27, జనవరి 2022, గురువారం

గరికపాటి వారికి

💐గరికపాటి వారికి అభినందనచందనాలు💐

వ్యవధానములు లేని యవధానముల సాగి 
          కవనాల పండించి కవుల మించి 
ప్రవచనామృతధార రంగరింపులలోన 
          సంస్కృతీవిలువల సందడించి 
వాగ్వైభవము జూపి వాణికిం బ్రియమౌచు 
          వఱలెడు ప్రియవాచి వందితాంఘ్రి! 
గౌతమీ తీర్థాలఁ గడుపారగాఁ గ్రోల 
          గలిగెనో పాండితీగరిమ మీకు 
లలితవిన్యాసభూషిత తెలుగుభాష 
మెచ్చి యిచ్చె *పద్మశ్రీ* ని యిచ్చగించి 
మిమ్ము గన్న గర్భమ్ము సతమ్ముఁ బొంగు 
భారతావని భాగ్యమ్ము పరిఢవిల్లు 
*~శ్రీశర్మద*

దేవతార్చన కొరకు పుష్ఫాలు

 దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్ఫాలు - వాటి ఫలితాలు . 


 *  జాజిపువ్వుతో అర్చించిన భుక్తి , ముఖ్తి ఇచ్చును . చంపకము స్తంభనము , మొగిలి , మొల్ల , తెల్ల కలువ ఉచ్చాటన పద్దతిలో ఆయుధముగా పనిచేయును . 


 *  బంగారు మల్లె లాభము , నల్ల గోరింట పువ్వుల అర్చన బలవర్ధనము , తెల్ల కలిగొట్టు గొప్ప కీర్తిని ఇచ్చును . 


 *  పద్మము శాంతి , పుష్టిని ఇచ్చును . కమలము సుపుత్రులను , దాసాని మరియు రక్తగన్నేరు వశీకరణము ఇచ్చును . 


 *  శాలి ( వరివెన్ను ) సౌభాగ్యమును , కడిమి , పొగడ , మొల్ల , వస , కుందము అను పుష్పములతో అర్చించిన పాపనాశనం చేయును . 


 *  కుసుమ వశీకరణము , మోదుగ ఆకర్షణము , పొన్న , నాగకేసరములు మహాలక్ష్మీప్రదములు . 


 *  ఎర్ర కలువ వశీకరణము , నీలము మరియు నల్ల కలువలు మారణ ప్రయోగము నందు , మందార పుష్పము శత్రువుకు భయము కలిగించుటకు ఉపయోగించదగినది . 


 *  వైశాఖము నందు పొగడ పువ్వులు , జైష్టమున నాగకేసర పుష్పములు , ఆషాడమున గన్నేరు పుష్పములు విరివిగా దొరకును కావున దేవతార్చనకు ఈ మాసములలో వీటిని వాడుట శ్రేష్టం . 


 *  శ్రావణమాసము నందు పద్మముల కన్నా సంపెంగలకు ప్రాముఖ్యం , భాద్రపదమున లొద్దుగ , అశ్వజమున దాసాని , కార్తీకము నందు అగిసే , మార్గశిరమున బిల్వములు , పుష్యమాసము నందు గరికె , మాఘ మాసము నందు కుంద పుష్పములు , ఫాల్గుణమున పూల గురివిందతో పూజించుట సర్వసిద్ధి ప్రదాయకము   చైత్రమాసమున అశోక మొగ్గలతో పూజించుట అత్యంత శ్రేష్టదాయకం . 


 *  తెల్లని సన్నజాజి ,అడవి గోరింట  , దవనం , రేల , పచ్చపూల గోరింట , ఎర్ర గోరింట , కలిగొట్టు , విరజాజి , జిల్లేడు , మాధవి , గొరింటా ఈ 11 రకాల పుష్పములతో జగదాంబకు అర్చన కొరకు సమర్పించవలెను . 


 *  సన్నజాజి పుష్పములతో పూజించిన వాక్శుద్ధి కలుగును . 


 *  చమేలీ పుష్పములతో అర్చించిన రాజవశీకరణము కలుగును . మరియు అధిక మేధాశక్తి లభించును . నాగకేసరములు రాజత్వమును ప్రసాదించును . 


 *  పూల గురువింద భూలాభము , సంపెంగ బంగారము , బండి గురువెంద బుద్ధివృద్ధి , మల్లె ధనాధిక్యతను కలిగించును . 


 *  మొల్ల పువ్వు కీర్తిని , దాసాని పువ్వులతో అర్చించిన శత్రువులు సంశయావస్థలో పడెదరు . 


 *  పద్మము వలన ఆయుర్వృద్ధి కలుగును . కలువ వలన కవిత్వము అబ్బును , కడిమి పుష్పములతో అర్చన ద్వారా వ్యాధి నాశనము , బ్రహ్మదండి వలన బుద్ధిశాలిత్వము సంభంవించును . 


 *  మరువము వలన విజయప్రాప్తి , పచ్చ గోరింట వలన గజలాభము , అపరాజితా పుష్పముల వలన సర్వాంగ సుందరత్వము అబ్బును . 


 *  వావిలి వలన పుత్రలాభము , అశోకము వలన దుఃఖరాహిత్యము , పొగడ వలన వంశ గౌరవము కలుగును . 


 *  గరిక వలన ధన ధాన్య సంపద , బూరుగు పువ్వుల వలన శత్రుక్షయము , తుమ్మి పువ్వుల వలన అన్నప్రాప్తి , పొగడ వలన ధనాధిక్యత లభించును . 


 *  పొన్న వలన రాజ్యలాభము , రేల వలన అధికోన్నతి , పోట్లపువ్వుల వలన దీర్గాయువు , గ్రంథితగరము వలన సర్వమాన్యత ప్రాప్తించును . 


 *  మోదుగపువ్వుల వలన అనేక గోవులు ,మేకలు లభ్యమగును . దిరిసెన పువ్వులతో సుందర యువతి , దేవకాంచనం వలన జయము , శ్రేయము లభ్యమగును . 


 *  గన్నేరు పువ్వుల వలన మంత్రసిద్ధి , మారేడు దళముల వలన పరమపదము ప్రాప్తించును . సాత్వికమైన కోరికలకు తెల్లని పువ్వులు ప్రశస్తమైనవి . 


 *  ఉచ్చాటనము , వశీకరణము , ప్రేమ , శత్రుజయము వంటి వాటికొరకు అర్చనలు చేయువారు పరిమళము గల ఎర్రని పుష్పములు వాడవలెను . 


 *  మోహనము , వశీకరణము నందు పసుపుపచ్చని పుష్పములు శ్రేష్టమైనవి , అభిచారము , చేతబడి , పగ , మరణ ప్రయోగాల యందు రెండు విధములైన నల్లని పువ్వులు వాడవలెను . 


 *  దాసాని పువ్వులను దానం ఇచ్చిన దివ్యవస్త్రదాన  ఫలము కలుగును . మరియు బ్రహ్మ హత్యాది పాపములు క్షణములో నశించును . 


 *  దింటెన పుష్పముల యందు తెల్లదాని కంటే నల్ల దింటెన పుష్పములు దానం ఇచ్చిన రెండింతల పుణ్యము వచ్చును . 


 *  అపరాజితా , కుందముల నడుమ మనోహరమైన స్థానం కలదు . గన్నేరు పుష్పముల యందు సాక్షత్తు సదాశివుడే ఉండును . 


 *  దేవిని మంకెన పుష్పములతో పూజించిన యెడల మేకను బలి ఇచ్చినంత తృప్తి చెందును . దేవికి నిత్యపూజ యందు అర్ఘ్యం ఇయ్యవలెను . 


    

     పైన చెప్పినవన్నీ పరమశివుడు అమ్మవారికి తెలియచేసిన పుష్పసంబంధ మహత్తులు . వీటిని నేను కొన్ని పురాతన తాంత్రిక గ్రంథాల నుంచి సేకరించాను . ఇలాంటి మరెన్నో అద్బుత విషయాలు నా గ్రంథముల యందు విపులంగా ఇవ్వడం జరిగింది.  


  

    గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

కరక్కాయ గురించి

 కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ - 


 తెలుగు  - కరక్కాయ . 


 సంస్కృతం  -  హరీతకి . 


 హింది - హరడ్ . 


 లాటిన్  - TERMINALIA CHIBULA . 


 కుటుంబము  - COMBRETACEAE . 


 గుణగణాలు  - 


     కరక్కాయ లవణరస వర్జితముగా , అయిదు రసములు గలదిగా , రూక్షముగా , వేడిగా , జఠరదీపనముగా , బుద్ధిబలమును ఇచ్చునదిగా , మధురపక్వముగా , ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా , నేత్రములకు హితవుగా , తేలికగా , ఆయువును పెంపొందించునదిగా , ధాతువృద్ధిగా , వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్టును , నంజును , ఉదరమును , క్రిమిని , స్వరభంగమును , గ్రహిణిని , మలబద్ధకమును , విషజ్వరమును , గుల్మమును , కడుపుబ్బరం , దాహము , వాంతిని , ఎక్కిళ్ళను , దురదను , హృదయరోగమును , కామెర్లను , శూలను , ప్లీహారోగమును , అనాహమును , కాలేయవ్యాధిని , శిలామేహమును , మూత్రకృచ్చ రోగమును , మూత్రఘాత రోగమును నాశనం చేయును . 


           కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును . తీపి , చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును . రూక్షత్వం ,వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును . ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. 


        కరక్కాయను వర్షఋతువు నందు సైన్ధవ లవణము చేర్చి , శరదృతువు యందు పంచదార చేర్చి  , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి శిశిర ఋతువు నందు పిప్పలిని చేర్చి , వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లమును చేర్చి భక్షించవలెను. కరక్కాయను భోజనానంతరం భక్షించినను పథ్యకరమైనది . మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను , అజీర్ణసమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 


  రూప లక్షణాలు  - 


     కరక్కాయ మొత్తం 7 రకాలుగా కలదు. అవి 


             *  విజయా . 


             *  రోహిణీ . 


             *  పూతన . 


             *  అమృతా . 


             *  అభయా . 


             *  జీవంతి . 


             *  చేతకీ . 


      అని మొత్తం 7 జాతులుగా ఉండును. ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగ వివరిస్తాను. 


        విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 


                  సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 


     విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 


                కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ ( తినిన ) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 


     చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  


           ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 


              చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 


             పైన చెప్పిన 7 జాతులలో విజయ కరక్కాయ ప్రధానం అయినది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వరోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది . గొప్పది , గుండ్రనిది , బరువు కలిగినది . నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు 2 తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 


 ఔషధోపయొగాలు  - 


 *  కామెర్ల నివారణ కొరకు  - 


        కరక్కాయ , తేనె , బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 


 *  కీళ్ళవాతము నివారణ కొరకు - 


        కరక్కాయ చూర్ణమును , ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం , గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 


 *  క్రిమిరోగముల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును . ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది . 


 *  కడుపునొప్పి నివారణ కొరకు 


         కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 


 *  చర్మరోగముల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 


 *  విషమ జ్వరాల నివారణ కొరకు  - 


         కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 


 *  ఆమ్ల పిత్తము నివారణ కొరకు  - 


         కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 


 *  అర్శమొలల నివారణ కొరకు  - 


          కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 


 *  బరువు తగ్గుట కొరకు - 


         కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 


 *  గోరుచుట్టు నివారణ కొరకు  - 


        పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 


 *  నీళ్ల విరేచనాల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 


 *  రక్తస్రావ నివారణ కొరకు  - 


        కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 


 *  శరీర బలం పెరుగుట కొరకు  - 


         కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 


 *  పాండురోగం నివారణ కొరకు  - 


        కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు.  దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు , వరిబీజం తగ్గును. 


 *  చర్మ దళ కుష్టు నివారణ కొరకు  - 


       20ml గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు , కిటిభకుష్టు  తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 


 *  గొంతు బొంగురు నివారణ కొరకు  - 


       కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 


 *  దగ్గు నివారణ కొరకు  - 


        కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక , దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 


 *  తలనొప్పి నివారణ కొరకు  - 


        కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 


 * కండ్ల ఎరుపు నివారణ కొరకు  - 


         కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 


 *  ఎక్కిళ్లు నివారణ కొరకు  - 


       గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 


 *  ఉదరరోగ నివారణ కొరకు  - 


       ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 


 *  ఆహారం జీర్ణం అగుటకు  - 


       వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును . 


 *  కఫజ్వర నివారణ కొరకు  - 


       గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 


 *  వాంతుల నివారణ కొరకు  - 


        కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 


 *  కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు  - 


       కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 


 *  గుల్మ నివారణ కొరకు  -  


        కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 


 *  రక్తపిత్త రోగ నివారణ కొరకు  - 


        అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 


 *  ఉబ్బురోగం నివారణ కొరకు - 


     బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 


 *  వాతరక్త వ్యాధి నివారణ కొరకు  - 


     5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.


 *  అండవృద్ధి నివారణ కొరకు  - 


        గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 


 *  నేత్రరోగ నివారణ కొరకు  - 


        కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 


 *  పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు  - 


       కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును  . 


  గమనిక  - 


           అతిగా నడచినవాళ్లు , బలహీన శరీరం కలవాళ్ళు , చిక్కిన శరీరం కలవాళ్లు , ఉపవాసం వలన బలహీనపడిన వారు , శరీరం నందు అమిత వేడి కలిగినవారు , గర్భవతులు , రక్తం తీయబడిన వారు , రక్తస్రావం వలన ఇబ్బందిపడేవారు , హనుస్థంభ వాత రోగులు కరక్కాయను వాడరాదు. 


  పైన చెప్పినంత వివరణగా ఒక్కో మొక్క గురించి అత్యంత వివరణాత్మకంగా నేను రచించిన          " సర్వ మూలికా చింతామణి " అను గ్రంథము నందు ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథము నందు ఇచ్చినటువంటి యోగములు అన్నియు మా అనుభవపూర్వకములు . మొక్కలను సులభముగా గుర్తించుటకు మొక్కల రంగుల చిత్రములుతో ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథం మొత్తం 352 పేజీలతో మనం మాట్లాడుకునే సాధారణమైన భాషలో అందరికి సులభరీతిలో అర్థం అయ్యేలా ఇచ్చాను . ఎక్కడా గ్రాంధిక భాష ఉపయోగించలేదు . 


       సర్వమూలికా చింతామణి  గ్రంథము యొక్క విలువ  550 రూపాయలు కొరియర్ ఖర్చుతో కలుపుకుని . ఇతర రాష్ట్రాలకు 50 రూపాయలు అదనంగా 600 రూపాయలు అవుతుంది . గ్రంధములు కావాల్సినవారు 9885030034 నంబర్ నందు సంప్రదించగలరు . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


          అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034