19, ఆగస్టు 2023, శనివారం

రామాయణమ్ 297

 రామాయణమ్ 297

...

నేనూ ,రాఘవుడూ మందాకినిలో జలక్రీడలాడి హాయిగా విహరించి ఒక చోట విశ్రాంతి తీసుకొంటున్నాము.

.అప్పుడు ఒక కాకి నా వద్దకు వచ్చి నన్ను పొడవటానికి ప్రయత్నించటము నేను దానిని ఒక మట్టిపెళ్ళతీసుకొని దూరముగా తరమటము జరిగినది .

.

అది మాటిమాటికి అలా వస్తూ ఉండగా తరమటము నా వంతు అయినది నా అవస్థ చూసి రాఘవుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ నన్ను కవ్వించటమూ నేను ఉడుక్కొనుటమూ ఒక వేడుకగా కొంత సమయము సాగినది .

.

అలసిన నేను రాఘవుని ఒడిలో తల ఉంచుకొని నిదురపోయి సేదతీరినాను.నేను మేలుకొన్నపిమ్మట రామచంద్రుడు నా ఒడిలో నిదురించసాగాడు.గాఢనిద్రలో ఉన్నరాముని చూస్తూ అలాగే కాలం గడుపుతున్న నాకు హఠాత్తుగా నా వక్షస్థలము మీద ఎవరో పొడిచినట్లయి చూడగా అది ఇంతకు మునుపు నేను తరిమిన కాకి.!

.

మాంసము మీద ఆసక్తితో అది నన్ను ముక్కుతో వక్షోభాగము మీద పొడవసాగింది.

.

రాఘవుడికి నిద్రాభంగము కలిగించుట ఇష్టములేని నేను ఆ బాధను అలాగే భరించసాగాను.

.

కానీ దాని ఆగడము మితిమీరిపోయి నాకు తీవ్రమైన గాయము చేయగా రుధిరధార వెచ్చగా రాముని ఫాలభాగము మీద పడి ఆయనకు నిద్రాభంగము కలిగించినది.

.

మేలుకున్న రాముడు నాకు అయినగాయము, కారుతున్న రక్తము చూసి క్రోధముతో రుద్రుడైనాడు.

.

 ఎవడు రా వాడు?నా సీతకు గాయము చేసి ,అయిదుతలల మహానాగునితో ఆటలాడ సంకల్పించినవాడు ? అని అటునిటు చూడగా ఈ ఆకతాయి కాకి కనపడినది.వాడు ఇంద్రుడి కొడుకట!

.

ఆ కాకిని శిక్షించవలెనని సంకల్పించిన రామచంద్రుడు ప్రక్కనున్న దర్భను తీసి బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి దాని పైకి ప్రయోగించినాడు.

.

బ్రహ్మస్త్రమైన ఆ దర్భ వానిప్రాణములు తీయుటకు గాను వానిని వెంబడించింది .

.

ఆ కాకి ముల్లోకములు తిరిగి రక్షించువాడు కానరాక మరల రామునే శరణుజొచ్చినది.

.

శరణాగత రక్షకుడు ,కరుణార్ద్రహృదయుడు అయిన ఆ దాశరధి బ్రహ్మాస్త్రము వ్యర్ధము కారాదు కావున ఆ కాకి కన్ను మాత్రము పెకిలించి వేసి దానికి ప్రాణభిక్ష పెట్టెను .అది రామునకు ప్రణమిల్లి బ్రతుకుజీవుడా అంటూ తనతావునకు ఎగిరి పోయెను.....అంటూ సీతమ్మ, హనుమంతునకు తమ కధ చెప్పి....ఇంకా....

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: