: Srimadhandhra Bhagavatham -- 70 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
కృష్ణ పరమాత్మ వెన్నలన్నీ తినేసి వచ్చాడు. ఇంటికి వచ్చిన గోపకాంతలను చూసి యశోద ‘ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు? అని అడిగింది. అక్కడకు వచ్చిన గోపకాంతలు అందరూ ఒకరి తర్వాత ఒకరు కృష్ణుని మీద ఫిర్యాదులు చెప్పడం ప్రారంభించారు. ఒక గోపకాంత అన్నది
బాలురకు బాలు లేవని, బాలింతలు మొఱలు వెట్ట పకపక నగి యీ
బాలుం డాలము సేయుచు, నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
‘అమ్మా యశోదా! నీవేమిటో ‘మా అబ్బాయి మా అబ్బాయి’ అని పొంగిపోతున్నావు. మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? చంటి పిల్లలకి తల్లి పాలు లేకపోతే ఆవుపాలు పడతారు. బాలింతలు సాయంకాలం అవుతోంది. ఇక పిల్లాడికి పాలు పడదాం అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుపాలు వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేస్తున్నాడు. ఆ దూడలన్నీ వచ్చి ఆవులపాలను తాగేస్తున్నాయి. మీవాడు ఎదురుగుండా ఉన్న చెట్టుకొమ్మ ఎక్కి దూడలను వదిలినందుకు మేము బాధ పడుతుంటే అతను చక్కగా నవ్వుతూ కూర్చుంటున్నాడు. మాకు దొరకడు’ అని చెప్పింది.
ఇందులో ఉండే అంతరార్థమును పరిశీలిద్దాం. మనకి మనకుటుంబం వరకే మన కుటుంబం. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినకపోతే నాకెందుకు అనుకుంటాం. ఈశ్వరుడు జగద్భర్త. ఈ లోకమునంతటికీ తండ్రి. ఆయన రెండుపనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవుదూడలు అంటే ఉపనిషత్తులు. వాటిని పోషిస్తున్నాడు. ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానమును పోషిస్తాడు. అందుకని దూడలను వదిలాడు. రెండవది ఆవులు ఎక్కడికో వెళ్ళి గడ్డితిని, కుడితి తాగి వాటిని పాలుగా మారుస్తున్నాయి. ఆవులు తమ దూడలకు పాలను ఇవ్వడానికి సంతోషంగా ఎదురు చూస్తుంటాయి. ఇంటి యజమాని వచ్చి ముందుగా దూడ దగ్గరకు వెళ్ళి దాని మెడలో ఉన్న ముడిని విప్పితే వెంటనే దూడ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆర్తితో తల్లిపాలను త్రాగుతుంది. ఇంకా దూడకు ఆకలి తీరదు. ఆ దూడను లాగేసి స్తంభమునకు కట్టేసి పిల్లాడి కోసం పాలను పితకడం ప్రారంభిస్తారు. దాని దూడ దాని పిల్ల కాదూ! నీ పిల్లాడు ఎక్కువా! ఈశ్వరునికి ఆవు తనబిడ్డే, దూడా తన బిడ్డే. అందుకని ఆయన వదిలాడు. నీవు ఆయనను వంక పెట్టడం ఎందుకు? దొంగ ఎవరు? నీవా, ఆయనా? ఆయన దొంగ కాదు. నువ్వు దొంగ. తమ దొంగతనం దాచుకుని చోరలీలని ఆయనయందు దొంగతనం చెపుతున్నవారి దొంగ బ్రతుకును స్వామి బయటపెడుతున్నాడు. ఇదీ దీని అంతరార్థం.
మరొక గోపస్త్రీ
పడతీ! నీ బిడ్డడు మా, కడవలలో నున్న మంచి కాగిన పాలా
పడుచులకు బోసి చిక్కిన, కడవల బో నడిచె నాజ్ఞ గలదో లేదో?
యశోదా! నీకు అసలు క్రమశిక్షణ లేదు. నీకే లేనిది నీ పిల్లాడికి ఎలా వస్తుంది? ఏమి చేసాడో తెలుసా! మా ఇంట్లో పాలన్నీ ఎర్రగా కుండల్లో కాచాము. పిల్లలందరినీ తీసుకు వచ్చి చప్పుడు చేయకుండా కుండలను ఎత్తి ఆ పాలన్నీ త్రాగేసి, కడవలను క్రిందపారేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పాలూ పోయాయి, కడవలూ పోయాయి. ఇదెక్కడి పిల్లాడు’ అన్నది.
ఒకరికి పెట్టడం అన్నది లేకుండా ఎప్పుడూ తమకోసమే దాచుకునే వారి ఇంట్లో ఐశ్వర్యమును ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు పరాయివాడికి పెట్టడం రాని ఇంట్లోంచి లక్ష్మీదేవిని ఎలా తీసుకు వెళ్ళిపోవాలో నారాయణునికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకువెళ్ళి పోతాడు. పరులకు పెట్టడం నేర్చుకుంటే జీవితం వృద్ధిలోకి వస్తుంది. ఏది పెట్టారో అది ఆస్తి. పుణ్యం కాపాడుతుంది. అదీ ఇక్కడ కృష్ణుని ఈ చర్యలోని అంతరార్థం.
మరొక గోపిక కొంచెం తెలివయినది. అప్పటికే కృష్ణుడు వచ్చి దొంగతనములు చేస్తున్నాడని, కిందపెడితే పాలు పెరుగు త్రాగేసి కుండలు పగల కొట్టేస్తున్నాడని తెలుసుకుంది. ఆమె తన కోడలిని పిలిచి ‘కుండలను క్రింద పెట్టకు ఉట్టి మీద పెట్టు కృష్ణుడికి అందదు’ అన్నది. అందరూ హాయిగా పడుకున్నారు. కృష్ణుడు వచ్చి చూశాడు. ‘అమ్మా ఎంత తెలివయిన దానివే! నీవు ఎక్కడ పెట్టావో నాకు తెలియదా అనుకున్నాడు. ఈశ్వరుడు ఐశ్వర్యమును తీసివేయాలంటే ఎక్కడ పెడితే మాత్రం తీయలేడు? ఆయన ఎక్కడ ఉన్నా వెన్నను (భక్తిని) తింటాడని రెండవ అర్థం. కృష్ణుడు రోళ్ళు, పీటలు వేసాడు. చెయ్యి అందలేదు. కుండకు క్రింద కన్నం పెట్టాడు. అందులోంచి శుభ్రంగా మిగతా పిల్లలందరితో కలిసి వెన్న తినేశాడు. ఆ గోపస్త్రీ ‘యశోదా! నీ కడుపు పైకి కనపడదు ఇంత తిండి తినేసే పిల్లవాడిని ఎక్కడ కన్నావమ్మా? వెన్న పాలు చేరలు పట్టి తాగేస్తున్నాడు’ అన్నది.
మరొక ఆమె అమ్మా! మా ఇంటికి వచ్చి వెన్న, నెయ్యి తినేశాడు. ఈ ఇంట్లో కుండ పట్టుకువెళ్ళి పక్కవాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళి పోయేవాడు. వాళ్ళు లేచి చూసుకునే సరికి వాళ్ళ కుండలు పక్కఇంట్లో ఉండేవి. వాళ్ళూ వీళ్ళూ దెబ్బలాడుకునేవారు. ఈయన వీధిలో ఆవులకి గడ్డి పెడుతున్నట్లుగా నిలబడి వీళ్ళ దెబ్బలాటని చూసి నవ్వుకునేవాడు. ఎందుకీ లీల? ఒక్కొక్కళ్ళకి తమకి సంపద ఉన్నదనే గొప్ప అహంకారం ఉంటుంది. తమ పక్కన పేదవాడు అన్నం లేక సొమ్మసిల్లి పడిపోయినా తాను మృష్టాన్న భోజనం చేసి పేదవాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాడు నిర్దయుడు. బీదవానికి పట్టెడు అన్నం పెట్టమని అనలేదు. అలాంటి వాడి ఐశ్వర్యమును తీసివేయడమే కుండను మరొకచోట పెట్టడం. ఆయన తలుచుకుంటే వ్యక్తుల స్థానం మార్చగలడు కదా! పేదవాడిని చూసి పరిహాసం చేస్తే ‘నీ పుర్రె అక్కడ పెట్టగలను – ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను. జాగ్రత్త సుమా’ అని స్వామి మనకు ఒక పాఠమును నేర్పారు.
కృష్ణుడు ఇంకొక చోటికి వెళ్ళాడు.
ఆడం జనీ వీరల పెరు, గోడక నీసుతుడు ద్రావి యొకయించుక తా
గోడలి మూతిం జరిమిన, గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!
ఆ ఇంట్లోకి వెళ్లి శుభ్రంగా వెన్న, నెయ్యి తినేశాడు. ఆ ఇంట్లో అత్తాకోడళ్ళు పడుకుని ఉన్నారు. వెళ్ళిపోయే ముందు ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దుట నిద్రలేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది. నెయ్యి లేదు. కోడలు మూతివంక చూస్తే నెయ్యి ఉన్నది. ‘ఓసి ముచ్చా! రాత్రి నెయ్యంతా తినేశావా?’ అని కోడలిని పట్టుకుని కొట్టింది. ఈయన కిటికీలోంచి చూసి నవ్వుతున్నాడు.
అత్త కోడలికి నేర్పవలసిన గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఇంటికి వచ్చిన మహాత్ములను ఆదరించడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి ఐశ్వర్యం కోడలి వలన నిలబడాలి. వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలికి నేర్పాలి. అలాకాకుండా అత్తగారు కోడలికి దుష్టచేష్టలు నేర్పితే చివరికి అది వారిద్దరి మధ్య దెబ్బలాటలకు దారితీస్తుంది. సంసారములు చితికిపోతాయి. ధర్మమునందు పూనిక ఉండదు. అత్త కోడలిని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకును పక్కన పెట్టుకోవాలి. దానం చేయడం కొడుక్కి కూడా అలవాటయి రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మమని స్వామి నేర్పారు.
ఓయమ్మ! నీకుమారుడు, మా యిండ్లను బాలు బెరుగు మననీడమ్మా!
పోయెద మెక్కడి కైనను, మాయన్నుల సురభులాన మంజులవాణీ!!
చివరికి వాళ్ళు ‘అమ్మా! ఇంక నీ కొడుకు మా ఇంట్లో పాలు, పెరుగు బతకనివ్వడు. ఈ ఊరు విడిచి వెళ్లిపోతాము’ అన్నారు.
యశోద వారిని ‘ఇవన్నీ ఎప్పుడు చేశాడు?’ అని అడిగింది. ‘ఇవన్నీ ఈవేళ పొద్దున్న చేశాడు’ అని వాళ్ళు చెప్పారు. ఆవిడ ఈవేళ పొద్దుటినుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. మీరంతా నా కొడుకును గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు అందంగా ఉంటాడని, బుజ్జి కృష్ణుడని మీరు ఇన్ని చాడీలు చెపుతారా! అన్నీ అబద్ధములే’ అలా చెప్పకూడదమ్మా’ అన్నది. ‘అవును ఇప్పుడెందుకు తెలుస్తుందిలే. ఇని ఇళ్ళల్లో జరిగినవి నీ ఇంట్లో జరిగితే నీకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తావో మేము చూస్తాము’ అని గోపికా స్త్రీలు అక్కడనుండి నిష్క్రమించారు.
ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పని చేసుకుంటోంది. బయట బలరాముడు, ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వారు గబగబా పరుగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చి ‘అమ్మా! అమ్మా! నువ్వు ఎన్నోమాట్లు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా! తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు’ అని చెప్పారు.
పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారు. కృష్ణునికి అది చాలా ఇష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా ఇష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండులీలలే చేసాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కుని ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకునే వాడు. ఈ చర్యవలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొకచోట దాక్కున్నవాడు కృష్ణుడు నోట్లో మట్టిపోసుకోవడం చూసాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుని చేయిపట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ వెడితే ఆవిడ -
మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద, రన్నా! మన్నేల? మఱి పదార్థము లేదే?
పిల్లలు చెప్పిన మాటలను ఆవిడ నమ్మేసింది. ఆయన ఏమీ తక్కువ వాడు కాదు. తిన్నాడు ఈ లీల యశోద అదృష్టమును ఆవిష్కరిస్తోంది. పరమాత్మ లొంగిపోయినట్లుగా కనపడిన స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప మరొకచోట లేదు. ఆయన లోకములకన్నిటికి నడవడిని నేర్పినవాడు. ప్రపంచమునకు మార్గదర్శనం చేసిన మహా పురుషుడయిన పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. ‘ కృష్ణా! మన్ను తినవద్దని నీకు ఎన్నిమాట్లు చెప్పాను! మన్ను ఎందుకు తింటున్నావు? నేను ఇంతకు ముందు నీకు ఎన్నోమాట్లు ఇలా తినవద్దని చెప్పాను కదా! నీవు యిలా ఎందుకు చేసావు?’ అని అడిగింది.
కృష్ణుడు మాట్లాడిన తీరును పోతనగారు చేసిన దర్శనం -
అమ్మా! మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెఱ్ఱినో ?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్, న న్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు, కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే !
అమ్మా! నేను మన్ను తినడమేమిటి? నేను శిశువునా? నేను వెఱ్ఱివాడనా? వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నావని అనేస్తున్నావు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ నామీద కల్పించి చెప్తున్నారు. ఆయన వేదాంతం ఎంత చెప్తున్నారో ! తన్మాత్రలలో పృథివికి వాసన ఉంటుంది. ‘నేను నిజంగా మట్టిని తిన్న వాడనయితే పృథివిలోనుండి వాసన వస్తుంది. నా నోరు మట్టి వాసన రావాలి కదా! ఏదీ నా నోరు వాసన చూడు. వాసన వస్తే అప్పుడు కొట్టు’ అన్నాడు. యశోద ‘ఏమిటి వీడు ఇంత తెంపరితనంగా మాట్లాడుతున్నాడు. మట్టి తినలేదంటున్నాడు. నిజం ఏమిటో పరిశీలిస్తాను’ అని కృష్ణుడిని నోరు తెరవమన్నది. ఏమి యశోదాదేవి అదృష్టం! ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరల జన్మములు ఎత్తారు. అంతటా నిండివున్న ఈశ్వరుని చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానము. ఏమీ చదువుకోని స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుని యందు లోకం కనపడుతోంది. లోకము ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ ఈ తత్త్వమును ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనం. దీనినే ‘మృద్భక్షణమున విశ్వరూప ప్రదర్శనము’ అంటారు.
కృష్ణుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నరులతో, లోకంతో, నందవ్రజంతో, నందవ్రజంలో ఉన్న పశువులతో, తన ఇంటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనపడ్డారు. ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోటిలో కనపడుతుంటే ఆవిడ తెల్లబోయింది.
కలయో! వైష్ణవమాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలపన్ నేరకయున్నదాననో ? యశోదాదేవి గానో ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్!!
నోరు తెరిస్తే పిల్లవాని నోట్లో ఉన్నవన్నీ చూసి యశోద ‘ఇది కలా? వైష్ణవ మాయా? ఏదయినా సంకల్పమా? నేను యశోదనేనా? నేను నా ఇంట్లోనే ఉన్నానా? వీడు నా కొడుకేనా? వీని నోట్లో బ్రహ్మాండములు అన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. పిల్లవాడేమిటి? నోట్లో బ్రహ్మాండములు ఏమిటి?’ అని ఆశ్చర్యపోయింది. యశోద కృష్ణుని కేవలము తన కొడుకుగా భావన పెంచుకుంది ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించినా ఆమె ఈశ్వరునే ప్రేమించింది. భక్తికి పర్యవసానము జ్ఞానము. ఇదే విశ్వరూప సందర్శనము.
అమ్మ ఇలా జ్ఞానంతో ఉండిపోతే నాకు అమ్మగా ఉండలేదు. మరల వైష్ణవమాయ కప్పాలి అనుకొని పరమాత్మ ఆమె జ్ఞానమును ఉపసంహారం చేశాడు. అంతే! ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది. ఇదే పరమాత్మ అనుగ్రహం.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
[: Sri Siva Maha Puranam -- 17 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
వైద్యనాథ లింగము
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతం!
సురాసురాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి!!
‘ఓ వైద్యనాథుడా! నీకు మేము నమస్కరించుచున్నాము’ అంటారు. ఏది చేసినా దాని చిట్టచివరి ప్రయోజనం పరబ్రహ్మమును చేరటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉన్నది. ‘ప్రథమో దైవ్యో భిషక్’. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. భవరోగము అని ఒక రోగం ఉంటుంది. ఎప్పుడూ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం. ఈ భవ రోగమునకు ప్రధాన కారణం అహంకారం. భవరోగములో పడి కొట్టుకునే వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరకి చేర్చుకుంటాడు. కూడా ఆయన వైద్యనాథుడు. వైద్యులకు నాథుడయినవాడు లేదా వైద్యులయందు పెద్ద వైద్యుడు – రెండు కారణముల చేత ఆయనను వైద్యనాథ లింగమని పిలుస్తారు.
ఒకానొక సమయంలో లంకా పట్టణమును రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకాపట్టణం ఎప్పుడూ దక్షిణదిక్కునే ఉంటుంది. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవన యాత్రలో చిట్టచివరి ప్రయాణం అక్కడకు వెళ్ళడంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు. వేదమును చదువుకున్న వాడు, త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘన - జట చెప్పేవాడు. ఈ చదువు ఒక స్థాయి యందు నిజమయిన చదువు కాదు. అంత గొప్పవాడయిన రావణుడు ఒకసారి కైలాసమునకు వెళ్ళాడు. శరీరము నేననే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని దర్శనం దొరకడం కష్టం. రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా, మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. సాత్త్వికంగా ఉండదు. ఈశ్వరుడిని కదపలేక పోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉన్నది. ఈశ్వరుడి మీద అలక వహించాడు. తన తొమ్మిది తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన పదవ తలను కూడా నరుక్కునేందుకు సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆసమయంలో శంకరుడు వచ్చి ఎదురుగుండా నిలబడే సరికి రావణుని పది తలలు మరల మొలిచాయి. శంకరుడు రావణునితో “రావణా ! నీకు ఏమి కావాలి?” అని అడిగితే తనకు విపరీతమయిన బలం కావాలి అన్నాడు. రెండవ కోరికగా శంకరుడిని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. శివుడు ‘నేను లింగమునందు ఉంటాను. నీవు దీనిని తెలివితో నీ పట్టణమునకు తీసుకువెళ్ళు’ అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉంది కాని మనస్సుకి తెలివిలేదు. ఉత్తర క్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది. అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు.
రావణుడు ఆ శివలింగమును పట్టుకుని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంథానము ఒకటి ఉన్నది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహారపదార్ధం తీసుకు వెళ్లి ఈ పిండాండంలో పడెయ్యాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉన్నది. ఇందులోని మలినములను పట్టుకుని ఆ నీళ్ళు బయటికి రావాలి. నీళ్ళను మరల బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించిన వాడు ఈశ్వరుడు, నీటిని ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఈ నీటిని మరల మూత్రముగా మార్చిన వాడు ఈశ్వరుడు, బయటకు పంపిన వాడు ఈశ్వరుడు. ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలి వాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా! ఎవడో ఒకరు శివలింగమును పట్టుకుంటే బాగుండుని అని అనుకుని అటూ ఇటూ చూశాడు. ఆ శివలింగం శివుడన్న భావన రావణునికి లేదు. తేలికగా చూశాడు. అక్కడి సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగమును ఒకసారి పట్టుకుని ఉండవలసినదని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అది శివుడు. రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువయిపోయింది. వాడు మోయలేక కింద పెట్టేశాడు. శివుడు రావణునితో ఇది నీ పురి చేర్చు. మధ్యలో దీనిని ఎక్కడయినా క్రింద పెట్టావో అక్కడ ఉండిపోతాను’ అని ముందరే చెప్పాడు. ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును భూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగుపరుగున వచ్చాడు. అతను వెంటనే ‘ఈశ్వరా! తీసుకు వెళ్ళమన్నావు కానీ ఆ తెలివి నాయందు నిలబడక పోవడానికి కారణం కూడా నీవే. నా బుద్ధి మార్చవలసిందని ప్రార్థన చేయలేదు. ఇదెంత దీనిని నేను ఎత్తుకు పోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉన్నది.
దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలదని దేవతలు భావించి నారదుని వద్దకు వెళ్లి రావణుడు సంపాదించిన బలం వానినే పాడుచేసేటట్లుగా చేయవలసినదని కోరారు. నారదుడు వెళ్ళి ‘రావణా! నీవు కైలాసమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది’ అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. నారదుడు నీకు శివలింగమును ఇచ్చినట్లే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా! దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరులమీదికి వెళ్ళు’ అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పకవిమానం ఎక్కి కైలాసపర్వతం దగ్గరకు వెళ్ళి కైలాస పర్వతమును కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమునకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. లోకమును బతికించి లోక కంటకుడిని చంపాలి. వాడు చావడానికి కారణం శివ ముఖతః రావాలి. అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివుడు చేస్తుంది. లోకక్షేమం కోసం శివున్ని రుద్రుని చేస్తోంది.
మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నా రండీ! మీరు వరములు ఇచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి కోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు మీరు నేనూ ఊగిపోతున్నాము. పాపం మీరుమాత్రం ఏం చేస్తారు లెండి?” అన్నది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. ‘రావణా! ఇక కొద్దికాలంలో నీ మదం అణగిపోతుంది. ఇక్కడనుండి పో’ అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈమాట వినపడింది. ఈశ్వరుని మాట నిజం అయింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివ వాక్యమును ఆధారం చేసుకునే తరువాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరకు రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున పది తలలు పడగొట్టేస్తుంటే ఆఖరున మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది.
ఇది ఆనాడు చితాభూమియందు వెలసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం. ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహమును ఇస్తున్నది. ఇదే వైద్యనాథుడంటే! భవము – అంటే సంసారమునందు కొట్టుమిట్టాడుతూ, కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్త్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని కృపచేసి భవసాగరమునుండి ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకరికి ఈశ్వరుడిని చేరడానికి కోటి జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో, ఒక్క గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి అటువంటి మహానుభావుడికి నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువకాలంలో సత్త్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాలన్న భావన మంచిది కాదు.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy