్న, అలాగ హత్తుకొనుటకు సాధ్యమా ? ఆమెకు కొడుకు తన అంగములకన్నా వేరే యను భావమే ఉన్నట్లు లేదు .
అలాగ ఒక ఘడియ వాడిని పట్టుకొని ఉండి , " యజ్ఞీ , నువ్వు చెలుకోలు తీసుకొని నడిమింట్లో గుర్రము ఆట ఆడుకొని రా, అంతలోపల నేను చింతపండు పిసికి గిన్నెలో వేస్తాను " అన్నది . వాడు సరేనమ్మా అని మూలనున్న చెలుకోలును తీసుకొని నడిమింట్లోకి వెళ్ళినాడు .
తల్లి వెళుతున్న కొడుకును మరియొకసారి తిరిగి చూచినది . మరలా పిలిచి ముద్దు పెట్టుకోవాలనిపించినది . వెంటనే గృహిణీ భావము వచ్చి , ఆ భావము పెద్దదై , ’ ఇలాగ వీడితో ఆటలాడుచూ మిగిలిన పనులను చెడగొట్టుకోకూడదు , వంట చెడిపోతే వైశ్వేదేవము చెడిపోతుంది . వారూ , వారి శిష్యులూ ఏమీ అనరు , అది వారి మంచితనము . అలాగని పనులను చెడగొట్టవచ్చునా ? ’ అని గృహిణి కార్యములో కొనసాగింది . అమె పులుసులోకి చింతపండు రసము పిండి , పొయ్యిపైనున్న అన్నపు తప్పేలా ను తీసి , ఇటువైపు పెట్టి , పులుసు గిన్నెను ఎత్తి పొయ్యిపైన పెట్టింది .
ఆ వేళకు కొడుకు గుర్రము ఆటను నిలిపి మళ్ళీ వచ్చినాడు . తల్లి , చింతపండు పిసికిన పాత్రను కడుగుచున్నది . కొడుకు వచ్చి తల్లివద్ద నిలుచొని , ’ ఏమిటమ్మా , ఎప్పుడు చూసినా ఆ పాత్ర కడిగేది , ఈ పాత్ర కడిగేది , నువ్వు పాత్రలు కడిగేదే పెద్ద పనిగా పెట్టుకున్నావు కదమ్మా ? " అన్నాడు .
తల్లికి దానికీ నవ్వు వచ్చింది . " కాదయ్యా , యజ్ఞయ్యా , పాత్రలు లోపలా కడగవలెను , బయటా కడగవలెను , అవునా కాదా , చెప్పు ? లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి , కాదేమీ ? చెప్పూ ? " అంది
కొడుకు మళ్ళీ గంభీరుడై , బాల భావనను ఎక్కడో వదలి వేసినవాడిలాగా , అదే మాటను మరలా మరలా పలికినాడు . " లోపలా కడగవలెను , బయటా కడగవలెను, లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి , " అని తన ఒంటిని చూసుకొని , ’ బయట కడుగుట తెలుసు , కానీ లోపల కడిగేదెలాగ ? ’ అని తనలో తాను మాట్లాడుకొనునట్లు అన్నాడు .
తల్లి ఎక్కడో , ఏదో పనిలో మునిగిఉన్నది , ’ వారు వచ్చినాక వారిని అడుగు , చెపుతారు ’ అన్నది .
కొడుకు ’ సరే వారినే అడగవలెను , లోపల కడిగేది ఎలాగా అని . సరే , లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి ’ అనుకుంటూ ఉన్నాడు .