19, ఆగస్టు 2023, శనివారం

బర్బరీకుడి శాప వృత్తాంతమేమిటి

 నిత్యాన్వేషణ:


బర్బరీకుడి శాప వృత్తాంతమేమిటి?


బర్బరీకుడు భీముడికి మనవడు. ఘటోత్కచుడికి కుమారుడు. అతని తల్లి మౌర్వి.బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి, అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు.


బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు.


‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు.


‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు.


‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు.


కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద అకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.


‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు.


ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవు అని గ్రహిస్తాడు.


‘బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో... నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని విశదపరుస్తాడు. శ్రీకృష్ణుని మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావలసి వుందని, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వు’ అని కోరుతాడు. ఆ మాటలతో, వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారుమాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా వుందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.


బర్బరీకుడి శాపవృత్తాంతము:-


బర్బరీకా! నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. “భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణూ! “ అంటూ బ్రహ్మదేవుడిని వెంటపెట్టుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. “ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే “ అని శపించాడు. అందుకే నీ బలి . అంతేకాదు, నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు కృష్ణుడు. కానీ నాకు యుద్దాన్నీ చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు కృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు.


కృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. కృష్ణుడు వారినందరినీ బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్లి , బర్బరీకుడి గురించి చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత కృష్ణుడు బర్బరీకుడితో, వత్సా ! ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే. నువ్వు చెప్పు ఏం గమనించావో అని అనెను. “ స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి, నువ్వు మాత్రమే యుద్ద కారకులు, యుద్ధకర్తలు. మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే “ అని సమాధానమిచ్చెను. తన శాపం ముగిసిపోయి, తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు బర్బరీకుడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ.

కామెంట్‌లు లేవు: