20, నవంబర్ 2022, ఆదివారం

స్వామితో సంభాషణ

 స్వామితో సంభాషణ


వైకుంఠ ఏకాదశికి కంచి వెళ్లాలని నేను సంకల్పించుకున్నది కంచి వరదుని సేవించు కోవడం కొరకే. కామకోటి శంకరాచార్య దర్శనం తలవని తలంపుగా తటస్థించింది. అయినా దాని ప్రభావం నామీద చెరగని ముద్ర వేసింది.


ఆ స్వామి పూజావిధానం, ఆ పూజలో ఆయన తన్మయత్వం, తన్మయతలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధా, మెలకువా, శ్రీ చంద్రమౌళీశ్వరుని పూలతో పూజించేటప్పుడు, హారతులిచ్చేటప్పుడు, వింజామరలు వీచేప్పుడు, శ్రీ త్రిపురసుందరీ, చంద్రమౌళిశ్వరులను ఊయలలో ఊపేటప్పుడు, చేత దండం పుచ్చుకుని స్వామి ప్రదక్షిణ చేసేప్పుడు, చివరకు, తన తలపై నుంచి కిందికి జారుతున్న కాషాయాన్ని సవరించుకునేప్పడు సైతం, కళాశోభితమైన ఆ సౌకుమార్యం, అతిలోక సౌందర్యం, నన్ను పూర్తిగా లోగొన్నవి. రోజులు గడిచిన కొద్దీ వారి ప్రభావం పదింతలూ, నూరింతలూ అయింది.


మరోసారి కంచికి ప్రయాణం కట్టి, ఆచార్య స్వామిని చూచి రావాలనిపించింది. దూర దూరంనుంచి గాక, దగ్గరకు వెళ్లి స్వామిని చూడాలని, స్వామితో మాట్లాడాలనీ, స్వామి మాటలు ఆలకించాలనే అభిలాష రేకెత్తింది.


ఈ స్వామి అందరు పీఠాధిపతులవంటి స్వామికారనీ, అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈయనలో ఉన్నదనీ, అంతకు ముందు నాకు ఏర్పడిన అభిప్రాయం వైకుంఠ ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది. మహాపురుష సంశ్రయం కోసం మనస్సు ఉవ్విళూరింది.


అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా ఒక గురువును అన్వేషిద్దామనో, ఆయన వల్ల ఉపదేశం పొందుదామనో అభిలాష మాత్రం అప్పటికి నాకు లేదు.

చెన్నపురి ఆంధ్రమహాసభలో నాతోపాటు గౌరవ కార్యనిర్వాహకుడుగా ఉంటున్న ఒక న్యాయవాది మిత్రుని తోడు చేసుకుని, ఇద్దరం కలిసి, ఒక ఆదివారం మధ్యాహ్నం కంచి చేరాము. స్వామి వారింకా విష్ణుకంచిలో ఉన్న మఠంలోనే ఉన్నారు. మా అదృష్టమేమో, మేమక్కడికి చేరినవేళకు స్వామి వెంట, వారి శిష్యులు తప్ప ఇతరులెవరూ లేరు. మా ఇరువురి పేరూ ఒక చీటిమీద వ్రాసి, స్వామి దర్శనానికి వచ్చినట్టు శిష్యులతో చెప్పాము.


"ఇప్పుడే భిక్ష ముగించారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. కాసేపటికి వెలుపలికి వస్తారు. కూచోండి" అని శిష్యులు చెప్పారు.


వారి మాటలు విని మేము కూర్చున్నామో లేదో, మరొక శిష్యుడు వచ్చి, "స్వామి ఇప్పడే వస్తున్నారు" అంటూ, వారు కూచోడానికి ఒక పీట వేశారు.


ఇంతలో చేత్తో దండం పుచ్చుకుని స్వామి రానే వచ్చారు. మేమిద్దరం స్వామికి సాష్టాంగం చేశాము, మా మా ప్రవర, గోత్రనామాలూ చెప్పకుంటూ. స్వామి మమ్మల్ని తమకు అభిముఖంగా కూచోమన్నారు. ప్రశాంతగంభీరంగా ఉంది స్వామి వదనం. ప్రసన్నతను కుమ్మరిస్తువి ఆయన నేత్రాలు. శరీరకాంతి చెప్పశక్యం కాదు. అప్పటికి స్వామి వయస్సు అరవై డెభ్చయి ఏళ్ల మధ్యలో ఉండవచ్చు. వయస్సుచే కాకున్నా, నిరంతర జపతపాల వల్లా, ఉపవాసవ్ర తాల మూలంగానేమో శరీరం శుష్కించి, కాస్తముడతలు పడినట్టు కనిపిస్తున్నది. లోక సేవాచరణంలో ఎవని శరీరం శుష్కించుతుందో వాడే నిజంగా ధన్యాత్ముడంటాడు స్వామి వివేకానందుడు.


శరీరం ఒకింత సడలినా దేహకాంతి మాత్రం దర్శనీయంగా ఉంది. లావణ్యమంటే అదే కాబోలు!


ముక్తాఫలేషు చాయాయా:

తరలత్వమివాంతరా

ప్రతిభాతి యదంగేషు

లావణ్యం తదిహోచ్యతే.


ముత్తెపు గోళాల్లో లోలోన చలిస్తూన్న కాంతివలె దేహంపై ప్రకాశించే కాంతి "లావణ్య” మట.


ఇక ఆ స్వామి నయన సౌందర్యం, అహో! అది వర్ణనాతీతం. నేనేమిటి, దేశదేశాల ప్రముఖులెందరెందరో దివ్య సౌందర్యం వెలిగక్కే ఆ నేత్రకమలాలకు నీరాజనాలర్పించారు.


లోకంలో సాధారణ సౌందర్య ప్రమాణాల ప్రకారం, అంగప్రత్యంగసౌష్ఠవం దృష్ట్యా, స్వామి సౌందర్యవంతుడు కాకపోవచ్చు. కాని, అనిర్వచనీయమైన అఖిలజనానందకరమైన ఏదో ఒక తేజస్పూ, ఒక వర్చస్సూ, ఆయనలో ఉన్నవి. అదేనేమో బ్రహ్మతేజస్పు!

"గురుకృపాలహరి" అనే సంస్కృత పద్య కావ్యంలో సుప్రసిద్ధకవులు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు స్వామి సౌందర్యం ఇలా వర్ణించారు.


రక్తాంతస్పృహణీయ దీర్షనయనం

స్వాకుంచిత భ్రూలతం!

హాసస్మేరముదార పాలఫలకం

స్ఫూర్జత్కపోలారుణం!

శ్రీ కర్ణం సునయనం సుచారు రదనం

పూర్ణేందు బింబాసనం

వందే శ్రీగురుమూర్తి మిందుమకుటం

శ్రీ కామపీఠాధిపమ్"


(కొనలయందు ఎర్రని జీరలతో సాంపునింపు చారడేసి కన్నులు, కొంచెం వాలిన కను బొమలు, చిరునవ్వదులకించే వెడల్పయిన లలాటం, లేత ఎరుపురంగు చెక్కిళ్లు, శ్రీకారము లవంటి చెవులు, చక్కని ముక్కు, ఇంపైన పలువరస, పన్నమి చందురునికి సాటివచ్చే నెమ్మోమూ కలిగిన కామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం)

ఇంటి పేరుతో సహా నాపేరూ, ప్రవరా విని, మందహాసం చేసూ,

"మీరైతే బ్రాహ్మణులా? మీ ఇంటిపేరులోనూ, మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియులా!" అని స్వామి చమత్కరించారు. (మా ఇంటి పేరు "నీలంరాజు". మా గోత్ర ఋషులు, "హరిత, అంబరీష, యవనాస్య")

స్వామి విసరిన చలోక్తివల్ల మా కొత్తదనం కొంత సడలింది. స్వామికి మేము మరింత సన్నిహితులమైనాము.


నేను నా విద్యార్థి దశలోనే మహాత్మగాంధి ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నాననీ, టంగుటూరు ప్రకాశంగారు స్థాపించిన ఆంగ్ల "స్వరాజ్య" పత్రికలో, కాశీనాథుని నాగేశ్వరరావు నడిపిన 'ఆంధ్రపత్రికలో’ పనిచేశాననీ, రాజకీయాల్లో గాంధి అనుయాయుణ్ణి అనీ స్వామికి విన్నవించాను.


ఆ తరువాత స్వామి నాలుగున్నర గంటలు సావకాశంగా, తెరిపి లేకుండా వివిధ విషయాలను గురించి సంభాషించారు. మన సంస్కతి, మన చరిత్ర, ఆనాటి మన రాజకీయాలూ, మన దేశనాయకుల వైఖరులూ, మన సంఘసంస్కర్తల నడవడులూ, ఒకటేమిటి - ప్రసక్తాను ప్రసక్తంగా సమస్త విషయాలూ చర్చనీయాంశాలు అయినాయి.


దేశవిభజన విషయంలో గాంధి - జిన్నాల మధ్య జరిగిన వాదప్రతివాదాలను, ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్వాపరాలతో పూసగుచ్చినటు విశ్లేషించి చెప్పారు. కాంగ్రెసు నాయకులు జిన్నాసాహెబ్ వ్యూహంలో చిక్కుకున్న పరిస్తితులు ఎలా కల్పించబడ్డాయో, తత్ఫలితంగా అఖండభారత స్వరూపం ఏవిధంగా అంతరించిందో సహేతుకంగా నిరూపణ చేశారు. (ఈ సందర్భంలో ఇటీవల వెలుగు చూసిన మౌలానా అబుల్ కలాం అజాద్ వ్రాతలు స్వామి అభిప్రాయాలను బలపరుస్తున్నాయి.)


నాలుగున్నర గంటలు స్వామి ముచ్చటైన తెలుగులో, నేటి మన ఉపన్యాసకుల ధోరణిలో గాక, మన పూర్వీకులు మాట్లాడుకునే సరళమైన వాడుకభాషలో మాట్లాడారు. కాకపోతే, అరవదేశంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల యాసమాత్రం అక్కడక్కడా కాస్త తొంగిచూసింది. పండితుల పదాడంబరం మాటవరసకైనా కానరాలేదు. పదంకోసం వెతుక్కోవడం లేదు. తరంగం లేని సముద్రంలో పడవ నడిచినటు ప్రసంగం యావత్తు ఆశుకవిత్వంలా సాగింది. యావద్భారతజాతిని కలవరపరచిన ప్రధాన సమస్యలను గురించి అంత తర్కసహంగా, యుక్తియుక్తంగా అనుద్వేగంగా ప్రసంగించడం అందరికీ సాధ్యం కాదు. అంతసేపు నేనూ, నా మిత్రుడూ శ్రోతలంగా చెవులప్పగించి స్వామి ప్రసంగం విన్నాము. ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే "శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తెలుగువాడే, ఆయన మాతృభాష తెలుగేనన్న అభిప్రాయం కలిగింది. కాదు, కన్నడమన్నమాట అటు తరువాతనే.


కాగా, గాంధి - జిన్నాల మధ్య జరిగిన వాద ప్రతివాదాలను, పూర్వాపరసందర్భాలను ఇంచుమించు తేదీల క్రమంగా స్వామి వివరించిన తీరు చూస్తే, ఆయన ధారణాశక్తి ఎంతటి వారికైనా దుర్లభమని తోచింది. అసాధారణమైన ఉపాసనాబలమేదో ఆ శక్తికి కారణమై ఉండాలి. లేదా, ఆ మేధాసంపద జన్మసిద్ధమైనా కావాలి. ఆ విషయం అలా ఉంచి, మరో ముఖ్యాంశం గమనించుదాం. నాటి దేశపరిస్థితులను స్వామి చర్చించిన తీరునుబట్టి, దేశ రాజకీయ సమస్యల పట్ల స్వామికి గల అవగాహన గానీ, రాజ్యాంగ పరిజ్ఞానం గానీ కలవారు, అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకులలో సైతం ఎందరో ఉండరు.


1894 సంవత్సరం మే నెల 20వ తేది, దక్షిణదేశంలోని విళుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్తి, శ్రీమతి మహాలక్ష్మి పుణ్యదంపతులకు జన్మించిన "స్వామినాథన్ అనే బాలుడు తన 13 ఏట సన్యాసదీక్ష పుచ్చుకుని, చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటిపీఠం అధిష్టించకుండా, అందరితోపాటు ఆంగ్ల విద్యనభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే, గాంధి, నెహ్రూల సరసన ఏ మహానాయకుడుగానో, ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తగానో, ప్రపంచ ఖ్యాతికాంచేవాడని చెప్పడానికి జ్యోతిశాస్త్రవేత్త కానక్కరలేదు. మత విషయాలకు మాత్రమే పరిమితమైన పీఠాధిపతులుగా ఉంటూ, అహర్నిశలు జపహోమతపాదులతో, పూజాపునస్కారాలతో, శాస్త్రపురాణ చర్చలతో, అనుదినం తమ్ము సందర్శించే అశేషభక్తజనుల సమస్యల పరిష్కారంలో నిమగ్నులైన కాషాయధారులకు వర్తమాన రాజకీయాలను గురించి అంతటి సదవగాహనం ఎలా సాధ్యమన్నది ఊహించడానికే వీలుకాని విషయం. ఒక్క రాజకీయమా? చారిత్రకమా? శాస్త్ర విషయమా? ధర్మవిషయమా? ఇంతటి వివిధ విషయాభిజ్ఞత ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఒకేఒక వ్యక్తిలో నిక్షిప్తం కావడం ఎలా సంభవం? అసదృశం ! అపూర్వం !


అయినా, ఇలా ఆశ్చర్యం చెందవలసిన పనిలేదట. వేదానికి భాష్యం రాయడమేగాక, విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు కారణభూతులైన శ్రీ విద్యారణ్యులు ఇలా అంటారు:


తదిత్థం తత్వవిజ్ఞానే సాధనాను సమర్దనాత్

జ్ఞానినా చరితుం శక్యం సమ్యక్ రాజ్యాది లౌకికమ్|

“తపస్సు వల్ల తత్వజ్ఞానాన్ని బడసి పరిణతులైన మహాజ్ఞానులు, రాజ్యపాలనా సమర్థులు కూడా కాగలరు”


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తకం నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: