*ఆదిత్య హృదయం: అర్ధములతో …
➖➖➖✍️
ఆదిత్య హృదయాన్ని ప్రతీరోజు ఉదయాన్నే మూడుసార్లు చొప్పున పఠించేవారికి దైర్యం, జ్ఞానం లాంటి దైవగుణాలు పెరుగుతాయి! శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కఠిన సమస్యలు తొలగిపోతాయి! చింతలు చికాకులు పోయి,దైవభక్తి పెరుగుతుంది! ఇతరుల మీద ద్వేషం, అసూయ, గిట్టనితనం, మాత్సర్యం లాంటి అవగుణాలు పోయి, మనస్సు ఎప్పుడూ ఈశ్వరుడిపై లగ్నం అవుతుంది. అన్నిటికీ మించి సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత!
అసలు ఆదిత్యహృదయం వల్ల లాభాలు ఇంతా అంతా అని చెప్పడం కానిపని! ఆదిత్యహృదయం అంటేనే అక్షయపాత్ర!
శ్రీరాముల వారు ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారని శ్రీమద్రామాయణం చెబుతున్నది.
ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది.
ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖవర్చస్సు మెరుగవుతుంది.
ఆదిత్య హృదయం లోని శ్లోకాలు వాటి అర్ధములు.
1. తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
#అర్థము: యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.
2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః
#అర్థము: యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.
3. అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
#అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.
4. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
#అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.
5. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం
#అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.
6. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
#అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.
7. సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
#అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.
8. ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
#అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు
9. పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
#అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.
10. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
#అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.
11. హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్
#అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.
12. హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్
#అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.
13. వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
#అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.
14. ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః
#అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.
15. నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే
#అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.
16. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః
#అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
17. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
#అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితిపుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
18. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః
#అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
19. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః
#అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
20. తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
#అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.
21. తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
#అర్థము: బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.
22. నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
#అర్థము: రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.
23. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
#అర్థము: ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.
24. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః
#అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.
25. ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః
#అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.
26. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
#అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.
27. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం
#అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.
28. ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్
#అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.
29. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
#అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.
30. రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్
#అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.
X. అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
#అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికేను.
X. సూర్యోపాసనలో అత్యంత గుప్తనామం "హిరణ్యగర్భాయ" ఈ నామం అర్ధం సృష్టి-స్థితి-లయ కర్తలయిన బ్రహ్మ-విష్ణు-రుద్ర స్వరూపం ఇతడే అని అర్ధం
భక్తితో " భగవతే హిరణ్యగర్భాయ నమః " అని సూర్యభగవానుణ్ణి స్మరిస్తే విశేషంగా ఆ సూర్యనారాయణస్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
A Collection from
Admin
Brahmana Samaakhya