22, ఆగస్టు 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *22.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మొదటి అధ్యాయము*


*యదువంశమునకు ఋషుల శాపము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీబాదరాయణిరువాచ*


*1.1 (ప్రథమ శ్లోకము)*


*కృత్వా దైత్యవధం కృష్ణః సరామో యదుభిర్వృతః|*


*భువోఽవతారయద్భారం జవిష్ఠం జనయన్ కలిమ్॥12167॥*


*వ్యాసనందనుడగు శ్రీశుకమహర్షి చెప్పసాగెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణభగవానుడు బలరామునితోను, ఇతర యదువంశీయులతోడను గూడి పూతన, శకటాసుర, యమళార్జున, ధేనుక, అరిష్ట, చాణూర, తోసల, కంసాది దైత్యులను హతమార్చెను. అనంతరము కురుపాండవుల మధ్య బలీయమైన కలహమును సృష్టించి, భూభారమును తొలగించెను.


*1.2 (రెండవ శ్లోకము)*


*యే కోపితాః సుబహుపాండుసుతాః సపత్నైర్దుర్ద్యూతహేలనకచగ్రహణాదిభిస్తాన్|*


*కృత్వా నిమిత్తమితరేతరతః సమేతాన్ హత్వా నృపాన్ నిరహరత్ క్షితిభారమీశః॥12168॥*


కౌరవులు కపట ద్యూతములో పాండవుల రాజ్యమును హరించిరి. నిండుసభలో ద్రౌపదియొక్క జుట్టు పట్టుకొని లాగిరి. ఇంకను వారు పాండవులను అనేక విధములుగా అవమానించిరి. కౌరవుల దుశ్చర్యల కారణముగా పాండవులలో క్రోధాగ్ని ప్రజ్వరిల్లెను. ఆ స్థితిలో శ్రీకృష్ణుడు పాండవులను నిమిత్తముగా జేసికొని, రణరంగమున కౌరవ - పాండవ పక్షములకు చెందిన పెక్కుమంది రాజులను వధింపజేసి, భూభారమును తగ్గించెను.


*1.3 (మూడవ శ్లోకము)*


*భూభారరాజపృతనా యదుభిర్నిరస్య గుప్తైః స్వబాహుభిరచింతయదప్రమేయః|*


*మన్యేఽవనేర్నను గతోఽప్యగతం హి భారం యద్యాదవం కులమహో అవిషహ్యమాస్తే॥12169॥*


శ్రీకృష్ణభగవానుడు ప్రమాణములకు అందనివాడు. ఆ ప్రభువు తన భుజశక్తిచే రక్షింపబడిన యదువంశీయులను నిమిత్తమాత్రులనుగా జేసికొని, భూమికి భారముగానున్న రాజన్యులను, వారి సేనలను హతమార్చెను. పిమ్మట ఆ స్వామి ఇట్లు తలంచెను. 'లోకదృష్టిలో భూభారము తొలగిపోయినట్లుగా కనిపించుచున్నను, నా దృష్టిలో మాత్రము ఇంకను భూభారము మిగిలియేయున్నది. ఏలయన, అజేయులైన యాదవులు ఇంకను బ్రతికియేయున్నారుగదా!"


*1.4 (నాలుగవ శ్లోకము)*


*నైవాన్యతః పరిభవోఽస్య భవేత్కథంచిన్మత్సంశ్రయస్య విభవోన్నహనస్య నిత్యమ్|*


*అంతఃకలిం యదుకులస్య విధాయ వేణుస్తంబస్య వహ్నిమివ శాంతిముపైమి ధామ॥12170॥*


ఈ యదువంశీయులు నన్నే ఆశ్రయించుకొనియున్నారు. అందువలన ఇతరులద్వారా వీరికి ఓటమి కలుగుట అసంభవము. కాని వీరు తమ చతురంగబలములను, అపరిమితమైన సంపదలను చూచుకొని, గర్వితులై విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు. వెదురుకర్రలు ఒకదానితో మరియొకటి రాచుకొనుటచే అగ్ని ఉత్పన్నమై, అవి బుగ్గిపాలగును. అట్లే వీరిమధ్య అంతఃకలహములను సృష్టించినచో వీరును తమలోతాము కొట్టుకొని మృత్యుముఖమున చేరుదురు. అప్పుడు భూభారము పూర్తిగా అంతరించును. పిదప నేను నిత్యమంగళమగు పరంధామమునకు చేరుదును.


*1.5 (ఐదవ శ్లోకము)*


*ఏవం వ్యవసితో రాజన్ సత్యసంకల్ప ఈశ్వరః|*


*శాపవ్యాజేన విప్రాణాం సంజహ్రే స్వకులం విభుః॥12171॥*


మహారాజా! సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని సంకల్పము తిరుగులేనిది. ఆ ప్రభువు ఇట్లు నిశ్చయించుకొని *బ్రాహ్మణశాపము* అను నెపముతో తన వంశమును ఉపసంహరించెను.


*1.6 (ఆరవ శ్లోకము)*


*స్వమూర్త్యా లోకలావణ్యనిర్ముక్త్యా లోచనం నృణామ్|*


*గీర్భిస్తాః స్మరతాం చిత్తం పదైస్తానీక్షతాం క్రియాః॥12172॥*


*1.7 (ఏడవ శ్లోకము)*


*ఆచ్ఛిద్య కీర్తిం సుశ్లోకాం వితత్య హ్యంజసా ను కౌ|*


*తమోఽనయా తరిష్యంతీత్యగాత్స్వం పదమీశ్వరః॥12173॥*


భగవంతుడు తన రూపలావణ్యాతిశయముతో లోకుల నేత్రదృష్టిని ఆకర్షించేవాడు. అట్లే మృదుమధురమైన తీయని మాటలతో చిత్తమును, త్రిభంగాకృతితో మనోహరముగా చేసే నృత్యములతో, తమ తమ కర్మలను వదలిపెట్టి తనవైపు ఆకర్షించేవాడు అనగా నేత్రదృష్టితో స్థూలశరీరమును, చిత్తముతో సూక్ష్మ శరీరమును, నృత్యములవంటి కర్మలతో కారణశరీరమును దాటిపోయి స్వస్వరూప అనుసంధానమును పొంది శ్రీకృష్ణ భావనాతన్మయులను చేయు మహద్భాగ్యమును ప్రసాదించెడివాడని దీని గూఢార్థము.


*రాజోవాచ*


*1.8 (ఎనిమిదవ శ్లోకము)*


*బ్రహ్మణ్యానాం వదాన్యానాం నిత్యం వృద్ధోపసేవినామ్|*


*విప్రశాపః కథమభూద్వృష్ణీనాం కృష్ణచేతసామ్॥12174॥*


*పరీక్షిన్మహారాజు వచించెను* "బ్రాహ్మణోత్తమా! శుకమహర్షీ! వృష్ణివంశమువారు ఎల్లరును బ్రాహ్మణభక్తి తత్పరులు. మిక్కిలి ఔదార్యముగలవారు. నిరంతరము గురుజనులను, కులవృద్ధులను సేవించుచుండెడివారు. సంతతము తమ చిత్తములను శ్రీకృష్ణభగవానునియందే నిలుపుకొనుచుండెడివారు గదా! అట్టి పుణ్యాత్ములకు విప్రశాపము ఎట్లు సంభవించెను?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

గృహస్థులు- విధి విధానాలు

 గృహస్థులు- విధి విధానాలు

1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు

2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి

3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.. 

4.చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు... 

5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి

6. కాళికా , ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు

7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు... 

8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు.. 

9.ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు,వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది.. 

10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి.. 

11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి..వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయకుడు ఉండాలి

12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.. 

13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి

14.పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం , ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు.

 15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి

16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు

17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు

18. నవగ్రహాలు తాకి మొక్క కూడదు... 

19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు

20. నీరు,పాలు, పెరుగు, నైయి కి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు.. 

21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి.. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది

22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు... 

23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు.. 

24.పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.. 

25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో 

కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి.. 

26. జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు.. 

27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు.... 

28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు... 

29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు... మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి..అలా ఓక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు.. 

30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది

31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి.... 

32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది...

మానవ జన్మ లక్ష్యం.

 మానవ జన్మ లక్ష్యం.. బ్రహ్మ జ్ఞానం 

 జన్మ లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం, జన్మను సార్ధకత చేసుకోవడం...  విశ్వమంతా బ్రహ్మం ఉంది, బ్రహ్మం తప్ప మరేమీ లేదు.  అయినా , అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు. బ్రహ్మం - సత్యం - జ్ఞానం - అనంతం.. ఇదీ ఉపనిషత్తులు ఇచ్చిన  అర్థం, బ్రహ్మం అంటే సత్యం, సత్యం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే అనంతం... అంటే.. ఇవేవీ వేర్వేరు కాదు. అన్నీ ఒకటే.

పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్

అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్

కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః

యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః 

ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతారు. బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన 'చ్ఛుక్రమ్' పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు.  జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు...

 పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు.  'అకాయమ్' ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం.  'అవ్రణమ్' రోగాలు, వ్యాధులు అంటని శరీరం. 'అస్నావీరమ్'.. ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక 'శుద్ధమపాపవిద్ధమ్' ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది.  పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు... వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు.  కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో. మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా ? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది. ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ మాదిరిగా జ్ఞానం అంతటా విస్తరించి వుంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు. వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది.  వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు. అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు. గురువు మనకు ఇది చెప్పాలంటే.. మనకు నాలుగు అర్హతలు కావాలి

1. వైరాగ్యము

2. వివేకము. 

3. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం  అనే 6 సంపదలు

4. ముముక్షత్వం.. 

4 మీలో ఉంటే.. గురువు మిమ్మల్ని పరీక్ష చేసి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. వరుణుడు తన కొడుకైన భ్రుగువును, ఎన్నో రకాలుగా పరీక్ష చేసి బ్రహ్మ జ్ఞానం తెలుసుకోనేటట్టు చేస్తాడు.

నిజానికి బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విషయం చెప్పలేం. ఒక్క గడియలో రావచ్చు. ఒక్క రోజులో రావొచ్చు. ఒక్క సంవత్సరంలో రావొచ్చు. ఒక్క జన్మ కావొచ్చు. కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. ఇదే బ్రహ్మ విద్య. బ్రహ్మ జ్ఞానం రావడం కాదు. మీరే బ్రహ్మంగా మారిపోతారు. మారడమేకాదు. అసలు మీరెప్పుడూ బ్రహ్మ గానే ఉన్నారు - అని తెలుసుకొంటారు...

మోక్షం పొందాలంటే

అనాదిగా మన మహర్షులు తమ తమ జ్ఞానాన్ని మనకు అందించే పరంపరలో ఉపనిషత్తులు అందించారు. ప్రతి ఉపనిషత్తు మన జీవనానికి మార్గదర్శి. మనం మన లక్ష్యాన్ని ఎలా నిర్ణయించుకోవాలి, ఎలా చేరుకోవాలి తెలిపేవే ఉపనిషత్తులు. మనిషి తప్పకుండ చదివి ఆకళింపుచేసుకొని అనుసరించాల్సిన గ్రంధాలు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు చదవకుండా ఎన్ని గుడులకు వెళ్లినా, ఎన్ని క్షేత్రాలకు వెళ్లినా, ఎన్ని తీర్థాలలో స్నానమాడినా మోక్షం మాత్రం రాదు రాదు రాదు ఇది ముమ్మాటికీ నిజాము. 

మనకు కనిపించే జగత్తు మొత్తం ఆ బ్రహ్మయే.  అందులకు సందేహం లేదు. బ్రహ్మ కానిది ఏది ఈ జగత్తులో లేదు. కేవలము బ్రహ్మ, బ్రహ్మ మాత్రమే. మనం చూసేది, వినేది, స్పర్శించేది, రుచిచూసేది, వాసనచూసేది అంతా బ్రహ్మమే. నీవు, నేను సమస్త జీవ రాసి, నిర్జీవ రాసి అంతటా బ్రహ్మయే. ఈ సత్యం ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు తనని దూషించే వానిలో, ప్రేమించే వానిలో బ్రహ్మనే చూస్తాడు. మానవ అంతిమ లక్ష్యం ఆ బ్రహ్మలో లీనమై పోవటమే అదే మోక్షం.  మోక్షం కేవలం జ్ఞానం లాగ వున్నది. అంటే మోక్ష జ్ఞానం కలిగితే మోక్షం సిద్ధిస్తుంది. అందుకే సిద్దించుకున్న వారిని సిద్దులు అని అంటారు. అందరమూ యోగులుగా మారుదాము మోక్షాన్ని సిద్దించుకుందాము. 

మోక్షం పొందాలంటే జ్ఞానం ఒక్కటే సాక్షాత్ సాధనం అంటున్నారు. అన్యమైన కర్మ, భక్తి, ధ్యాన, యోగ మొదలైన సాధనలెన్ని చేసినప్పటికీ జ్ఞానం మాత్రమే మోక్షానికి సూటియైన మార్గం అంటున్నారు

"జ్ఞానం వినా మోక్ష: సిధ్యతి

అంటున్నారు. వంటచెయ్యాలంటే ఉప్పు, పప్పు, బియ్యం, కూరలు, వగైరాలన్నీ అవసరమే అయినా నిప్పులేనిదే వస్తువులన్నీ ఉన్నవి ఉన్నట్లుగా ఉండి పోతాయేగాని తినటానికి పనికిరావు. అగ్ని ఉన్నప్పుడే బియ్యం అన్నంగాను, కూరగాయలు తినే కూరలుగాను మారతాయి.. అలాగే జ్ఞానం ఉన్నప్పుడే-తెలివి ఉన్నప్పుడే, నేను ఆత్మనని తెలుసుకున్నప్పుడే, దేహమనోబుద్ధుల తోను, వాటి వృత్తులతోను ఏమాత్రం సంబంధం లేకుండా, వాటితో సంగభావం లేకుండా, వాటికన్నవేరుగా ఉండి వాటిని కేవలం సాక్షిగ చూసే 'ఆత్మను'అని తెలుసుకున్నప్పుడే, వాటినుండి, సమస్త దు:ఖాల నుండి విముక్తి పొంది నేను నేనుగా, ఆనందస్వరూప ఆత్మగా శాశ్వతంగా ఉండిపోతాము. కనుక మోక్షానికి జ్ఞానమే సూటి దారి. మేటి దారి

అందుకే "జ్ఞానే నైవతు కైవల్యం

అన్నారు.ఆత్మనెరిగినవాడే శోకాన్ని అధిగమిస్తాడు-

"తరతి శోకం-ఆత్మవిత్

అని వేదం చెబుతున్నది

"బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి"

  బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మమే అగును అని ఉపనిషత్ వచనం. కాబట్టి నిత్యం ఆ బ్రహ్మను తెలుసుకునే సాధనతోనే మన జీవితాన్ని గడుపుదాము. బ్రహ్మను తెలుసుకుందాము. సుఖ దుఃఖాలకు నిలయమైన ఈ శరీరాన్ని మనం వాటికి అతీతంగా బ్రహ్మ జ్ఞాన సముపార్జితముకు ఉపయోగిద్దాము, కర్మలన్నీ పరమేశ్వరునికి అర్పిద్దాము. ఎలాంటి ముద్రలు, అంటే పాపలు, పుణ్యాలు లేకుండా మనస్సును నిష్కల్మషంగా చేసుకొని బ్రహ్మ జ్ఞానులము అవుదాము. 

ఇప్పుడే సాధన మొదలు పెట్టండి. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ