కేనోపనిషత్- ఈ ఉపనిషత్తు సామవేద తవల్కార శాఖకు సంబంధించినది. 'కేనేతి' అనే ప్రశ్నతో ఆరంభం అవ్వడం వల్ల ఈ ఉపనిషత్తుకు 'కేనోపనిషత్తు' అని పేరు. బ్రహ్మ యొక్క రహస్యాత్మక రూపనిరూపణము, ఉమాదేవి పరమాత్మ విషయక జ్ఞానము ఉపదేశించడము, పరబ్రహ్మ యొక్క సర్వశక్తిమత్వ ప్రతిపాదనము మొదలైన విషయాలు ఈ ఉపనిషత్తులో చర్చింపబడ్డాయి.
కేనేషితం పతతి ప్రేషితం మనః కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః॥ కేనేషితాం వాచమిమాం వదన్తి చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి ॥
II మనస్సుని విషయాలపైకి పోయేటట్టుగా ఏది ప్రేరేపిస్తుంది? దేని ప్రేరణచే ప్రాణము తన వ్యాపారమును నిర్వర్తిస్తుంది? దేని సంకల్పముచే మానవులు మాట్లాడగలుగుతున్నారు? ఎవని ఆజ్ఞచే చక్షువు, శ్రోత్రము పనిచేస్తున్నాయి? అనే ప్రశ్నతో ఈ ఉపనిషత్తు మొదలైంది.
కర్మజ్ఞానాలు రెండూ “తమః ప్రకాశం” లాంటివి. తమ: ప్రకాశాలు రెండూ ఒకేచోట ఉండటం కుదరదు కాబట్టి కర్మల నుండి విరక్తుడైన వానికి, తన స్వరూపాన్ని తెలియాలనే కోరిక పుట్టును. ఈ విషయమును "కేనేషితమ్” అనే మంత్రం నిరూపిస్తోంది.
ఆత్మజ్ఞానము కలిగినవాడు కర్మలను చేయుట యుక్తియుక్తము (లోకహితం కోసం చేయాలి) కాదు. కాబట్టి బాహ్యజగత్తు నుండి నివృత్తమైన మనస్సు గలవానికి ఆత్మజ్ఞానము కలుగుట కొరకు ఈ ఉపనిషత్ యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది.
కేనేషితం.... అనే శిష్యుని ప్రశ్నకు ఆచార్యుడు సమాధానం ఇలా చెబుతున్నాడు. ఏదైతే చెవికి చెవియో, మనస్సుకు మనసో, వాక్కునకు వాక్కో అదియే ప్రాణమునకు ప్రాణము, కన్నుకు కన్ను ఇలా గ్రహించిన ధీరులు విముక్తులై ఈ లోకమునుండి వెళ్ళి అమరులగుదురు అని ఆచార్యుడు ఉపదేశించాడు.
ఆత్మను ఆశ్రయించుకొని సమస్త ఇంద్రియాలు వాటి వాటి వ్యాపారాల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇక్కడ మనస్సుకు మనస్సు అని చెప్పడంలో గల తాత్పర్యమేమనగా? చైతన్యజ్యోతి యొక్క ప్రకాశము లేకుండా అంత:కరణము తనకు విషయములైన సంకల్పము, నిశ్చయము, శ్రద్ధ, అశ్రద్ధ, అధృతి మొదలగు వాటి యందు సమర్థము అవ్వదు. కావున ఆత్మ మనస్సునకు కూడ మనస్సు అని చెప్పబడినది.
ఈ ఉపనిషత్తులో మరొక ప్రధాన విషయం- దేవాసుర సంగ్రామంలో అసురులపై దేవతలు విజయాన్ని పొందారు. విజయగర్వంతో దేవతలు ఆనందిస్తున్న వేళ వారి గర్వాన్ని అణచడానికి బ్రహ్మ ఒక యక్షరూపాన్ని దాల్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యక్షుడు ఎవరో కనుక్కోమని మొదటగా 'అగ్నిదేవత'ను పంపిస్తాడు ఇంద్రుడు. ఆ యక్షుడు నువ్వు ఎవరివి? అని ప్రశ్నించగా నేను ‘అగ్ని’దేవతను. ఈ సమస్తాన్ని క్షణకాలంలో దహించగలనని సమాధానం చెప్పాడు. యక్షుడు ఒక గడ్డిపోచను అతడి ముందు ఉంచి దీనిని దహించమని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవత సర్వశక్తితో గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అవమానంచే వెనుదిరిగాడు. తరువాత మాతరిశ్వుడు వచ్చి గడ్డిపోచను కదలించలేక వెళ్ళిపోయాడు. చివరకు దేవేంద్రుడు గర్వంతోవచ్చేసరికి యక్షుడు కనిపించకపోగా, అతడు అక్కడే ఉండి తపస్సు చేయగా, ఉమాదేవి ప్రత్యక్షమయి ఆ యక్షుడు ఎవరో కాదు సాక్షాత్ బ్రహ్మయేనని తెలిపింది.
ఇక్కడ గ్రహించవలసిన విషయమేమనగా! అహంకారాది అసుర సంపత్తి గల మనుజుడు ఆ భగవంతుని యొక్క వాస్తవతత్త్వాన్ని తెలుసుకోలేడు. కనుక అహంకారాది అసుర సంపత్తిని వదలినవారికే అతడి దర్శనం కలుగుతుందని గ్రహించాలి.
కొనసాగింపు