22, ఆగస్టు 2021, ఆదివారం

సర్వాయి పాపన్నను

 సర్వాయి పాపన్నను గజదొంగగా చిత్రీకరించినదెవరు ?

.........................................................


జానపదుల పాటలలో ఒక వ్యక్తి గురించి కీర్తించారంటే ఆ వ్యక్తి గొప్పవాడైయుండి లోకోపకారానికి కృషిచేసివుండాలి. చేసినమేలు మరవని గ్రామీణులు అతనిపై పాటలుకట్టి పాడుకోవడం ద్వారా తమ కృతజ్ఞతను తెలుపుకొంటారు.

ఆ కోవకు చెందినవాడే ఉయ్యాలవాడ నరసింహరెడ్డి (జననం 24.11. 1806 - ఉరితీత 22. 2. 1847). జానపదం బ్రతికివున్నంత వరకు మహానుభావుల కీర్తిప్రతిష్టలు జనం నోళ్ళలో నానుతూనే వుంటాయి.


సరిగా ఇలాంటి కోవకు చెందినవాడే సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్నను మేట్ కాఫ్, రిచర్డ్స్ అనే ఆంగ్లేయులు బందిపోటుదొంగగా ఎలా చిత్రీకరించారో దిగువన చూద్దాం.


సర్వాయిపాపన్న లేదా సర్ధార్‌ పాపన్న లేదా పాపడుగా పిలువబడిన పాపన్న వరంగల్లుకు దగ్గరలోని తరిగొండలో జన్మించాడు. తండ్రి కల్లుగీత కార్మికుడు. తండ్రిచేసే వృత్తిని కాదని పాపడు కత్తినిచేతబట్టాడు. ఆ రోజులలో గోల్కొండ ప్రాంత పరిస్థితులు అల్లకల్లోలంగా వున్నాయి. 1687 లో గోల్కొండ సులతాను తానీషా మొఘలాయిల చేతిలో ఓడిపోవడం జరిగింది. సరైన పాలకుడు దక్కనులో లేకపోవడం వలన అరాచక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. మరాఠాల విజృంభనను అణచటానికే ఔరంగజేబుకు కాలం సరిపోలేదు. దక్కను పీఠాన్ని ఆక్రమించాలని అధికారులలో, మొఘలు వారసులలలో కుమ్ములాటలు మొదలయ్యాయి. శాంతిభద్రతలు క్షిణించాయి.


చిన్నతనంనుండే పాపడు ధైర్యసాహసాలున్నవాడు. తండ్రిచేస్తున్న వృత్తినికాదని నాటి అరాచక పరిస్థితులను అవకాశంగా తీసుకొని రాజకీయప్రాముఖ్యం సంపాదించాలనుకొన్నాడు. 1690లో ధనవంతురాలు విధవరాలైన సోదరిని తల్లిని హింసించి డబ్బు సంపాదించాడు.ఆ డబ్బుతో తరిగొండలో ఓ మట్టికోటను నిర్మించాడు. పరిసర గ్రామాలను రైతులను దోచుకోవడం, అందమైన స్త్రీలను చెరపట్టడం చేసాడు.


ఆ రోజులలో లంబాడీలు వర్తక వ్యాపారుల వద్ద సరుకులు రవాణా చేసేవారు. పాపన్న వారిని కొల్లగొట్టి వారిని బందీలుగా చేసుకొని కోటలు కట్టేటందుకు, పరిసరభూములను సాగుచేసేటందుకు నియోగించాడు. ఆ తరువాత సైనిక శిక్షణ కొరకు ఎల్లందల జమీందారు కొలువులో సైనికుడిగా చేరాడు. జమీందారీలో కూడా దోపిడీలకు అక్రమాలకు తెరదీశాడు. కోపించిన ఎల్లందల జమీందారు పాపన్నను ఖైదుచేశాడు.అక్కడనుండి తప్పించుకొని భువనగిరి చేరి, అక్కడ సర్వాయి అనే దొంగతో చేతులు కలిపాడు. అప్పటినుండి ఇద్దరిని కలిపి సర్వాయి పాపన్నగా పిలవడం పరిపాటైంది.


సర్వాయితో చేరిన పాపన్న రైతులను, వర్తకులను, ధనవంతులను, సామాన్యజనులను దోచుకోవడాలు చేసి వచ్చిన సొమ్ముతో భాగ్యనగరానికి 50 మైళ్ళదూరంలోనున్న షాపూరులో కొటకట్టాడు. సర్వాయి పాపన్న ఆగడాలు మితిమీరడంతో ప్రజలు వర్తకులు గగ్గోలు పెట్టారు.


మొఘలాయిలకు దక్కను సుబేదారైన రుస్తుంఖాన్‌ అనే సరదారు సర్వాయి పాపన్నను పట్టిబంధించాలని రియాజుఖాన్‌ పంపాడు.ఖాన్‌ ప్రయాత్నాలు విఫలమైనాయి.


1707 లో ఔరంగజేబు మరణించాడు.మారిన రాజకీయాలలో భాగంగా యూసఫ్ ఖాన్ దక్కను ఫౌజుదారు (దండనాయకుడు) గా వచ్చాడు. 1708 లో పాపన్నబృందం వరంగల్లుపై దాడిచేసి 12వేలమంది నగర జనాభాను హతమార్చడం జరిగింది. చాలామందిని బంధీలుగా తీసుకెళ్ళడం జరిగింది. వరంగల్లు ఖాజీ భార్యను తన అంత:పురంలోనికి చేర్చాడు. అతని కూతురిని భోగంమేళాలో చేర్చాడు.ఖాజీ గుండెపగిలి చచ్చాడు.


కోపగించిన యూసఫ్ ఖానుడు సర్దారుపాపడిని శిక్షించటానికి 20 వేలమంది కాల్భటులను 15 వేలమందితోనున్న అశ్వదళాన్ని తరిగొండపైకి పంపాడు. ఇరుసేనల మధ్య ఆరునెలలపాటు భీకరయుద్ధం జరిగింది. పాపడు ఓడి పారిపోయాడు. తరిగొండ యూసఫ్ ఖానుని వశమైంది. పారిపోయిన పాపడు హసనాబాదులో ఓ కల్లంగడి (కల్లు అంగడి ) యాజమానిని ఆశ్రయించాడు. ఆ కల్లంగడి యాజమాని దుర్భుద్ధితో పాపన్నను యూసఫ్ ఖాన్ సేనకు అప్పగించాడు.

మెుఘలాయిల దక్కను సేనలు సర్దారు సర్వాయి పాపన్నను తీవ్రమైన చిత్రహింసల పాల్చేసి ఉరితీయించి, తలను బహుమతిగా డిల్లిరాజైన మొదటి బహదూర్షాకు కానుకగా పంపారు.


ఆంగ్లేయుల రచనలలో పాపడు దొంగదోపిడిదారు, వ్యసనపరుడని పెర్కొనడం అసమంజసం.ఇతను పేదలపాలిటి పెన్నిధి. దోపిడిలు దొంగతనాలు చేసింది నిజమే, అయితే దోపిడిలు చేసింది మాత్రం ప్రజలను పట్టి పీడిస్తున్న షాహుకారులను వర్తకులను అధికారులను మాత్రమే.


( సేకరణ)

................................................................................................................. జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: