22, ఆగస్టు 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *22.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మొదటి అధ్యాయము*


*యదువంశమునకు ఋషుల శాపము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీబాదరాయణిరువాచ*


*1.1 (ప్రథమ శ్లోకము)*


*కృత్వా దైత్యవధం కృష్ణః సరామో యదుభిర్వృతః|*


*భువోఽవతారయద్భారం జవిష్ఠం జనయన్ కలిమ్॥12167॥*


*వ్యాసనందనుడగు శ్రీశుకమహర్షి చెప్పసాగెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణభగవానుడు బలరామునితోను, ఇతర యదువంశీయులతోడను గూడి పూతన, శకటాసుర, యమళార్జున, ధేనుక, అరిష్ట, చాణూర, తోసల, కంసాది దైత్యులను హతమార్చెను. అనంతరము కురుపాండవుల మధ్య బలీయమైన కలహమును సృష్టించి, భూభారమును తొలగించెను.


*1.2 (రెండవ శ్లోకము)*


*యే కోపితాః సుబహుపాండుసుతాః సపత్నైర్దుర్ద్యూతహేలనకచగ్రహణాదిభిస్తాన్|*


*కృత్వా నిమిత్తమితరేతరతః సమేతాన్ హత్వా నృపాన్ నిరహరత్ క్షితిభారమీశః॥12168॥*


కౌరవులు కపట ద్యూతములో పాండవుల రాజ్యమును హరించిరి. నిండుసభలో ద్రౌపదియొక్క జుట్టు పట్టుకొని లాగిరి. ఇంకను వారు పాండవులను అనేక విధములుగా అవమానించిరి. కౌరవుల దుశ్చర్యల కారణముగా పాండవులలో క్రోధాగ్ని ప్రజ్వరిల్లెను. ఆ స్థితిలో శ్రీకృష్ణుడు పాండవులను నిమిత్తముగా జేసికొని, రణరంగమున కౌరవ - పాండవ పక్షములకు చెందిన పెక్కుమంది రాజులను వధింపజేసి, భూభారమును తగ్గించెను.


*1.3 (మూడవ శ్లోకము)*


*భూభారరాజపృతనా యదుభిర్నిరస్య గుప్తైః స్వబాహుభిరచింతయదప్రమేయః|*


*మన్యేఽవనేర్నను గతోఽప్యగతం హి భారం యద్యాదవం కులమహో అవిషహ్యమాస్తే॥12169॥*


శ్రీకృష్ణభగవానుడు ప్రమాణములకు అందనివాడు. ఆ ప్రభువు తన భుజశక్తిచే రక్షింపబడిన యదువంశీయులను నిమిత్తమాత్రులనుగా జేసికొని, భూమికి భారముగానున్న రాజన్యులను, వారి సేనలను హతమార్చెను. పిమ్మట ఆ స్వామి ఇట్లు తలంచెను. 'లోకదృష్టిలో భూభారము తొలగిపోయినట్లుగా కనిపించుచున్నను, నా దృష్టిలో మాత్రము ఇంకను భూభారము మిగిలియేయున్నది. ఏలయన, అజేయులైన యాదవులు ఇంకను బ్రతికియేయున్నారుగదా!"


*1.4 (నాలుగవ శ్లోకము)*


*నైవాన్యతః పరిభవోఽస్య భవేత్కథంచిన్మత్సంశ్రయస్య విభవోన్నహనస్య నిత్యమ్|*


*అంతఃకలిం యదుకులస్య విధాయ వేణుస్తంబస్య వహ్నిమివ శాంతిముపైమి ధామ॥12170॥*


ఈ యదువంశీయులు నన్నే ఆశ్రయించుకొనియున్నారు. అందువలన ఇతరులద్వారా వీరికి ఓటమి కలుగుట అసంభవము. కాని వీరు తమ చతురంగబలములను, అపరిమితమైన సంపదలను చూచుకొని, గర్వితులై విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు. వెదురుకర్రలు ఒకదానితో మరియొకటి రాచుకొనుటచే అగ్ని ఉత్పన్నమై, అవి బుగ్గిపాలగును. అట్లే వీరిమధ్య అంతఃకలహములను సృష్టించినచో వీరును తమలోతాము కొట్టుకొని మృత్యుముఖమున చేరుదురు. అప్పుడు భూభారము పూర్తిగా అంతరించును. పిదప నేను నిత్యమంగళమగు పరంధామమునకు చేరుదును.


*1.5 (ఐదవ శ్లోకము)*


*ఏవం వ్యవసితో రాజన్ సత్యసంకల్ప ఈశ్వరః|*


*శాపవ్యాజేన విప్రాణాం సంజహ్రే స్వకులం విభుః॥12171॥*


మహారాజా! సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని సంకల్పము తిరుగులేనిది. ఆ ప్రభువు ఇట్లు నిశ్చయించుకొని *బ్రాహ్మణశాపము* అను నెపముతో తన వంశమును ఉపసంహరించెను.


*1.6 (ఆరవ శ్లోకము)*


*స్వమూర్త్యా లోకలావణ్యనిర్ముక్త్యా లోచనం నృణామ్|*


*గీర్భిస్తాః స్మరతాం చిత్తం పదైస్తానీక్షతాం క్రియాః॥12172॥*


*1.7 (ఏడవ శ్లోకము)*


*ఆచ్ఛిద్య కీర్తిం సుశ్లోకాం వితత్య హ్యంజసా ను కౌ|*


*తమోఽనయా తరిష్యంతీత్యగాత్స్వం పదమీశ్వరః॥12173॥*


భగవంతుడు తన రూపలావణ్యాతిశయముతో లోకుల నేత్రదృష్టిని ఆకర్షించేవాడు. అట్లే మృదుమధురమైన తీయని మాటలతో చిత్తమును, త్రిభంగాకృతితో మనోహరముగా చేసే నృత్యములతో, తమ తమ కర్మలను వదలిపెట్టి తనవైపు ఆకర్షించేవాడు అనగా నేత్రదృష్టితో స్థూలశరీరమును, చిత్తముతో సూక్ష్మ శరీరమును, నృత్యములవంటి కర్మలతో కారణశరీరమును దాటిపోయి స్వస్వరూప అనుసంధానమును పొంది శ్రీకృష్ణ భావనాతన్మయులను చేయు మహద్భాగ్యమును ప్రసాదించెడివాడని దీని గూఢార్థము.


*రాజోవాచ*


*1.8 (ఎనిమిదవ శ్లోకము)*


*బ్రహ్మణ్యానాం వదాన్యానాం నిత్యం వృద్ధోపసేవినామ్|*


*విప్రశాపః కథమభూద్వృష్ణీనాం కృష్ణచేతసామ్॥12174॥*


*పరీక్షిన్మహారాజు వచించెను* "బ్రాహ్మణోత్తమా! శుకమహర్షీ! వృష్ణివంశమువారు ఎల్లరును బ్రాహ్మణభక్తి తత్పరులు. మిక్కిలి ఔదార్యముగలవారు. నిరంతరము గురుజనులను, కులవృద్ధులను సేవించుచుండెడివారు. సంతతము తమ చిత్తములను శ్రీకృష్ణభగవానునియందే నిలుపుకొనుచుండెడివారు గదా! అట్టి పుణ్యాత్ములకు విప్రశాపము ఎట్లు సంభవించెను?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: