25, డిసెంబర్ 2022, ఆదివారం

 ఆలోచనా విధానాలు 

 ఆలోచనా విధానాలు 

ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కోవిధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తారు.  కానీ అందరి ఆలోచనలు ఒక్కొక్క రీతిలో ఉంటాయి. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది.  ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్బవించవచ్చు కూడా. ఒకమనిషి ఆలోచనా విధానం అతని మేధస్సుమీద ఆధారపడి ఉంటుంది. సమస్యను కూలంకుషంగా సత్వరం అర్ధం చేసుకొని వెనువెంటనే సరైన పరిష్కారం చెప్పటం అనేదానినికి సూక్ష్మగ్రాహ్యత  సమయస్పూర్తి కావాలని పెద్దవారు చెపుతారు. ఒకే విధమైన నెలజీతం పొందుతున్న ఇద్దరు ఉద్యోగస్తుల జీవన విధానం ఒకే విధంగా వుండాలని లేదు ఒకరు అనేక అప్పులు చేస్తూ అనవసరమైన డాంబికాలు పోయి అనేక ఇక్కట్లు పడవచ్చు ఇంకొకరు తనకు వున్న వనరులను ఒక ప్రణాళికా బద్దంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తనకు మించిన ఖర్చులు చేస్తూ తగిన ఆదాయంలేక అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చలేక కస్టాలు పడుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకున్న వారి గూర్చి నిత్యం మనం వార్తల్లో చదువుతున్నాము, చూస్తూన్నాము . వాటన్నిటికీ కారణం ఆలోచనా విధానం మాత్రమే. 

సరయిన నిర్ణయం తీసుకోవటం ఒకని మేధాశక్తికి నిదర్శనం. అంతే కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం.  కొన్ని సందర్భాలలో నిర్ణయం సరైనది అయినా కూడా సరైన సమయంలో తీసుకోక పోవటం అనేక కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు  అనేక కారణాలవల్ల పేరుకొని ఉంటే తాను  కొన్న ధరకాన్న తక్కువ ధరకు అమ్ముతారు,  దానికి కారణం ఒకటి ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మచూస్తే అది అమ్మటానికి చాలాసమయం పట్టవచ్చు, రేండు ఎక్కువ సమయం వేచి చుస్తే ఆ సరకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు.  అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక జనప్రదాన్యత వున్న సరకు మీద వెచ్చిస్తే దానిమీద ఎక్కువ లాభం రావచ్చు.  ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గూర్చి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక  లాభాన్ని కోల్పోతాడు. 

ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు.  మేనేజరులు తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి. 

సమయస్పూర్తి: సీతాపహరణ తరువాత సుగ్రీవుని రాజ్యంలోని వానరులను  సీతాదేవిని వెతకటానికి నియమించారు ఆ వరువడిలోనే హనుమంతులవారిని కూడా నియమించారు.  హనుమంతులవారు లంకకు చేరారు, సీతామాతను తెలుసుకున్నారు.  నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది.  వెంటనే వచ్చి సీతాదేవి జాడని శ్రీ రామచంద్రులకు తెలిపితే తన నియమిత కార్యం అయిపోయినట్లే కానీ సీతజాడతోటి హనుమంతులవారు ఊరుకోలేదు సీతాదేవిని రావణుడినుండి విడిపించుటకు శ్రీరాముడు యుద్ధం చేయవలసి  ఉంటుంది. కాబాట్టి రావణాసురుని బలం అతని రాజ్య విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.  అందుకు రావణుని దర్శనం చేసుకోవాలి అది యెట్లా సాధ్యం తాను రాజప్రాసాదానికి వెళ్ళితే అక్కడి భటులు రావణాసురుని చూడనీయరు.  అందుకే ఆయన అశోకవనాన్ని ధ్వంసం  చేశారు. నిరోధించటానికి వచ్చిన వీరులను ఓడించారు.  అప్పుడు తప్పనిసరై హనుమంతులవారిపై బ్రహ్మస్త్రాన్ని ఇంద్రజిత్ ప్రయోగించి రావణుని సభకు తీసుకొని వెళతారు.  ఇక మిగిలిన కధ మనందరికీ తెలిసిందే.  ఇక్కడ మనం గమనించాలసింది హనుమంతులవారి ఆలోచనా విధానం సమయ స్ఫూర్తి.  సమయ స్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపద నయినా సులభంగా దాట వచ్చు. 

జ్యోతిష్య శాస్త్రంలో ప్రావిణ్యం వున్న ఒక జ్యోతిష్కులవారు ఒక రాజుగారి వద్దకు వెళ్లారట అయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట " మీ వాళ్ళందరూ మీ ముందే చనిపోతారు" అది విన్న ఆ రాజుగారు కోపోద్రేకుడై అతనికి బహుమానాలు  ఇవ్వటం అటుంచి మరణ శిక్ష విధించారట. ఒకటి రెండు రోజులలో శిక్ష అమలు అనగా ఈ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్య పండితులు రాజుగారి దర్శనం చేసుకున్నారు.  రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా  వున్నారు ఆ విషయం మన జ్యోతిస్యులవారికి తెలుసు ఆయన అత్యంత లౌక్యము చూపించి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి "మహారాజా మీరు అత్యంత మహార్జాతకులు మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు  పరిపాలిస్తారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు  జీవిస్తారు. ఏ కొద్దీ మందికో మీలాగా జాతకం ఉండదు" అని తెలిపారు. దానికి ప్రసన్నులైన మహారాజు నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు నీకు ఏమి కావాలో కోరుకో అని  అన్నారు. మహారాజా నా శిష్యుడు తెలిసి తెలియని జ్ఞానంతో మీ వద్దకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణ శిక్ష విధింపబడ్డాడు.  దయచేసి అతనిని క్షమించి విడిపించవలసిందిగా ప్రార్ధించారు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిస్యుల శిక్షను రద్దుచేశారట.  మన రెండవ జ్యోతిషేలవారు మొదటివారిని కలుసుకొని నీవెందుకు అలా చెప్పావు అని అడిగితె నేను చెప్పింది నిజంకాదా అని ప్రశ్నించారట.  నీవు చెప్పింది నిజం నేను అదే చెప్పాను కానీ చెప్పే విధానం బట్టి మనము అనుగ్రహ, ఆగ్రహాలకు పాత్త్రులము అవుతాము అని అన్నారట. 

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః!
జిహ్వాగ్రే మిత్రబాంధవాః!
జిహ్వాగ్రే బంధనప్రాప్తిః!
జిహ్వాగ్రే మరణం ధృవం!!

అని అన్నారు కాబాట్టి మనం నోటిని జాగ్రత్తగా అంటే మాటలను సమయానుకూలంగా వాడాలని హితవు చెప్పి పంపారట. బుద్ది కర్మానుసారినే  అనే నానుడి ఊరికే రాలేదేమో అనిపిస్తుంది. 

ఒక కేసువిషయంలో చాలా తీవ్రంగా ఒక లాయరుగారు వాదిస్తున్నారట ఆయన వాదనకు జడ్జిగారు కూడా ముగ్దులు అయ్యారట. ఇక వాదనను ముగించపోవగా ప్రక్కనే వున్నా జ్యునీయరు లాయరుగారు మన లాయరుగారి చెవిలో ఏదో చెప్పారట వెంటనే మన లాయరు గారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నేను చెప్పింది బహుశా డిఫెన్సు లాయరుగారు చెప్పవచ్చు కానీ అది ఎంతమాత్రమూ సబబుకాదు ఇప్పుడు నా వాదనను వినండి అని తానూ ముందు చెప్పిన వాదనకు వ్యతిరేకంగా చెప్పి జడ్జిగారిని మెప్పించి కేసు గెలిపించారట.  ఇంతకూ ఆ జూనియరు లాయరు గారు చెవిలో  చెప్పింది ఏమిటి అంటే అయ్యా మీరు మన క్లయెంటు గూర్చి కాకుండా అవతలి పార్టీకి సపోర్టుగా వాదిస్తున్నారు అని.  ఆక్షణంలోనే సర్దుకొని తన వాదనను పూర్తిగా మార్చుకున్నారు సీనియర్ లాయరు గారు అదే సమయ స్ఫూర్తి అంటే. ఇవ్వన్నీ మనం తెలుసుకున్నవి, నిత్యం చూస్తూవున్నవి.  ఇక అసలు విషయానికి వస్తే మానవుడు తన జీవిత లక్ష్యం అయిన మోక్ష సాధన చేయటానికి చక్కటి ఆలోచనా విధానం వుండాలి అంతేకాదు తనకు దైనందిక జీవితంలో ఎదురుపడే అనేక ఒడిదుడుకులను ఎదుర్కునే సమయస్ఫూర్తి కావలి.  సాధకుని చూసి సామాన్యులు అనేక విధములుగా మాట్లాడవచ్చు అటువంటి మాటలకు, విమర్శలకు ఏమాత్రం చలించకుండా నిత్యం తన లక్ష సాధనవైపు ద్రుష్టి సాగించి లక్ష్యాన్ని ఈ జన్మలోనే సాదించాలి. 

నాకు ఈ జన్మలోనే మోక్షం వస్తుందా అది ఎంతో దుర్లభం ఏదో దైవ జాసలో, నామ స్మరణతో కాలం గడుపుదాం అని చెప్పే అనేకులు మనకు  తారసపడతారు. అంతే కాకుండా అయన సద్గురువు, ఈయన సద్గురువు అని చెప్పి మీ వద్ద వలసినంత ద్రవ్యాన్ని వసూలు చేసేవారు కూడా వుంటారు. కాబట్టి ఎవ్వరిని అనుసరించకుండా నీ సాధన నీవు కొనసాగించు. వారి మాటలను పరిగణలోకి తీసుకొన్నామంటే మన సాధనకు  పూర్తిగా అవరోధం కలుగుతుంది. కాబట్టి మిత్రమా మోక్షం అంటే సామాన్యమైన విషయం కాదు అత్యంత కృషి, సాధన, అకుంఠిత దీక్ష ఉంటేనే సాధించగలం. ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనది దీనిని  ఇక్కడే,ఇప్పుడే సార్ధకట్చేసుకోవాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

ఇంకా వుంది

కామెంట్‌లు లేవు: