19, ఆగస్టు 2023, శనివారం

సౌందర్యలహరి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.       *🌹సౌందర్యలహరి🌹*


*భూమౌస్కలితపాదానాం భూమిరేవవలంభనం*

*త్వయిజాతా పారాధానం త్వమేవ శరణం శివే ||*




*శ్లోకం - 1*


       *శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం*

       *న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|*

       *అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి*

       *ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి||*


శివ, శక్తుల ఏకత్వాన్ని నుతిస్తూ ఈ స్తోత్ర ప్రారంభం చేశారు శంకరులు. 


శివః శక్త్యాయుక్త = శక్తితో కూడియున్న శివుడు

శక్తః ప్రభవితు యది భవతి=సృష్టి, స్థితి, లయలు చేయు శక్తి కలిగియున్నాడు.

న చే దేవం = అలా కానట్లయితే

దేవః న ఖలు కుశలః స్పందితుమపి = ఆ పరమేశ్వరుడు స్పందించే నేర్పు లేని వాడవుతాడు.

 అమ్మవారు చైతన్య శక్తి అని ముందు చెప్పుకున్నాము. చైతన్యం ఉన్నచోటనే స్పందన ఉంటుంది. పరమేశ్వరుడు ఏకః అహం బహుస్యాం - ఒక్కడుగా వున్న నేను అనేకముగా అవుతాను అని సంకల్పించగానే ఆ సంకల్పమునుండి స్పందన దానినుండి ఇచ్చా, జ్ఞాన, క్రియాత్మకమైన వ్యక్తీకరణ జరిగింది. అమ్మవారే ఆ స్పందన శక్తి. జ్ఞాన క్రియాశక్తులతో వేరుగాలేని ఇచ్ఛాశక్తి కలిగియున్న పరమేశ్వరుని వల్ల ఈ ప్రపంచ సృష్టి జరుగుతుంది. అమ్మవారి నామాల్లో  ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అని *సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిన్దరూపిణీ* అని మనం చెప్పుకుంటున్నాం. ఇచ్చాశక్తినే సత్య కామః సత్య సంకల్పః అన్నారు శ్రుతిలో. సత్య అంటే ఎప్పుడూ ఉండేది వ్యర్ధము కానిది. ఈ సత్యకామ సత్య సంకల్పాలే కామేశ్వరుడు  కామేశ్వరి. 

అతస్త్వామ్ ఆరాధ్యాం = అందువల్ల హరి హర బ్రహ్మలచే ఆరాధింపబడుతున్నది అమ్మవారు.

 ముందు సంకల్పం చేసాడని చెప్పబడుతున్న పరమేశ్వరుడు  హరి హర బ్రహ్మలకు మూలమైనవాడు. ఆయనే జగన్నిర్వహణ కోసం త్రిమూర్తులుగా ఇతర దేవతలతో కలిసి నిన్ను ఆరాధిస్తున్నారు అమ్మాఅని భావం. సృష్టి స్థితి లయలు నిర్వహించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఇతర దేవతల శక్తులు అమ్మవారినుండి ప్రసరింపబడి వారి వారి విధులకు తగిన శక్తులను ప్రసాదిస్తున్నవి.

ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి = అటువంటి తల్లికి నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా ఎన్నో జన్మలుగా పుణ్యకార్యముల వాసన లేనివాడు ఎలా చేయగలడు?

🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: