అనాదిగా మన మహర్షులు తమ తమ జ్ఞానాన్ని మనకు అందించే పరంపరలో ఉపనిషత్తులు అందించారు. ప్రతి ఉపనిషత్తు మన జీవనానికి మార్గదర్శి. మనం మన లక్ష్యాన్ని ఎలా నిర్ణయించుకోవాలి, ఎలా చేరుకోవాలి తెలిపేవే ఉపనిషత్తులు. మనిషి తప్పకుండ చదివి ఆకళింపుచేసుకొని అనుసరించాల్సిన గ్రంధాలు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు చదవకుండా ఎన్ని గుడులకు వెళ్లినా, ఎన్ని క్షేత్రాలకు వెళ్లినా, ఎన్ని తీర్థాలలో స్నానమాడినా మోక్షం మాత్రం రాదు రాదు రాదు ఇది ముమ్మాటికీ నిజాము.
మనకు కనిపించే జగత్తు మొత్తం ఆ బ్రహ్మయే. అందులకు సందేహం లేదు. బ్రహ్మ కానిది ఏది ఈ జగత్తులో లేదు. కేవలము బ్రహ్మ, బ్రహ్మ మాత్రమే. మనం చూసేది, వినేది, స్పర్శించేది, రుచిచూసేది, వాసనచూసేది అంతా బ్రహ్మమే. నీవు, నేను సమస్త జీవ రాసి, నిర్జీవ రాసి అంతటా బ్రహ్మయే. ఈ సత్యం ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు తనని దూషించే వానిలో, ప్రేమించే వానిలో బ్రహ్మనే చూస్తాడు. మానవ అంతిమ లక్ష్యం ఆ బ్రహ్మలో లీనమై పోవటమే అదే మోక్షం. మోక్షం కేవలం జ్ఞానం లాగ వున్నది. అంటే మోక్ష జ్ఞానం కలిగితే మోక్షం సిద్ధిస్తుంది. అందుకే సిద్దించుకున్న వారిని సిద్దులు అని అంటారు. అందరమూ యోగులుగా మారుదాము మోక్షాన్ని సిద్దించుకుందాము.
మోక్షం పొందాలంటే జ్ఞానం ఒక్కటే సాక్షాత్ సాధనం అంటున్నారు. అన్యమైన కర్మ, భక్తి, ధ్యాన, యోగ మొదలైన సాధనలెన్ని చేసినప్పటికీ జ్ఞానం మాత్రమే మోక్షానికి సూటియైన మార్గం అంటున్నారు.
"జ్ఞానం వినా మోక్ష:న సిధ్యతి"
అంటున్నారు. వంటచెయ్యాలంటే ఉప్పు, పప్పు, బియ్యం, కూరలు, వగైరాలన్నీ అవసరమే అయినా నిప్పులేనిదే ఆ వస్తువులన్నీ ఉన్నవి ఉన్నట్లుగా ఉండి పోతాయేగాని తినటానికి పనికిరావు. అగ్ని ఉన్నప్పుడే బియ్యం అన్నంగాను, కూరగాయలు తినే కూరలుగాను మారతాయి.. అలాగే జ్ఞానం ఉన్నప్పుడే-తెలివి ఉన్నప్పుడే, నేను ఆత్మనని తెలుసుకున్నప్పుడే, ఈ దేహమనోబుద్ధుల తోను, వాటి వృత్తులతోను ఏమాత్రం సంబంధం లేకుండా, వాటితో సంగభావం లేకుండా, వాటికన్నవేరుగా ఉండి వాటిని కేవలం సాక్షిగ చూసే 'ఆత్మను'అని తెలుసుకున్నప్పుడే, వాటినుండి, సమస్త దు:ఖాల నుండి విముక్తి పొంది నేను నేనుగా, ఆనందస్వరూప ఆత్మగా శాశ్వతంగా ఉండిపోతాము. కనుక మోక్షానికి జ్ఞానమే సూటి దారి. మేటి దారి.
అందుకే "జ్ఞానే నైవతు కైవల్యం"
అన్నారు.ఆత్మనెరిగినవాడే శోకాన్ని అధిగమిస్తాడు-
"తరతి శోకం-ఆత్మవిత్"
అని వేదం చెబుతున్నది
"బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి"
బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మమే అగును అని ఉపనిషత్ వచనం. కాబట్టి నిత్యం ఆ బ్రహ్మను తెలుసుకునే సాధనతోనే మన జీవితాన్ని గడుపుదాము. బ్రహ్మను తెలుసుకుందాము. సుఖ దుఃఖాలకు నిలయమైన ఈ శరీరాన్ని మనం వాటికి అతీతంగా బ్రహ్మ జ్ఞాన సముపార్జితముకు ఉపయోగిద్దాము, కర్మలన్నీ పరమేశ్వరునికి అర్పిద్దాము. ఎలాంటి ముద్రలు, అంటే పాపలు, పుణ్యాలు లేకుండా మనస్సును నిష్కల్మషంగా చేసుకొని బ్రహ్మ జ్ఞానులము అవుదాము.
ఇప్పుడే సాధన మొదలు పెట్టండి.
ఓం తత్సత్
శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి