13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

భగవంతుడియందు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *భగవంతుడియందు*

             *పరిపూర్ణ*

      *నమ్మకం - విశ్వాసం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఒకప్పుడు ఒక గ్రామంలో బాగా చదువుకున్న ఒక పండితుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక పాలమ్మి ఈ పండితుడి ఇంటికి వచ్చి తెల్లవారుఝామునే పాలు పోసివెళ్ళేది. ఒకరోజు ఆమె పాలు పొయ్యటానికి పండితుడి ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చింది.*


*అందువల్ల పండితుడికి చాలా కోపం వచ్చి ఆమెను ఆలస్యమునకు కారణం అడిగాడు. నది దాటటానికి పడవవాడు రావటం ఆలస్యం కావటంవలన తను రావటానికి ఆలస్యం అయిందని ఆమె చెప్పింది. పడవవాడి సహాయం లేకుండానే నదిని దాటవచ్చునని పండితుడు పాలమ్మికి చెప్పాడు. హరి నామమును స్మరిస్తూ నదిని సులువుగా దాటవచ్చునని పడవ అవసరంలేదని పండితుడు ఆమెతో అన్నాడు. హరినామస్మరణతో సంసారమనే సాగరమునే సులువుగా దాటగలిగినప్పుడు చిన నదిని దాటటంలో కష్టం ఏముందని పండితుడు అన్నాడు.*


*పండితుడి మాటలను పాలమ్మి చాలా శ్రద్ధగా ఆలకించింది.*


*మరునాటి ఉదయం పాలమ్మి రోజూ కంటే త్వరగా పండితుడి ఇంటికి పాలు పొయ్యటానికి వెళ్ళింది. అంతత్వరగా ఎలా రాగలిగావని పండితుడు మళ్ళీ అడిగాడు. క్రిందటిరోజు పండితుడు చెప్పిన ప్రకారమే పడవవాడి కోసం ఎదురు చూడకుండా హరినామమును స్మరించుకుంటూ నదిని దాటి వచ్చేశానని పాలమ్మి చెప్పింది. పండితుడు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయాడు.*


*ఆమె ఏదో కట్టుకథ అల్లి చెప్పుతున్నదని అతను భావించాడు. పాలమ్మి పండితుడిని నది దగ్గరికి తీసుకెళ్ళి, హరినమాన్ని స్మరిస్తూ ఆమె నదిలో నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. పండితుడిని కూడా అలాగే నామస్మరణ చేస్తూ నది దాటి రమ్మని చెప్పింది. నదిలోకి దిగుతూనే పండితుడు ఎక్కడ తన బట్టలు తడిసిపోతాయోనని భయపడసాగాడు. అతని ధ్యాస అంతా దేవుడి మీద కంటే తన బట్టల పైనే ఉన్నది. తన మాటల మీద తనకే నమ్మకం లేకపోయింది ఆ పండితుడికి. అతనికి విశ్వాసం లోపించింది.*


*కేవలం శాస్త్రములు చదివినంత మాత్రమున సరిపోదు. విశ్వాసము, భక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం.*


*అనన్యాశ్చింతయంతో మాం*

*యే జనాః పర్యుపాసతే*

*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్।*


*ఎవరైతే వెరొక ఆలోచన లేకుండా నా యందే మనసు నిలిపి, నాకు దగ్గరగా (మానసికంగా) ఉంటారో, అటువంటి వారి యోగక్షేమాలను 'వ్యక్తిగతంగా' నేను వహిస్తాను.* *అని కృష్ణభగవానుడు గీతలో చెప్పలేదా।*


*ఓం నమః శివాయ।* 

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: