20, నవంబర్ 2022, ఆదివారం

స్వామితో సంభాషణ

 స్వామితో సంభాషణ


వైకుంఠ ఏకాదశికి కంచి వెళ్లాలని నేను సంకల్పించుకున్నది కంచి వరదుని సేవించు కోవడం కొరకే. కామకోటి శంకరాచార్య దర్శనం తలవని తలంపుగా తటస్థించింది. అయినా దాని ప్రభావం నామీద చెరగని ముద్ర వేసింది.


ఆ స్వామి పూజావిధానం, ఆ పూజలో ఆయన తన్మయత్వం, తన్మయతలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధా, మెలకువా, శ్రీ చంద్రమౌళీశ్వరుని పూలతో పూజించేటప్పుడు, హారతులిచ్చేటప్పుడు, వింజామరలు వీచేప్పుడు, శ్రీ త్రిపురసుందరీ, చంద్రమౌళిశ్వరులను ఊయలలో ఊపేటప్పుడు, చేత దండం పుచ్చుకుని స్వామి ప్రదక్షిణ చేసేప్పుడు, చివరకు, తన తలపై నుంచి కిందికి జారుతున్న కాషాయాన్ని సవరించుకునేప్పడు సైతం, కళాశోభితమైన ఆ సౌకుమార్యం, అతిలోక సౌందర్యం, నన్ను పూర్తిగా లోగొన్నవి. రోజులు గడిచిన కొద్దీ వారి ప్రభావం పదింతలూ, నూరింతలూ అయింది.


మరోసారి కంచికి ప్రయాణం కట్టి, ఆచార్య స్వామిని చూచి రావాలనిపించింది. దూర దూరంనుంచి గాక, దగ్గరకు వెళ్లి స్వామిని చూడాలని, స్వామితో మాట్లాడాలనీ, స్వామి మాటలు ఆలకించాలనే అభిలాష రేకెత్తింది.


ఈ స్వామి అందరు పీఠాధిపతులవంటి స్వామికారనీ, అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈయనలో ఉన్నదనీ, అంతకు ముందు నాకు ఏర్పడిన అభిప్రాయం వైకుంఠ ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది. మహాపురుష సంశ్రయం కోసం మనస్సు ఉవ్విళూరింది.


అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా ఒక గురువును అన్వేషిద్దామనో, ఆయన వల్ల ఉపదేశం పొందుదామనో అభిలాష మాత్రం అప్పటికి నాకు లేదు.

చెన్నపురి ఆంధ్రమహాసభలో నాతోపాటు గౌరవ కార్యనిర్వాహకుడుగా ఉంటున్న ఒక న్యాయవాది మిత్రుని తోడు చేసుకుని, ఇద్దరం కలిసి, ఒక ఆదివారం మధ్యాహ్నం కంచి చేరాము. స్వామి వారింకా విష్ణుకంచిలో ఉన్న మఠంలోనే ఉన్నారు. మా అదృష్టమేమో, మేమక్కడికి చేరినవేళకు స్వామి వెంట, వారి శిష్యులు తప్ప ఇతరులెవరూ లేరు. మా ఇరువురి పేరూ ఒక చీటిమీద వ్రాసి, స్వామి దర్శనానికి వచ్చినట్టు శిష్యులతో చెప్పాము.


"ఇప్పుడే భిక్ష ముగించారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. కాసేపటికి వెలుపలికి వస్తారు. కూచోండి" అని శిష్యులు చెప్పారు.


వారి మాటలు విని మేము కూర్చున్నామో లేదో, మరొక శిష్యుడు వచ్చి, "స్వామి ఇప్పడే వస్తున్నారు" అంటూ, వారు కూచోడానికి ఒక పీట వేశారు.


ఇంతలో చేత్తో దండం పుచ్చుకుని స్వామి రానే వచ్చారు. మేమిద్దరం స్వామికి సాష్టాంగం చేశాము, మా మా ప్రవర, గోత్రనామాలూ చెప్పకుంటూ. స్వామి మమ్మల్ని తమకు అభిముఖంగా కూచోమన్నారు. ప్రశాంతగంభీరంగా ఉంది స్వామి వదనం. ప్రసన్నతను కుమ్మరిస్తువి ఆయన నేత్రాలు. శరీరకాంతి చెప్పశక్యం కాదు. అప్పటికి స్వామి వయస్సు అరవై డెభ్చయి ఏళ్ల మధ్యలో ఉండవచ్చు. వయస్సుచే కాకున్నా, నిరంతర జపతపాల వల్లా, ఉపవాసవ్ర తాల మూలంగానేమో శరీరం శుష్కించి, కాస్తముడతలు పడినట్టు కనిపిస్తున్నది. లోక సేవాచరణంలో ఎవని శరీరం శుష్కించుతుందో వాడే నిజంగా ధన్యాత్ముడంటాడు స్వామి వివేకానందుడు.


శరీరం ఒకింత సడలినా దేహకాంతి మాత్రం దర్శనీయంగా ఉంది. లావణ్యమంటే అదే కాబోలు!


ముక్తాఫలేషు చాయాయా:

తరలత్వమివాంతరా

ప్రతిభాతి యదంగేషు

లావణ్యం తదిహోచ్యతే.


ముత్తెపు గోళాల్లో లోలోన చలిస్తూన్న కాంతివలె దేహంపై ప్రకాశించే కాంతి "లావణ్య” మట.


ఇక ఆ స్వామి నయన సౌందర్యం, అహో! అది వర్ణనాతీతం. నేనేమిటి, దేశదేశాల ప్రముఖులెందరెందరో దివ్య సౌందర్యం వెలిగక్కే ఆ నేత్రకమలాలకు నీరాజనాలర్పించారు.


లోకంలో సాధారణ సౌందర్య ప్రమాణాల ప్రకారం, అంగప్రత్యంగసౌష్ఠవం దృష్ట్యా, స్వామి సౌందర్యవంతుడు కాకపోవచ్చు. కాని, అనిర్వచనీయమైన అఖిలజనానందకరమైన ఏదో ఒక తేజస్పూ, ఒక వర్చస్సూ, ఆయనలో ఉన్నవి. అదేనేమో బ్రహ్మతేజస్పు!

"గురుకృపాలహరి" అనే సంస్కృత పద్య కావ్యంలో సుప్రసిద్ధకవులు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు స్వామి సౌందర్యం ఇలా వర్ణించారు.


రక్తాంతస్పృహణీయ దీర్షనయనం

స్వాకుంచిత భ్రూలతం!

హాసస్మేరముదార పాలఫలకం

స్ఫూర్జత్కపోలారుణం!

శ్రీ కర్ణం సునయనం సుచారు రదనం

పూర్ణేందు బింబాసనం

వందే శ్రీగురుమూర్తి మిందుమకుటం

శ్రీ కామపీఠాధిపమ్"


(కొనలయందు ఎర్రని జీరలతో సాంపునింపు చారడేసి కన్నులు, కొంచెం వాలిన కను బొమలు, చిరునవ్వదులకించే వెడల్పయిన లలాటం, లేత ఎరుపురంగు చెక్కిళ్లు, శ్రీకారము లవంటి చెవులు, చక్కని ముక్కు, ఇంపైన పలువరస, పన్నమి చందురునికి సాటివచ్చే నెమ్మోమూ కలిగిన కామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం)

ఇంటి పేరుతో సహా నాపేరూ, ప్రవరా విని, మందహాసం చేసూ,

"మీరైతే బ్రాహ్మణులా? మీ ఇంటిపేరులోనూ, మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియులా!" అని స్వామి చమత్కరించారు. (మా ఇంటి పేరు "నీలంరాజు". మా గోత్ర ఋషులు, "హరిత, అంబరీష, యవనాస్య")

స్వామి విసరిన చలోక్తివల్ల మా కొత్తదనం కొంత సడలింది. స్వామికి మేము మరింత సన్నిహితులమైనాము.


నేను నా విద్యార్థి దశలోనే మహాత్మగాంధి ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నాననీ, టంగుటూరు ప్రకాశంగారు స్థాపించిన ఆంగ్ల "స్వరాజ్య" పత్రికలో, కాశీనాథుని నాగేశ్వరరావు నడిపిన 'ఆంధ్రపత్రికలో’ పనిచేశాననీ, రాజకీయాల్లో గాంధి అనుయాయుణ్ణి అనీ స్వామికి విన్నవించాను.


ఆ తరువాత స్వామి నాలుగున్నర గంటలు సావకాశంగా, తెరిపి లేకుండా వివిధ విషయాలను గురించి సంభాషించారు. మన సంస్కతి, మన చరిత్ర, ఆనాటి మన రాజకీయాలూ, మన దేశనాయకుల వైఖరులూ, మన సంఘసంస్కర్తల నడవడులూ, ఒకటేమిటి - ప్రసక్తాను ప్రసక్తంగా సమస్త విషయాలూ చర్చనీయాంశాలు అయినాయి.


దేశవిభజన విషయంలో గాంధి - జిన్నాల మధ్య జరిగిన వాదప్రతివాదాలను, ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్వాపరాలతో పూసగుచ్చినటు విశ్లేషించి చెప్పారు. కాంగ్రెసు నాయకులు జిన్నాసాహెబ్ వ్యూహంలో చిక్కుకున్న పరిస్తితులు ఎలా కల్పించబడ్డాయో, తత్ఫలితంగా అఖండభారత స్వరూపం ఏవిధంగా అంతరించిందో సహేతుకంగా నిరూపణ చేశారు. (ఈ సందర్భంలో ఇటీవల వెలుగు చూసిన మౌలానా అబుల్ కలాం అజాద్ వ్రాతలు స్వామి అభిప్రాయాలను బలపరుస్తున్నాయి.)


నాలుగున్నర గంటలు స్వామి ముచ్చటైన తెలుగులో, నేటి మన ఉపన్యాసకుల ధోరణిలో గాక, మన పూర్వీకులు మాట్లాడుకునే సరళమైన వాడుకభాషలో మాట్లాడారు. కాకపోతే, అరవదేశంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల యాసమాత్రం అక్కడక్కడా కాస్త తొంగిచూసింది. పండితుల పదాడంబరం మాటవరసకైనా కానరాలేదు. పదంకోసం వెతుక్కోవడం లేదు. తరంగం లేని సముద్రంలో పడవ నడిచినటు ప్రసంగం యావత్తు ఆశుకవిత్వంలా సాగింది. యావద్భారతజాతిని కలవరపరచిన ప్రధాన సమస్యలను గురించి అంత తర్కసహంగా, యుక్తియుక్తంగా అనుద్వేగంగా ప్రసంగించడం అందరికీ సాధ్యం కాదు. అంతసేపు నేనూ, నా మిత్రుడూ శ్రోతలంగా చెవులప్పగించి స్వామి ప్రసంగం విన్నాము. ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే "శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తెలుగువాడే, ఆయన మాతృభాష తెలుగేనన్న అభిప్రాయం కలిగింది. కాదు, కన్నడమన్నమాట అటు తరువాతనే.


కాగా, గాంధి - జిన్నాల మధ్య జరిగిన వాద ప్రతివాదాలను, పూర్వాపరసందర్భాలను ఇంచుమించు తేదీల క్రమంగా స్వామి వివరించిన తీరు చూస్తే, ఆయన ధారణాశక్తి ఎంతటి వారికైనా దుర్లభమని తోచింది. అసాధారణమైన ఉపాసనాబలమేదో ఆ శక్తికి కారణమై ఉండాలి. లేదా, ఆ మేధాసంపద జన్మసిద్ధమైనా కావాలి. ఆ విషయం అలా ఉంచి, మరో ముఖ్యాంశం గమనించుదాం. నాటి దేశపరిస్థితులను స్వామి చర్చించిన తీరునుబట్టి, దేశ రాజకీయ సమస్యల పట్ల స్వామికి గల అవగాహన గానీ, రాజ్యాంగ పరిజ్ఞానం గానీ కలవారు, అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకులలో సైతం ఎందరో ఉండరు.


1894 సంవత్సరం మే నెల 20వ తేది, దక్షిణదేశంలోని విళుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్తి, శ్రీమతి మహాలక్ష్మి పుణ్యదంపతులకు జన్మించిన "స్వామినాథన్ అనే బాలుడు తన 13 ఏట సన్యాసదీక్ష పుచ్చుకుని, చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటిపీఠం అధిష్టించకుండా, అందరితోపాటు ఆంగ్ల విద్యనభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే, గాంధి, నెహ్రూల సరసన ఏ మహానాయకుడుగానో, ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తగానో, ప్రపంచ ఖ్యాతికాంచేవాడని చెప్పడానికి జ్యోతిశాస్త్రవేత్త కానక్కరలేదు. మత విషయాలకు మాత్రమే పరిమితమైన పీఠాధిపతులుగా ఉంటూ, అహర్నిశలు జపహోమతపాదులతో, పూజాపునస్కారాలతో, శాస్త్రపురాణ చర్చలతో, అనుదినం తమ్ము సందర్శించే అశేషభక్తజనుల సమస్యల పరిష్కారంలో నిమగ్నులైన కాషాయధారులకు వర్తమాన రాజకీయాలను గురించి అంతటి సదవగాహనం ఎలా సాధ్యమన్నది ఊహించడానికే వీలుకాని విషయం. ఒక్క రాజకీయమా? చారిత్రకమా? శాస్త్ర విషయమా? ధర్మవిషయమా? ఇంతటి వివిధ విషయాభిజ్ఞత ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఒకేఒక వ్యక్తిలో నిక్షిప్తం కావడం ఎలా సంభవం? అసదృశం ! అపూర్వం !


అయినా, ఇలా ఆశ్చర్యం చెందవలసిన పనిలేదట. వేదానికి భాష్యం రాయడమేగాక, విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు కారణభూతులైన శ్రీ విద్యారణ్యులు ఇలా అంటారు:


తదిత్థం తత్వవిజ్ఞానే సాధనాను సమర్దనాత్

జ్ఞానినా చరితుం శక్యం సమ్యక్ రాజ్యాది లౌకికమ్|

“తపస్సు వల్ల తత్వజ్ఞానాన్ని బడసి పరిణతులైన మహాజ్ఞానులు, రాజ్యపాలనా సమర్థులు కూడా కాగలరు”


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తకం నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అవగాహనా స్థాయిలు (UNDERSTANDING LEVELS) 

 

అవగాహనా స్థాయిలు (UNDERSTANDING LEVELS) 

ఈ భూమి మీద వున్న జంతుకోటిలో ఒక్క మానవుడు మాత్రమే బుద్ది జీవి.  అట్లా అని అందరు మానవులు అన్ని విషయాలను తెలుసుకునే స్థాయిలో (LEVEL) ఉంటారని మనం అనలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహనా స్థాయి  ఉంటుంది.  పూర్వం కొంతమంది ఒక్కసారి ఒక పాఠం చెపితే వెంటనే దానిని తెలుసుకొని కంటతహా పట్టేవారట అంటే వారు ఒక్కసారి ఒక్కవిషయాన్ని వింటే వెంటనే ఆదివారికి నోటికే వచ్చేది అన్నమాట.  ఒకసారి మన తెలుగు దేశంలోని ఒక పండితుడు ఇప్పుడు ఆగ్రాగా పిలవబడే పట్టణానికి వెళ్లి అక్కడి యమునా నదిలో స్నానం చేస్తుండగా ఒక స్త్రీని కొంతమంది దుండగలులు తీసుకొని వచ్చి హత్య చేశారట అక్కడ మన పండితుడు తప్ప ఆ దేశంవారు ఎవరు అక్కడ  లేరు. మన పండితునివారికి అక్కడి భాష రాదు.  మరునాడు రాజుగారు ఆ కేసును విచారించటానికి రాజభటులను పంపగా వారు మన పండితుఁలవారిని సాక్షిగా తీసుకొని వచ్చారట.  రాజుగారు అడిగిన ప్రశ్నలకు పండితులవారు ఇలా చెప్పారట.  నాకు అక్కడి దుండగులు మాట్లాడే భాష తెలియదు, కానీ వారు ఏమి మాట్లాడుకున్నారో చెప్పగలను అని విన్నది విన్నట్లు  చెప్పారట. ఆ పండితుడు చెప్పిన మాటలతో ఆ నేరస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకొన్నారు  రాజుగారు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి మీకు బాష రాదుగా మరి ఎలాచెప్పారని అడిగారట.  దానికి మన పండితులవారు రాజా నేను అవధానాలు  చేస్తుంటాను. మాకు అవధానప్రక్రియలో ఏకసంతాగ్రాహ్యం ప్రధాన విషయం అని చెప్పగా మన పండితులవారి తెలివి తేటలకు ముగ్దులైన ఆ రాజుగారు ఆయనను విశేషంగా సన్మానించారట. మన అవధానుల మేధస్సు అంత గొప్పది. పూర్వకాలంలో వేదాలు నోటికే చెప్పేవారు.  బహుశా అప్పుడు భాషలకు లిపికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారుకాదేమో. అందుకే " ముఖే ముఖే సరస్వతి" అని అన్నారు కాబోలు.

నిజానికి మనం రోజు అనేక విషయాలను వింటుంటాము, చూస్తుంటాము కానీ అవి అన్ని మనకు గుర్తుండవచ్చు లేక గుర్తుండకపోవచ్చు. మనజీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనకు ఎల్లప్పుడూ జ్ఞ్యాపకం ఉంటాయి అవి సహజంగా మనం పొందిన అత్యంత ఆనందము, దుఃఖము, బాధలు.  ఎవరో నిన్ను అవమానించారనుకో అది నీకు సదా జ్ఞ్యాపకం ఉంటుంది.  అదే నిన్ను అవమానించిన వానితో నీకు జరిగిన ఇతరవిషయాలు మాత్రం జ్ఞ్యాపకం  ఉండకపోవచ్చు. "అది నేనెట్లా మరుస్తాను జీవితాంతం గుర్తుంచుకుంటా.  అని అనటం" మనం సర్వ సాధారణంగా చూస్తూవుంటాం.  అంటే మనం మనసుకు పూర్తిగా హత్తుకునే విషయాలు అవి మంచివి కావచ్చు లేక చెడ్డవికావచు వాటిని మాత్రమే గుర్తు  పెట్టుకోగలుగుతాము. ఇది నిజం. 

కొన్ని సందర్భాలలో మన ముందు జరిగిన విషయాలు కూడా తెలియనట్లుగా ఉంటాము.  నీవు ఇక్కడే ఉన్నావా అని నీ స్నేహితుడు అడిగితె ఇక్కడే గంటనుంచి బస్సుకోసం ఎదురుచూస్తున్నాను అని అన్నావు.  రామారావు ఇటుగా వెళ్ళటం చూసావా అంటే మాత్రం ఏమోరా నేను చూడలేదు అని బదులు ఇస్తావు.  ఎందుకు అంటే నీవు రామారావు నీ ముందరిగా వెళ్ళటం నీ కళ్ళు చూశాయి కానీ నీమనస్సు గుర్తించలేదు అదీ సంగతి. 

ఒక విషయాన్ని చూడటం, చూసినదానిని గమనించి అవగాహన చేసుకోవటం, చేసుకున్నదానిని గుర్తుంచుకోవటం మొదలైన అన్నివిషయాలు కూడా ఒక మనిషి మేధాశక్తి మీద ఆధార పడతాయి.  ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ మేధాశక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఏదిఏమైనప్పటికీ తానుచేసిన విషయం మీద మనస్సు లగ్నం కానిఅప్పుడు ఆ విషయాన్ని అవగాహన చేసుకోవటం కుదరదు అంతేకాదు గుర్తుకూడా ఉండదు. భౌతికమైన విషయాలమీదనే ఇన్నిరకాల సమస్యలు ఉంటే ఇక ఆద్యద్మికమైన విషయాల మీద ఇంకా ఎంతో శ్రర్ధ కావలసి వస్తుంది. 

భౌతికమైన విషయాలు మనకు పంచేంద్రియాలతో ముడిపడినవి.  ఎందుకంటె భౌతికజ్ఞ్యానం మనకు ఇంద్రియాలతోటే కలుగుతుంది. ఇంద్రియాలకు అతీతమైనది ఆత్మ జ్ఞ్యానం లేక బ్రహ్మ జ్ఞ్యానం కాబట్టి ఆ జ్ఞ్యానం పొందాలంటే మనుషులకు అవగాహనా స్థాయి చాలా ఎక్కువగా ఉండాలి.  ఎందుకంటె బౌతికంగా పొందే జ్ఞ్యానం తనకన్నా బిన్నంగా వున్నా విషయాల జ్ఞ్యానం అదే బ్రహ్మ జ్ఞ్యానం అనేది తన గూర్చి తాను తెలుసుకునే జ్ఞ్యానం.  కాబట్టి బ్రహ్మ జ్ఞ్యాన పిపాసికి అనగా జిగ్న్యాశువుకి అవగాహనా సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉండాలి. అణువణువున ఎన్నో సందేహాలు  వస్తూవుంటాయి. వాటిని సరైన పూజ్యగురువు సేవనం చేస్తూ నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక జీవనం చాలా కఠినంగా కష్టభరితంగా, దుర్లభంగా ఉంటుంది. ఎందుకంటె సాధకుడు తనకు తానూ మోక్షాన్ని పొందాలి అని యోచిస్తాడు  కాబట్టి. ఈ భూమిమీద మానవుడు సాధించవలసిన అతిబృహత్ కార్యం ఏదయినా వున్నది అంటే అది మోక్షం మాత్రమే.  ఒక మనిషి బౌతికంగా చేయగల కార్యాలు అన్నీ కూడా ఏదో ఒక హద్దు కలిగి ఉంటుంది.  కానీ మోక్షం అనేది అట్లా కాదు.  ఇంకొక విషయం బౌతికంగా సాధించేది ప్రతిదీ పూర్తిగా కానీ లేక ఒక స్టాయిమటుకు అయినా తనకన్నా ముందు ఎవరో ఒకరు చేసి వుంటారు, ఆలా చేసినది ఉపలబ్ధం అవుతుంది అంటే దానికి సంబందించిన సమాచారం, ఆధారము, సాక్షం ఉంటుంది.  కానీ మోక్షం ఏమిటో ఎలావుంటుందో అనేది ఒక్కొక్క సాధకుడు తన సాధనా పటిమతో సిద్దించుకునేది మాత్రమే మోక్షార్ధికి గతంలో మోక్షం పొందిన వాని జాడ కుడా తెలియదు.  తెలుసుకునేటందుకు అవకాశం కూడా ఉండదు.  ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షం అనేది తనకుతానుగా తెలుసుకుని సిద్దించుకునేది . అంటే స్వయంగా తెలుసుకునేది మాత్రమే. 

ఓం తత్సత్  

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు

మీ భార్గవ శర్మ

 

 



మధుకైటభులు

 మధుకైటభులు


శ్రీహరి యోగనిద్రా ముద్రితుడై ఉండగా, ఒకనాడు అతని రెండు చెవుల నుండి ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారే మధుకైటభులు. వారిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరిని ప్రసన్నం చేసుకున్నారు. తమకు మరణం లేని జీవితాన్ని వరంగా ఇమ్మని దేవిని ప్రార్థించారు. 'పుట్టినవానికి మరణం తప్పద'ని, 'కనుక ఆ వరం ఇవ్వడం అసాధ్యమ'ని జగన్మాత చెప్పింది. "అలా అయితే, మేము ఎపుడు మరణించాలని కోరుకుంటామో, అపుడే మాకు మరణం వచ్చేట్లుగా వరమిమ్మ'ని వారు 'అమ్మ'ను ప్రార్థించారు. అమ్మ 'తథాస్తు' అని దీవించి అంతర్థానం అయింది.



'స్వచ్ఛంద మరణం' అనే వరం పొంది యుక్తితో విజయం సాధించామని, తమకు మరణం కావాలని తామే కోరుకోవడం అసంభవం కనుక, తాము మృత్యువును జయించినట్లే అని విఱ్ఱవీగి, మధుకైటభులు విజృంభించ సాగారు. అన్ని లోకాలపై దండయాత్రలు చేస్తూ, వీరవిహారం ప్రారంభించారు. సజ్జనులను బాధిస్తూ, లోకకంటకులై ప్రవర్తించారు.


ఒకనాడు మదుకైటభులు బ్రహ్మపై దండెత్తారు. ప్రళయకాలంలో అంతా జలమయం కాగా, మహావిష్ణువు నాభికమలం నుండి ఆవిర్భవించిన బ్రహ్మను సమీపించి, వరగర్వంతో మధుకైటభులు "బ్రహ్మదేవా! చేతనైతే మాతో యుద్ధం చేయ్యి, లేకపోతే, నీ ఓటమిని అంగీకరించి, మాకు లొంగిపో, ఈ పద్మాన్ని విడచి పారిపో" అని హెచ్చరించారు.


వారితో పోరాడలేని బ్రహ్మ, పద్మనాళంలో దూరి, ఐదువేల సంవత్సరాలు ప్రయాణం చేసి, విష్ణువును చేరుకున్నాడు. యోగనిద్రలో ఉన్న శ్రీమహవిష్ణువును చూచి. నిద్రాదేవిని పరిపరి విధాల ప్రార్థించాడు. విష్ణువునకు మెలకువ వచ్చింది. కన్నులు తెరచిన విష్ణువు సంగతి తెలుసుకునే లోగానే మధుకైటభులు బ్రహ్మను వెంబడిస్తూ అక్కడికి వచ్చారు.


"మీరిద్దరూ మాతో యుద్ధం చేయండి!" అని బ్రహ్మ, విష్ణువులను వత్తిడి చేయసాగారు.


విష్ణువు మధుకైటభులతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు ఆలసట తీర్చుకుంటూ వంతులు వారీగా యుద్ధం చేయ సాగారు. ఎన్నాళ్ళు యుద్ధం జరిగినా, విష్ణువు ఆ రాక్షసులను జయించలేక పోయాడు. పైగా తానే అలసిపోవడం గమనించి, వారు సామాన్యులు కారని, తనతో ఇంతకాలం యుద్ధం చేసి చావకుండా బ్రతికినవారు వరప్రభాల గర్వితులని గ్రహించాడు. జగన్మాతను ప్రార్థించాడు. "తల్లీ! సృష్టిస్థితి లయకారిణీ !నీమహిమను గుర్తించలేక, ఈ రాక్షసులను నేనే సంహరింప గలనుకున్నాను. నీఅనుగ్రహం వల్లనే అది సాధ్యమని ఇపుడు తెలుసుకున్నాను. వారిని వధించే ఉపాయం చెప్పి, నన్ను అనుగ్రహించు" అని చేతులు జోడించాడు.


జగన్మాత ప్రత్యక్షమై, "మహావిష్ణువు!ఈ రాక్షసులు నా వల్ల స్వచ్చంద మరణాన్ని వరంగా పొందారు, తమంతట తాము మరణిచాలని వారు కోరుకుంటేగాని, వారికి మరణంరాదు. కనుక,నీవు వారిని యుధ్దానికి ఆహ్వానించు.


"మీ పరాక్రమానికి మెచ్చాను. మీ కొక వరం ఇస్తాను. కోరుకోండి" అని వారిని అడుగు. ఆ తరువాత కథ నేను నడిపిస్తాను" అని అభయ మిచ్చింది.


జగన్మాత ఆదేశాన్ని శిరసా వహించి, శ్రీమహావిష్ణువు మధుకైటభులను


పిలిచి, 'వరం కోరుకో" మన్నాడు. 'వరగర్వంతో ఆ రాక్షసులు విష్ణువును హేళన చేశారు. "మాచేతిలో ఓటమిని పొందిన నువ్వు మాకు వరమిచ్చే దేమిటి?మేమే నీకోరిక వరాన్ని అనుగ్రహిస్తాం. కోరుకో" అని ప్రగల్భంగా పలికారు. " అలా అయితే, నాచేతిలో మీరిద్దరూ మరణించేట్లుగా వరమివ్వండి "ని విష్ణువు అడిగాడు.


అప్పుడు మధుకైటభులు తమ తొందరపాటుకు చింతించినా, 'సరే' అనక


తప్పలేదు. "అలాగే నీ చేతిలో మరిణిస్తాం. వరమిస్తున్నాం కాని, ఈ సముద్ర జలంపై యుద్ధం ఎలా సాగుతుంది? ఎక్కడైనా భూమిని చూపించు. భూమిపై యుద్ధంచేసి మమ్ములను సంహరించు' ' అన్నారు. ఈ వంకతో తప్పించు కుందామని వాళ్ళ దురాలోచన.


అపుడు విష్ణువు తన తొడను పెంచి, సముద్రజలంపై విస్తరింప చేసి, తన ఊరువునే భూమిగా చూపి, మధుకైటభులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు.


మధుకైటభుల శరీరాలలోని మేదస్సు ఆ ప్రదేశమంతా వ్యాపించడం వల్ల "మేదిని" అని, విష్ణువు ఊరుభాగం చేత పరివ్యాప్తమైనందువల్ల "ఉర్వి" అని భూమికి పేర్లు వచ్చాయి. రాక్షసుల రక్తమాంసాదులతో నిండినందువల్ల భూమికి ఆనాటి నుండి "అభక్ష్య" అనే పేరు కూడా వచ్చింది.


జగన్మాత అనుగ్రహంతో స్వచ్ఛంద మరణం వరంగా పొంది కూడా, సత్ర్పవర్తన లేక, వరబల గర్వితులై దురాగతాలు చేసి లోకకంటకులైన మధుకైటభులు అహంకారముతో విఱ్ఱవీగి, తమ మరణాన్ని తామే కోరితెచ్చుకున్న వారయ్యారు.


శ్రీమహావిష్ణువు కూడ మొదట- తానే ఆరాక్షసులను సంహరించ గలనని భావించి, విఫలుడై , తరువాత పరాశక్తి ప్రభావాన్ని గుర్తించి, ఆమె అనుగ్రహంతో కృతార్థుడు కాగలిగాడు.


సర్వజగద్రక్షుకుడైన విష్ణువునకు కూడా అలసట కలగడం, ఆ ఇద్దరు రాక్షసులనూ వధించ లేకపోవడం జగన్మాత మాయా విలాసం తప్ప వేఱు కాదని వివరిస్తూ, సూతుడుశౌనకాది మునులకు ఈ వృత్తాంతాన్ని వినిపించాడు.


మధుకైటభులను సంహరించినది మహావిష్ణువే అయినా సంహరింప చేసినది దేవియే కనుక, ఆ జగన్మాతకు "మధుకైటభమర్దని" అనే పేరు వచ్చింది.

ఏకముఖి రుద్రాక్ష

 ఏకముఖి రుద్రాక్ష గురించి సంపూర్ణ వివరణ  - 1


      దీనినే శివరుద్రాక్ష అంటారు. దీనిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు . ఇది అసలైనది దొరుకుట మహాదుర్లభం. ఈ ఏకముఖి రుద్రాక్ష వృక్షజాతి రత్నం.  ఈ ఏకముఖి రుద్రాక్షని సూర్యుని స్వరూపముగా భావిస్తారు . దీనిని ధరించటం వలన సూర్యగ్రహ అనుగ్రహం లభించును. ఈ రుద్రాక్ష మాల ధరించటం వలన ఆధ్యాత్మిక శక్తులు వశం అగును. అత్యంత అరుదుగా లభించే ఈ అద్భుత రుద్రాక్ష జీడిపప్పు ఆకారంలో (అర్ధ చంద్రాకారంలో ) లభించును.  మంత్ర , తంత్ర ప్రయోగాలు తిప్పికొట్టబడును. 


                ఏకముఖి రుద్రాక్ష ధారణ వలన పని మీద ఆసక్తి పెరుగును . మనస్సులో భక్తి పెరుగును . ఆర్థికాభివృద్ధి జరుగును. జీవితంలో ఉన్నతస్థితి కలుగును. ఈ మాలను ధరించు సమయమున రుద్రాక్ష మంత్రమును 11 సార్లు జపించవలెను . దీని ధారణ వలన బ్రహ్మహత్యా దోషం నివారణ అగును. ఇంద్రియ నిగ్రహం కలుగును.  టీబీ మరియు ఆస్తమా వంటి మొండివ్యాధులను తగ్గించును . తలనొప్పి , కంటి సమస్య , లివర్ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేయును .  ఈ రుద్రాక్షను పూజామందిరంలో ఉంచుకుని పూజించుచున్న సంపదలు తరలివచ్చును . సుఖసంతోషాలు కలుగును.


           రాజకీయ నాయకులు ఈ రుద్రాక్ష ధారణకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులలో శ్రీమతి ఇందిరాగాంధీ , n .t .రామారావు గారి వద్ద మాత్రమే ఈ ఏకముఖి రుద్రాక్ష ఉండేది. కాని ఇందిరా గాంధీ మరణానికి కొన్ని రోజుల ముందే ఈ రుద్రాక్ష ఆమె దగ్గర నుంచి మాయం అయ్యింది . అది ఇప్పటివరకు ఏమైందో ఎవ్వరికి తెలియదు. 


                         ఏకముఖి రుద్రాక్ష పరమతత్వాన్ని బోధిస్తుంది. అలాంటి ఆలోచన ఉన్నవారు మాత్రమే దీనిని ధరించవలెను . దీని దర్శనం కూడా దుర్లభమే .శివరాత్రి పర్వదినమున ఈ రుద్రాక్షను పూజించిన సాక్షాత్తు శివుడ్ని పూజించిన ఫలితం వచ్చును.  


     ఈ ఏకముఖి రుద్రాక్షలో 4 రకాలు కలవు. ఒక్కోరకం ధరించటం వలన ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. వాటి గురించి వివరిస్తాను.


 1 -  శ్వేత వర్ణ ఏకముఖి  -


           వ్యాధుల నుండి విముక్తి.


 2 -  రక్తవర్ణ ఏకముఖి  -


           బ్రహ్మహత్యా పాతకం నుండి దూరం చేయును .


 3 -  పీతవర్ణ ఏకముఖి  -


         భోగము మరియు మోక్షమును ప్రసాదించును.


 4 -  శ్యామవర్ణ ఏకముఖి  -


         ఆరోగ్య లాభము , సాత్విక ప్రసన్నత కలిగించును. 


          పైన చెప్పినవిధముగా ఒక్కో రంగు ఏకముఖి రుద్రాక్ష ధరించటం వలన ఒక్కొ రకమైన ఫలితాన్ని పొందవచ్చు.


        ఇప్పుడు మీకు అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య బేధం ఎలా కనుగొనాలో మీకు వివరిస్తాను. 


 *  రెండు రాగిరేకుల మధ్య రుద్రాక్షని ఉంచినట్లయితే అది తనచుట్టూ తానే సవ్యదిశలో తిరుగును. అపసవ్య దిశలో తిరిగిన అశుభ ఫలితాలు కలుగును. కావున సవ్య దిశలో తిరగవలెను.


 *  ఒక చిన్నగిన్నెలో మంచినీరు పోసి దానిలో రుద్రాక్షని వేసినట్లు అయితే నకిలీది మునగకు తేలుతుంది. అంతేగాక రంగు వెలిసిపోయినట్లు ఉన్నచో అది నకిలీదిగా గుర్తించవలెను .


 *  ఆవుపాలలో అసలైన రుద్రాక్షని వేసి ఉంచిన ఆ పాలు 48 గంటల నుండి 72 గంటల వరకు చెడిపోకుండా విరగకుండా ఉంటాయి.


 *  ఒక చిన్న గ్లాసులో రుద్రాక్ష మునిగేంత ఎత్తుటి వరకు చల్లని నీరు నింపి రుద్రాక్షని ఉంచి ఒక అరగంట తరువాత ఆ నీటి ఉష్ణోగ్రతని ధర్మామీటరుతో  కొలిచినట్లైతే కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ఉండును.


 *  రుద్రాక్షలలో అర్ధనారీశ్వర రుద్రాక్షలు ఉంటాయి. వాటిని నకిలీలుగా తయారుచేయుటకు రెండు రుద్రాక్షలను శిలపైన  అరగదీసి అతికిస్తారు. కావున జాగ్రత్తగా గీతను గమనించవలెను .


 *  రెండు పాత్రల మధ్య రుద్రాక్షని ఉంచినప్పుడు రుద్రాక్ష తిరుగును.


 *  పురుగులు తిన్నవి , పగిలినవి ధరించరాదు .


 *  రుద్రాక్షని బాగా వేడిగా ఉన్న నీటిలో వేస్తే  మునిగిపోతే అది నిజమైనదిగా భావించాలి . కొంతమంది ఇరుగుడు చెట్టు కొయ్యతో రుద్రాక్షలు తయారుచేస్తారు. కావున జాగ్రత్తగా ఉండవలెను .


 *  రుద్రాక్షని ఒక వారంపాటు నూనెలో ముంచి ఉంచాలి. అవి ఏరంగు రుద్రాక్ష అయిన దాని రంగు ప్రభావితం అగును. ఆ తరువాత కాగితం లేక దూదితో శుభ్రపరచి బావినీటితో కడిగించాలి. అతరువాత ధరించినచో రంగు ప్రభావితం కానిచో అవి అసలైన రుద్రాక్షలు .


 *  రుద్రాక్షలు ఎక్కువుగా కాశి , హరిద్వార్ లలో లభ్యం అగును. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగును. ఒక నిజమైన రుద్రాక్షను ధరించినచో మంచి ఆరోగ్యం మరియు ఉన్నతస్థితిని ఇచ్చును. రుద్రాక్షలో ప్రకృతి సిద్ధముగానే రంధ్రం ఉండును. చిన్న రుద్రాక్షమాల గొప్ప ఫలితాన్ని ఇచ్చును.  


    

               తరవాతి పోస్టులో రుద్రాక్ష గురించి మరిన్ని విషయాలు మీకు తెలియచేస్తాను .


   

      మరింత విలువైన సమాచారం మరియు  సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .